ఎడిట్ పేజీ

‘డేటా చౌర్యాని’కి చట్టంతో విరుగుడు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరెంటు బిల్లు కట్టాలంటే చాంతాడు ‘క్యూ’లు, పైరవీలు చేసే దశ నుండి ఇంట్లో కూర్చుని ఆ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించే సదుపాయం ఏనాడో వచ్చేసింది. నేడు దేశంలో 3,516 రకాల సేవలను ప్రజలు ఆన్‌లైన్‌లో పొందే వీలు ఏర్పడింది. సమాచార సాంకేతిక (ఐటీ) రంగం ఫలాలు సామాన్యులకు మరింతగా చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించింది. సమస్త సమాచారాన్ని డిజిటలీకరణ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ వెబ్ పోర్టల్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ ప్లస్ వంటి సామాజిక మాధ్యమాల్లో సేవలు అందిస్తున్నాయి.
ఒకప్పుడు ఒక సమస్యపై ఆర్జీ పెట్టుకుంటే అది అధికారులకు చేరి, దానిపై వారు స్పందించడానికి రెండు, మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. నేడు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు అందిన కొద్ది క్షణాల్లోనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయి. చివరికి రైళ్లలో ప్రయాణిస్తూ జనం చేసే ఫిర్యాదులపై సిబ్బంది తొందరగానే స్పందిస్తున్నారు. ఐటీ రంగం విస్తృతమవుతున్న కొద్దీ సేవలు మరింత సులభతరం అవుతున్నాయి. రైలు, విమాన టిక్కెట్లు కావాలన్నా, పర్యాటక కేంద్రాలు సందర్శించాలన్నా, ఆలయ దర్శనానికి, పూజలకు సైతం ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయి. పరీక్షలు, ఫీజులు, అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు, పించన్లు, సబ్సిడీల చెల్లింపు, నగదు బదిలీ అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతోంది. రోజుకు రెండున్నర కోట్ల మేర డిజిటల్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ 1నాటికి అయిదు నెలల వ్యవధిలో రూ. 1254 కోట్ల 38 లక్షల మేరకు డిజిటల్ కార్యకలాపాలు జరిగాయి. కేవలం జూన్ 1న 2 కోట్ల 56లక్షల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. ఎలక్ట్రానిక్ కార్యకలాపాల్లో అగ్రస్థానంలో ఏపీ ఉండగా, తెలంగాణ మూడోస్థానంలో ఉంది (ఇతాల్ డాట్ జీవోవీ డాట్ ఇన్ ) గుజరాత్ రెండోస్థానంలోనూ, కర్నాటక నాలుగో స్థానంలో ఉన్నాయి.
రోజురోజుకూ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఊహించలేని స్థాయిలో వినియోగిస్తున్నాం. ఒకప్పుడు ఈ-సేవ కేంద్రాల ముఖం కూడా చూడని జనం నేడు వాటిముందు బారులు తీరుతున్నారు. మరో రెండేళ్లలో విశ్వవ్యాప్తంగా వినియోగించే డిజిటల్ కార్యకలాపాలు 44 జెటా బైట్లకు చేరుకుంటుందని అంచనా. మరికొద్ది కాలంలోనే జియోప్ బైట్ల వినియోగం మొదలవుతుంది. 1024 జీబీలు ఒక టెరాబైట్, 1024 టెరాబైట్లు ఒక పెటాబైట్, 1024 పెటాబైట్లు ఒక హెక్సా బైట్, 1024 హెక్సాబైట్‌లు ఒక జెటా బైట్, 1024 జెటాబైట్లు ఒక యోటాబైట్. 1024 యోటాబైట్లు ఒక బ్రాంటో బైట్, 1024 బ్రాంటోబైట్‌లు ఒక జియోప్ బైట్. నేటి డిజిటల్ యుగం యోటాబైట్‌లకు చేరడానికి ఎంతో దూరం లేదు. ఈ-సర్వీసు, ఈ- ప్రాడక్టు, సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు, గ్రామ పంచాయతీలు, అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు, డిజిటల్ లాకర్, ఈ-విద్య, ఈ-వైద్యం, ఈ-పరిపాలన, ఈ- వాణిజ్యం తదితర సేవలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించడమే డిజిటల్ ఇండియా లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే 2 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం సమకూర్చారు. ఈ-పాలనతో అతిపెద్ద ప్రయోజనం అవినీతిని పారద్రోలడం. సాంకేతికత ద్వారా పౌరులకు డిజిటల్ సాధికారత చేకూర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో దాచుకున్నట్టే కీలక పత్రాలను మొబైల్‌లోనూ, డిజిటల్ లాకర్‌లోనూ ఎన్‌క్రిప్టెడ్ రూపంలో పాస్‌వర్డ్ సహాయంతో దాచుకునే వీలు కలుగుతుంది. దానివల్ల అన్ని పత్రాలను వెంట పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రభుత్వ సేవలు అన్నీ సమన్వయంతోనూ, సమన్యాయంతోనూ అందరికీ చేరువవుతాయి. ‘స్వచ్ఛ భారత్’ వంటి సామాజక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమేగాక, ఈ-సంతకం ఆధారంగా పౌరులు తమ ఆధార్ కార్డులను ఉపయోగించుకుని డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకాలు చేసుకోవచ్చు. ఈ-ఆస్పత్రి పథకం ద్వారా మనం ఎక్కడ ఉన్నా ఆరోగ్య సేవలను పొందవచ్చు. విద్యార్థులు ఉపకార వేతనాలు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ‘స్వయం’ వంటి వేదిక ద్వారా విలువైన గ్రంథాలను ఆన్‌లైన్‌లో చదువుకునే వీలుంటుంది. ఇటువంటి ప్రాజెక్టును ఇప్పటికే గూటెన్‌బర్గ్ చేపట్టింది. లక్షలాది గ్రంథాలు, డాక్యుమెంట్లు ఆర్కివ్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఉచిత వైఫై, హాట్‌స్పాట్‌ల వ్యవస్థ కూడా తేలికైపోయింది.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మార్కెట్ల స్వ రూపం కూడా మారిపోయింది. ఒక్క సొంత వాహనం లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ కంపెనీగా ‘ఉబర్’ ఆవిర్భవించగా, దినపత్రికను గాని, టీవీ చానల్‌ను గాని నడపకుండానే ఫేస్ బుక్ అతి పెద్ద మీడియా సంస్థగా ఎదిగింది. సొంత ఉత్పాదన లేని సంస్థలు పెద్ద రిటైలర్లుగా మారుతున్నాయి. సొంత ఎస్టేట్ లేకుండా ఎయిర్ బిఎన్‌బి అతి పెద్ద ఆతిథ్య పోర్టల్‌గా రూపాంతరం చెందింది. ఇలాంటి అద్భుతాలు ఇంటర్నెట్, డిజిటల్ విప్లవంతో ఎన్నో సంభవించాయి.
కష్టాలు ప్రారంభం...
అందరూ ఐటి మీద బాగా ఆధారపడటం మొదలైన తర్వాతనే అసలు కష్టాలు తెలిసొచ్చాయి. సమాచార చౌర్యం, పౌరుల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడం, తీవ్రవాద సంస్థలు వెబ్ పోర్టల్స్‌ను హాక్ చేయడం, ఆన్‌లైన్ నగదు బదలాయింపులో మోసాలు వంటివి వెలుగు చూస్తున్నాయి. నైజీరియాకు చెందిన బృందాలు లాటరీ వచ్చిందని పేర్కొంటూ జనాన్ని దోచుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్నవారు సైతం మోసపోతున్నారు. ఇది భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచంలో చాలా దేశాలకు చెందిన డేటా ఇప్పటికే సరిహద్దులు దాటిపోయింది. చివరికి ఆధార్ డేటాపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిపై సర్వోన్నత న్యాయస్థానంలో 72కు పైగా పిటిషన్లు దాఖలైతే వాటి విచారణ కొనసాగుతోంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాలను లింక్ చేయడంతో ఒక దాని సమాచారాన్ని పసిగట్టి మిగిలిన వాటి వివరాలు తెలుసుకునేందుకు నేరగాళ్లు ప్రయత్నం చేస్తున్నారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ఎల్ అండ్ టీ , వెరిజోన్ కంపెనీలు అమెరికా, బ్రిటన్, కెనడా , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలలో గూఢచర్యం చేసి అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీకి సమాచారాన్ని అందించిన విషయం ‘స్నోడెన్’ బయటపెట్టింది. ఈ డేటాను విశే్లషించుకోవడానికి, వినియోగించుకోవడానికి, రానున్న 50ఏళ్ల పాటు తమ వద్దే ఉంచుకోవడానికి కూడా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీలకు అనుమతిచ్చినట్టు స్నోడెన్ వెల్లడించడంతో ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ప్రాప్తకాలజ్ఞత అన్నట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? దేశ భవిష్యత్‌ను సంతర్పణ చేశాక, ఏ ముప్పు జరిగినా దానిని ఎదుర్కోక తప్పదు. ఈ పరిస్థితులను అధిగమించేందుకే జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఇందులో అరుణ సుందరరాజన్, అజయ్ భూషణ్ పాండే, అజయ్ కుమార్, రజత్ మూనా, రిషీకేష కృష్ణన్, ఆర్ఘ్యా సేన్ గుప్త, రమా వేదశ్రీ వంటి ఉద్దండులున్నారు. ఈ కమిటీ తన నివేదికను కేంద్రానికి అందించింది. నిజానికి ఇప్పడు అందుబాటులో చాలా చట్టాలున్నాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టు-1949, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ యాక్టు-2005, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రెగ్యులేషన్స్- 2006, ఇన్‌సాల్వెన్సీ బ్యాంకరప్టసీ కోడ్-2016, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్స్ సిస్టమ్స్ యాక్టు- 2007, ఆర్‌బీఐ యాక్టు-1934, ది సెక్యూరిటీ అండ్ ఎక్చ్సేంజి బోర్డు ఆఫ్ ఇండియా యాక్టు- 1992, సెక్యూరిటీస్ కాంట్రాక్టు రూల్స్-1957, ఇన్స్యూరెన్స్ యాక్టు-1938 వంటివి అందుబాటులో ఉన్నాయి.
ఇన్ని చట్టాలున్నా తెలుగు రాష్ట్రాల్లో అనేక మార్లు ప్రభుత్వ శాఖల వెబ్ పోర్టల్స్ హాక్ అయ్యాయి. వాటిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోలేక కొన్ని శాఖలు పోర్టల్స్‌ను మార్చుకున్నాయి. కేంద్రంలో కూడా విదేశాంగ వ్యవహారాల శాఖ పోర్టల్‌లోకి కూడా విద్రోహులు చొచ్చుకురావడం, దానిని అదుపు చేయడం కూడా జరిగింది. కొన్ని మార్లు డేటా కోల్పోయిన ఘటనలు లేకపోలేదు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా వినియోగించడంపై పలు సందర్భాల్లో కీలకమైన తీర్పులు ఇవ్వడంతో కేంద్రం మేల్కొంది. వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా అవసరమైన భద్రత, రక్షణ కల్పించేందుకు కేంద్రం కొత్తగా ‘డేటాప్రొటక్షన్’ చట్టాన్ని తీసుకురాబోతోంది. ప్రతి వ్యక్తీ తన సమాచారం చాలా భద్రం అనుకున్నపుడే సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సాహసిస్తారు. లేకుంటే నూతన విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వెనుకంజ వేస్తారు. ఈ క్రమంలో ప్రతి పౌరుడిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేందుకు కేంద్రం డేటా ప్రొటక్షన్ బిల్లును తీసుకువస్తోంది. ఈ అంశంపై కేంద్రం ఒక శే్వతపత్రాన్ని విడుదల చేసింది.
ప్రపంచంలో అగ్రరాజ్యాలు డేటా భద్రతకు విభిన్నమైన మార్గాలను అనుసరిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికాలు భిన్నమైన విధానాలను పాటిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తోంది. జాతీయ భద్రత, రక్షణ అంశాలను మినహాయిస్తే మిగిలిన ఏ సందర్భంలోనూ వ్యక్తుల సమాచారాన్ని పంచుకోవడం, విశే్లషించుకోవడం నేరమే. అమెరికాలో వ్యక్తుల సమాచార భద్రతకు సంబంధించి రంగాల వారీగాను, ప్రభుత్వ సంస్థలకూ, ప్రైవేటు సంస్థలకు కూడా వేర్వేరు నిబంధనలను చేర్చారు. దీంతో భారత్ ఏదో ఒక పద్ధతికి పరిమితం కాకుండా ప్రపంచంలో విజయవంతమైన పద్ధతులను ఎంచుకుని సమగ్ర బిల్లును రూపొందించేందుకు వీలు కలిగింది. కొత్తగా రూపొందించే చట్టం మారుతున్న టెక్నాలజీలను దృష్టిలో ఉంచుకుంటూనే, దేశాభివృద్ధికి, సంక్షేమానికి, సమగ్రతకు, భవిష్యత్ ప్రణాళికలకు వినియోగించుకునేలా ఉండాలి. ఈ డేటా పారదర్శకంగానూ, జవాబుదారీతనంతో ఉండాలి. పొరపాట్లు చేసే వారిపై కఠినమైన చర్యలను ఈ చట్టంలో చేర్చాల్సి ఉంది. ఇప్పటికే చట్టంపై పౌరులు,నిపుణుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొద్దిరోజుల్లో ఇదో రూపాన్ని సంతరించుకుని సమగ్ర చట్టంగా అమలులోకి వస్తే ఆర్థిక లావాదేవీలపైనా నమ్మకం కలుగుతుందేమో చూడాలి మరి.

--బీవీ ప్రసాద్ 98499 98090