ఎడిట్ పేజీ

ఫలితం ఇవ్వని పర్యావరణ చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు పెరిగిపోయాయని ఒక రోజు, వరదలు కుమ్మరిస్తున్నాయని మరో రోజు, విపరీతమైన చలి అని ఇంకో రోజు.. సమోష్ణ శీతల మండలంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు, వరదలు , చలి.. ఇదంతా ఒక ఎత్తయితే మరో పక్క- భరించలేని శబ్ద,నీటి,వాయు కాలుష్యాలను రోజూ చూస్తూనే ఉన్నా ఎవరికీ పట్టని వైనం. 20 శాతం ప్రజలకు ఈ పరిస్థితులపై అవగాహన ఉన్నా ‘మనకెందుకులే’ అనే నిర్లిప్తత , మిగిలిన 80 శాతం మందిలో చైతన్యం కొరవడినందున- భూమండలం వినాశనం వైపు దారితీస్తోంది.
కొద్ది దశాబ్దాల క్రితమే మేల్కొన్న ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసినా, వాటి అమలులో చిత్తశుద్ధి కొరవడటం, పర్యవేక్షణ యంత్రాంగం కొరత, చట్టాలలో లోపాలు, రాజకీయ వ్యవస్థలో చిత్తశుద్ధి లేమి, అంతా ఇంతేలే అనే భావనతో కూడిన మానసిక దౌర్బల్యం.. చివరికి మానవ మనుగడకే ముప్పు వస్తోంది. పర్యావరణ వ్యవస్థలను ఛిద్రం చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) రోజున కాలుష్య తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రపంచ దేశాల ఒడంబడికలు, శపథాలు,ప్రకటనలు, ఘనమైన ఉపన్యాసాలు.. అదే రోజు నుండి ఇవన్నీ నీటి మీద రాతలుగా మారుతున్నాయి. పర్యావరణ విధ్వంసం జనానికి అలవాటుగా మారింది. కాలుష్య నియంత్రణే కాదు, ప్రకృతి వనరుల పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. అయినా అదేదో తమకు సంబంధించింది కాదన్నట్టు వ్యవహరించడంతో ఆసియా దేశాలకు వాటిల్లిన ముప్పు మన దేశ రాజధాని ఢిల్లీకి అక్కడి నుండి చిన్న చిన్న పట్టణాలకు శాపంగా మారుతోంది.
శబ్ద,వాయు,జల కాలుష్యాలను పరిష్కరించడంతోనే అంతా కుదురుకున్నట్టు కాదు. పర్యావరణం అంటే జంతుజాలాన్ని పరిరక్షించడం, వాతావరణ ఉష్ణోగ్రతలను నియంత్రించడం, అధిక వేడిమితో భూ మండలం అతలాకుతలం చేయకుండా చూడటం, అడవులను పరిరక్షిస్తూ వాటి విస్తీర్ణాన్ని పెంచడం, సహజ సిద్ధంగా ఆవిర్భవించిన ప్రకృతి అందాలను కాపాడటం, మొత్తంగా జీవవైవిధ్యాన్ని పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రజలకు పట్టనిది మనకెందుకులే అన్నట్టు ప్రభుత్వాలు సైతం వ్యవహరించడంతో పర్యావరణ ప్రమాదం మరింత ముంచుకొస్తోంది. దేశంలో దాదాపు 200 కేంద్ర చట్టాలు, రాష్ట్రాల చట్టాలూ ఉన్నా, అవి ఏ విధంగానూ పర్యావరణ ముష్కరులను అడ్డుకునేందుకు సరిపోవడం లేదు.
దేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా పేరొందిన బిష్ణోయి ఉద్యమం రాజస్థాన్‌లోని జోద్‌పూర్ జిల్లా ఖేజర్గీకి చెందిన అమృతాదేవి నాయకత్వంలో జరిగింది. 1730లో ఖేజ్రి వృక్షాలను రక్షించేందుకు 363 మంది ఉద్యమం చేసి ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా ఉష్ణమండల అటవీ ప్రాంతంలో పెరియార్ ఉపనది కుదిపుజపై జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అడవులు, జంతువులు, జీవరాశులు అంతరించిపోతున్నాయని 1973లో ఉద్యమం ఆరంభమైంది. ఆ తర్వాత 1985లో ఈ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుగా మార్చారు. బిహార్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న సాల్ చెట్లను నరికి, వాటి స్థానంలో టేకు వృక్షాలను పెంచాలని ప్రయత్నించడంతో 1980లో పెద్ద ఉద్యమమే జరిగింది. ఉత్తరాఖండ్ చిమోలీ జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1973లో చిప్కో ఉద్యమం జరిగింది. చిప్కో ఉద్యమకారులు ఆ చెట్లను హత్తుకుంటూ ఉద్యమించారు. సుందర్‌లాల్ బహుగుణ, గౌరీదేవి, చండీ ప్రసాద్ భట్ వంటి వారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. జీవవైవిధ్య సంరక్షణకు సేంద్రీయ వ్యవసాయానికి రక్షణ కల్పిచేందుకు 1984లో వందనా శివ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇదే క్రమంలో అప్పికో ఉద్యమం ఉన్నత కన్నడ జిల్లా సల్కానీ ప్రాంతంలోనూ, నర్మదానది పరిరక్షణకు నర్మదా బచావో ఆందోళన జరిగాయి. ఈ ఆందోళనలకు దిగివచ్చిన కేంద్రం అనేక పర్యావరణ చట్టాలను చేసింది.
ఏదో ఒక సంఘటన జరగడం దానికి ప్రతిగా ఒక చట్టాన్ని చేయడం వినా దానికో యంత్రాంగం, వ్యవస్థలను ఏర్పాటుచేయకపోవడంతో ఆ చట్టాల ప్రతిఫలం చెప్పుకోదగిన రీతిలో సామాన్యులకు అందలేదనే చెప్పాలి. చైతన్యం ఉన్న వారు చట్టాలను చూపించి న్యాయస్థానాలను ఆశ్రయించడం, కోర్టు తీర్పులతో లబ్ది పొందడం మినహా నిజాయితీగా చట్టాలను అమలుచేసే పరిస్థితి లేదు.
ప్రపంచంలో నేర నియంత్రణ చట్టాలకు శతాబ్దాల చరిత్ర ఉన్నా పర్యావరణ చట్టాలకు మాత్రం అంత గొప్ప చరిత్ర లేదు. ప్రపంచం మేల్కొన్నదే 1972లో. స్టాక్‌హోంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పర్యావరణంపై అంతర్జాతీయ విధానం ఉండాలని గుర్తించారు. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థల సమాఖ్య (ఐఎఫ్‌ఈహెచ్) ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. భారత్‌లోనూ స్వాతంత్య్రానికి పూర్వం పర్యావరణ పరిరక్షణకు నేరుగా ఎలాంటి చట్టాలూ లేవు. పరిశ్రమల చట్టం 1948 ద్వారా శ్రామికుల సంరక్షణకు కొంత మేరకు నిబంధనలు ఉన్నా కాలుష్య నియంత్రణపై అంత శ్రద్ధ ఉండేది కాదు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, నిర్వహణపై ఎలాంటి ప్రత్యేక చట్టాలు లేవు. 1972కు ముందు పర్యావరణ అంశాలను స్పృశిస్తూ 31 చట్టాలు ఉండేవి. ఆ చట్టాలు చాలా వరకూ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తప్ప కాలుష్య నియంత్రణ పరిగణలోకి తీసుకుని చేసినవి కావు. దేశంలో 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చారు. దీనికి 2002లో కొన్ని సవరణలు చేశారు. భూమి సహజ వనరుల హక్కు సంరక్షణ చట్టాన్ని 1972లో చేశారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో పర్యావరణంపై జరిగిన యుఎన్ సదస్సులో భూమి, సహజ వనరులను రక్షించేందుకు ప్రతి దేశం చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో భారత్ ఈ చట్టాన్ని చేసింది. 1974లో నీటి కాలుష్య నివారణ- నియంత్రణ చట్టం ప్రకారం కేంద్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసింది. 1981లో వాయు కాలుష్య నివారణ- నియంత్రణ చట్టంలోని అధికారాలను ఈ మండళ్లకే అప్పగించారు. 1980లో అడవుల సంరక్షణ చట్టం వచ్చింది. దీని ప్రకారం ఏ రాష్టమ్రైనా కేంద్రం అనుమతి లేనిదే అటవీ భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించరాదు. అటవీ భూముల్లో ఏదైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే ముందుగా సంబంధిత శాఖల అనుమతి పొందాలి. తర్వాత ఈ చట్టానికి కూడా కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం చేసింది.
ఈ చట్టాలలోని లొసుగులు చూపించి శిక్షల నుంచి తప్పించుకున్న వారే ఎక్కువ. వీటిని అధిగమించడానికి పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 వచ్చింది. పర్యావరణానికి హాని కలిగించే ఏ సంస్థ కూడా తప్పించుకోలేని విధంగా దీనిని రూపొందించారు. ఈ చట్టాన్ని కూడా 1988లో ప్రభుత్వం సవరించింది. 1991 వరకూ ఉన్న అన్ని చట్టిలు దాదాపు నియంత్రణ విధానంగానే ఉండటంతో లియబిలిటి ఇన్స్యూరెన్స్ యాక్టును కేంద్రం రూపొందించింది. ఇది వాస్తవానికి పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది. స్టాక్‌హోం ఒప్పందాలను గౌరవిస్తూ కేంద్రం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆదేశ సూత్రాల్లో భాగమైన 48-3 ప్రకారం వాతావరణాన్ని, అడవులను, సామాజిక అడవులను అభివృద్ధి పరిచి వన్యప్రాణుల పరిరక్షణ బాధ్యతను కూడా చేర్చారు. 7వ షెడ్యూలులోని 17-ఎ కింద అడవులను ఉమ్మడి ఆస్తుల జాబితాలోకి తెచ్చారు. మొదట్లో ఇవి రాష్ట్రాల జాబితాలో ఉండేవి. రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా అడవులపై శాసనాలు చేసే అధికారం వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖను 1985లో ఏర్పాటు చేసింది. పర్యావరణం, అడవులకు సంబంధించిన కార్యక్రమాలకు అటవీశాఖ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తోంది. 1991లో ‘ఎకో మార్కు’ను ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకో మార్కు సర్ట్ఫికెట్‌ను జారీ చేస్తారు. పర్యావరణంపై ప్రభావం చూసే వస్తువులను అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే నిరాకరించడంతో ఈ ఎకో మార్కు వల్ల ఎగుమతులకు వీలు కలుగుతుంది. 1995లో పర్యావరణ ట్రిబ్యునళ్లను కేంద్రం ఏర్పాటుచేసింది. పర్యావరణానికి నష్టం కలిగించే అంశాలపైనా, ప్రమాదకర పదార్థాల తయారీపై చర్యలకు రూపొందించిన ఈ చట్టం ద్వారాట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. 2002లో జీవవైవిధ్య చట్టాన్ని రూపొందించింది. 1992 జూన్ 5న ఐక్యరాజ్యసమితి బ్రెజిల్‌లోని రియో డిజెనీరోలో జరిగిన జీవ వైవిధ్య సదస్సులో జీవ వైవిధ్య సంరక్షణకు 172 దేశాలతో పాటు భారత్ కూడా సంతకాలు చేసింది. ఈ అవగాహన ఒప్పందం మేరకు 2002లో కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ జీవ వైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింద కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ జీవ వైవిధ్య బోర్డులు ఏర్పాటయ్యాయి.
జాతీయ అటవీ కార్యాచరణ విధానం -1988, జాతీయ పర్యావరణ పరిరక్షణ , అభివృద్ధి కార్యాచరణ విధానం -1982, జాతీయ వ్యవసాయ విధానం-2000, కాలుష్యనివారణ విధానం -1992, జాతీయ జల విధానం -2002లను దృష్టిలో ఉంచుకుని 2006లో జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానాన్ని రూపొందించింది. ఈ క్రమంలోనే జాతీయ హరిత ప్రత్యేక న్యాయస్థాన చట్టం-2010 (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్టు 2010) 2010 జూన్ 2న ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం జాతీయ హరిత ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుకు వీలుకలిగింది. దీనికి అనుసంధానంగా నాలుగు సర్క్యూట్ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. ఈ కోర్టు జల, వాయు కాలుష్యాలపై ఉన్న పర్యావరణ రక్షణ, అడవుల సంరక్షణ, జీవవైవిధ్య చట్టాలపై తీర్పులను ఇస్తోంది. ఈ కృషితో భారత్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సరసన చేరింది. ఇదంతా ఉత్తుత్తినే జరగలేదు. భోపాల్‌లో మిక్ గ్యాస్ లీక్ ఉదయం, ఢిల్లీలో హీలియం గ్యాస్ లీక్ ఉదంతంతోపాటు పర్యావరణ చట్టాల కోసం జీవితాన్ని అంకితం చేసిన న్యాయవాది ఎంసీ మెహతా వంటి వారి కృషితో ఎన్నో మార్పులు జరిగాయి. మాజీ కేబినెట్ కార్యదర్శి టిఎస్‌ఆర్ సుబ్రమణియన్ అధ్యక్షతన పర్యావరణ చట్టాల సమీకృతానికి కమిటీ ఏర్పాటైంది. చట్టాల్లో గందరగోళం తొలగించి సమగ్రమైన ఒకే చట్టాన్ని అందుబాటులోకి తేవాలనే యోచన ఎపుడు నెరవేరుతుందో చూడాల్సిందే.
మితిమీరిన వాయు కాలుష్యం జనారోగ్యం పాలిట పెనుశాపం అవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. స్వచ్ఛమైన గాలి, రక్షిత తాగునీరు అందడమే కాదు, జీవ వైవిధ్యాన్ని పాటించిన నాడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. చట్టాల ప్రక్షాళన వాదన ఎలా ఉన్నా కార్యాచరణ మాత్రం మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. పర్యావరణం అనేది చట్టాలకు, ప్రభుత్వానికి మాత్రమే సంబంధించింది కాదని, అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించిన నాడే మానవ మనుగడకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.

-బీవీ ప్రసాద్ 98499 98090