ఎడిట్ పేజీ

రాజీ మార్గంతో కేసులకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లలో పేరుకుపోతున్న కోర్టుకేసులకు సరికొత్త పరిష్కారం-రాజీ మార్గం. ఇందుకోసం కేంద్రప్రభుత్వం నూతన సవరణలతో ‘ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార చట్టం’ (ఎడిఆర్) తీసుకురావడంతో పాటు అనేక ఇతర మార్గాలను కూడా రూపొందించింది. అందులో ప్రధానమైనవి- లోకాయుక్త, లీగల్ సర్వీసెస్ అథారిటీలు, ట్రిబ్యునళ్లు, వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థలు, లోక్ అదాలత్‌లు, పారిశ్రామిక వివాదాల పరిష్కార సంస్థలు, జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార చట్టాన్ని తీసుకొచ్చినా కేసులు పెండింగ్‌లో పడటం ప్రారంభం కావడంతో ఎడిఆర్ చట్ట సవరణకు కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఉభయ పక్షాలకూ నష్టం కలగని రీతిలో మేలు చేయడమే ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార చట్టం లక్ష్యం. కోర్టులకు పోతే శిక్ష రూపంలో ఒకరికి కష్టం, మరొకరికి మేలు జరుగుతుంది. తీవ్రమైన శిక్షలు అవసరం లేకున్నా, ప్రతి కేసులోనూ కోర్టులకు పోవడం వల్ల ఇరు పక్షాలకూ ఒక్కో మారు నష్టం వాటిల్లుతుంది. ఈ ఇబ్బంది నుండి బయటపడేందుకు ‘ఎడిఆర్’ దోహదం చేస్తుంది.
మనిషికి, మనిషికి మధ్య అనేక హక్కులు, బాధ్యతలు ఉన్నట్టే ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య హక్కులు , బాధ్యతలు ఉంటాయి. ఈ హక్కుల కోసం అవతలి వారి బాధ్యతలను నెరవేర్చడానికే ఎన్నో తగవులు, గొడవలు జరుగుతుంటాయి. దాని కోసం కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం. కొంత మంది అనవసర వ్యాజ్యాలను వేయడం, కొంతమందిని వారి ప్రమేయం లేకపోయినా కోర్టులకు లాగడం, ఎన్నో చట్టాల్లో లోపాలు, ఇవన్నీ కలిసి సగటు భారతీయుడికి ఎంతో నష్టం వాటిల్లుతోంది. కొంతమంది కనీసం జామీను కూడా తెచ్చుకోలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ తాము చేసిన శిక్ష కంటే ఎక్కువ కాలమే జైళ్లలో మగ్గుతున్న సందర్భాలు ఎనె్నన్నో.
ఏళ్ల తరబడి కేసులు ఎందుకు పరిష్కారం కావడం లేదు? న్యాయమూర్తులే కారణమా? కక్షి దారులా? వారి తరఫున వాదించే న్యాయవాదులా? న్యాయస్థానాల్లో వౌలిక సదుపాయాల లేమి కారణమా? ఇలా చెప్పుకుంటే ‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్న’ట్టే, అనేక కారణాలతో కేసులు కొండల్లా పేరుకు పోతున్నాయి. ఒక పక్క లక్షల్లో కేసులు పరిష్కారం అవుతున్నా, మరో పక్క అంతకు మించి కేసులు నమోదు కావడం వల్లనే ఎపుడు చూసినా కేసుల సంఖ్య కోట్లలోనే కనిపిస్తోంది. ఢిల్లీకి చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి 320 సంవత్సరాలు పట్టొచ్చని అంచనా. కేసులు తేలడం లేదన్నది సహజమైన మాట. ఏ న్యాయస్థానానికి వెళ్లినా వేలల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులు మొదలు, జిల్లా కోర్టులు, మెట్రోపాలిటన్ కోర్టులు, హైకోర్టులు , చివరికి సర్వోన్నతమైన సుప్రీం కోర్టు వరకూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితి ఇప్పటిదే కాదు, బ్రిటిష్ కాలం నుండి ఉన్నదే. అప్పట్లో చాలా విషయాలకు స్పష్టమైన చట్టాలు, శిక్షలు, సూత్రీకరణలు లేకపోవడం వల్ల కేసులు పెండింగ్‌లో పడేవి.
నిజంగానే కేసుల విచారణలో అనూహ్యమైన జాప్యం జరుగుతోందా? దీనికి ప్రత్యామ్నాయ పరిష్కారం లేదా? న్యాయస్థానాలు లేకముందు వివాదాలే లేవా? ఉంటే వాటి పరిష్కారం ఎలా జరిగేది ? ఆ పద్ధతులు ఇపుడు ఎందుకు అమలులో లేవు. వివాదాలను శాస్ర్తియ దృక్కోణంతో విచారించి నిజానిజాలను నిగ్గుతేల్చి తీర్పులు ఇచ్చే దేవాలయాలే న్యాయస్థానాలు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, తప్పు చేయని వారికి చట్టం రక్షణగా నిలవాలి అనేదే న్యాయస్థానాల అంతర్లీన స్ఫూర్తి. అందుకే న్యాయస్థానంలో ప్రతి కేసులోనూ ఒకరికి నష్టం జరిగితే, మరొకరికి మేలు జరుగుతుంది. తప్పు చేసిన వారికి శిక్ష అనివార్యం.
తీవ్రమైన నేరాలు, ఘటనలు, దోపిడీలు, అత్యాచారాలు, దాడులు, ఇతర దుర్మార్గాలకు పాల్పడిన వారిపై విచారణలు జరగాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఘటనల్లో మరో పక్షంలో బాధితులకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. వాస్తవానికి ఇలాంటి కేసులు న్యాయస్థానాల్లో కేవలం 15 నుండి 20 శాతం మాత్రమే. మిగిలిన కేసుల్లో ఎక్కువ భాగం ఎవరికీ తీవ్రమైన నష్టం కలిగించనివే. ఏ మాత్రం నష్టం ఉంటే- అది సంస్థలకూ, ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినవి. అయినా ఆ కేసులు కూడా ఏళ్ల తరబడి అపరిష్కృతంగానే ఉన్నాయి.
మహాత్మా గాంధీ ఇంగ్లాండ్‌లోని ఇన్నర్ టెంపుల్‌లో న్యాయశాస్త్రం అభ్యసించి బారిస్టర్ పట్టా పొంది , భారతదేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఒక కేసులో సహాయకుడిగా ఉండటానికి 1893లో ఆయన దక్షిణాఫ్రికా వెళ్లారు. ఆ కేసు పేరు దాదా అబ్దుల్లా కేసు. ఈ కేసు రికార్డు పరిశీలించిన మహాత్మాగాంధీ తన క్లయింట్‌కు చట్టప్రకారం మంచి వాదన ఉందనే భావనకు వచ్చారు. కానీ ఆ దావా కొనసాగిస్తే బంధువులైన వాది, ప్రతివాదులు నష్టపోతారు. కనుక ఆ దావాను రాజీ చేశారు. దీనికి ఇరు పార్టీలూ సంతోషించాయి. ఈ విషయాన్ని గాంధీ తన ‘సత్యంతో ప్రయోగాలు’ గ్రంథంలో వివరించారు. ఈ కేసు వల్ల నిజమైన న్యాయవాద వృత్తిని ఎలా చేయాలో తాను నేర్చుకున్నానని, పార్టీలను కలిపి రాజీ చేయడమే అసలైన న్యాయవాది విధి అని తాను తెలుసుకున్నానని అందులో రాశారు. ఆ తర్వాత ఆయన 20 ఏళ్లపాటు అనేక కేసుల్లో రాజీ కుదిర్చారు. దీనివల్ల గాంధీ డబ్బు కోల్పోయినా తన ఆత్మను మాత్రం పోగొట్టుకోలేదు.
పాశ్చాత్య న్యాయవ్యవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నది, అది పేద ప్రజలకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పవచ్చు. ఆ న్యాయవ్యవస్థతో సుఖం లేదని గాంధీ నిర్ధారించారు. అదే పరిస్థితి నేడు దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో కేసులో గట్టి వాదనలు వినిపించాలంటే గంటకు లక్షల్లో పేరుమోసిన న్యాయవాదులు వసూలుచేస్తున్నారేది గోప్యం కాదు. రాం జిత్మలానీ, ఫాలినా రిమన్, కేకే వేణుగోపాల్, గోపాల్ సుబ్రహ్మణ్యం, పి.చిదంబరం, హరీష్ సాల్వే, ఎఎం సింఘ్వి, సిఎ సుందరం, దుష్యంత్ దవే, సల్మాన్ ఖుర్షీద్, పరాగ్ త్రిపాఠీ, కపిల్ సిబాల్, శాంతి భూషణ్, రంజిత్ కుమార్, రవి సిక్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసిద్ధ న్యాయవాదుల జాబితా చాలా పెద్దదే. గాంధీ దృష్టిలో న్యాయవాది అంటే రాజకీయ, ఆర్ధిక, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాల్సిన ప్రజా ఉద్యోగి మాత్రమే. రాజ్యాంగంలో అందరికీ సమాన న్యాయం అందించాలనీ, న్యాయం ముందు అందరూ సమానమేనని ప్రాథమిక హక్కుల భాగంలో 14వ నిబంధనలో చెప్పినా, పేదలకు న్యాయ సహాయం గురించి ఆ విభాగంలోగాని, ఆదేశిక సూత్రాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు.
1976లో ఎఐఆర్ 1976 ఎస్సీ 1163లో న్యాయ సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పిన తీర్పు చివరికి అదే ఏడాది 42వ రాజ్యాంగ సవరణకు దారితీసింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల విభాగంలో మాత్రమే 39ఎ నిబంధనను చేర్చారు. ఈ నిబంధన ప్రకారం ఉచిత న్యాయ సహాయం అందించాలని, అందుకు తగిన పథకాలను రూపొందించాలని నిర్దేశించారు. ఇది కేవలం ఆదేశిక సూత్రం కావడం, ప్రాథమిక హక్కు కాకపోవడంతో అంతగా ఫలితాలను ఇవ్వలేదు. దాంతో మళ్లీ న్యాయవ్యవస్థ స్పందించింది. 1979 ఎస్సీ 1960లో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ భగవతి ప్రభుత్వం బాధ్యతను ఊటంకిస్తూ న్యాయ సహాయాన్ని ఇవ్వడమే గాక, రాజీ చేయడానికి ప్రజా కోర్టులు లేదా నీతి మేళాలు వంటివి ప్రోత్సహించాలని ఆదేశించారు. న్యాయ సహాయాన్ని హక్కుగా పరిగణించాలని ఆయన సూచించారు.
మహాత్ముని ఉద్దేశాలకు అనుగుణంగా 1987లో కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో జస్టిస్ వి ఆర్ కృష్ణయ్యార్ పాత్ర గణనీయమైనది. పేదలకు న్యాయ సహాయం, సాధారణ పౌరులకు న్యాయం అందుబాటులో ఉంచడం, ఖర్చులు లేకుండా న్యాయవాదుల వాదనలు, న్యాయస్థానాల విధానాలను పేర్కొంటూ త్వరితగతిన విచారణ పూర్తి చేసి ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అనుమతించడం వంటి విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. న్యాయ సహాయక పథకాలు అమలు జరిపే కమిటీ పేరుతో జస్టిస్ భగవతి అధ్యక్షతన ఏర్పాటు చేస్తూ 1980 సెప్టెంబర్ 26న తీర్మానం చేసి అమలు చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. కమిటీ పనితీరును పరిశీలించిన తర్వాత అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించి న్యాయ సహాయాన్ని పటిష్టంగా అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి అధికారిక సంస్థలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 1987లో కేంద్రం తొలిసారి విప్లవాత్మకమైన బిల్లును పార్లమెంటులో తెచ్చి కేంద్ర, రాష్టస్థ్రాయిల్లో అధికారిక సంస్థలను ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల తగవులను పరిష్కరించడానికి ప్రజాకోర్టులు ఏర్పాటు చేసి కచ్చితంగా రాజీ కుదిర్చే యత్నాలు సాగిస్తూ వచ్చాయి. కానీ వాటికి చట్టబద్ధత లేదు. దాంతో లోక్ అదాలత్ (ప్రజాకోర్టు) వ్యవస్థకు చట్టబద్ధత కల్పించేలా శాసనం చేశారు. న్యాయ సేవాధికారిక సంస్థ 1987 చట్టం 39/1987 అమలులోకి వచ్చింది. ఇందులో ఏడు విభాగాలు, 30 సెక్షన్లు ఉన్నాయి. అదే రీతిన కేంద్రం ఎడిఆర్ చట్టంలో (1996) సమూల మార్పులు చేసి 2015లో సమగ్ర చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ చట్టం 2015 అక్టోబర్ 23 నుండి అమలులోకి వచ్చింది. మధ్యవర్తిత్వం, తగాదాల రాజీ, సఖ్యత- సంప్రదింపులు, సంధి కుదర్చడం ద్వారా ఇరుపక్షాలకు న్యాయం చేసే బృహత్తర అవకాశం ఈ చట్టం కల్పించింది.
శతాబ్దాలుగా ఈ ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్నా, దీనిని ఒక క్రమపద్ధతిలో 1697లో మధ్యవర్తిత్వ చట్టం పేరుతో ఇంగ్లాండ్‌లో అమలులోకి తెచ్చారు. 1854లో కొంచెం మెరుగుపరిచి 1889లో మరిన్ని మార్పులు చేశారు. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ వారు 1989 నుండి ఈ చట్టాన్ని భారత్‌లో అమలుచేస్తున్నారు. 1925, 1934, 1940, 1950, 1996లలో దీనికి సవరణలు తీసుకువచ్చారు. 1996లో ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ బిల్లును భారత పార్లమెంటు ఆమోదించింది. దీనికి 1996 ఆగస్టు 16న రాష్టప్రతి ఆమోదం తెలుపగా, జనవరి 27 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం నాలుగు భాగాలుగా, 86 విభాగాలుగా (సెక్షన్లుగా) రూపుదిద్దుకుంది. మొదటి భాగంలో 43 విభాగాలు, రెండో భాగంలో 17 విభాగాలు, మూడో భాగంలో 21, నాలుగో భాగంలో ఐదు విభాగాలున్నాయి. 2018 చట్ట సవరణలు సైతం అమలులోకి వస్తే నిర్ణీత కాలవ్యవధిలోనే కేసులను పరిష్కరించాల్సి ఉంటుంది. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల్లో ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రం వీటికి బదలాయించి పరిష్కరించగలిగితే కేసుల సంఖ్య తగ్గడం ఖాయం. దీనికి అందరి సహకారం అనివార్యం. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, న్యాయవాదులు సహకరిస్తే కేసుల భారం లేని న్యాయవ్యవస్థను చూడగలుగుతాం.

--బీవీ ప్రసాద్ 98499 98090