మెయన్ ఫీచర్

విశ్వశాంతికి భారత్ మార్గదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో శాంతి (విశ్వశాంతి) నెలకొల్పే దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అన్ని దేశాలను ఒకే తాటిపైకి నడిచే విధంగా ప్రణాళికను రూపొందించుకుంది. విశ్వమానవ కళ్యాణం కోసం భారతదేశం వేలాది సంవత్సరాల నుండి పాటుపడుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. సనాతన ధర్మం గతంలో విశ్వవ్యాప్తంగా వెలుగొందింది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, మలేషియా, శ్రీలంక తదితర దేశాల చరిత్ర ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారత్ విదేశీ పాలనను ఎదుర్కొన్నంత కాలం సనాతన ధర్మం ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఈ ధర్మాన్ని అణచివేసేందుకు అనేక దేశాలు ఎన్ని కుట్రలు పన్నినా మరింత వేగంగా ముందుకు సాగిందే కాని, వెనకకు తగ్గలేదు. ఇప్పుడు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోబోతోంది. సనాతన ధర్మానికి సనాతన యోగశాస్త్రానికి ప్రపంచంలోని అన్ని దేశాలు నేడు విలువ ఇస్తున్నాయి. మనుషుల మధ్య సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు, స్నేహం వర్థిల్లేందుకు సనాతన ధర్మం పాటుపడుతుందే తప్ప, ఇతర ధర్మాలను కించపరచడం, అణచివేయడం కోసం ప్రయత్నాలు జరగలేదు. అందుకే భారత్ నుండి ఏ ఆధ్యాత్మికవేత్త విదేశాలకు వెళ్లినా ఆయన ఏం చెబుతారు? ఏమి నేర్చుకుందామన్న ఆత్రుత విదేశీయుల్లో కనిపిస్తోంది. స్వామి వివేకానంద మొదలుకుని నేటిదాకా భారతీయ ఆధ్యాత్మిక గురువుల అడుగుజాడల్లో లక్షలాదిమంది విదేశీయులు నడుస్తున్నారు. భారతీయ సనాతన ధర్మంలో భాగమైన ‘యోగా’ను ప్రపంచమంతా గుర్తించేందుకు వీలుగా ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ) జూన్ 21ని ‘యోగా దినోత్సవం’గా ప్రకటించింది. సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచం గుర్తిస్తోందనడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.
భారతదేశం బాగుండాలని, ప్రపంచానికి మార్గదర్శనం చేయాలన్న లక్ష్యంతో యోగులు, రుషులు, దైశాంశ సంభూతులు నేటికీ తమ శక్తియుక్తులను వినియోగిస్తున్నారు. భారత్‌ను శక్తివంతం చేయాలని, తద్వారా ప్రపంచ శాంతి నెలకొల్పాలని యోగులు తమ తపస్సును ధారపోస్తున్నా రు. అమెరికా, రష్యా తదితర అభివృద్ధి చెందిన దేశాలు కళ్లు తెరవకపూర్వమే ప్రపంచానికి భారతదేశం వివిధ రంగాల్లో దారి చూపింది. అదేవిధంగా సమిష్టి కృషితోపాటు దివ్యశక్తుల ప్రభావంవల్ల భవిష్యత్తులో కూడా మన దేశమే ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతుందనడంలో సందేహం లేదు. సత్యం ధర్మం, న్యాయం, నీతి, సామాజిక శాంతి... వీటిని మానవజాతికి అందించింది సనాతన ధర్మమే. సనాతన ధర్మం భారత్‌కు గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. సనాతన ధర్మమే ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది.
భారత్‌కు చెందిన యువతపైనే దేశ భవిష్యత్తుతోపాటు ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యువశక్తిని దేశాభివృద్ధికోసం వినియోగించుకునేందుకు అనేకమంది మహానుభావులు, యోగులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా మారుతుందని, గురుస్థానానికి చేరే రోజు దగ్గర్లోనే ఉందని నేను చాలాకాలంగా చెబుతున్నాను. విశ్వశాంతికోసం అనేక దేశాలు భారత్ మార్గదర్శనం కోసం చూస్తున్నాయి. వివిధ దేశాల అధినేతలు గత ఏడాది కాలంగా భారత్ పర్యటన చేయడం ఇందులో భాగమేనని చెప్పుకోవచ్చు. భారత్‌లో మేధావులకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదు. వైద్యం, ఇంజనీరింగ్, శాస్త్ర విజ్ఞానం, రోదసి తదితర రంగాల్లో నిష్ణాతులైన భారత మేధావులను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది. భారత్ మేధస్సును అమెరికా రష్యా, బ్రిటన్‌తోసహా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉపయోగించుకుంటున్నాయి. భారత్‌కు చెందిన మేధావుల సేవలు అన్ని దేశాలకు అందుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల ముందున్న అతి పెద్ద సమస్య కాలుష్య సమస్య. సాధారణ పౌరులకు కాలుష్య సమస్య అతి చిన్నగా కనిపించవచ్చు. కాని ప్రపంచ మానవాళి జీవితం యావత్తూ కాలుష్యరహిత వాతావరణంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలను అనేక రూపాల్లో చూస్తున్నాం. భూకంపాలు, తుపాన్లు, టార్నిడోలు రావడం, మంచు పర్వతాలు కరిగిపోవడం, అంతరిక్షంలో ఓజోన్ పొర బలహీనం కావడంతో విపరీతమైన ఎండలు తదితర ప్రకృతి వైపరీత్యాలవల్ల ప్రాణ ఆస్తినష్టం జరుగుతోంది. అందుకే హైందవ ధర్మంలో భగవంతుడి పూజలు పూర్తయిన తర్వాత ‘పృధ్విశాంతిః, ఆపస్‌శాంతిః, అగ్నిశాంతిః, వాయుశాంతిః, ఆకాశశాంతిః’ అంటూ శాంతి మంత్రం చదువుతారు. పంచభూతాలు శాంతిగా ఉండాలని, తద్వారా విశ్వమంతా శాంతిగా ఉండాలని కోరుతోంది మన సనాతన ధర్మం. ఇంతటి విశాలమైన భావన ప్రపంచంలో ఏ ఇతర ధర్మం కూడా బోధించడంలేదు.
పంచభూతాలైన భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశాన్ని శాంతిగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. పంచభూతాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలపై ఉంది. పంచభూతాలు కలుషితం అయితే వాటి మధ్య సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. పంచభూతాలను సంరక్షించడం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడిలేదు. అందుకే ప్రపంచ దేశాలన్నీ మేల్కొనాలని, చైతన్యవంతం కావాలని, ఐక్యంగా పోరాటం చేయాలని (అవేక్, అరైజ్ అండ్ యునైట్) నేను చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకృతి ఏవిధంగా పంచభూతాలతో కూడి ఉందో, మన దేహం కూడా పంచభూతాలతో కూడి ఉంది. అందుకే ‘దేహమే దేవాలయం - హృదయమే దైవపీఠం’ అంటున్నాం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి అనేవి మన దేహంలో పంచభూతాలకి కేంద్రాలు. ఈ దేహాన్ని శుచిగా, శుద్ధిగా ఉంచుకోవాలి. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిబద్ధంగా జీవితాన్ని గడపాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రకృతివిరుద్ధంగా జీవనం గడపరాదు. పంచభూతాలతో కూడి ఉన్న మన శరీరాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ, ప్రకృతిని కూడా కాలుష్యరహితంగా ఉంచాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడంతోపాటు, వాక్కును తన అధీనంలో ఉంచుకుని, సత్కర్మలను (మంచిపనులను) చేయడాన్ని అలవర్చుకోవాలి.
పంచభూతాలను రక్షించాలన్న ఉద్దేశాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయాలని నేను గత రెండు దశాబ్దాల నుండి ప్రయత్నిస్తున్నాను. ఇందులో భాగంగా అమెరికా దేశానికి (యుఎస్‌ఎ) వెళ్లి వస్తున్నాను. అమెరికా అనేది ‘చిన్న ప్రపంచం’ (మినీ వరల్డ్). భారతతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన మేధావులు, శాస్తవ్రేత్తలు ఉంటున్నారు. అంటే మరో మాటలో చెప్పాలంటే ప్రపంచంలోని మేధావులందరినీ అమెరికా ప్రభుత్వం ఆహ్వానిస్తూ, వారి మేధస్సును ఉపయోగించుకుంటోంది. ఇదొక బృహత్కార్యం. అందుకే అమెరికాలో వినిపించే వాణి ప్రపంచం నలుమూలలకు వెళుతోంది. అందుకే ఏడాదిలో అయిదారు నెలలపాటు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా పర్యటనలో భాగంగా ఈనెల 18న అమెరికా వెళుతున్నాను. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదు నెలలపాటు పర్యటించబోతున్నాను. అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, శాస్తవ్రేత్తలతో ఆధ్యాత్మికవేత్తలతో చర్చిస్తున్నాను. విశ్వశాంతికోసం నా వంతుగా నేను చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది ‘స్వచ్ఛ్భారత్’ అంటూ పిలుపు ఇచ్చారు. స్వచ్ఛ్భారత్ అంటే కేవలం చీపురు పట్టుకొని రోడ్లు ఊడ్చడం కాదు. పంచభూతాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నదే మోదీ ఉద్దేశ్యం. మోదీ ఉద్దేశాన్ని భారతీయులంతా అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా నడవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళను ఏ విధంగా శభ్రంగా, కలుషితం లేకుండా ఉంచుకుంటారో- తమ పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. స్వచ్ఛ్భారత్ అంటూ మోదీ ఇచ్చిన పిలుపు ప్రధాన ఉద్దేశం ఇదే. ఈ ఉద్దేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. పంచభూతాలు కలుషితం కాకుండా ఎవరికివారు తమ వంతు సహకారం అందిస్తే సత్ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. విశ్వశాంతిని కోరే సనాతన హిందూ ధర్మం గొప్పదని మనం చెప్పడం కాదు.. విదేశీయుల చేత చెప్పించాలన్నదే నా తాపత్రయం. సనాతన ధర్మాన్ని విదేశీయులు గుర్తించి, అమలు చేయడం ఇప్పటికే ప్రారంభించారు.
అమెరికాతో సహా వివిధ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు, మాతృదేశాన్ని మరువకూడదు. ఏ దేశంలో నివశిస్తున్నప్పటికీ, ఆ దేశ నియమావళికి, చట్టాలకు లోబడే జీవిస్తూ, భారతదేశ కీర్తిప్రతిష్ఠలను కూడా అంతర్జాతీయంగా ఎగురవేయాలి. భారత్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేయాలి. మాతృమూర్తిని, మాతృభూమిని మరువకూడదు. మాతృమూర్తిని ప్రేమించేవారు, మాతృభూమిని గౌరవించేవారు సమాజంలో గుర్తింపు పొందుతారు. ప్రతి ఒక్కరికి సరైన ఆహా రం, కట్టుకోవడానికి దుస్తులు, ఉండటానికి ఇల్లు ఉండటంతపాటు విద్య వైద్యం తదితర వౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రభుత్వానికి విద్యావంతులు, ధనవంతులు, మేధావులంతా సహకరించాలి.
ప్రపంచంలోని అన్ని దేశాలు మూడు అంశాలను నివారించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యలను నివారించేందుకు పంచభూతాలను కలుషితం కాకుం డా చూడాలి. వివిధ కారణాల మూలంగా వస్తున్న భయంకర వ్యాధులను నివారించేందుకు భారీ పథకాలు, కార్యక్రమాలు చేపట్టాలి. యువతపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి యువత తప్పుడు మార్గంలో పయనించకుండా చూడాలి. మద్యానికి అలవాటు కాకుండా, రకరకాల మత్తు మందులకు లోబడకుండా చూడాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తే సమస్యలు ఉత్పన్నం కాకుండా నివారించవచ్చు.

-విశ్వయోగి విశ్వంజీ www.viswaguru.com