మెయిన్ ఫీచర్

సంప్రదాయం - సామాజిక స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానృషిః కురుతే కావ్యమ్ అన్నారు ప్రాచీనులు. ఋషి అంటే క్రాంతదర్శి. సత్వగుణ స్వభావుడు. విశ్వమానవ కల్యాణాన్ని కోరేవాడు. విశ్వశ్రే్శయః కావ్యమ్ అన్నారు. ఇదీ ప్రాచీనుల సామాజిక దృక్పథం. కావ్య ప్రయోజనం నిశ్రేయస్సు. అభ్యుదయం, కవికృతము కావ్యము, ఇది యశస్సు, అర్థలాభం, (అర్ధశతాబ్దానికి రెండు అర్థాలున్నాయి) వ్యవహార వేతృత్వం, కాంతాసమ్మిత ఉపదేశం, శివేతరక్షతి వంటి లక్షణాలున్నాయని భారతీయ దార్శనికులు భావించారు.
ఇక కావ్యాత్మ ఏది? కావ్య శరీరము ఏది? అనే సుదీర్ఘ చర్చలూ శతాబ్దాలు జరిగింది.
కవిత్వం ఒక ఆల్కమీ. అది కాళిదాసుకు తెలుసు. అల్లసాని పెద్దన్నకు తెలుసు. విశ్వనాధకు, కృష్ణశాస్ర్తీకి తెలుసు. వేదుల సత్యనారాయణకు తెలుసు. పొట్టివాడు ఎతె్తైన చెట్టు పండు అందుకోవాలనుకోవటం అత్యాశ అన్నాడు కాళిదాసు. కాని ముద్రణా సౌకర్యం పెరిగాక గ్రంథాలు వస్తున్న స్థాయిలో ఉత్తమ జాతి కవిత్వం రావటం లేదు. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఎవరి పుస్తకం వారికి ముద్దు. కాని ఉన్నది కదా ఒక హద్దు!
పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రాచీన కాలంలో ఇలియట్, ఇనియద్, పారడైజ్‌లాస్ట్, ఒధెల్లో వంటి గ్రంథాలకు కావ్య గౌరవం దక్కింది. ఆధునికంగా కీట్సు, షెల్లీ, చైరన్ వంటివారిని ఆదరించారు. వర్డ్స్‌వర్త్ వంటివారి షానెట్స్, లిరికల్ పొయిట్రీ పేరుతో ఆదరణకు నోచుకున్నాయి.
తెలుగులో తొలి తరం కవులు విశ్వనాథ, పింగళి, వేటూరి, కృష్ణశాస్ర్తీ, పుట్టపర్తి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, జాషువా వంటివారు ఉత్తమ జాతి కవిత్వం వెలువరించారు. వారు పండిత కవులు కవి పండితులు- నవలా రంగంలో అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్ర్తీ, పిలకా గణపతి శాస్ర్తీ, మల్లాది వసుంధర, వెంకట పార్వతీశ్వర కవులు నాకంటే చాలామందే గద్య ప్రబంధాలు అనదగ్గ కృతులు వ్రాశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి, విశ్వనాథవారి వేయిపడగలు గద్య ప్రబంధాలే.
1936లో ఒక సంఘటన జరిగింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు నవలల పోటీ పెట్టారు. దానికి వేయిపడగలు, నారాయణరావు, మైదానం పుస్తకాలను ఆయా రచయితలు పంపారు. వేయిపడగలు, నారాయణరావు ఎంపిక చేయబడ్డాయి. బహుమతి మొత్తం ఈ రెండు పుస్తకాలకు చెరి సగం పంచారు. చలం గ్రంథాన్ని యోగ్యమైనదిగా భావించలేదు. చలం తన పుస్తకాన్ని విశ్వనాథవారికిచ్చి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. విశ్వనాథ మైదానం చదివి ఇలా అన్నాడు. ‘నీవు పిరికిముండాకొడుకువి- ఒక తురకవాడు ఓ హిందూ ప్లీడరు భార్యను లేవదీసుకుపోయినట్టు వ్రాశావు. ఒక హిందూ యువకుడు ఒక తురకవాడి భార్యను ఎత్తుకుపోయాడని ఎందుకు వ్రాయలేకపోయావు?’- ఇదిగో మన సూడో సెక్యులరిజానికి బీజాలు ఇక్కడినుండే మొదలయినాయి.
ఆర్థిక అసమానతలు ఉండకూడదు. భూసంస్కరణలు జరగాలి. దునే్నవాడిదే భూమి- అన్నానికి హామీ- రాచరికము భూస్వామ్య వ్యవస్థా అంతరించాలి. ఇలాంటి ఆశయాలతో కొందరు రచయితలు కలం పట్టారు. వీరు తాము అభ్యుదయ రచయితలు అని చెప్పుకొన్నారు. పైన చెప్పిన ఆదర్శాలతో విభేదించేవారు ఎవరూ ఉండరు. కాకుంటే ఆర్థిక అసమానత్వం ఏ స్థాయిలో ఉండకూడదు? అనే విషయంలో అభిప్రాయభేదాలున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు, ఆ ఆఫీసులోని స్వీపర్‌కు ఒకే జీతం. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. స్టాలిన్, లెనిన్, పుతిన్‌ల సౌకర్యాలు అక్కడి క్లర్కులకు ఉండదు. కార్కు సూర్యారావుమీద కవిత్వం వ్రాసినవాడి ఆర్థిక సంపత్తి మనకు తెలుసు. ఇవ్వాళ యుజిసి స్కేళ్లు వచ్చాక నెలకు లక్ష రూపాయల జీతాలు తీసుకునే అభ్యుదయ కవులు పేద ప్రజల కన్నీళ్లను వ్యాపారపు ముడిసరుకుగా మార్చుకొని కవితలు వ్రాసి పురస్కారాలు తెచ్చుకొని వినోదిస్తున్నారు. వీరిలో ఎవడూ పస్తుపడుకోవటంలేదు.
కొద్దికాలంగా పురస్కారాల గూర్చి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. వర్గ కవులు బహుమతులను కొనుక్కొంటున్నారనేది ఆరోపణ. ఇది యాదృశ్చికం కాదు. ప్రణాళికాబద్ధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నది. భారత సాంస్కృతిక జాతీయవాదాన్ని ఎవాంజలిజం- జీహాదీయిజం, మార్క్సిజం - ఈ మూడూ మూడు దిక్కులనుండి విచ్ఛిన్నం చేస్తున్నాయి. 2014లో భారత రాజకీయాల్లో గుణాత్మక పరిణామం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. దీనికి అమెరికా, చైనా, పాకిస్తాన్‌లు భరించలేకపోతున్నాయి. ఆయా దేశాల పేరోల్స్‌లో ఉన్న రచయితలు ఎవార్డు వాపసీ ఉద్యమం మొన్న నడిపారు. 1984లో న్యూఢిల్లీలో 4వేలమంది అమాయక సిక్కులను ఊచకోత కోశారు. ఆనాడు ఈ ఎవార్డు వాపసీ బ్రిగేడ్ ఎందుకు స్పందించలేదు? తెలంగాణలో 4000, ఎపిలో 24000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నము పెట్టేవాడికి ఆత్మహత్యలెందుకు? మానము కాపాడే నేతన్నకు మరణాలా అంటూ నేనొక కవిత వ్రాశాను. ఐనా నేను వీరి దృష్టిలో సామాజిక స్పృహ లేని వర్గానికే చెందినవాడిని. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి, శ్రీకృష్ణదేవరాయలు, రుద్రమదేవి, రఘునాథ నాయకుడు వంటి తెలుగు రాజులను ప్రశంసిస్తూ నవలలు వ్రాశాను కదా! అందుకని నావి బూర్జువా నవలలు. ఇవి పురస్కార యోగ్యత కలవి కావు. కారా - బూరా- చేరా- రారా- వీరంతా సామాజిక స్పృహగల రచయితలు. ఇదొక యుగధర్మం- భరించాలి.
1940-50 దశకంలో కొవ్వలి జంపన వంటి మాస్ రైటర్స్ ఉండేవారు. తర్వాత యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, యండమూరి వీరేంద్రనాధ్ వంటి వారి రచనలకు విపరీతమైన ఆదరణ లభించింది. ప్రపంచంలో ఎప్పుడూ క్లాస్ రైటర్స్- మాస్ రైటర్స్- ఇద్దరూ సమాంతర సరళరేఖల్లా పయనిస్తూనే ఉంటారు. ఎవరి స్థాయిని బట్టి వారు ఆయా రచయితల గ్రంథాలను చదువుకొని ఆనందిస్తుంటారు. కల్పవృక్షం వచ్చినపుడే విషవృక్షం వచ్చి ఒక వర్గానికి కిక్ ఇచ్చింది. ఏవి అల్ప వృక్షాలో కాలం నిర్ణయిస్తుంది. పోతన్నగారికి జ్ఞానపీఠం లేదు. సత్కవుల్ హాలికులైననేమి? అన్నాడు. పోతన్న, శ్రీనాథుడు కూడా పొలం దున్ని పంట పండించారు. మావోలు, తావోలు, స్టాలిన్‌లు, లెనిన్‌లు ఎవరూ పొలం దున్నలేదు. నాట్లు వేయలేదు. రైతు కూలీల మీద కవిత్వాలు వ్రాసినవారిలో ఎందరు సుత్తిపట్టారు. ఎందరికి జాలరి పగ్గం నేతన్న మగ్గం తెలుసు. కేవలం అదొక ఫాషన్? హిపోక్రసీ -
‘‘నా మొగుడు గాడిద’’ అన్నది కె.రామలక్ష్మి. ఈ గార్ద్భ సార్వభౌముడు గురజాడ గురుపీఠం అనే పుస్తకం వ్రాస్తే దానికి కేంద్ర సాహిత్య పురస్కారం ఇప్పించారు. ఓహో! కేంద్ర పురస్కారాలు ఇలాంటివారికి మాత్రమే వస్తాయన్నమాట అనుకున్నారు ప్రజలు. చలం చేయవలసిన ద్రోహమంతా చేసి చివరకు రమణాశ్రమం చేరాడు. ఎందుకు అలాంటి చెత్త సాహిత్యం సృష్టించారు? అని విలేఖరులు ప్రశ్నిస్తే- ‘బుద్ధిలేక’ అని జవాబిచ్చాడు. రావిశాస్ర్తీ రాచకొండ (నల్గొండ జిల్లా)లోని రామాలయంలో పొర్లుడు దండాలు పెట్టి ‘‘ఇవి నా పూర్వీకుల మీద స్పర్శతో పునీతమైన రాళ్లు’’ అని సెంటిమెంటల్ డైలాగులు చెప్పాడు. దీనిని అభ్యుదయ కవులు ఏమంటారు? ఈ పూర్వీకుల పరంపర ఆలయాల బండలలో పురాస్మృతులు- ఇదంతా సెంటిమెంటల్ నానె్సన్సు కదూ!
కుందుర్తి ఆంజనేయులు, భార్య పోయినపుడు ‘హంస ఎగిరిపోయింది’ అంటూ కవిత వ్రాశాడు. హంస జీవాత్మకు సంకేతం. జడభౌతిక వాదులకు హంసలూ కొంగలూ ఏవీ ఉండకూడదు మరి!
భారతీయ సాహిత్యం ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా స్థిరంగా ఉండటానికి కారణాలేమిటి? అంటే దాని పునాదులు బలమైనవి.
సర్వము అహింస- ప్రేమ- త్యాగము- విశ్వమానవ దృక్పథం- కరుణ వంటి శాశ్వత ధర్మాలపై ఆధారపడి సాహిత్య నిర్మాణం జరిగింది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, భాసుడు, భవభూతి, రవీంద్రుడు, అరవిందుడు- వీరు ధృవతారలుగా మానవాళిలో మిగిలారు. ఇది ఆధునిక అనార్కిష్టులకు అర్థం కావటం లేదు. అందుకేగా ఈ సంఘర్షణ!
ఆమధ్య కేశవరెడ్డి అనే అభ్యుదయ రచయిత మునెమ్మ అనే పుస్తకం వ్రాశాడు. అందులో బొల్లి ఎద్దుకు మనిషికి లైంగిక సంబంధం వర్ణించాడు. ఇది చాలా ప్రోగ్రెసివ్ రైటింగ్ అన్నారు కమ్యూనిస్టు రచయితలు.
ఇలాంటి వికృతులవల్ల అభ్యుదయ సాహిత్యోద్యమం ప్రజల చేత తిరస్కరింపబడింది. ఆర్.కె. కరంజియా బ్లిడ్జ్ అనే పత్రిక నడిపేవారు. ఇతడు నెహ్రూగారి శిష్యుడు. అభ్యుదయ సామాజిక శక్తులకు నాయకుడు. కాని చివరికి ఏమయింది? పుట్టపర్తి సాయిబాబా భక్తుడై భజనలు చేయటం మొదలుపెట్టాడు.
‘చలనచిత్ర రంగంలోని రచయితల్లో కమ్యూనిస్టులు ఎవరు?’ అని దాశరధిని ప్రశ్నించగా... ‘కమ్యూనిస్టులు ఎవరూ ఉండరు. అంతా ఆపర్చ్యూనిష్టులే’ అని చెప్పాడు దాశరథి కృష్ణమాచార్య.
విధ్వంస రచనలు చేసిన దిగంబర కవులల్లో మహాస్వప్న పుట్టపర్తి సత్యసాయిబాబా దర్శనం చేసుకున్నాడు. జ్వాలాముఖి, తిరుప్పావై (్ధనుర్మాస) వ్రత ప్రవచనాల సందర్భంగా కార్యకర్తగా వ్యవహరించడం నేను స్వయంగా హైదరాబాద్‌లో చూచాను. ఈ ద్వంద్వ వైఖరివల్ల వారి సిద్ధాంతాలు పలుచన అయిపోయాయి.
నన్నయ తిక్కనలు కవులు కాదు అని అతివాదం మొదలుపెడితే శ్రీశ్రీ, గురజాడలు కూడా రచయితలు కాదు అనే రియాక్షన్ వచ్చింది. కాళిదాసు కవి కాకపోతే ఆరుద్రలు కవులవుతారా? అనే ప్రశ్న వచ్చింది. ఆల్‌జీబ్రా రానివాడు లెక్కల ప్రొఫెసర్ కాజాలడు. కాని రసస్వరూపం తెలియనివాడు కూడా కవి అని పిలిపించుకోబడుతున్నాడు. ఇది ఇతర దేశాలలో ఉండదు.
సాహిత్యం ఒక ఆల్కమీ- అందులో రసం కేవలం ధ్వనివంటివి ఉంటాయి. అనేకమంది కేవలం అరుపులు కేకలు నినాదాలు సాహిత్యం పేరుతో చెలామణి చేయవచ్చు అని ఒక యుగం వచ్చింది. 1917కు ముందు ప్రపంచ చరిత్ర లేదు. 1925 లండన్‌లో ప్రోగ్రెసివ్ రైటర్స్ సమావేశంలోనే విశ్వసాహిత్య చరిత్ర పుట్టింది అని ప్రచారం మొదలుపెట్టారు. అందుకే వీరు నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు వంటి పూజనీయులైన కవులను నీచ భాషలో నిందించారు. పోతన పంచశతి జయంతి ఉత్సవాలు వరంగల్‌లో చేస్తే అడ్డుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ పంచశతి ఉత్సవాలను నిషేధించారు. చివరకు ప్రపంచ తెలుగు మహాసభలను కూడా జరుగనివ్వలేదు. ఎందుకని?
వల్లకాట్లో వెంకట సుబ్బయ్యలు రాహుకేతువులు - వీరే రచయితలు అన్నారు. సామాజిక స్పృహ అంటే మన చట్టూ ఒక సమాజం ఉన్నది. దాని బాగోగులు కవిత్వంలో ప్రతిబింబించాలి అనేది చాలా పాత దృక్పథం. ఇపుడు సామాజిక స్పృహ అంటే కేవలం మార్క్సిస్టు దృక్పథం అనే నూతన నిర్వచనం అన్నారు. ఇట్లా మానవ చరిత్ర మొత్తం ఆర్థిక సంఘర్షణా చరిత్ర క్రింద భావించి ప్రపంచ చరిత్రకు వక్రభాష్యం చెప్పి రాహుల్ సాంకృత్యాయన్, రొమిల్లా థాపర్, తీస్తా సెతల్వాద్ వంటివారు పాఠ్య గ్రంథాలు తయారుచేశారు. దేశభక్తులకు సంప్రదాయ సాహిత్యాభిమానులకు సాహిత్యంలో చలనచిత్ర కళారంగాలలో పురస్కారాలు ఇవ్వకూడదని శాసించారు. ఇదుగో ఈ రౌడీయిజం మీద ఇప్పుడు తిరుగుబాటు వస్తున్నది.

- ముదిగొండ శివప్రసాద్