మెయన్ ఫీచర్

‘నమూనా’ పాలనకు స్థూల లక్ష్యాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణను ‘దేశంలోనే నెంబర్ వన్’ చేయడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొంతకాలం క్రితం కొద్దిసార్లు అన్నట్లున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేసిన వివిధ ప్రసంగాలలోగాని, ఇచ్చిన ఇంటర్వ్యూలలోగాని ఆ మాట ఎక్కడా కనిపించలేదు. దాని అర్థం ఆయన దృష్టి మారిందా? లక్ష్యాలు మారాయనా? ‘దేశంలో నంబర్ వన్’ అనే మాటను ఉపయోగించకపోయినా తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నట్లు మాత్రం పేర్కొన్నారాయన. అవేమిటి? దృష్టిమారటమేమిటి? అందుకు అర్థమేంటి?
తన ఆలోచనలో ఉన్నది ఆర్థికాభివృద్ధి సూచికలతోపాటు, మానవాభివృద్ధి సూచికలు కూడా పెరిగే తెలంగాణ అని తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలంగా చెబుతున్నారు. తన ప్రసంగాలతోపాటు, బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో ఆయన అర్థికమంత్రి ఈటెల నోటివెంట అమర్త్యసేన్ గురించి ఉటంకింపులు తరచు వినవస్తుంటాయి. గమనించదగ్గ ఒక ఆసక్తికరమైన విషయమేమంటే, మానవాభివృద్ధి గురించిన ప్రస్తావనలు పెరుగుతూ వచ్చిన కొద్దీ, ‘దేశంలో నంబర్ వన్’ తరహా ప్రస్తావనలు తగ్గుతూ పోయాయి. ‘నెంబర్ వన్’ అనే మాటలో ప్రతిఫలించేది ఆర్థికాభివృద్ధి పరమైన ఉద్దేశాలు. పరిశ్రమలు, వ్యాపారం, జిడిపి, వౌలిక సదుపాయ కల్పనలు, ఆదాయాలు మొదలైనవి. ముఖ్యంగా పాతికేళ్ల క్రితం ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై నెహ్రూ సోషలిజం ఆలోచనలు వెనుకకు పోయిన కొద్దీ జిడిపి పెరుగుదల ఒక్కటే కేంద్రానికి, రాష్ట్రాలకు కూడా లక్ష్యంగా మారింది. అభివృద్ధికి అదొక్కటే గీటురాయి అయింది. అందువల్లనే, ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు మన జిడిపి, ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగినప్పుడు పొంగడం, తగ్గినప్పుడు కుంగడం, అదే విషయాలు రాత్రింబవళ్లు చర్చించడం మినహా, యుఎన్‌డిపి వారి మానవాభివృద్ధి సూచిలో మన స్థానం క్రమంగా పతనం కావడం గురించి పాలకులు ఒక్కసారైనా వ్యాఖ్యానించలేదు. విచారించింది అంతకన్నా లేదు.
ఇటువంటి వాతావరణంలో నెంబర్ వన్ అన్నది ఒక వేదమంత్రంగా మారటంలో ఆశ్చర్యం లేదు. అభవృద్ధి వద్దన్నది ఎవరి వాదనా కాదు. అమర్త్యసేన్ రచనలలో అభివృద్ధి గురించి చెప్పడం చాలా కనిపిస్తుంది. ఆయన ఆర్థిక సంస్కరణలకు కూడా అనుకూలుడే. కాని ఆ సంస్కరణలు అందరికీ అవకాశాలను కల్పించాలని, మానవాభివృద్ధికి బాటలు వేయాలని చెప్తాడాయన. విశేషమేమంటే సంస్కరణల సిద్ధాంత కర్తలు సైతం ఒకదశ వచ్చేసరికి, ఆ విధానాల వల్ల పెచ్చు పెరిగే అసమానతల పట్ల ఆందోళన వ్యక్త పరచడం మొదలు పెట్టారు.
అనగా ‘దేశంలోనే నంబర్ వన్’ తరహా దృష్టిని మనవాభివృద్ధి దృష్టితో సమతులనం చేయాలన్నమాట. ఆర్థికాభివృద్ధి లేకున్నా ఫరవాలేదు కాని, ఉన్నంతలో సమానాభివృద్ధి కావాలనే విపరీత వైఖరులు ఒక చారిత్రక దశలో కొన్ని వర్గాలలో ఉండేవి. కాని అందులో ఉన్న ఉద్దేశం మంచిదేననుకున్నా, ఆచరణలో అందువల్ల హాని కలిగి విఫలమైనందున అది వెనుకబడిపోయింది. ఇపుడు వర్థమాన దేశాలు, ప్రగతిశీల దేశాలు, ఆలోచనా పరులైన వారి దృష్టి ఆర్థికాభివృద్ధి-మానవాభివృద్ధి సమతులనంగా సాగడం. అందులో భాగంగా అందరికీ సమానావకాశాల కల్పన. అటువంటి స్థితిలో దేశంలో నంబర్ వన్ తరహా మాటలు కేవలం స్ఫూర్తికోసమైతే ఆక్షేపణీయం కాదుకాని, వాస్తవమైన పరిపాలనా దృష్టితో మాత్రం అట్లుండకూడదు. అట్లున్నదనే సందేహం ప్రజలకు కలిగినందునే దేశంలో పలువులు మహా సంస్కర్తలపై గత 15 సంవత్సరాలుగా ఎటువంటి ఎన్నికల తీర్పులు చెప్తూవస్తున్నారో తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ వర్గాల జనాభా స్థితిగతులను గమనించడంతోపాటు, పైన పేర్కొన్న అనుభవాలను తెలిసిన మీదటనే సమతులన అభివృద్ధి నమూనాను ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నట్టు భావించాలి కావచ్చు. ఇటువంటి ఆలోచనలను ఆయన వెల్లడించడం గతంనుంచి ఉన్నదే. అదేసమయంలో ఈ రెండేళ్ల పాలన తర్వాత, నంబర్ వన్ తరహా మాటలు అసలెక్కడా కనిపించకపోగా, మానవాభివృద్ధి సూచీ, సంతోష సూచీ (్భటాన్ తరహాలో), ఆకుపచ్చ తెలంగాణ, సుఖ సంతోషాల తెలంగాణ, మానవీయ అభివృద్ధి తెలంగాణ,దేశంలో గర్వించదగ్గ రాష్ట్రం కావడం, దేశ నిర్మాణంలో పాత్ర అనే తరహా పరిభాషను ఆయన ఉపయోగించడం గమనించదగ్గది.
దీని అర్థం, ఆయన దీనినంతా తు.చ. తప్పకుండా అనుసరిస్తారని, సాధిస్తారని కావచ్చు, కాకపోవచ్చు. వాస్తవిక పరిస్థితులను బట్టి దేనికైనా కొన్ని పరిమితులు, ఒడిదుడుకులు సహజం. ఒక మహా పటిష్టమైన సిద్ధాంతంతో, మహత్తరమైన ప్రజాపోరాటాలతో నెలకొన్ని వ్యవస్థలు సైతం కారణాలు ఏమైతేనేమి కుప్పకూలి పూర్తిగా తిరగబడడం మన జీవితకాలంలోనే చూసాం మనం. అందువల్ల కొలబద్దలు నూటికి నూరుశాతం సాఫల్యాల పద్ధతిలో ఉండవు. ఉండటం సాధ్యం కాదు. కావలసింది ఒక వాంఛనీయమైన దృష్టి, ఆ మార్గంలో ప్రయాణం వీలైనంతమేర రాజీపడకపోవడం మాత్రమే. ఈ పద్ధతిలో ఆర్థికాభివృద్ధి-మానవాభివృద్ధి, అందరికీ అవకాశాలు, అన్ని ప్రాంతాల పురోగతి, చారిత్రకంగా దగాపడిన వర్గాలకు అదనపు చేయూత, అందరి ఆత్మగౌరవాలకు తగిన సామాజిక సమున్నతికి అవకాశాల కల్పన అనే స్థూలమైన లక్ష్యాలతో పరిపాలన నమూనాను తయారుచేసుకోవడం ప్రాథమికంగా జరగవలసిన పని. అదంటూ జరిగి ఆ మార్గంలో కట్టుబడిన విధంగా ముందుకు సాగినట్లయితే, పరిమితులు కొన్ని ఎదురైనా ఫలితాలు తప్పకుండా ఉంటాయి. గణనీయంగానూ ఉంటాయి. అవన్నీ తెలంగాణ ప్రజల అనుభవంలోకి రాగలవే గనుక, వాటిని గుర్తించి హర్షించడం సహజ పర్యవసానమవుతుంది.
కాని ఇదంతా చెప్పుకున్నంత తేలిక కూడా కాదు. దాదాపు వంద సంవత్సరాల స్వాతంత్య్రోద్యమకాలంలో, సమస్త జను లు ఉద్యమించి అనేకానేక ఆర్థిక-సామాజిక అంశాలు నిరంతర చర్చలకు గురైన దాని ఫలితంగా ఒక గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగం తయారైంది. కాని మొదటితరం పాలకులలోనే చిత్తశుద్ధి గల వారితోపాటు అది తగ్గినవారు కూడా తగినంత సంఖ్యలో ఉండటం వల్ల ఆ రాజ్యాంగానికి ప్రణాళికలకు, బడ్జెట్లకు, చట్టాలకు ఏమైందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ లక్షణాలు స్వాతంత్య్రం లభించిన తర్వాత మొదలైనవి కావు. ఉద్యమం ఉన్నతంగా సాగుతుండిన 1920లో, 30లో, 40లలోనే ముందుకొచ్చాయి. 1947లో అధికారం సిద్ధించిన వెనుక ప్రకోపనలు మొదలయ్యాయి. అందువల్ల, పైన అన్నట్లు ఇదంతా చెప్పుకున్నంత తేలిక కాదు.
అదే సమయంలో, మనం చుట్టూ చూస్తున్న అభివృద్ధి నమూనాలకు, పరిపాలనా నమూనాలకు తగినంత భిన్నం కాగల నమూనాల అమలు అసాధ్యమైనదీ కాదు. పలు పరిమితులు, ఆటంకాలు ఎదురుకాగలవనుకున్నప్పటికీ అసాధ్యం కాదు. కావలసింది తగిన దృష్టి, సంకల్పం. అమలు క్రమంలో చిన్నచిన్న రాజీల మాట అట్లుంచి, చిన్నా పెద్దా ఘర్షణలు కూడా కొన్ని తప్పవు. సమాజంలో పాతుకుపోయి, ఇటువంటి నమూనాను ఆహ్వానించని వర్గాలు ఇతర పక్షాలలోనేకాదు, స్వపక్షంలోనూ ఉంటాయి. స్వపక్షంలో చేరే వారంతా అధికారంలో భాగస్వాములు అవుతారు కాని, దృక్పథంలో భాగస్వాములు కాగలరని చెప్పగలమా? అందువల్ల, అట్లా దృక్పథంలో భాగస్వాములు కానివారు, తమకు ఆ దృక్పథంతో గల భిన్నత్వపు స్థాయిని బట్టి, ఏ విధంగానైనా వ్యవహరించవచ్చు. ఘర్షణ అన్నది రాగల కాలంలో పరిస్థితులపై ఆధారపడి ప్రత్యక్షంగానో, నర్మగర్భంగానో ఉండవచ్చు. ఇదంతా అంటున్నది కేవలం ఊహాగానంగా కాదు. మొదటి ప్రధానమంత్రి నెహ్రూ అనుభవాలలో ఇవన్నీ ఉన్నాయి.
మొత్తంమీద తెలంగాణలో ఇటువంటి నమూనాకు ఈ అయిదేళ్లు ఒక ప్రయోగం వంటిది. అది ఎంత విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకే గాక కేంద్రానికి కూడా అంత నమూనాగా నిలుస్తుంది. అంతకన్న ముఖ్యంగా సాధారణ ప్రజలకు, ఆలోచనాపరులకు దేశ వ్యాప్తంగా నమూనా అవుతుంది. 1952 నుంచి మొదలుకొని కేంద్రంలో వివిధ రాష్ట్రాలలో పలు సిద్ధాంతాలు, అస్తిత్వ గుర్తింపులు, ప్రయోజనాల పార్టీలు, ఐక్య సంఘటనలు, అనేకం అధికారానికి వచ్చాయి. వాటిలో కొంత భిన్నంగా ఆలోచించి ఎంతోకొంత నుంచి చేసినవి కూడా ఉన్నాయి. చేయదలచిన మం చిని పరిమితులు, అవరోధాల వల్ల చేయలేకపోయిన వారూ ఉన్నారు. మంచి చేసే ఉద్దేశం తమకు లేకున్నా ప్రజలు, పరిస్థితుల వత్తిడితో కొంత చేసిన సందర్భాలూ కనిపిస్తాయి. ఇటువంటి దశాబ్దాల కాలపు అనుభవాల నేపథ్యంలో ఇపుడు మనం కెసిఆర్ నాయకత్వాన టిఆర్‌ఎస్ పాలనలో తెరంగాణ రాష్ట్ర పరిపాలన, ఆయన నిర్దేశించుకుంటున్న నమూనాతో ఏవిధంగా సాగగలదో చూడవలసి ఉంది. తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని విధాలైన విశిష్ట గుర్తింపులున్నాయి. ఇపుడు పరిపాలన మరొక గుర్తింపునివ్వగలదా?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)