మెయిన్ ఫీచర్

ఆశుకవితా సన్యాసం.. రాయప్రోలుకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య డా. రాపాక ఏకాంబరాచార్యుల వారు రూపొందించి ఇచ్చిన ‘అవధాన విద్యా సర్వస్వం’ చదివాను. 13వ శతాబ్దం నుండి ఈనాటివరకు ఉన్న 182 మంది అవధానులను గూర్చి సోదాహరణంగా వివరించారీ గ్రంథంలో. పుస్తకం చివరలో ఉదాహరణలు లభించని 107 మంది ప్రముఖ అవధానులను తెలుగు అకాడమీ ప్రచురించిన సాహిత్య కోశము ఆధారంగా సంక్షిప్త పరిచయం చేసినారు డా. ఏపాక వారు. పద్య కవిత్వం మీద డా. ఏకాంబరాచార్యుల వారికున్న అత్యంతమైన ఆసక్తివల్ల తెలుగులో అవధాన విద్యకు సంబంధించి ఒక మంచి పుస్తకం ఇన్నాళ్ళకు సాహిత్యాభిమానులకు లభించింది. ఇది మంచి ప్రయత్నమే. అయితే ఈ పుస్తకం చదివిన సందర్భంలో ఒక ప్రముఖ కవి అవధానాలను గూర్చి చేసిన ఒక చారిత్రక ప్రకటన ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించలేదు. అందువల్ల తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన మహాకవి అవధాన విద్యను ‘వేగాదివేగోక్తి దుర్వ్యసనమని’ భావిస్తూ చేసిన చారిత్రక ప్రకటనను సాహితీపరులకు గుర్తు చేయవలసిన బాధ్యత నాకు ఉందనిపించి ఇది వ్రాస్తున్నాను.
అవధాన విద్యపై చారిత్రక ప్రకటన చేసిన ఆ మహాకవి రాయప్రోలు సుబ్బారావు. ఆధునిక తెలుగు కవిత్వాన్ని క్రొత్తదారులు తొక్కించిన అభినవ కవితా చార్యులు ఆయన. అవధానాలను గూర్చి ఆయన చేసిన వ్యాఖ్యానం తెలుగు కవిత్వానికి నూతన భాగ్యోదయాన్ని కలిగించినది. 1915 ప్రాంతంలో గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బుచ్చిరెడ్డిపాలెంలో మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్యశాస్ర్తీతో కలిసి నిర్వహిస్తున్న అవధాన కార్యక్రమ సందర్భంలో అకస్మాత్తుగా ఆశుకవితా సన్యాసం గూర్చి ఆయన చేసిన ప్రకటన అక్కడున్న సభ్యులను ఆశ్చర్యచకితులను చేసింది. అంతేకాదు ఆ ప్రకటన మొత్తం తెలుగు సాహిత్యలోకాన్ని తనవైపు దృష్టి మరలునట్లు చేసినది. ఇంత ప్రభావంతమైన ఆశుకవితా సన్యాసం గూర్చి రాయప్రోలు సుబ్బారావు వెల్లడించిన ఆవేదనా భరితమైన ప్రార్థనాపూర్వకమైన పద్యాలతో అవధానాలను గూర్చి చేసిన వ్యాఖ్యానం చూడండి -
తెనుగే తీయని దందు పద్య పదరీతి క్రీడలత్యంత మో
హనముల్ శోభనముల్ తదీయ రసరక్తాలాపనంబుల్ లభిం
చిన వాగర్థ కలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తునే
జననీ! యేమిటి కింక ఆశుకవితా సన్యాసమిప్పింపవే!
ఇది ‘ఆత్మనఃకలా’ వాణి అయిన సరస్వతీదేవిని గూర్చి రాయప్రోలు సుబ్బారావు ప్రార్థన, ఆవేదన. ఈ ఆవేదనే రాయప్రోలును మహాకవిని చేసింది. ఆశుకవితా సన్యాసమే ఆయనకు వరమైంది. తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వానికి మూల పురుషుడిని చేసింది. ఆనాడు కవిగా వ్యక్తిగత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేసే ఆశుకవితా వ్యాసంగాన్ని రాయప్రోలు ఎందుకు వదులుకున్నాడు? ఆనాడు సాహిత్యరంగంలో ఉన్న పరిస్థితులేమిటి? ఆనాడు కవులు, పండితులు అమితంగా ఆదరించిన ఆశుకవితావధానాన్ని రాయప్రోలు ఎందుకు తిరస్కరించినాడు? ఈ తిరస్కరణ, ఈ తిరుగుబాటు ఆయన జీవితంలోనే కాదు తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక పెద్ద మార్పునకు కారణమైంది.
భాషాపరంగా పై పద్యంలో కొంత సమాధానం కనిపించినా కనిపించని చారిత్రక భూమిక సామాజిక ప్రయోజన దృష్టి ఎంతో దాగి ఉంది. మృదుమధుర మనోహరమైన రసవంతమైన తెనుగుభాష సౌందర్యానికి ఆశుకవిత్వంవల్ల ఎంతో హాని జరుగుతున్నదని రాయప్రోలు భావన. అవధానాలలోని ఆశుకవిత్వం పద్య కవితా ప్రచారానికి, అభ్యాసానికి పనికి వ చ్చిన దానినొక విద్యగా రాయప్రోలు అంగీకరించలేదు. అందుకు ప్రధాన కారణం తాత్కాలిక వినోద లక్షణం, ఆలోచనకు అనుభూతికి అవకాశం లేకుండా కేవలం గణాల పంపిణీ మీద వేగంగా పద్యాలను చెప్పడం కావచ్చు. అవధానాలు ఆలోచనామృతమైన కవిత్వానికి సరియైన ప్రాతినిధ్యం వహించవని భావించినాడు. ఇది రాయప్రోలు అంతరంగం.
ఇక ఆనాడు 1915 నాటికి తెలుగు సాహిత్య రంగంలో కవిత్వ పరిస్థితి ఎలా ఉందంటే, కవులు పండితులు సంప్రదాయ కావ్యాలు అనేకంగా వ్రాస్తూనే వారివారి ప్రతిభా ప్రదర్శనకు ప్రాధాన్యమిస్తూ అవధాన ప్రదర్శనలు కూడా అనేకంగా నిర్వహిస్తూ వచ్చినారు. తెలుగుదేశంలో ఆనాడు ఆశుకవితా ప్రధానమైన అవధాన విద్యావ్యాప్తి ఎంత విస్తృతంగా ఉన్నదో వేలూరి శివరామశాస్ర్తీ అవధాని గారు వ్రాసిన ఈ పద్యం వల్ల తెలుస్తుంది-
ఎక్కడ జూచినన్ గవులే యెక్కడఁజూడ శతావధానులే
యెక్కడఁజూడనాశుకవులెక్కడఁ జూడ బ్రబంధ కర్తలే
దిక్కరులంచు బేర్వడిన తిరుపతి వేంకట సూరులేగు నా
ప్రక్కల్ నెల్ల నీ కడుపు పండినదమ్మ! తెలుంగు దేశమా!
ఇది ఆనాటి తెలుగు కవిత్వ పరిస్థితి. 20వ శతాబ్దం ప్రారంభం నాటికే తిరుపతి వేంకట కవుల అవధాన ప్రదర్శనలు చూచి వందలలో వేలలో అవధానాలు చేసినవారున్నారు. ఆనాడు తెలుగుదేశమునందు విద్వత్కవులైన పలువురు తిరుపతి వేంకటకవులకు శిష్యులై, ప్రశిష్యులై, ఏకలవ్య శిష్యులై బహుళ ప్రజాదరణ పొందినవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో వేంకట రామకృష్ణ కవులు, కాశీ కృష్ణాచార్యులు, కొప్పరపు సోదరకవులు, గాడేపల్లి వీర రాఘవశాస్ర్తీ, పోకూరి కాశీపతి, పల్నాటి సోదర కవులు, వేలూరి శివరామశాస్ర్తీ, అవ్వారి సుబ్రహ్మణ్య శాస్ర్తీ, కాటూరి కవులు మొదలైనవారు వందలలో ఉన్నారు. ఈ అవధాన ఆశుకవితా ప్రభావం నుండే రాయప్రోలు, విశ్వనాథ నాయని, నండూరి, జాషువా, తల్లావజ్జల మొదలైనవారు తిరుపతి వేంకటకవులకు శిష్యులై తమ రచనలను అనేకం వారికి అంకితమిచ్చారు.
ఈ పరిస్థితుల్లో ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగు నేలలో అప్పుడే మొదలైంది. 1909లో గోల్డ్‌స్మిత్ వ్రాసిన ‘హెర్మిట్’ ఆధారంగా రాయప్రోలు లలిత పేరుతో పద్యకావ్యాన్ని రచించినారు. రాయప్రోలు తన తొలి కావ్యమైన లలితలోనే తన కావ్య దృక్పథాన్ని గురించిన ఆలోచన ఇట్లు వెల్లడించినాడు -
శతపత్రాయత శుక్లపీఠమున శింజన్మంజు మంజీర రం
జిత పాదమ్ములు పాటలింపగ విపంచీ జీవతంత్రీకల
శ్రుతులం దీర్చి చతుర్ముఖావతర శ్లోకంబులంబాడు భా
రతి కంఠంబు ధ్వనించు కావ్య సుకుమార ద్వార మీక్షించెదన్
ఈ విధంగా కావ్యాన్ని గూర్చిన రాయప్రోలు విచార ధార చతుర్ముఖంగా ప్రవహించినట్లు ఆయన కావ్య అనంతర కాలంలోని ఆయన రచనా విధానం వ్యక్తీకరిస్తుంది. అందువల్ల లలిత రచనతోనే రాయప్రోలు రచనా జీవితం క్రొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు.
ఈ తరుణంలోనే వీరేశలింగంతో మొదలై గురజాడతో ఉద్యమరూపం దాల్చిన సంఘ సంస్కరణ దృష్టి, గిడుగు వ్యవహార భాషోద్యమం రాయప్రోలు ఆలోచనలను ప్రభావితం చేసింది. కాలధర్మానుగతంగా సమాజంలోను దాన్ననుసరించి సాహిత్యంలోను మార్పు అనివార్యమని గ్రహించిన రాయప్రోలు -
కాలధర్మానుగతమై జగత్ ప్రవృత్తి
మారునపుడు వాఙ్మయమును మారు నిజము
క్రొత్తనీరు తొల్కరియేళ్ల క్రుమ్మి పాఱ
ప్రాతనీరు కలంగుట బ్రమ్ము కాదు
- అంటూ తన రమ్యాలోకంలో మార్పు యొక్క సహజలక్షణాన్ని గుర్తించినాడు. అందుకే అప్పటివరకూ కొనసాగుతూ వచ్చిన కావ్య సంప్రదాయాన్ని ఒక మలుపు తిప్పినాడు తన తృణకంకణ కావ్య రచనతో.
సమకాలీన యువజన స్పృహతో ఆరంభమైన ఒక నూతనాదర్శాన్ని గూర్చిన అనే్వషణ ఫలితమే 1914లో వెలువడిన తృణకంకణ కావ్యరచన. ఇది వెలువడుతూనే తెలుగు సాహిత్యలోకంలో అమితంగా సంచలనం కలిగించింది. నూత్నత కోసం అఱ్ఱులు చాస్తున్న యువకవి లోకాన్ని పండితలోకాన్ని విపరీతంగా ఆకర్షించింది.
వస్త్భువ రచనల్లో నూతనత్వాన్ని తెచ్చిన రాయప్రోలు భాషాపరంగాను, సామాజిక పరంగానూ కవిత్వం యొక్క ఉన్నత లక్ష్యానికి ప్రతిబంధకంగా ఉన్న అవధాన ఆశుకవిత్వాన్ని తిరస్కరిస్తూ, ఆశు కవితా సన్యాసం చేస్తున్నారంటూ ఆశుకవితా సంప్రదాయాన్ని అమితంగా అభిమానిస్తూ ఆదరిస్తున్న తననాటి గురువులను పండితులను కవులను ధైర్యంగా ఎదిరించి నిలిచినాడు రాయప్రోలు. ముఖ్యంగా ఆనాడు పేరు పొందిన విద్వత్కవులు తనకు సాహిత్య విద్యారహస్యాలను బోధించిన ప్రథమ గురువు ప్రముఖ అవధాని, మేనమామ కూడా అయిన అవ్వారి సుబ్రహ్మణ్యశాస్ర్తీ వెంట దేశాటన చేస్తూ వారితో పాటు అనేక అవధానాలు చేస్తూనే రాయప్రోలు తాను అనుసరిస్తున్న ఆశుకవిత్వాన్ని సన్యసిస్తున్నానని చెప్పడం ఆనాడొక విశేషం.
ఏదిఏమైనా ఆనాడు రాయప్రోలు చేసిన ‘ఆశుకవితా సన్యాసం’ అనే సాహసం తెలుగు కవిత్వానికి క్రొత్త బాటలు వేసింది. ఆశుకవిత్వంవల్ల కవితా సౌందర్యం మరుగున పడిపోవడాన్ని కానీ, దానిని తాను వదలుకోవడాన్ని కానీ ఇష్టపడని వేదనా తీవ్రత ఆయనలో పెరుగసాగింది. ఇంతకూ ఆశుకవితను సన్యసించి చేసేదేమిటి? వెళ్ళేదెక్కడికి? ఈ సంక్లిష్ట మానసిక స్థితిలో ఆయన తనలోని క్షోభను తన గమ్యాన్ని కూడా ఇలా ప్రకటించినాడు-
రసమో భావమో జీవదర్ధ సుకుమార వ్యంజనా మంజు శ
బ్ద సమాసరచనంబొ సాధు హృదయస్పంద ప్రతిష్ఠా కథా
విసరంబొ సకలార్థ శూన్యమగు నీవేగాతి వేగోక్తి దు
ర్వ్యసనం బేటికి త్రిప్పుమింక జననీ! రమ్యాక్షర క్షోణికిన్!
- అంటూ ఆ వాగ్దేవికి విన్నవించుకున్న ఈ పద్యం రాయప్రోలు కవితా హృదయాన్ని కవిత్వంపై ఆయనకు గల దృక్పథాన్ని సృష్టీకరించింది. తాత్కాలిక వినోద లక్షణమే తప్ప ఏమాత్రం సామాజిక ప్రయోజన దృష్టిలేని అవధాన విద్యపై ఆయనకుగల అభిప్రాయానికి అద్దం పట్టింది ఈ పద్యం. బుచ్చిరెడ్డిగూడెంలో ఈ వేగాతివేగోక్తి దుర్వ్యసనానికి (అవధాన విద్యకు) మంగళం పాడటంతో రాయప్రోలు మనస్సులో కవితా స్వరూప సౌందర్యాలను గూర్చిన తీవ్రభావన ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ తీవ్ర ఆవేదన నుండే రాయప్రోలు ఒక దార్శనికుడిగా అవతరించినాడు.
తృణకంకణ కావ్య రచనతో తెలుగులో నవ్యకవిత్వానికి శ్రీకారం చుట్టిన రాయప్రోలు ఈ విధంగా రసభావహీనమై వేగాతివేగోక్తి దుర్వ్యసనంగా మారిన ఆశుకవిత్వానికి (అవధాన విద్యకు) సన్యాసమిచ్చి తన అభినవ కవితా రథాన్ని రమ్యాక్షర క్షోణికి మరలించుమని సరస్వతీదేవిని ప్రార్థించి కృతకృత్యుడైనాడు.
ఈ విధంగా ఆశుకవితా సన్యాసంవల్లనే రాయప్రోలు వట్టి అవధానకవి మాత్రమే కాకుండా అభినవ కవిత్వానికి ఆచార్యుడైనాడు.

- ఆచార్య కె.యాదగిరి సెల్: 9390113169