మెయిన్ ఫీచర్

అపురూప దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ప్రాచీన సంస్కృతికి, హైందవ సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రైమూర్త్య నిలయమై, వరదాయినియై, భక్తి ముక్తి ప్రదాయినియై, పరమ పావనియైన పవిత్ర గోదావరినదీ తీరాన వెలసి, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుని, హిందూ ముస్లిం మత సామరస్యానికి అనాదిగా ప్రతీకగా, దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా రాష్ట్రంలో వాసికెక్కి, నిత్య భక్త జన సందడితో, నిరంతర దైవనామ స్మరణలతో విరాజిల్లుతున్న పవిత్ర తీర్థం - ప్రాచీన ధర్మపురి పుణ్య క్షేత్రం. రాష్ట్రంలోనే గాక, వేరెచ్చటనూ లేని విధంగా, ఈక్షేత్రంలోగల దేవాలయాలు, ఒక్కొక్కటి ప్రత్యేక ప్రతిపత్తిని, ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని కలిగియుండడం విశేషం. అలాంటి ఆలయాలలో అత్యంత వైశిష్ట్యాన్ని సంతరించుకుని, పౌరాణిక, చారిత్రక నేపథ్యాన్ని కలిగిన పతివ్రతా శిరోమణి అయిన సత్యవతీ దేవి ఆలయం, ఆ సాధ్వీమణి పాతివ్రత్యానికి నిలువెత్తు సాక్షీభూతంగా నిలిచిన సైకత (ఇసుక) స్థంభం, దేశంలో వేరెక్కడా లేని విధంగా శివ పానవట్టంమీద నారసింహ విగ్రహం కలిగి శివకేశవాద్వైత సాంప్రదాయానికి ప్రతీకయైన అరుదైన విగ్రహాలు నిరాదరణ నీడలో మగ్గుతున్నాయి.
ఒకనాడు మహోజ్వలంగా వెలుగొంది, సనాతన హిందూ స్ర్తిల ధర్మాచరణ సాంప్రదాయంలో భాగంగా, నారీలోకానికి ఆదర్శమూర్తిగా నిత్య పూజలనందుకున్న సత్యవతీదేవి, ఆదరణ కరువై, నిర్లక్ష్యానికి గురవుతున్నది. వేదవ్యాస విరచితంగా భావించబడే బ్రహ్మాండ, స్కాందాది పురాణాంతర్గతమైన ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం గ్రంథంలో సత్యవతీదేవి పాతివ్రత్య వృత్తాంతం వర్ణించబడింది. నైమిశారణ్యంలో, శౌనకాది మహర్షులకు, సూత పౌరాణికుడు వివరించిన ప్రకారం, నారద మహర్షి పృథుచక్రవర్తికి చెప్పిన విధంగా, పూర్వము సింధు దేశమును పాలించిన వీరసేనుడను రాజు ఆఙ్ఞ ప్రకారం, జయుడను ఆయన పురోహితుడు, యుక్త వయస్కురాలైన రాకుమారికి, సర్వలక్షణ సమన్వితుడైన రాకుమారుని వరునిగా చేయ సంకల్పించి, ఎన్నో దేశాలు తిరిగి చిత్ర పటములు తెచ్చినా, ఆమె మెచ్చకుండిన కారణంగా విసుగుచెంది, మంత్రోపాయముచేత ఒక సర్పమున బంధించి తెచ్చి, పేటికయందుంచి, కులాచార ప్రకారం, వరుని చూడకయే యుక్త సమయమున వివాహమాడమని చెప్పి, దేశము వదలి వెడలిపోయెను. వివాహ ముహూర్త సమయంలో పేటిక తెరచి, భయంకర సర్పమును గాంచి, జరిగిన మోసమును గ్రహించి, వచన బద్దురాలై, రాకుమారి పామునే తన భర్తగా స్వీకరించెను. ఆ సర్పమును కంఠమున ఉత్తరీయము వలె ధరించి, భగవదనుగ్రహమునకై తీర్థయాత్రల కేగి, పుణ్య క్షేత్రములను తిరుగుతూ, దండకారణ్యమందలి పుణ్యభూమి యగు ధర్మపురికి ఏతెంచి, పవిత్ర గౌతమీ జలాలలో సర్పముతోకూడి స్నానమాచరించెను.
తక్షణమే సర్పము దివ్య పురుషునిగా మారెను. ప్రజలందరి సంశయమును తీర్చి, పాతివ్రత్య నిరూపణకై, మూడు ముష్ఠుల ఇసుకను పిడికిలితో పోయగా, ఆప్రదేశమందు సైకతము ఇసుక స్థంభముగా మారెను. రాజకుమారి విజయ సత్యవతియని పాతివ్రత్య మహిమకారణంగా సార్థక నామధేయురాలు కాగా, ఆ మహాసాధ్వి స్నాన మాచరించిన స్థలము సత్యవతీ కుండము అని నామాంకితయయ్యెను. అనంతర కాలంలో, సత్యవతీ కుండములో స్నాన మాచరించి, ఆమె దర్శనం చేసుకుని, స్థానిక ఇలవేలుపైన శ్రీనృసింహుని మందిరానికి వెళితే, ఒక్కొక్క పాదమున ఒక్కొక్క అశ్వమేధ యఙ్ఞ ఫలం లభించునట్లు వరములు పొందెనని స్థల పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక చారిత్రిక అంశానికొస్తే స్థానిక ఓరియంటల్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, చారిత్రక పరిశోధకులు, బహుభాషావేత్త డాక్టర్ సంగనభట్ల నర్సయ్య చారిత్రిక పరిశోధనల ఫలితంగా ఇది అపురూపమైన హరిహరనాథ ఆలయంగా భావించబడుతున్నది. శివ, కేశవులకు అభేదాన్ని పాటించే హరిహర క్షేత్రంలోని ఈఆలయంలో భారతదేశంలో వేరెచ్చటనూ కానరాని విధంగా పానవట్టం మీద నారసింహుని విగ్రహం ఉండడం విశేషం. 11వ శతాబ్దికి చెందిన ఈ ఆలయం మొదట శివాలయమని, తరువాత నారసింహాలయమని, ప్రస్తుతం సత్యవతి ఆలయమని డాక్టర్ నర్సయ్య పరిశోధన ద్వారా తేల్చి చెప్పారు. ఇక్కడి స్థంభం చాళుక్యుల కాలంనాటి విజయస్థంభమని పేర్కొన్నారు. ఆరు అడుగుల ఎత్తుగా వితర్ధిక కట్టి, దానిపై ఆలయం నిర్మితమైంది. ఆలయ గర్భంనుండి కప్పును చీల్చుకుని అత్యంత ఎత్తుగా నిలిచిన స్థంభమునానుకునే పానవట్టం, దానిపై లింగం స్థానంలో నరసింహుని విగ్రహం ఉంది. దీని పక్కగా పడగ నీడలో లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది. కుడిపక్కన నూనె కారుతున్నంత నునుపుగా అమ్మవారి విగ్రహం ఉంది. ఆళ్వారుల విగ్రహాలూ ఉన్నాయి. ఆలయ ప్రవేశంలో రెండు ఆంజనేయస్వామి విగ్రహాలు ఎదురెదురుగా ఉన్నాయి. ద్వారబంధంపై శేషసాయి విష్ణుమూర్తి విగ్రహముంది. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన సత్యవతీ ఆలయం తదంతర్గత ఇసుకస్థంభం, ఆలయంలోని అరుదైన విగ్రహాలు ప్రస్తుతం ఆదరణలేక శిథిలావస్థకు చేరుకున్నాయి. బ్రహ్మపుష్కరిణి (కోనేరు)కి నైరుతి భాగాన, పట్టణం నడిబొడ్డున, ఎత్తయిన ప్రదేశంలోగల సత్యవతీ ఆలయాన్ని, రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీన పరుచుకుని, శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా జేసి, ప్రత్యేక నిధులతో, క్షేత్ర ప్రాధాన్యతను ఇనుమడింప జేస్తూ, సనాతన ఆలయాలను పునరుద్దరించే చర్యలు గైకొనాలని, అందులకై దేవాదాయ శాఖ తక్షణం స్పందించాలని, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందులకై తగు కృషి సల్పాలని, ఆలయ జీర్ణోద్ధరణ పనులను వెనువెంటనే చేపట్టే చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్త కంఠంతో విఙ్ఞప్తి చేస్తున్నారు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494