మెయన్ ఫీచర్

ఉత్తరాఖండ్ పరిణామాలు శ్రేయస్కరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చరిత్రలో ఇప్పటిరకు కనని, వినని ఒక ప్రక్రియలో పాల్గొన్న జయదేవ్ సింగ్ అనే వ్యక్తి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ఆయన ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి శాసన, పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఒక బ్యూరోక్రాట్. ఇంతకూ ఆయన చేసిన పనేంటి? బ్యూరోక్రాట్‌లకు ఎంతమాత్రం ప్రవేశించడానికి వీల్లేని ఉత్తరాఖండ్ విధానసభలోకి అడుగుపెట్టడమే కాదు, ప్రజాస్వామ్యంలో అతిపవిత్రంగా భావించే స్పీకర్ స్థానంలో కూర్చొని, అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించడం! ఇదంతా జరిగింది గత మే,10వ తేదీన! ఇటువంటి అసాధారణ కార్యకలాపంలో పాల్గొనడం ద్వారా ఆయన గిన్నిస్ బుక్‌లోకి స్థానం సంపాదించుకునే అర్హత సాధించారన్నది నా అభిప్రాయం. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో ఇకముందు జరగబోయే శాసన కార్యకలాపాల చరిత్రలో, తన పేరు పదిలంగా నమోదు చేసుకోగలిగారు.
ఇటీవలనే జరిగిన ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేశారు. ఈ తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు భాజపా సభ్యులతో కలిసి గత మార్చి 18న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఓటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది అసలు ప్రణాళిక. వీరి వ్యూహాన్ని ముందే పసికట్టిన స్పీకర్ మూజువాణి ఓటుతో శాసనసభ బడ్జెట్‌ను ఆమోదించిందని ప్రకటించారు. భాజాపా, కాంగ్రెస్ తిరుగు బాటు అభ్యర్ధులు ఇందుకు నిరసన తెలుపుతూ వెంటనే గవర్నర్ కె.కె.పౌల్‌ను కలిసి హరీష్ రావత్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి మైనారిటీలో పడిందంటూ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన గవర్నర్, మార్చి 28న శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇప్పటి వరకు స్క్రిప్ట్ చాలా స్పష్టంగానే ఉంది. బహుశా కొద్ది వారాల తర్వాత తాను స్పీకర్ సీట్లో కూర్చొని సభా కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తుందన్న అంశపై అప్పటి వరకు జయదేవ్ సింగ్‌కు ఏవిధమైన సంకేతాలు అంది ఉండవు.
అంతా అనుకున్నట్టుకాగానే స్పీకర్ మొ త్తం తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను, రాజ్యాంగం పదవ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపు వ్యతిరేక నిబంధనల కింద బహిష్కరణ వేటు వేశారు. స్పీకర్ తీసుకున్న చర్య సరైనదేనన్నది నా విస్పష్ట అభిప్రాయం. ఎవరో కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆకస్మికంగా పార్టీ ఫిరాయించి, ప్రతిపక్షంతో చేతులుకలిపి, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తున్న ఈ పరిస్థితిని నిరోధించడానికి స్పీకర్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించడం ఎంతైనా సమంజసమైన చర్య. ఈ విధంగా పార్టీ ఫిరాయించడానికి ‘‘ఆత్మ ప్రబోధానికి’’ ఎటువంటి సంబంధం ఉండదు. ఇది కేవలం ప్రలోభాలకు లొంగి, ఇతర పార్టీలోకి చేరే ‘హార్స్ ట్రేడింగ్’ తప్ప మరోటి కాదు.
ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు, జయదేవ్ సింగ్ పాల్గొనే చారిత్రక ‘ప్రక్రియ’కు మరింత దగ్గర కావడానికి దోహదం చేశాయి. తమకు నమ్మకస్తులుగా మారిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను స్పీకర్ బహిష్కరించిన కారణంగా, భాజపాకు, దొడ్డిదోవన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి అసెంబ్లీలో బలపరీక్ష జరగడానికి సరీగ్గా ఒకరోజు ముందు రాష్ట్రంలో రాష్టప్రతి పాలను విధించింది. దీంతో వరుసగా కోర్టులను ఆశ్రయించే కార్యక్రమాలకు తెరలేచింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించినవారికి శాససభ్యులంతా తప్పుచేసిన పిల్లవాళ్ల మాదిరిగా కనిపించడం సాధారణమైపోయింది.
రాష్టప్రతి పాలనను వ్యతిరేకిస్తూ ముందుగా స్పందించిన వారు ముఖ్యమంత్రి హరీష్ రావత్. కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన కోర్టు అసెంబ్లీలో బలపరీక్షకు మార్చి 31గా తేదీని నిర్ణయించింది. అంతేకాదు బహిష్కరించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించి, బలపరీక్షపై స్టే విధించడమే కాకుండా, దీని విచారణపై కూడా స్టేవిధించింది. ఈ పరిణామాల నేపథ్యం సహజంగానే సుప్రీంకోర్టు కలుగజేసుకోవడానికి దారితీసింది. రావత్ ప్రభుత్వం శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలంటూ ఏప్రిల్ 21న ఆదేశాలు జారీచేసింది. దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా, మే 10న ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాలంటూ నిర్దేశించింది. ఈ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలో రెండు గంటలపాటు రాష్టప్రతిపాలనను సడలించింది. ఈ బలపరీక్షను తామే నిర్వహిస్తామని ప్రకటించింది సుప్రీంకోర్టు! అంటే ఈ పరీక్షను నిర్వహించేది స్పీకర్ కాదు! దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ ఉన్నదన్న అంశంపై సుప్రీంకోర్టు నిర్దేశం మేరకు ఒక బ్యూరోక్రాట్ స్పీకర్ స్థానంలో కూర్చొని నిర్ణయించడం నిజంగా అసాధారణ పరిణామం! ఆవిధంగా జయదేవ్ సింగ్ చారిత్రక ప్రక్రియ నిర్వహించే తరుణం ముందుకు దూసుకొచ్చింది.
మరి ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించినప్పుడు మనల్ని ఆశ్చర్యపరచే అంశాలు చాలానే కనిపిస్తాయి. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య నిర్మాణాత్మక సమతుల్యతను మన రాజ్యాంగం కల్పించింది. మరి దీని భావమేంటి? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ మూడు వ్యవస్థలు వేటి పరిధిలో అవి స్వతంత్రంగా సమర్ధవంతంగా పనిచేస్తాయని! కాని మన రాజ్యాంగ నిర్మాతలు ఉత్తరాఖండ్‌లో మాదిరి జరిగే పరిణామాలను అప్పట్లో అంచనా వేయలేకపోయారు. మరి ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యేలు విదూషకుల మాదిరిగా వ్యవహరించడానికి నేపథ్యం వారి రాజకీయ బాస్‌లు! ఈ విపరిణామాలు సహజంగానే న్యాయవ్యవస్థ కలుగజేసుకోవడానికి దోహదం చేశాయి.
నా అభిప్రాయంలో..సంక్షోభాన్ని శాసనవ్యవస్థ తనకుతాను పరిష్కరించుకోలేకపోయిన నేపథ్యంలో కోర్టు కలుగజేసుకోవడమే కాదు మరింత ముందుకు వెళ్లింది కూడ. శాసన సభ్యులు తమ కార్యకలాపాలను ఏవిధంగా నిర్వహించాలన్న విషయంలో న్యాయవస్థ ఎట్టిపరిస్థితుల్లో కలుగజేసుకోరాదని రాజ్యాంగంలోని 212వ అధికరణం స్పష్టం చేస్తోంది. అందువల్ల శాసనసభలో స్పీకర్ రాజ్యాంగం ప్రకారం తనకు దఖలు పడిన అధికారాలను వినియోగించడం, న్యాయవ్యవస్థ పరిధిలోకి రావు. అందువల్ల స్పీకర్ నిర్ణయాలను ఏ కోర్టులు ప్రశ్నించజాలవు. కాని ఉత్తరాఖండ్‌లో స్పీకర్ తనకు దఖలు పడిన అధికారాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలపై కోర్టు తీర్పు చెప్పడం ఇక్కడ విశేషం.. విచిత్రం కూడా!
ఈ విషయంలో నాకు కొన్ని అభిప్రాయలున్నాయి. ఒకవేళ శాసనసభలో ఓటింగ్ నిజాయితీగా జరిగేలా చూడాలని కోర్టు భావిస్తే..ఈ మొత్తం ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం, వీడియో రికార్డు చేయడం వంటివి చేసి ఉండాలి. కానీ తనకు ఎప్పటికప్పుడు నివేదించాల్సిన కార్యదర్శికోసం స్పీకర్ తన సీటు ఖాళీ చేయాల్సి రావడం విచిత్రాల్లోకెల్లా విచి త్రం! మరి ఈ పరిణామాలు భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతాయన్నదానిపై ఆందోళన కలుగుతోంది. రాజ్యాం గ నిర్దేశం ప్రకారం సుప్రీంకోర్టు శాసన వ్యవస్థ అధికారాల్లో వేటినీ తన చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. ఒక ఎంపి కాని లేదా బ్యూరోక్రాట్ కాని న్యాయమూర్తి స్థానంలో కూర్చొని విచారణ జరిపి, తర్వాత తన తీర్పు కాపీని సీల్డుకవర్‌లో పార్లమెంట్‌కు పంపగలుగుతారా? ఆవిధంగా చేయవచ్చా? ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో జరిగింది సరిగ్గా ఇటువంటిదే. అంటే శాసనవ్యవస్థ ఉన్నత స్థానమైన స్పీకర్ సీటులో సుప్రీకోర్టు నిర్దేశం మేరకు, ఒక బ్యూరోక్రాట్ కూర్చొని ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందన్న అంశాన్ని నిర్ణయించారు మరి!
పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న రాజకీయ ప్రత్యర్థులు ఇక్కడ ఒక అతిముఖ్యమైన అంశాన్ని పట్టించుకోవడంలేదు. నేడు ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న పరిణామం, భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా నిలిచిపోతుందనేది వారి మెదళ్లకు తట్టకపోవడమే విషాదం. స్వతంత్ర భారత ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటి సారి చోటు చేసుకున్న ఈ అసాధారణ పరిణామానికి తామే కారణమన్న సంగతి కూడా వారికి పట్టకపోవడం విచారకరం. వీరి దుశ్చర్యల కారణంగానే ఒక బ్యూరోక్రాట్ 24 గంటలపాటు వార్తలో పతాక శీర్షికల్లో నిలిచారు. రాజ్యాంగపరంగా ఇదెంతవరకు సమంజసం? భవిష్యత్తులో మనం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నడు, న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థల సంబంధాలపై ఇటీవల ఉత్తరాఖండ్ పరిణామాల నీడ ఎట్టిపరిస్థితుల్లో ఉండితీరుతుంది. మరి ఈ పరిణామాలు సానుకూలమైనవి కూడా కాబోవన్నది కూడా గుర్తించాల్సిన మరో సత్యం. సానుకూల పరిణామాలకంటె, ప్రతికూల పరిణామాల ప్రభావమే అధికంగా ఉండటం, సువిశాల ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మనదేశంలో అత్యంత సహజం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన సమాజంలో మంచి తన ప్రభావం చూపే లోగానే, చెడు తేలిగ్గా విస్తరిస్తుంది.

-పవన్ కె. వర్మ