మెయిన్ ఫీచర్

కవిర్విశ్వో మహాతేజః...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం చెప్పిన కొద్దిమంది తెలుగు కవులలో గుంటూరు శేషేంద్రశర్మ ఒకరు. అన్నమయ్య, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల తరువాత అంతర్జాతీయ స్థాయి కవిత్వపు మరో పార్శ్వం శేషేంద్ర. ప్రాంతీయత, వర్గం, కులం, మతం, అశ్లీలతలకు అతీతమైన నిర్మలమైన కవిత్వం చెప్పారాయన.
‘‘శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం’’ అన్నారు శ్రీశ్రీ శేషేంద్ర శర్మ చిత్రణను. 1946లో ఆంధ్ర క్రైస్తవ కళాశాల పత్రికలో ‘చండాలోపి మమ గురుః’ అన్న 17 పద్యాల కృతి శేషేంద్ర శర్మ తొలి రచనగా అచ్చయింది. శేషేంద్ర తొలి కావ్యరచన సొరాబు. 1947-48 లలో రాసిన ఈ కావ్యం 1954లో అచ్చుకొచ్చింది. ఇంగ్లిష్‌లో ఆనల్డ్ మేత్యూ (శ్యజూ ఘఆఆ్దళతీ 1822-88) రాసిన సొహరాబ్ ఎండ్ రుస్తుం దీనికి మూలం. అయితే సొరాబు కావ్యంలోని సంభాషణా సంవిధానం పాత్ర చిత్రణలు శేషేంద్రవే. ఇందులో అయన పద్యరచనా ప్రకర్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 1996లో ఈ కావ్యాన్ని పునర్ముద్రిస్తున్నప్పుడు అచ్చుతప్పులు దిద్దుకుంటూ శేషేంద్ర తమ ‘‘ఋతుఘోష పద్యాలకన్నా ఈ పద్యాలే మేలైన’’వి అని అన్నారట.
అయన రెండవ పద్యకావ్యం 1961లో వచ్చిన చంపూ వినోదిని. ఇందులో ఇతివృత్తం ప్రణయం. ‘‘జీవితమే ఒక పూలబాటగా హాయిగ, తీయగా, ఒక ఖయాముగ నీదు హయాము సాగుతన్’’ అంటూ ఫార్సీ కవితా ధోరణిని ప్రదర్శించారు అందులో. 1962లో ఆయన ఋతుఘోష వచ్చింది. ఈ ఋతుఘోషను మెచ్చుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ ‘‘ఇట్టి రచన చేయగల వారీనాడు పట్టుమని పదిమందియైనను లేరు’’ అన్నారు. ‘‘ఏ గాలికెగసెనో రుూ చికిలి తారకలు..’’ అనీ, ‘‘చలి పులివోలె దారుల పచారులు చేయుచుండ’’ అనీ శేషేంద్ర అనడం మనకు ఈ ఋతుఘోషలో వినిపిస్తుంది. ఆ తరువాత 1968లో పక్షులు కావ్యం వచ్చింది. ఇందులో ‘‘క్రిమి బాధామయ కాళరాత్రికి ఉషః శ్రీ రేఖ జన్మింపదా?’’ అనీ, ‘‘కుల గోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూర క్రియా పీడిత జ్వలిత ప్రాణి చమూ సమూహ మొకటే సత్యంబు’’ అనీ శేషేంద్ర అనడం వినిపిస్తుంది. ఈ పక్షులులో చోటుచేసుకున్న విశ్వఘోష అంతర్జాతీయ స్థాయిలో శేషేంద్ర రాసిన తొలి కవిత. శ్రీశ్రీ తప్పితే మరెవరూ ఇలాంటి కవిత రాయలేరు. 1972లో శేషేంద్ర శేషజ్యోత్స్న విడుదలయింది. ఇది ఆయన తొలి వచన కవితా సంపుటి.
శేషజ్యోత్స్నతో తమ వచన కవితా యాగాన్ని ప్రారంభించి తెలుగు సాహితీ గగనానికి అపూర్వమైన భావనా మేఘాలను రప్పించి విశ్వస్థాయి కవిత్వాన్ని తెలుగులో కురిపించారు శేషేంద్ర. దీనికి పీఠికగా ఆయన రాసిన ‘నేను నా నెమలి లేక నా నెమలి నా నేను’ అన్న రచన అద్భుతమైన రచనా సంవిధానంతో వెలసిన కవిత. శేషేంద్రను ఒక మహోన్నతమైన కవిగా ప్రపంచానికి తెలియజేసే కవిత అది. కవిత్వంపై శ్రద్ధ, భక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాల్సిన కవిత అది. ‘‘బ్రతుకు సారాంశం చావులో తెలుసుకోవచ్చు’’ అనీ, ‘‘ప్రతి రంగుకు ఒక శబ్దం ఉంది, ప్రతి శబ్దానికి ఒక రంగు ఉంది’’ అనీ ఈ కవితలో శేషేంద్ర అంటారు.
1975లో మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, 1976లో నీరై పారి పోయింది, 1977లో గొరిల్లా, 1978లో సముద్రం నా పేరు, ప్రేమ లేఖలు, 1984లో అరుస్తున్న ఆద్మీ అన్న ఆయన కవితా సంపుటాలు వెలువడ్దాయి. శేషజ్యోత్స్న నుంచి అరుస్తున్న ఆద్మీ వరకూ వచ్చిన ఆ కవితా సంకలనాల్ని ఆధునిక మహాభారతం పేరిట 1986లో ప్రకటించారు. ఇందులో కొంత పునర్విభజన, పునర్వర్గీకరణ, కొన్ని మార్పులూ చేసి ఆ కవితా సంకలనాల్ని పర్వాలుగా చూపారు. ఏ ఇతిహాసంలోనైనా వౌక్తిక పర్వం అనేది ఉంటుంది కాబట్టి ఆయన రాసిన కొన్ని ఇతర వచన కవితల్ని ఇందులో వౌక్తిక పర్వంగా చేర్చారు. ఈ ఆధునిక మహాభారతం శేషేంద్ర శర్మ ఉత్కృష్ట రచనా నైపుణ్యానికి ఆకృతి. ఇది 2004లో నౌబెల్ (్యఇళ) బహుమతికి పరిగణించబడింది.
ఇందులో ‘‘చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది. మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను’’ అనీ, ‘‘కాలాన్ని నా కాగితం చేసుకుంటూ దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా దాని కింద ఊపిరితో నా సంతకం చేస్తా’’ అనీ, ‘‘ఇక్కడ జీవితం ఎవడ్నీ విడిచిపెట్టదు, మనిషి నుంచి మనిషికి నిప్పంటిస్తోంది’’ అనీ, ‘‘నేను చెట్లతో మొరపెట్టు కుంటున్నాను ఆకులు కాదు తుపాకులు కాయండని’’ అనీ, కవిత్వం ఎర్ర గుర్రంలా పరుగెత్తుకు వస్తోంది- రక్తంలో మునిగిన బాణంలా, వీరుడు వదిలిన ప్రాణంలా’’ అనీ, నేను చెమట బిందువుని కండల కొండల్లో ఉదయించే లోకబంధువుని’’ అనీ, ఈ దేశపు గర్భ గుడిలో దేవుడు జీర్ణమైపోయాడు, ఆకలి వేస్తోంది మరో దేవుడి కోసం’’ అనీ ‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు / తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు / పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు’’ అనీ, ‘‘నా చేతులు నా దేశపు ఖడ్గాలు’’ అనీ, ‘‘దేవుడు మనిషిని కోల్పోయాడు’’ అనీ, ‘‘నా పాటకు మాటల్లేవు మధురిమే ఉంది’’ అనీ, ‘‘ప్రతి ఆత్మా ఒక రాగమే మనం వినాలే గానీ’’ అనీ, ‘‘చంద్రుడు నా చేతిలో ఉన్నంత వరకూ మాసాలెక్కడికి పోతాయి’’ అనీ, ‘‘పాత చెట్టు కూడా కొత్త పూలు పూస్తుంది’’ అనీ, ‘‘ఒక సెలయేటిలో ఎవడో కవి పడి కరిగిపోయి నట్లున్నాడు, ఆ నీళ్ళు ఎప్పుడూ కవితలు పాడుతూనే ఉంటాయి’’ అనీ, పక్షి ఆకాశంలో మాట్లాడేది వ్యాకరణం లేని భాష’’ అనీ, ‘‘నిశ్శబ్దాల నిర్మాణ వాస్తు తెలిసిన వాడు రుషి / శబ్దాలకు రెక్కలిచ్చి నిశ్శబ్దాల్లోకి ఎగరేసేవాడు కవి’’ అనీ అంటున్నప్పుడు శేషేంద్ర ఒక మహాకవి అన్నది తెలిసిపోతుంది.
అధునిక మహాభారతంలో ప్రవాహ పర్వంగా చోటుచేసుకున్న నీరై పారిపోయింది ఒక అద్భుత సృజన. కావ్య జగత్తుకు ఆభరణం. ‘నీరై పారిపోయింది’లో ఉన్నది అచ్చమైన, స్వచ్ఛమైన కవిత్వం. 1976లో వచ్చినా 2076 నాటికి కూడా ఒక మహోన్నత కవిత్వంగా ప్రపంచంలో పదిలమై ఉంటుంది.. శేషేంద్ర విశ్వఘోష , నేను నా నెమలి లేక నా నెమలి నా నేను, నీరై పారిపోయింది రచనలు విశ్వకవిత్వంలో తెలుగు తేజాన్ని పంచే రచనలు.
శేషేంద్ర ముత్యాల ముగ్గు చిత్రంలో ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అన్న పాట రాశారు. ఇదొక్కటే చాలు అయన ఒక గొప్పకవి అని తెలుసుకోవడానికి. తోట నిదురించడం, అందులోకి పాట రావడం అనడం, అది కవిత్వం అవడం9 ఒక్క శేషేంద్ర వల్లే సాధ్యం.
శేషేంద్ర గజళ్ళు రాయలేదు. కానీ ఆయన కవితల్లో గజలియత్ (గజల్ శైలి, శయ్య) ఉంటుంది. ‘‘్ధతితో నాజూకు గజలును ప్రేమిద్దాం’’ అనీ, ‘‘గజల్ గురించి రాద్దామని కూర్చుంటే రాత్రి కవిత్వంతో తడిసిపోయింది’’ అనీ అన్నారు. ఆపై ‘‘నా బాధల్ని మరిచిపోనీకు’’ అనీ, ‘‘ఎందుకు నీకాగుండె నీవు దాన్ని బాధలతో నింపుకోలేకపోతే’’ అనీ, ‘‘మనసు ఇచ్చి గాయాలను మమత కొనుక్కున్నది’’ అనీ, ‘‘మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం’’ అనీ, ‘‘పానశాల నిషాలు బాటసారికేమి తెలుసు?’’ అనీ, ‘‘ప్రేమను గురించి ఉత్ప్రేక్షలు పేనుతూంటే గుండెను కోకిల తన్నుకు పోయింది’’ అనీ, ‘‘ఎన్నిసార్లు గుండె పగలాలో ఒక్క జీవితం దర్శనం ఇవ్వడానికి’’ అనీ, అంటూ గజళ్లని రాసిన వాళ్లకన్నా మిన్నగా గజలియత్‌ను మనపై చల్లారు శేషేంద్ర. ఈ నగరం జాబిల్లి పేరుతో ఆయన గజల్ పై విలువైన వ్యాసాలు రాశారు. వాటిని కొందరైనా చదివి ఉంటే తెలుగులో గజల్‌కు ఇప్పుడున్న దుస్థితి వచ్చేది కాదు. శేషేంద్ర మరో అద్వితీయమైన రచన 1977లో వచ్చిన కవిసేన మేనిఫెస్టో. ఇందులో ఉన్న విషయాన్ని మరో విధంగా తెలుసుకోవాలంటే ఒక పాఠకుడు విశ్వకవిత్వాన్ని పదేళ్లయినా చదవాల్సిందే. ఇందులో ‘‘సాహిత్యరంగంలో సాహిత్య స్పృహ ఉన్నవాళ్లకే సామాజిక స్పృహ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది’’ అనీ, ‘‘పద్యం ఒక దేవాలయం అందులోకి ప్రవేశించాలంటే శబ్దాలూ, భావాలూ చివరకు దేవుడు కూడా శుభ్రంగా స్నానం చేసి మడికట్టుకుని రావాలి’’ అని అంటారు శేషేంద్ర.
‘‘తెలుగు సాహిత్యంలో భటుమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల తరువాత శబ్దంపై, శైలిపై పట్టు ఉన్న కవి శేషేంద్ర. ‘‘నానా విధానూన సూనాళి రసపాన / పీనాళి కులగాన వేణి మెరసె’’ అని శేషేంద్ర అన్నది... ప్రాణావసాన వేళా జనితం / నానా గానానూన స్వానా వళితం’’ అని శ్రీశ్రీ అన్నదాన్ని తలపిస్తూ శబ్దసంపదను సఫలం చేస్తోంది. శేషేంద్ర తమ కావ్యాలు కొన్నిటిని ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రచురించారు.
శేషేంద్ర ఆధునిక మహాభారతం తరువాత దానికి అనుబంధంగా 1993లో జనవంశమ్ అనే సంకలనాన్ని వెలువరించారు. ఇక్కడ అంతకు ముందు రాసిన చంపూ వినోదిని, ఋతుఘోష, పక్షులు కావ్యాలతో పాటు తరువాతి రోజులలో రాసిన పద్యాల్నీ, కవితల్నీ, గేయాల్నీ సంపుటీకరించారు. ఇందులో ‘‘ఓ శేషేన్ జైలుకు అలవాటు పడ్ద ఖైదీ!’’ అని శేషేంద్ర అన్నప్పుడు ఖలీల్ జిబ్రాన్ కవి మనకు గుర్తొస్తారు. ఒకచోట ‘‘మీ రక్తం పారబోసి నా కవిత్వం నింపుకోండి’’ అంటారు. మరోచోట ‘‘గాలి చలనం కోల్పోయి వేలాడుతోంది’’ అని అనడం శేషేంద్ర మాత్రమే చెయ్యగలిగింది. ‘‘మనిషిని మనిషే చంపే మతాలవెందుకు / మనిషిని పశువుగ మార్చే మందిరాలు ఎందుకు’’ అని శేషేంద్ర అంటున్నప్పుడు ఉమర్ ఖయామ్, మీర్ తకీ మీర్ కవులు గుర్తొస్తారు. ‘‘అశ్రువులను తుడవలేని అధికారం ఎందుకు / నలుగురితో మాట్లాడని నాయకత్వ మెందుకు’’ అని ఆయన అన్నప్పుడు చైనా కవి లావ్ ట్సూ గుర్తొస్తారు. ‘‘ఇది నా పూర్వుల నేల’’ అని ఆయన అన్నప్పుడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గుర్తొస్తారు. ‘‘సమానతను మార్చేశారు సనాతన స్వప్నంగా’’ అనీ ‘‘కవులకూ, శబ్దాలకూ చెద పట్టింది ఈ దేశంలో’’ అనీ నిజం చెప్పారు శేషేంద్ర. ‘ఆకలి తన చెమట బొట్లని రాల్చుకోవడం’ చూసిన కవి శేషేంద్ర మాత్రమేనేమో? అంతర్జాతీయ కవీ, ఓ గుంటూరు శేషేంద్ర శర్మా, ‘‘నీ స్వరాలు ఫలిస్తాయి / నీ పాటలు నిలుస్తాయి’’.
*
మే 30 శేషేంద్ర శర్మ వర్ధంతి సందర్భంగా

- రోచిష్మాన్, 9444012279అ