మెయిన్ ఫీచర్

సంగీతపు అలవరసలపై చెరగని సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుని అలా వొదిలేస్తే అందులో ఆలోచనల పడవేదో వంటరిగా ఎక్కడికో నింపాదిగా పోతోంటే గాలి తన అలవరసలపై రజనీని మోసుకువస్తుంది. ఈ ఎండాకాలంలో చల్లగాలి నిండా రజని నింపిన ఓలేటి, గోపాలరత్నం, ఎందరెందరో మన గుండెల్లోకి హాయిగా సరఫరా అవుతారు. ఏకాంతం అంతా వెనె్నల పరచినట్టు- ఆ వెనె్నట్లో రజనిగారు తన బాణీతో రాజేశ్వర్రావునో, కృష్ణుని వేణువునో, రెండూ మిళాయించో మన నిశ్శబ్దాన్ని తనివితీరా అలంకరించడమో... కళ్లేమో మన మాట వినకుండా వెలుగుతోబాటు కన్నీటినీ పారించడమో... ఏది ఆగుతుంది గనుకా?! దేన్ని నిలపగలం గనుకా?! అంతే.. చివరి పడవ ఆ తీరాలకు వెళ్లేపోయంది... పడవ వదలిన చిరు కెరటాలు మన ఆనందపు కన్నీరే. అసలు రజని వంటి లయకారుల తీరు అంతేనేమో! ఆయన స్వరధ్యానమో, పాటకోసం చేసిన తపస్సో వెరసి హోరుజోరు విధి నిర్వహణలో కనబడని ఆర్కెస్ట్రా రేడియో తోటలో ఎనె్నన్నో పూలు పూయించటం గాక అవన్నీ మన సొంత జ్ఞాపకాల దీవులకు తరలించడం ఎంతో, ఎంతో, ఎంతో కమనీయం?!
భావ కవిత్వానికి కృష్ణశాస్ర్తీగారెంత అవసరమో, రేడియోకు, లలిత సంగీతానికి రజని అంతే అవసరమయి మన తెలుగువాళ్లకి ఎంత మంచి జరిగిందో కదా! అనే్నసి రేడియో సంగీత కార్యక్రమాలు మన సౌందర్యావేశపు చిరునామాలై నేటికి, రేపటికీ నిలిచిపోయే పని జరిగిందంటే అది ఆషామాషీగా జరగలేదని నాటినుంచి నేటిదాకావున్న రజని శిష్యమిత్ర బృందాలు ఎంతో చెప్పగలవు. ఆనాటికి రజనీ కన్నా పెద్దవారు, చిన్నవారు, సహచరులు రేడియో ఇంటాబయటా ఎందరో సంగీత, సాహిత్య వీధుల్లో గొప్పగొప్ప వెనె్నల పూలు పూయిస్తుండగా వారందరి సమక్షంలో రజని ఆ ఎత్తున తన శైలి, తన బాణి, తన దనం నిలపడం ఒక అసాధారణ ప్రజ్ఞ. దాని ఫలితం నాటి పెద్దలకు, నేటి పెద్దలకు, మనకు, మనకన్నా చిన్నలకు ఒక తెలుగు పోతపోసిన లలిత సంగీత సంస్కారాన్ని, దాని సౌందర్యావస్థనీ మిగిల్చిపెట్టింది. అసలాయనవన్నీ అపురూపకాలు!
జంట కవులయిన రజని పెద్దల దీవెనో, ఆయనను అంటిపెట్టుకు తిరిగిన మహనీయ మిత్ర బృందం ఏర్పరచిన వెసులుబాటో గాని చివరికి సినీ సంగీతానికీ ఆయనవల్ల మహోపకారం జరిగింది. రెండుమూడు మారుపేర్లయితేనేం గాని రజని మార్కు గుబాళింపు తరగకుండా సదా మన చెవుల్లో సున్నితంగా ధ్వనించే హాయి నిలిచింది గదా! తీరిగ్గా బైఠాయించి నింపాదిగా ఎప్పటికో ఓ పాట రాసి, మెల్లిగా ఇంకెన్నటికో ఓ బాణీ కట్టి, వీలువెంట రేడియోతో వ్యాపారం జరిగేట్టు చేయడం కాదు... యాజమాన్యం పెద్దలు సూచించిన కార్యక్రమాలు రూపొందిస్తూ, సౌందర్యం చిటికెడయినా తగ్గకుండా ఎన్నో పాటలు రాస్తూ, ట్యూన్ చేస్తూ, పాడుతూ, పాడిస్తూ, సంతృప్తిగా కవిత్వం సృజిస్తూ, సినీ పెద్దలకు సహకరిస్తూ, సహోద్యోగుల ప్రేమాభిమానాలు ప్రోది చేసుకుని అనుదిన చైతన్యం సదా ఫలించేలా జాగ్రత్తవహిస్తూ, విస్తృతంగా పర్యటిస్తూ, విన్నంత కన్నంత పరవశించి సరికొత్త వివరాలు శోధించి, పరికించి ఆంధ్ర వాగ్గేయకారుల భోగట్టా ఘనంగా రాయటం మొత్తం అంతా రజనిగారి సువిశాల మనోధర్మం కావటం మనందరి అదృష్టం.
‘స్వైరిణీ అన్నారు నన్ను’, ‘ఏంటి గోపిక’ ఆర్తి గీతాలు, ‘మరు నిముసమే..’ వంటి ధ్యాన తత్త్వ గీతాలు, ‘మాదీ స్వతంత్ర దేశం’ వంటి దేశభక్తి గీతాలు, ‘చల్లగాలిలో’ వంటి సుకుమార శబ్దగీతాలు, ‘మనప్రేమ’ వంటి మధుర గీతాలు, ‘జేజి మామయ్య’ వంటి చిన్నారుల పాటలు, మన తెలుగు చరిత్ర గాథల గీతాలు, చెలంతో ఇంటర్‌వ్యూ వంటి అపురూప సంభాషణలు, చర్చలు తెలుగింటి సొంత ఆస్తులయ్యేట్టు సృజించి, అనుసృజించి, బాణి కట్టి నవతరానికి కొత్త బాట వేసి మరీ దీవెనలిచ్చి వెళ్లారాయన. రజని జీవితం రజనీ కన్న సువిశాలమైంది. పిఠాపుర వీధుల సాహితీమూర్తుల సందర్శనం, సంభాషణల నుంచి విశాఖ, విజయవాడ, మదరాసు, హైదరాబాదులకు దీపాలుపెట్టిన సుస్వర సంగీత ప్రముఖుల ముచ్చట్లు. స్వానుభవంతో చిరదీక్షా ఫలం ఇచ్చిన జ్ఞాపకాలు, అపార జ్ఞానాభిలాష ఇచ్చిన ప్రోత్సాహకాల వరకు ఎన్నయినా ఎంత సేపయినా రాజనిని కదిలిస్తే చాలు. జలజలా పూలు రాలినట్టు చెబుతారు.... అలా మాట్టాడిన అనంతరం (నిన్నటి వృద్ధాప్యంలోనూ) పైస్థాయిలో సప్తస్వరాలు శోభిల్లేలా పాడటం ఆయన ముచ్చట, శైలి. స్వీయ రచనలు చేయడం, బాణీలు కట్టడం గాక నూట యాభైకి పైగా క్షేత్రయ్య పదాలను ఆంగ్లంలోకి అనువదించారు. ‘చతుర్భాణి’ అనే భాణ రూపకాలల్లో మూడింటిని తెలుగుచేశారు. పార్వతీశ కవుల ‘ఏకాంతసేవ’ను ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. కూచిపూడి నృత్యరీతికి అవసరమైన పథకాల్లో తమవంతు మంచి చేశారు.
రేడియో శాస్ర్తియ, నృత్యసంగీత, లలిత సంగీత, నాటక సంగీత నేపథ్య రచనలకు కొత్తదనమిచ్చిన ఆద్యుడు రజని. సంగీత కళాశాలకు పెద్దగా నిలిచి తాను తయారుచేసిన శిష్యుల ప్రతిభకు గొప్ప కారణమయ్యారు. స్ఫూర్తికి సరయిన అర్థమయ్యారు. మరొకసారి విని చూడండి... ‘అతిథిశాల’, ‘విశ్వయానం’ అనే సంగీత రేడియో రూపకాలకు చిత్ర విచిత్రమైన ధ్వనుల అలంకారం ఎంత సొగసుగా కూర్చారో గమనించవచ్చు. ఎన్నని ఎన్నని రజనీ గీతాలు, గేయాలు రేడియో ప్రసారం చేసిందో అవన్నీ మహామహుల ‘సాహిత్య సర్వస్వం’ వంటి పుస్తకంవలె సమగ్రంగా ఒకచోట చేర్చి ‘యూట్యూబు’లోనో, మరేదో వైనంలో ‘నెట్’లో పెట్టే పుణ్యం నాటి జ్ఞాపకాలుగల రేడియో పెద్దలు చేస్తే తెలుగువారి ఆనందం మూటగట్టిన పుణ్యం దక్కకమానదు - కదండీ?!
‘కరముననొక మధుకలశము నిడికొని
...........................................
తారా పథమును చేరగ గళమూను
సారించుక తీయతీయని పాటలు
హాయిగా పాడుతునా....’
- అనుకుంటూ రజని పరిణామ క్రమంలోకి వెళ్లారు.
‘దెసల అంచున
నీదు పాట
తేలి కరిగెనోయి
పసిమి వెలుగుల
తోట నిలువున పులకరించెనోయి’

- శివాజీ, 9959178453