మెయన్ ఫీచర్
ఆత్మస్థయిర్యమే ఆలంబన ( అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒకప్పుడు ఆడవాళ్లు వంటగదికి, పడక గదికి అంకితమై పురుషాహంకారానికి బలవుతు జీవచ్ఛవంలా బతికేవారు. అర్ధంలేని ఆచారాలతో, మూఢ నమ్మకాలతో మగవాడి దౌర్జన్యంతో నిరాశా నిస్పహలతో తమలో తామే మూగవేదనని అనుభవించేవారు. అత్తల ఆరళ్లు, ఆడపడుచుల వేధింపులు, కట్టుకున్నవాడి అరాచకాలు, బాల్య వివాహాలతో నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 12 ఏళ్ల వయసున్న బాలికలను 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి కట్టబెట్టేవారు. సతీసహగమం అమల్లో ఉండేది. సృష్టికి మూలమైన ఆడవాళ్ల జీవితాలు నరకంగా వున్న తరుణంలో కొంతమంది సంఘ సంస్కర్తల పోరాటాల పుణ్యమాని బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలు అంతరించాయి. అయినా ఇంటి పెద్దలు స్ర్తి పురుషుల మధ్య వివక్షత చూపడం మానలేదు. ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని పెదవి విరవడం, మగవాడైతే వంశోద్ధారకుడు పుట్టాడని సంబరపడడం, ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అంటూ పాత సామెతలు వల్లె వేయడం, ఒకవేళ ఇంట్లో ఆడపిల్లకి చదువు చెప్పించినా పుష్పవతి కాగానే చదువు మాన్పించి నాలుగు గోడల మధ్యకే పరిమితం చేయడం, నలుగురితో మాట్లాడకూడదని, తలెత్తుకు తిరగకూడదనే ఆంక్షలతో వాళ్లని మానసికంగా ఎదగనివ్వకపోవడం కొనసాగింది.
పెళ్లి చూపుల పేరుతో శల్యపరీక్షలు, వరకట్న హింసలు వంటి వాటితో జైలులో ఖైదీలుగా, కట్టుబానిసలుగా బతుకుతున్న ఆడవాళ్ల జీవితాలలో కాలంతోపాటు మార్పులు మొదలై, పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు. ఆడవాళ్లు ఎంతగా చదువుకుని అనేక రంగాల్లో పురుషులతో పోటీపడి రాణిస్తున్నా దేశానికి, ప్రపంచానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్నా వాళ్లమీద పురుషాహంకార దాడులు మాత్రం తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడో అక్కడ మగవాడి దౌర్జన్యాలకి, అకృత్యాలకి, హింసాకాండకి దుర్మార్గానికి ఆహుతవుతునే వున్నారు. ప్రేమ పేరుతో వంచనకి గురవుతున్నారు. కాలేజీలు, బస్టాపుల్లో, బస్సుల్లో రైళ్లలో, ఆఫీసుల్లో చివరికి అసెంబ్లీలో, పార్లమెంట్‌లో సైతం లింగ వివక్షతకు గురవుతునే వున్నారు. లైంగిక దాడులు జరుగుతునే వున్నాయి. గాంధీజీ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగిన రోజున స్వాతంత్య్రం వచ్చినట్టు అన్నారు. కానీ పట్టపగలు కూడా ఆడది స్వేచ్ఛగా తిరిగే రోజులు పోయాయి. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని క్షణ క్షణం భయపడుతున్నారు. కారణం చట్టంలో లొసుగులు. తప్పు చేసిన వాడికి శిక్షలు కఠినంగా అమలు జరపకపోవడం ఒకవేళ శిక్షపడినా వాడికి మళ్లీ పైకోర్టుకి వెళ్లే అవకాశం ఇవ్వడం. ఒక కేసు జడ్జిమెంటుకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పైగా తీర్పు వచ్చాక వాడికి మరో అవకాశం. అందుకనే మనదేశంలో నేరం మీద నేరం జరిగిపోతునే వుంటాయి. ఒకపక్క ఆడవాళ్లపై బలాత్కారాలు జరుపుతూ ఆ కిరాతకులు నిర్దాక్షిణ్యంగా చంపుకుపోతుంటే వాళ్లని జైళ్లలోవుంచి రాచమర్యాదలు చేస్తున్నది ప్రభుత్వం. నాయకులు సిగ్గువిడిచి ఆడపిల్లల దుస్తులపై కామెంట్ చేస్తున్నారు. ఆడపిల్లలు అలాంటి దుస్తులు వేసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయని గుర్తించాలి. పాశ్చాత్య నాగరికతా ప్రభావం, ఇంటర్‌నెట్‌లు, ఫేస్‌బుక్‌లు విచ్చలవిడిగా చలామణి అవడం, టివీల్లో వస్తున్న సీరియల్స్, రియాల్టీ షోల ప్రభావం వీరపై పడుతోంది. మరి వీటన్నింటికి ఒకపక్క అను మతులిస్తూ, వాటి ప్రభావానికి లోనుకావద్దం టే సాధ్యమయ్యేదేనా? విమర్శించే ముందు వీటిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి.
కళారంగంలో సమాజాన్ని వికసింపచేసి ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలు పదికాలాలపాటు ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోతాయి. కానీ జగుస్సాకరంగా, అశ్లీలంగా కథానాయికలని కేవలం శృంగారానికే ఉపయోగించుకుంటూ మహిళను కించపరస్తున్నారు. సినిమాను పక్కా కమర్షియల్‌గా మార్చేసి కేవలం సినీతారలను బూతుబొమ్మలుగా చూపిస్తేనే సినిమా ఆడుతుందనుకోవడమంత మూర ఖత్వం ఇంకోటి లేదు. కళకి కళారంగానికి ఒక గౌరవం వుంది. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కళాకారునికి ఉంది. దర్శక నిర్మాతలు సినిమా అంటే కేవలం హీరోయిన్‌ని సెక్స్ సింబల్‌గా భావిస్తున్నారు. చాలామంది హీరోయిన్లు కూడా కేవలం డబ్బుకోసం ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధపడుతున్నారు. అసలు నేటి సిమాలు చూస్తుంటే సెన్సార్ అనేది వుందా అనే అనుమానం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఒకప్పటి మాయాబజార్, పాతాళభైరవి, గుండమ్మకధ, అనార్కలి, మిస్సమ్మ,, దసరాబుల్లోడు, పవిత్రబంధం, ధర్మదాత, మల్లీశ్వరి, నవరాత్రి, ఆడబతుకు, రోజులు మారాయి, గుడిగంటలు వంటి చిత్రాలు అజరామర దృశ్య కావ్యాలుగా నిలిచిపోయాయి. సావిత్రి, అంజలి, కన్నాంబ వంటి నటీమణులని చూస్తే రెండు చేతులా నమస్కారం పెట్టాలనిపించేది. అందుకే వాళ్లతరాలు మారినా చిరస్మరణీయులుగా మిగిలారు. ఇప్పటి హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకే కనుమరుగవుతున్నారు. ఒకవిధంగా ఇలాంటి చిత్రాలు రావడానికి మహిళా సంఘాలు కూడా ఒక కారణం. ఎందుకంటే ఈ జుగస్సాకర చిత్రాలు వలన యువత చెడుమార్గంలో పయనిస్తూ దారి తప్పుతున్నా వీరు అటువంటి చిత్రాల గురించి నోరు మెదపరు. ఎప్పుడో ఒకసారి ఏవో కొన్ని చిత్రాలు ఆడవాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయంటూ, వాటిని బ్యాన్ చేయాలని రోడ్డెక్కుతారు. అది కూడా కేవలం పబ్లిసిటీ స్టంట్. వాళ్లు చిత్తశుద్ధితో పనిచేయరు. ఏదన్నా సంఘటన జరిగినపుడు, ఒక ఆడపిల్లను ప్రేమించానని వెంటబడి మోసం చేసి పారిపోయిన వెధవలున్నప్పుడో, నడిరోడ్డుమీద ఆడపిల్లల మీద దాడి జరిగినపుడో ఈ మహిళా సంఘాలు నాయకులు మేమున్నాం అంటూ ఓ నాలుగు రోజులు గొడవ చేస్తారు. ఆ తర్వాత ఈ సంఘటన గురించి పట్టించుకునే దిక్కుండదు.
నిర్భయకి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అన్నివర్గాలవారు తమ నిరసనని తెలిపారు. తర్వాత మళ్లీ ఆ అమ్మాయిని తలుచుకున్నవారు లేరు. ఆయేషా కేసు ఇంతవరకూ తేలలేదు. తెనాలిలో మహిళ మృతి కేసు మాయమైంది. బందరులో అనూష కేసు, విజయవాడలో పట్టపగలు శ్రీలక్ష్మిని నరికి చంపిన కేసు, నిన్నగాక మొన్న నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితీశ్వరి కేసు ఇలా ఎన్నో కేసులు అటకెక్కాయి. ఏ కేసులోనైనా చివరకంటా పోరాడిన మహిళా నాయకురాలు ఎవరైనా ఉన్నారా? గుండెమీద చెయ్యేసుకుని చెప్పమనండి! స్ర్తివిముక్తి సంఘటనలని, దళిత స్ర్తిలని ఆదుకుంటామని, మహిళా అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పుకునే వీరవనితలు ముందుగా నీచ నికృష్టంగా తయారవుతున్న ఈ సినిమాలని కేవలం ఆడవాళ్లని విలన్లుగా అసభ్యతకు ఆనవాళ్లుగా చూపిస్తు రేటింగ్‌ను పెంచుకుంటున్న టీవీ చానళ్లని బ్యాన్ చేయమనండి!
ఇక వ్యాపార రంగానికి వస్తే ఆడవాళ్లు లేని ప్రకటనలు వుండవంటే అతిశయోక్తి కాదు. చివరికి మగవాళ్లు గడ్డం చేసుకునే రేజర్లు బ్లేడ్‌లు ఇలా ప్రతి ఐటమ్ యాడ్‌లోను ఆడది వయ్యారాలు ఒలకపోయాల్సిందే. కేవలం వారి అమ్మకాలను పెంచుకోడానికే ఆటబొమ్మని చేస్తున్నారు. ఇక అందాల పోటీలు... ఈ అందాల పోటీల పేరుతో చేసే వికృత విన్యాసాలు కోకొల్లలు. స్టేజిమీద ర్యాంప్ వాక్‌లని, క్యాట్ వాక్‌లని ఎవరో నలుగురిని జడ్జీలుగాపెట్టి వాళ్ల అందాలకి మార్కులిచ్చి వందలమందిని చూపులతో, చేతలతో, నఖ శిఖ పర్యంతం హింసలుపెట్టి చివరికి ఒకళ్లని ఎంపిక చేసి కిరీటం పెడతారు. వీటిని పారిశ్రామిక వేత్తలే పోషిస్తుంటారు. వీటిగురించి కూడా ఏ మహిళా నాయకులు నోరు విప్పరు. ఇప్పుడు పబ్‌లు, క్లబ్‌ల్లో కూడా ఆడవాళ్లని ఎరగా వేస్తున్నారు. ప్రతిసారి ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అరాచకాలు, గృహహింస, కట్నం చావులు జరిగినపుడల్లా పాలకులు మేము చర్యలు తీసుకుంటాం, రక్షణ కల్పిస్తాం అంటూ ఊదరకొడతారు. రోజులు గడిచాక ఆ విషయం అందరూ మరిచిపోతారు. చదువులు చెప్పే ఉపాధ్యాయినిలకు, ఆఫీసుల్లో పనిచేసే ఆడవాళ్లకి, కాలేజీ అమ్మాయిలకి, చివరికి ఇంట్లో వుండే ఆడవాళ్లకు కూడా రక్షణ లేకుండాపోయింది. మనుషులు వావివరసలు కూడా మరిచిపోతున్నారు. టెక్నాలజీ పుణ్యమాని కేవలం ఆడదాన్ని కామంతోనే చూస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే భ్రూణ హత్యలు. ఆడపిల్లలని కడుపులోనే చంపేస్తున్నారు. కడుపులో పడిన పిండాన్ని ఆడపిల్ల అని తెలిసిన వెంటనే చిదిమేస్తున్నారు. ఇదంతా స్కానింగ్ ప్రభావం. ఈ విధంగా దేశ జనాభాలో ఆడపిల్లలు కరువైపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు, వర్తమానాల్లో భయంకరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు పెరగుతాయి. ఇదంతా చాలదన్నట్టు ఈ మధ్య మహిళలు తమంతట తాముగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తమ అందానికి మెరుగులు దిద్దుకోవాలనే తపనతో మార్కెట్‌లో వచ్చిన ఐటమ్‌నల్లా వాడడం, చర్మ సౌందర్యం ముఖ సౌందర్యం అంటూ రకరకాల కాస్మోటిక్స్ వాడడం, కెమికల్స్ వలన చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఒకప్పుడు చర్మ సౌందర్యానికి సున్నిపిండి, సికాయ, నువ్వుల నూనె ఉపయోగించి ఆరోగ్యంగా వుండేవారు. ఇపుడు అందం పేరుతో ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇవి కాక రోడ్లమీద తిరిగే ఆడవారు మాస్కులతో ముఖాన్ని దాచుకుంటున్నారు. ఇది ఆడవాళ్ల వయసుతో సంబంధం లేకుండా ఈ జబ్బు పెద్దవాళ్లకి కూడా పాకింది. అసాంఘిక కార్యకలాపాలు ఈ ముసుగు మాటున జరిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఏది ఏమైనా ముసుగులు ధరిస్తున్న ఆడవాళ్ల వుద్దేశాలు ఎలావున్నా ఇవి అనారోగ్యానికి దారి తీస్తున్నాయన్నది సుస్పష్టం. శ్వాసకోశ వ్యాధులు,చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే కొంతమంది తమను కామాంధులనుండి రక్షణ కల్పించుకోవడానికి ఇలా చేస్తున్నామని చెపుతున్నా ముసుగు వేసుకున్నంత మాత్రాన అరాచకాలు తగ్గుతాయనుకోవడం అవివేకం.
మహిళలు తమను తాము కాపాడుకోవడానికి జన సమ్మర్ధం వున్న చోట్ల సంచరించడం, ఆటోల్లో ప్రయాణించేటప్పుడు నెంబర్ నోట్ చేసుకోవడం, ఏమాత్రం అనుమానమున్నా కంప్లైంట్ టీంకి ఫోన్ చేయడం,దుండగుల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం, ఆయుధాలని ఏర్పాటు చేసుకోవడం, అయినవాళ్లకి మెసేజీ పంపడం ముఖ్యంగా ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ధైర్యంగా ఎదురు తిరగడం వంటి వాటివలన దుండగులనుండి తప్పించుకోవడమే కాక వాళ్లని చట్టానికి కూడా పట్టించవచ్చు. పాలకులు కేవలం మహిళా దినోత్సవం రోజున కంటితుడుపు కార్యక్రమాలు కాక మహిళల భద్రతకు రక్షణకు తగు ముందస్తు చర్యలు తీసుకుంటే కొంతవరకు వారిపై జరుగుతున్న అరాచకాలను తగ్గించే అవకాశం వుంటుంది.