మెయన్ ఫీచర్

పాకిస్తాన్ స్వయంకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌పై భారతదేశపు సైనికచర్య అనివార్యంగా మారిందన్నది ఈసరికి అందరూ గుర్తిస్తున్న విషయం. అటువంటి చర్య తీసుకోవాలంటూ దేశ ప్రజలు భావించారు. రాజకీయ పార్టీలలో ఆ మాట బయటకు అన్నవి ఎక్కువ లేకపోవచ్చు. అదే విధంగా బయటి దేశాలు కూడా అని ఉండకపోవచ్చు. కాని అనివార్యత మాత్రం అందరికీ అర్థమైంది. అందువల్లనే సైనిక చర్య అనంతరం ఇంటా, బయటా సానుకూలతే కనిపిస్తున్నది. లేదా కనీసం వౌనం వహించినవారున్నారు. కాని విమర్శ వినిపించింది పాక్ ప్రభుత్వం నుంచి మాత్రమే. అక్కడి పార్టీలు, సంస్థల మాట సరేసరి. పాకిస్తాన్‌కు సంబంధించి కూడా ఒక విశేషం ఉంది. గతంలో ఇండియా తమ దేశంపై దాడి జరిపిందన్నపుడల్లా అక్కడి ప్రజలు నిరసన ప్రదర్శనలు పెద్దఎత్తున చేపట్టేవారు. ఈసారి అటువంటిదేమీ జరగనట్లు పాక్ పత్రికలను, టీవీ ఛానళ్లను చూసిన మీదట తెలుస్తున్నది. ఇది గమనించవలసిన విషయం.
దాని అర్థం అక్కడి ప్రజలు భారతదేశపు చర్య సరైనదని, తమ ప్రభుత్వం, టెర్రరిస్టులు తప్పుచేస్తున్నారని భావించినట్లుకాదు. గత బుధ, గురువారాల రాత్రి జరిగిన భారత సైనిక చర్య పరిమితమైందే తప్ప భారీస్థాయి దాడి కాదన్నది అట్లుంచి, అంతకన్న ముఖ్యంగా జరిగింది ఏమిటనే వాస్తవిక సమాచారం అక్కడి ప్రజలకు ఉన్నట్లు లేదు. చర్య జరిగిన తర్వాత రెండురోజులకు కూడా అదే పరిస్థితి ఉండటం సాధారణ ప్రజలకే కాదు, పాకిస్తాన్ మీడియాకు కూడా అయోమయాన్ని సృష్టిస్తున్నట్లు కన్పిస్తున్నది. వారి వార్తలు, వ్యాఖ్యల తీరులో అదే ప్రతిఫలిస్తున్నది. సర్జికల్ దాడులు నిజం కాదని, నియంత్రణ రేఖ మీదుగా భారత సైన్యం ఎప్పటివలెనే కాల్పులు జరిపిందని, ఇద్దరు సైనికులు చనిపోగా తొమ్మిదిమంది గాయపడ్డారని, భారత ప్రభుత్వం తమ ప్రజాభిప్రాయాన్ని సంతృప్తిపరచేందుకు సర్జికల్ దాడుల ప్రచారం చేస్తున్నదని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం చెప్పే మాటలకు అక్కడి మీడియా రాత్రింబవళ్ల ప్రచారాన్నయితే కల్పిస్తున్నది. కాని దానివెంట, ‘ఇంతకూ వాస్తవాలేమిటో తెలియరావటంలేద’నే ప్రశ్నలు కూడా వేస్తున్నది. ఇదంతా అక్కడి ప్రజలకు అయోమయంగా ఉండి ఉండాలి. గతంలోవలె భారత వ్యతిరేక ప్రదర్శనలు జరగకపోవటానికి ఇది ప్రధాన కారణమై ఉండవచ్చు.
మొత్తం మీద, సర్జికల్ దాడులకు ముందురోజులలో, తర్వాత ఈ కొద్ది రోజులలో సర్వత్రా ఇటువంటి వాతావరణం ఏర్పడటానికి కారణాలు ఏమిటో పాక్ ఆత్మపరిశీలన చేసుకోవటం అవసరం. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే, గత వారం మధ్యలో నియంత్రణ రేఖకు సమీపానగల టెర్రరిస్టు లాంచింగ్ ప్యాడ్స్‌పై మాత్రమే చర్య జరిపిన భారత సైన్యం అదే విధమైన చర్యలు మునుముందు ఇంకా జరిపినా, అంతకన్న ముందుకు వెళ్లి బాగా లోతట్టు ప్రాంతాలలోగల శిక్షణా శిబిరాలపై దాడిచేసినా సార్వత్రిక అభిప్రాయం ఇండియాకు అనుకూలంగా ఉండగలదనిపిస్తున్నది. దీని అర్థం అటువంటి దాడులు భారత సైన్యం చేయాలని చెప్పటం కాదు. వాతావరణం ఆ రీతిలో తనకు ప్రతికూలంగా ఉందని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలని చెప్పటం ఇందులోని ఉద్దేశం. పోతే, విషయం అంతవరకు వెళుతుందా? లేదా? వెళితే అది పూర్తియుద్ధంగా మారవచ్చునా? అటువంటి స్థితిలో అమెరికా పెద్దన్నగాని, అంతర్జాతీయ సమాజం గాని జోక్యం చేసుకోవటం ప్రశ్నలన్నీ సరే. అవి ఎప్పుడూ ఉండే ప్రశ్నలే. అందరూ కలిసి యుద్ధాన్ని ఆపవచ్చు కూడా. కాని మనం చర్చిస్తున్నది అది కాదు. ఒకవేళ అటువంటి స్థితి గాని తలెత్తితే అపుడు కూడా అందరూ కాకున్నా అత్యధికులు అటువంటి పరిణామాలకు కారణం పాకిస్తానే అని వేలెత్తి చూపే అవకాశం స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆలోచించుకోవలసిన వౌలిక, దీర్ఘకాలిక ప్రశ్న ఇది. టెర్రరిజాన్ని ప్రపంచంలో ఎవరూ ఆమోదించే పరిస్థితి లేదు.
ఒక దేశం ఏకాకి కావటం అనేది ఇన్నిన్ని విధాలుగా ప్రతిఫలిస్తుంది. పాకిస్తాన్ ఏకాకి కావటమన్నది ఈ ఒక్క రోజున ఉరీ దాడి, సర్జికల్ ఎదురుదాడి, అంతర్జాతీయంగా ఏర్పడిన వాతావరణం చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తున్న విషయం కాదు. దానికి లోతు, విస్తృతి, దీర్ఘకాలికత ఉన్నాయి. అవన్నీ ప్రస్తుత ఉదంతంలో సూక్ష్మరూపంలో ప్రతిఫలిస్తున్నాయి. ఇదే ఉదంతం విస్తరించినట్లయితే ఆరోజున విస్తార రూపంలో కనిపించగలవనిపిస్తున్నది. ఏకాకి కావడమంటే అది. పాకిస్తాన్‌కు విచారం కలిగించవలసిన పరిస్థితి ఇది.
ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. పాకిస్తాన్ మరొక అర్థంలో ఏకాకి కాలేదు. బహుశా మునుముందు కూడా కాకపోవచ్చు. అది భౌగోళిక- రాజకీయ వ్యూహాత్మక స్థితి. పాకిస్తాన్ అంతర్గతంగా ఎటువంటిదైనా, భారతదేశంతో తన వివాదాలు ఏవైనా, కశ్మీర్‌లో ఏ జోక్యం చేసుకున్నా ఆ దేశానికి భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. అటువంటి ప్రాముఖ్యత అమెరికా నుంచి చైనా, రష్యాల వరకు చాలామందికి తమతమ అవసరాల రీత్యా ఉండటం రహస్యం కాదు. పాకిస్తాన్‌కు గల మరొక ప్రాముఖ్యత ఇస్లామిక్ ప్రపంచానికి సంబంధించినటువంటిది. ఇవన్నీ అంతర్జాతీయ క్రీడలు. వాటికి ప్రయోజనాలతో తప్ప న్యాయాన్యాయాలతో నిమిత్తం ఉండదు. ఆ స్థితిని మనం దశాబ్దాలుగా చూస్తున్నాం, భవిష్యత్తులోనూ చూస్తాము. అమెరికా నాయకత్వాన ఏకధృవ ప్రపంచం ఏర్పడిన తర్వాత సైతం వారు పాకిస్తాన్‌తో తమకుగల వ్యూహాత్మక ప్రయోజనాల కోసం భారతదేశానికే ప్రతిసారి నచ్చచెప్పుతున్నారంటే, ఏకాకితనం అన్నమాటకు ఒక విధంగా అర్థం లేకుండా పోతున్నది. కాకపోతే, అమెరికా దృష్టిలో సైతం ఇస్లామాబాద్‌ది నైతికంగా ఒంటరితనమన్నది చివరకు తేలే విషయం.
ఇందుకు కశ్మీర్ సమస్యతోడవుతున్నదనేది కూడా కాదనలేని విషయమే. విలీన సమయం నుంచి నెహ్రూ ప్రభుత్వం మొదలుకొని అందరూ చేసిన తప్పులు, పాకిస్థాన్ ప్రయోజనాలు కలగలిసి దానినొక కొరకరాని కొయ్యగా మార్చిన మాట నిజం. ఒకవైపు పాకిస్తాన్‌ను శక్తివంతంగా నిలువరిస్తూ మరొకవైపు స్థానిక ప్రజలను వివిధ చర్యల ద్వారా మెప్పించగలగటం మినహా ఆ సమస్యకు పరిష్కారం లేదు. స్థానికంగా ఉన్న సమస్యను పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టి ఉపయోగించుకుంటున్నది. సరిగా అటువంటి స్థానిక సమస్య కారణంగానే అంతర్జాతీయ సమాజం వేర్వేరు డిగ్రీలలో తటస్థవైఖరిని అవలంభిస్తున్నది. భారతదేశానికి అనుకూలం కాని ‘కాని పరిస్థితి’ ఇది. ఇది పాకిస్తాన్‌కు అనువుగా మారింది. ఇతరత్రా తన భారత వ్యతిరేక చర్యలు, టెర్రరిస్టుల పోషణ, ఇండియా ఒక్కటేగాక పలు దేశాలలో టెర్రరిజానికి వారు కేంద్రంగా మారటం వంటి దోషాలు అందరికీ తెలిసినవే కాగా, భారతదేశంతో సమస్య విషయానికి వచ్చినపుడు మాత్రం వారికి కశ్మీర్ ఒక ‘ఎలిబీ’గా ఉపయోగపడుతున్నది. అయితే ఆ సమస్యకు కూడా టెర్రరిజం పరిష్కారం కాజాలదు.
ఇంత చేసీ పాకిస్తాన్ కశ్మీర్ లోయ ప్రాం తాన్ని తన అధీనంలోకి తీసుకోగలదా? అది అసాధ్యమని తనకు తెలియనిది కాదు. ఆ అంశాన్ని ఉపయోగించుకుని ఇండియాకు ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తూ పోవచ్చు. కాని అందువల్ల మరొక విధంగా తనకూ నష్టాలు ఎదురవుతున్నాయి గాని నికర ప్రయోజనం ఆవగింజంత అయినా ఉండటం లేదు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి. కనీసం కశ్మీర్ లోయ తనకు లభించకున్నా భారతదేశం నుంచి విడివడి స్వతంత్ర స్థాయిని సాధించుకునేట్లు కూడా పాకిస్తాన్ సహా ఎవరూ చేయలేరు. ఇది ఎప్పుడో స్పష్టమైంది. అటువంటి స్థితిలో పాకిస్థాన్ సాధించదలచుకున్నదేమిటి?
పాకిస్తాన్ తనకుతాను సమాధానాలు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్నున్నాయి. బయటివారెవరికీ చెప్పనక్కరలేదు. కాని తన మేలుకోసం తనకుతానే చెప్పుకోవాలి. పాకిస్తాన్ అనటంలో అర్థం అక్కడి ప్రభుత్వం, రాజకీయ నాయకత్వం మాత్రమేకాదు. అక్కడి సైన్యం, బురాక్రసీ, వ్యాపార పారిశ్రామికవర్గాలు, మత సంస్థలు, మేధావులు, సాధారణ ప్రజలు అందరు కూడా. ముఖ్యంగా సైన్యాన్ని, బురాక్రసీని, రాజకీయాలను నియంత్రిస్తున్న ఫ్యూడల్, పెట్టుబడిదారీ, ప్రాంతీయ (పంజాబీ) వర్గాలు. ఈ శక్తులను కాదని ఐఎస్‌ఐ గాని, టెర్రరిస్టులు గాని, చివరకు అమెరికా వంటి బయటి వ్యూహాత్మక క్రీడాకారులు గాని చేయగలిగేది ఏమీ ఉండదు. కనుక ప్రశ్నలకు జవాబులను తమకోసం, తమ దేశం కోసం చెప్పుకోవలసింది వీరే. అది జరగక ఈరోజున విఫల దేశమనే పేరుతెచ్చుకున్నారు వారు.
పాకిస్తాన్ ఏడు దశాబ్దాల క్రితం ఎందుకు, ఎట్లా ఏర్పడిందనే చర్చవల్ల ప్రయోజనం లేదు గనుక దానిని వదలివేయవచ్చు. కాని తర్వాత ఏడు సుదీర్ఘ దశాబ్దాలలో ప్రపంచం చాలాముందుకు పోయింది. పలు విధాలుగా ఆధునికమైంది. 1940ల వరకు భారత ఉప ఖండమంతటా ఉండిన ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడుతున్నది. రాచరికాలు, జమీందారీలకు బదులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు బలపడుతున్నాయి. సాధారణ ప్రజల చైతన్యాలు, భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ సవ్యంగా సాగి ఉన్నట్లయితే ఉపఖండంలో భారతదేశం వలెనే పాకిస్తాన్ కూడా ఈసరికి ఒక బలమైన ఆధునిక ఆర్థిక, ప్రజాస్వామిక దేశంగా అవతరించి ఉండేది. అట్లాకాక పోవటం భారతదేశానికి కూడా సమస్యగా మారింది.
తమ పరిస్థితి అన్నివిధాలా అస్తవ్యస్తంగా తయారుకావటానికి కావటం ఎందుకో వారు ఆలోచించుకోవలసి ఉంది. అనేకానేక ప్రశ్నలకు, అందులో భాగంగా కశ్మీర్ సమస్య, ఉడీ దాడి, సర్జికల్ దాడి వంటి వాటికికూడా వారికి సమాధానాలు లభిస్తాయి. ఈ స్పృహ అక్కడి రాజకీయ నాయకత్వానికి కనీసం జుల్ఫీకర్ అలీ భుట్టోతో ఆరంభించి నవాజ్ షరీఫ్ వరకు ఏదోఒక మేరకు కలిగింది కూడా. కాని సైన్యానికి, బురాక్రసీకి, మతశక్తులకు కలగటం లేదు. సామాన్య ప్రజలకు అన్నీ తెలిసినా నిస్సహాయులుగా ఉన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలలోవలె వారు ఉద్యమాలు, తిరుగుబాట్లు కూడా చేయలేని స్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య బయటి పెద్దన్నలు ఆ దేశాన్ని, సైన్యాన్ని, వత్తిడి ద్వారా రాజకీయ వ్యవస్థను ఎప్పటికప్పుడు తమ వ్యూహాల కోసం ఉపయోగించుకుంటున్నారు. మతశక్తులు, టెర్రరిస్టు శక్తులు నాన్-స్టేట్ యాక్టర్స్‌గామారి దేశాధినేతలనే హతమార్చుతున్నారు. ఈ స్థితి ఆ దేశానికి పెద్దప్రశ్న. తనకితాను సమాధానం ఇచ్చుకోవలసినటువంటిది.
*

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)