మెయిన్ ఫీచర్

సంస్కరణ గోదావరి కందుకూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జన్మలో మూడు జన్మల సంఘటనా సమ్మర్ధమైన బతుకు బతికేవారు అతి కొద్దిమంది మాత్రమే. అలాంటివారిలో దక్షిణాదిన ఆద్య పర్వత శృంగం కందుకూరి వీరేశలింగం ఒకరు. ఏప్రిల్ 16న వారి 170వ జయంతి. (జననం: 16-04-1848). 27 మే, 1919న కన్నుమూసిన కందుకూరి వారి శతవర్ధంతి వత్సరం కూడా ఇది. (మే 2018-మే 2019). వలస పాలనలోని దక్షిణ భారత సీమలో, ప్రజలకు ముఖ్యంగా స్ర్తీలకు స్వేచ్ఛ నిరాకరించే సంఘంతో తగవు పెట్టుకున్న సాహసి. అక్షరం ఆయన ఆశయాల ప్రచారానికి ఒక వాహిక. అందుకే ఒక ఉరవడిలో జీవితకాలంలో 130 దాకా రచనలు చేయగలిగారు. ప్రహసనాలు, నాటకాలు, అటు సంస్కృతం, ఇటు ఆంగ్లం నుంచి అనువాద నాటకాలు, వచన ప్రబంధాలు (నవల) రాయగలిగాడు. పత్రికలు నడపడంలో మొదటివాడు. స్వీయ చరిత్ర రాసిన తొలి తెలుగు ఆధునికుడు. విద్యాలయాల స్థాపనలో ముందున్న వ్యక్తి. సంఘ సంస్కరణ ఉద్యమంలో దక్షిణాదిన జాతీయ స్థాయి కృషి చేసిన ఆచరణశీలి. సాంఘిక సంస్కరణ కేవలం ఉపన్యాసాల్లో, కాల్పనిక రచనల్లో కాక, నిజంగా ఆచరణగా తలపెట్టిన వాస్తవిక జీవనుడు ఈయన. తన జీవితకాలం అవిశ్రాంత కృషి, భాష, సంఘ సంస్కరణ, కుటుంబము - సంఘము మధ్య ఒక అభివృద్ధి పూర్వక సామరస్య భావన పెంపొందింపు, ఆధునిక దృష్టి ఆవశ్యకత, సాహిత్య చరిత్ర నిర్మాణం, స్ర్తి విద్య- ఇలా కొనసాగిస్తూ, తీవ్రమైన అశాంతితో ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నాయి అన్న ఎరుక, వాటిని తమ తరువాతి తరాల వారు తలకెత్తుకుంటారు అని ఆశిస్తూ మే 27, 1919న వెళ్లిపోయారు.
‘‘నా జీవితంలో సాధించవలసిన కార్యములింకెన్నో యున్నవి. అవి సాధించబడక పూర్వమే అసువులు వీడవలసి వస్తున్నది. అయినా నా అనుచరులు, మిత్రులు, సంస్కరణలాభిలాషులు, నా రుూ మిగిలిన బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. అజ్ఞానంలో, అమాయకత్వంలో జీవిత సంస్కారం లేని ప్రజాస్వామ్యానికి విద్య, విజ్ఞానం, సమానత్వం, పరిష్కారం కలిగించడానికి కృషి చేయాలని కోరుతున్నాను’’ అన్నది వారి చివరి సందేశం. 1953లో వీరేశలింగ స్మృతి కవితలో విశ్వనాథ సత్యనారాయణ, సరళ రీతిలో రాసిన గీతం, ఒకరకంగా విశ్వనాథ బాణీకి కొంత వేరుగా వుంటుంది. అయినా అది వీరేశలింగాష్టకమే.
వీరేశలింగం పుట్టుక నాటికి, దేశంలో విద్యావిధానం స్థిరపడలేదు. ఈయనకి పదేళ్ల వయసు- 1857నాటికి, సిపాయిల తిరుగుబాటు అనంతరం, కలకత్తా, బొంబాయి, మదరాసు నగరాల్లో ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగింది. బాల్యంలోనే తండ్రి మరణం, తన కుటుంబ ఇబ్బందులు, చిన్ననాడే పెళ్లి వంటి పరిస్థితులవల్ల ఇరవై రెండేళ్లకుగానీ వీరేశలింగం మెట్రిక్ పరీక్ష పాసుకాలేదు. తరువాత, ప్రభుత్వ ఉద్యోగాలకై పలు పరీక్షలు రాసి వాటిలో విజయం పొందినా, ప్రభుత్వోద్యోగిగా జీవనమా, న్యాయవాదిగా వృత్తి ఎన్నుకోవడమా, లేక ఉపాధ్యాయునిగా జీవించడమా అన్నది చాలాకాలం యువ వీరేశలింగాన్ని సతమతం చేయగా, ‘తక్కువ పాపాలు చేసే వీలు, కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటుంది’ కనుక, తనకు అదే సరైనదిగా భావించి ఈయన రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరంలో ఉపాధ్యాయ వృత్తిలో, కొన్ని పాఠశాలల్లో తదుపరి ప్రధానోపాధ్యాయునిగా కూడా ఆ రోజుల్లో 44 రూపాయల జీతానికి పనిచేశారు. తర్క చింతన ఈ యువకుడిలో ఎలా ఉండేదీ అంటే, ఉద్యోగంలో చేరే రోజు, మంచి రోజు కావాలన్న పట్టింపు లేకుండా రోజులన్నీ మంచివే అంటూ కోరంగి పాఠశాలల్లో అమావాస్య నాడు ప్రధానోపాధ్యాయునిగా చేరి, ఛాందస హిందూ సమాజం ఆశ్చర్యపోయేలా చేశారు. స్ర్తి జీవన అభివృద్ధి ఇవాళ్టి సమాజ అవసరం అన్న తలంపు ఈ బడి పదవుల కాలం నుంచే పంతులుగారిలో బలపడుతూ వచ్చింది.
పత్రికల ముద్రణ ప్రధాన విషయంగా, మొదట్లో కొన్నాళ్లు మద్రాసులో ముద్రణ పనులు చేయించినా, తరువాత, కొంతమంది స్నేహితుల సహాయంతో రాజమండ్రిలోనే ముద్రణశాల నెలకొల్పి పూర్తిగా సంప్రదాయ చాదస్తాల దృష్టి, మనస్తత్వం వున్న మదరాసు వాసి కొక్కొండ వెంకటరత్నం పంతులుగారితో, పత్రికల ద్వారా వాద ప్రతివాదాలు, పోటా పోటీ పత్రికల సంచికలు తేవడం వంటివి చేసేవారు. ‘వివేకవర్థని అని వీరేశలింగం నడుపుతున్న పత్రికకు వెక్కిరింతగా, ‘హాస్యవర్థని’ అని వెంకటరత్నం మదరాసు నుంచి ప్రచురణ తేగా, దానికి ప్రతిగా, వెంకటరత్నం నడిపే పత్రిక పేరు ‘సంజీవని’ కనుక- ‘హాస్య సంజీవని’ అంటూ తామూ ఒక పత్రిక తెచ్చారు. వీరేశలింగం గారి జీవితంలో రెండు నగరాలు ప్రధానం. మొదటిది రాజమండ్రి. వారి పుట్టుక, ఉద్యోగము, కార్యాచరణకు కేంద్ర స్థలం. ఇక దక్షిణాది నాలుగు భాషల ప్రజల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మదరాసులో కూడా, తన ముఖ్యమైన పనులు జరిపారు. అయిదేళ్ళు అక్కడ మదరాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితునిగా పనిచేశారు. తరువాత రాజమండ్రి వచ్చేసినా, వారి మరణం కూడా 1919లో పనిమీద మదరాసు వెళ్లినపుడే జరిగింది. ఎగ్మూరులోని వేదవిలాస్‌లో వారు కన్నుమూశారు.
హిందూ సంస్కృతిలో విధవా వివాహం పురాణాల్లోనే వున్నది అని తెలిపేందుకు ఎన్నో ప్రాచీన ఉదాహరణలను వారు చూపారు. కోరంగి, తరువాత ధవళేశ్వరంలో ఉద్యోగం చేస్తుండగా, తన మిత్రుడు బసవరాజు గవర్రాజు పిలుపు మేరకు, రాజమండ్రి ప్రొవిన్షియల్ సోషల్ క్లబ్ ప్రారంభ సభకు వెళ్లారు. ఆ క్లబ్ సభ్యులు కావడమే కాక, అక్కడ, సంఘంలో, సంప్రదాయాల్లో చాదస్తాలను వదులుకోవాలని ఎన్నో ప్రసంగాలు చేసేవారు. అతి బాల్య వివాహాల వల్ల వచ్చే అనర్థాలను తన ఉపన్యాసాలలో, రచనల్లో ప్రబోధించారు. ఇక్కడ కూడా అక్కడ బోర్డు యాజమాన్య వర్గాలతో అభిప్రాయాల తేడావల్ల చేస్తున్న ఉద్యోగం వదులుకుని, హెడ్ మాస్టర్ మెట్క్ఫా ఏర్పరచిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తిరిగి తక్కువ జీతానికి రాజమండ్రిలోనే ప్రభుత్వ పాఠశాలలో, మరో దారి లేక ఈ ఉద్యోగంలో చేరారు. 1879లో ఏర్పాటుచేసిన ప్రార్థన సమాజంలో బ్రహ్మ సమాజ అవలంబనలో, వీరేశలింగం విగ్రహాతీత విశే్వశ్వర ప్రార్థనలను ప్రోత్సహిస్తూ, ఆ విధమైన క్రమశిక్షణ, వ్యక్తిగతంగా కూడా పరిశుద్ధ వర్తనకు దారితీస్తుందని ఆచరించి, ఈ సమాజ పద్ధతులపట్ల ఆకర్షితులైన యువతీ యువకులను అదరించి మద్దతు ఇచ్చారు. ఆడపిల్లలు పెద్దమనిషి అయ్యాక పెళ్లిళ్లుచేయాలనీ, అలాగే వితంతు యువతుల పెళ్లిళ్లు సమాజంలో చాలా అవసరం అని కూడా వీటి పట్ల శ్రద్ధచూపడం మొదలుపెట్టాడు. ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు బెంగాల్‌లో చేస్తున్న రచనలు ఇంకా తనకు అందుబాటులోకి రాకముందరే, మచిలీపట్నం నుంచి పరవస్తు రంగాచారి, వితంతు వివాహం శాస్త్ర సమ్మతమే అని తెలిపిన వివరాలు వీరేశలింగానికి ఉపకరించాయి. మను, యాజ్ఞవల్క్య, పరాశర స్మృతులు, ఈ విషయంలో సానుకూలమైన ధోరణిలోనే ఉన్నాయి కనుక, మన భారతీయ సమాజంలో, ఇలా వితంతు కన్యలు పెళ్లిళ్ళు లేకుండా ఉండాలని ఆంక్షలు ఉండడం సరికాదు అని నిరసన గళం ఎత్తారు కందుకూరి, తన మిత్రులతోబాటుగా. ఈ విషయాలను ప్రస్తావించిన వీరి తొలి ప్రసంగాన్ని ఆగస్టు 3, 1879న ప్రభుత్వ బాలికల పాఠశాల వేదికపై నుంచి రాజమండ్రి ప్రజలు విన్నారు.
ఈ దశలోనే వీరేశలింగం జాతీయ స్థాయి సంఘ సంస్కర్తగా ఎదిగారు. కేవలం వాగ్దానాలో, రచనలో, కల్పనలో లేక ఆవేశ పూరిత ప్రసంగాలో కాదు వీరేశలింగం తత్వం- ఆచరణ. అది ఆయన ప్రాణవాయువు. సంఘ సంస్కరణ ఆవశ్యకత భారత ఉపఖండం అంతటా పెల్లుబుకుతున్న సంగతులు ఆయనకు తెలుస్తున్నాయి. సిపాయిల తిరుగుబాటు కాలంలోనే, భారతీయ సమాజంలో సంప్రదాయ ఆంక్షలపై తిరుగుబాటు కూడా మొదలయింది. తొలి విధవా వివాహం బెంగాల్‌లో 1856లో వితంతు పునర్వివాహ చట్టం జారీఅయిన కొద్దికాలానికి జరగగా, ఇంకా యావత్ భారతదేశం, ఇటువంటి ప్రగతిశీల, అభ్యుదయ సాంఘిక వాతావరణం కోసం ఎదురు చూస్తున్నది. తరువాతి దశాబ్దాలలో అలా దేశం నలుమూలలా జరిగిన విధవా వివాహాల్లో, దక్షిణాదిన, తొలి పెళ్లి జరిగినది రాజమండ్రిలో. దక్షిణాదిన తొలి వితంతు పునర్వివాహ సంఘాన్ని నెలకొల్పేందుకు కొనే్నళ్ల ముందునుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈలోగా, బొంబాయి ప్రెసిడెన్సీలో 1869లో, అక్కడి సంఘ సంస్కర్తలు మహదేవ్‌గోవింద్ రనడె, విష్ణుశాస్ర్తీ చిప్లుంకార్‌ల పూనికతో జరిగింది. ఇక దక్షిణ భారతదేశంలో ఈ అపూర్వ ఘట్టానికి వేదిక రాజమండ్రి. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో మరెక్కడా ఇంకా ఈ అభ్యుదయం సాధ్యం కాలేదు. మదరాసులో దివాన్ బహదూర్ ఆర్.రఘునాథరావు, పి.చంచల్‌రావు మున్నగువారు రచనల ద్వారా, ఈ పెళ్లిళ్లు జరగవలసిన ఆవశ్యకత గురించి చెప్తున్నారు. రాజమండ్రిలో 1879-1880లో చురుకుగా పనిచేసేలా తన మిత్ర బృందం, సహచరులైన బసవరాజు గవర్రాజు, ఏలూరి లక్ష్మీనరసింహం, బాయపనీడి వెంకట జోగయ్య, కన్నంరెడ్డి పార్థసారథినాయుడు, చిర్రావూరి యజ్ఞన్నశాస్ర్తీ, కాజ రామకృష్ణారావులతో ఏర్పాటుచేశారు. వీరితో తరువాత కలిసినవారు కొమ్ము రామలింగంశాస్ర్తీ. ఆంధ్ర ప్రాంతంలో ఇది మొట్టమొదటి వితంతు పునర్వివాహ సంఘం. ఇక వివాహమే జరగాలి. అదే వీరేశలింగ ముద్ర.
దానికి తేదీ 11 డిసెంబర్ 1881. రాజమండ్రి సంప్రదాయ సమాజం ఒత్తిళ్ళ వల్ల, పెళ్లితంతులో అవసరమైన వైదిక పురోహితుల నుంచి, బ్రాహ్మణ వంటవాళ్ళూ, బాజాబజంత్రీలూ, ఇతర కులాలవారి దాకా అందరూ ఈ పెళ్లిని బహిష్కరించారు. పెళ్లికొడుకు గోగులపాటి శ్రీరాములు. వధువుని నూటయాభై కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామంనుంచి రహస్యంగా తరలించారు. పెళ్ళికొడుకు బంధుకోటి, ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని సమస్త ప్రయత్నాలూ చేస్తున్నారు. పెళ్ళికి రాజమండ్రి జిల్లా పోలీసు అధికారి స్వయానా హాజరయ్యారు. వీధుల్లో అరవై మంది పోలీసులు కాపలా. జరిగేది ఒక అమ్మాయి పెళ్ళా- లేక సామాజిక పోరాటమా? అలాంటి ఉద్యమకారుడు, సంఘమే తన రణరంగంగా పోరాడిన కందుకూరి. ఆయనకి తోడు ఆయన అర్థాంగి రాజ్యలక్ష్మమ్మ. ఇంటికి ఎవరూ నీళ్ళుకూడా తేవడానికి వీల్లేని ఆంక్షలు పెట్టిన రాజమండ్రి ఛాందస సమాజం ఉండగా, తానే గోదావరికిపోయి నీళ్ళుతెచ్చుకున్న వజ్ర సంకల్పానికి నిలువెత్తు రూపం రాజ్యలక్ష్మమ్మగారు. వీరేశలింగం ఎంత పట్టుదలగల మనిషి అంటే, మొదటి పెళ్లి జరిగిన నాలుగురోజులకే మరొక వితంతు వివాహాన్ని జరిపించారు. మదరాసు ప్రెసిడెన్సీలో యావత్ దక్షిణాదిలో, విధంచెడిన రమణీ లలామలకు, పచ్చని బతుకుదారి చూపిన సంస్కరణ గోదావరి ఈ పంతులుగారు. అయితే సంప్రదాయ శక్తులనుంచి సాంఘిక ఉత్పాతం చెలరేగింది. మూడో పెళ్లి చేయడానికి మరొక తొమ్మిది నెలలు పైగా పట్టింది. ఈలోగా మదరాసులో తాము పెళ్లిచేసిన జంటలతోబాటుగా వెళ్ళిన వీరేశలింగం దంపతులు, అక్కడి సమాజానికి ప్రోత్సాహకర ప్రసంగాలు చేశారు. మదరాసు క్రిస్టియన్ కాలేజీ ఎండర్సన్ హాల్లో చేసిన పంతులుగారి ప్రసంగం మదరాసుని కదిల్చింది.
ఈ వితంతు వివాహోద్యమానికి బాసటగా నిలిచిన పైడా రామకృష్ణయ్యగారి ఆర్థిక తోడ్పాటుతో, 1884 నడిమికి ముప్ఫయారేళ్ళ వీరేశలింగం పది వివాహాలు జరిపించారు. వారిలో వైశ్య కులానికి చెందిన రెండు జంటలు కూడా ఉన్నాయ. దక్షిణాదిన చోటుచేసుకుంటున్న ఈ సాంఘిక మార్పు పట్ల, బెంగాల్‌నుంచి ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మూడో విధవా వివాహం జరిపించినప్పుడే కందుకూరికి రాసిన లేఖలో హర్షం ప్రకటించారు. వీరేశలింగం చైతన్యం కేవలం సాహిత్య రంగానికే పరిమితంకాదు. అయినా సృజనలో వారి నాటిక ‘‘అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము’’ నూట పాతికేళ్ళ ముందర రాయబడ్డదైనా కొత్త ఆలోచనలకు కేంద్రం.
నూట ముప్పై పైగా రచనలు, సంస్కృత, ఆంగ్ల భాషలనుంచి అనువాదాలు, జీవిత చరిత్రలు, కవుల చరిత్ర ఇలా పది సంపుటాలుగా, నిరంతర రచనగా వెలువరించిన కందుకూరి, రచనా రంగాన్ని దాటి ఎదిగిన సంఘ సంస్కరణ జాతీయ నాయకుడు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు, ఆ సంస్థ ఆవిర్భావ చర్చల్లో పాల్గొన్న భారతీయ ఆత్మగౌరవ చిహ్నం కందుకూరి వీరేశలింగం. ఈ రాజకీయ ఆకాంక్షలతోబాటు, మనం మన సంఘాన్ని కూడా బాగుచేసుకోవాలి అన్న చైతన్యం కూడా ఆనాడు పంజాబీ, హిందీ మరాఠీ, ప్రాంతాలనుంచి దక్షిణాదిన తెలుగు, తమిళ ప్రాంతాలలోనూ బలపడ్డది. ఆ చైతన్య వేదికలుగా ఇండియన్ సోషల్ రిఫార్మ్ మహాసభలు, భారత ఉపఖండ వ్యాప్తంగా, సంఘ సంస్కరణ నాయకుల ప్రాతినిధ్యంతో 1889నుంచే జరుగుతూ వచ్చాయి. వీటిలో వీరేశలింగం భాగస్వామ్యం ఉన్నది. వీటి ఉద్దేశ్యం, 1885లో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్, కేవలం రాజకీయ స్వాతంత్య్రం అనే లక్ష్యంపైనే దృష్టిపెట్టడం కాకుండా, సంఘంలో రావాల్సిన ఆధునిక మార్పులు గురించి కూడా పట్టించుకోవాలి అన్నదే, అయితే, అలా మాటల్లోచెప్పి ఆగిపోయేవారు వీరిలో ఒక్కరూ లేరు. ఎవరికి వారే వారి ప్రాంత సమాజంలో, లాహోర్, లక్నో, బొంబాయి వంటి నగరాల్లో అభ్యుదయ పతాకలెత్తిన కార్యశూరులు. ఈ మహాసభలు ఉపఖండవ్యాప్తంగా, పలు నగరాల్లో జరుగుతూ వచ్చాయి. మదరాసులో 1889లో జరిగిన ఈ సోషల్ రిఫార్మ్ మహాసభలకు అధ్యక్షులు కందుకూరి వీరేశలింగం పంతులు. దక్షిణాదిన జరిగిన వితంతు వివాహాల ఉద్యమ చోదక శక్తి కందుకూరిగా, ఆ సభా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడె, వీరేశలింగాన్ని ప్రస్తుతించారు. అదీ కందుకూరికి జాతీయంగా ఉన్న స్థాయి.
ఏప్రిల్ పదహారు, వారి నూట డెబ్భయ్యో జయంతి వత్సర ఆరంభమేకాక, మే 27, 2018 వారి వర్ధంతి శతవత్సర ఆరంభం కూడా. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, భాషారంగాల్లో ప్రగతివేపు వారి అడుగులు తరువాతి తరాలవారికి మార్గదర్శకాలు. కందుకూరి రచనలను పునర్ముద్రించడమే కాకుండా, వాటిని ఈ తరాలవారు చదివేలా సరళ సంక్షిప్తరూపంలో తీసుకురావడం కూడా, ప్రభుత్వం, తెలుగు సమాజం వెంటనే చేయవలసిన పనులు. వారు నడిపిన హితకారిణీ సమాజం. తోట, తిరిగి రాజమండ్రిలో సమున్నత స్మారక నిర్మాణాలుగా నిలబెట్టడం తెలుగుజాతి, తమ ఆధునికత నిర్మాతకు చేసే పౌర వందనం. వారి సమాధిపై చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన మాటలు ఎప్పటికీ వెలిగే బావుటాలు.
‘‘తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము, తన విద్య
జగజ్జనులకే వినియోగించిన ఘనుడీ వీరేశలింగ కవి జనులార!’’

- రామతీర్థ, 9849200385