మెయిన్ ఫీచర్

శుభాలనొసిగే బల్కంపేట ఎల్లమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మలగన్న అమ్మ ఆషాఢమాసంలో ప్రతివీధిలోను ప్రతి గ్రామంలోను కొలువై తన కన్న బిడ్డలతో పూజలందుకొంటుంది. ఆ పూజలందుకోవడంలో ఆతల్లి ఆనందిస్తుంది. తన బిడ్డలకు సంతోషాన్నిస్తుంది. ఆ తల్లికి పూజలందించుకునే పండుగే తెలంగాణలో బోనాలుగా ప్రసిద్ది చెందింది.
హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో ప్రధాన రహదారి పక్కనే శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు కొలువుతీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణగాధ ప్రచారంలో ఉంది. పూర్వం బల్కంపేట ప్రాంతం ఒక చిన్న గ్రామం.ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేసుకుని జీవిస్తుండేవారు. అటువంటి బల్కంపేట గ్రామంలో ఒకసారి ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేసేందుకు నీటి కోసం బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక శుభ ముహుర్తం చూసుకుని పూజా కార్యక్రమాలను చేసి బావిని తవ్వించడం ప్రారంభించాడు.
కూలీలు రోజూ బావిని తవ్వసాగారు. ఒకరోజు బావిని తవ్వుతుండగా ఒక రాయి అడ్డుపడింది. కాని వారికెందుకో అక్కడ తల్లి కూర్చుని ఉన్నట్టు అనిపించింది. అందుకే తవ్వడం ఆపివేసి చేతులతో మట్టిని తొలగించారు. వారి వూహ నిజమైంది. ఆ రాయలో వారికి అమ్మ రూపు పొడగట్టింది.
ఆ విషయం రైతుకు చె ప్పారు. దీనితో రైతు ఆ విగ్రహాన్ని బావిలోంచి బయటకు తీసేందుకు ప్రయత్నం చేసాడు. కాని ఆయనకది వీలు కాలేదు. విగ్రహాన్ని బయటకు తీసి గ్రామానికి తీసుకు వెళ్లాలని రైతు ప్రయత్నం ఫలించకపోవడంతో రైతు గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్థులకు విషయం చెప్పాడు. గ్రామస్థులు అందరూ అక్కడికి వచ్చారు. అమ్మను మనసార కొలిచారు. పూజలు చేశారు. కొందరు మహిళలు (శివసత్తులు) అమ్మవారు ఇక్కడే స్వయంభువుగా వెలిశారు. ఆమె ఇలాగే ఉండి పూజలు అందుకోవాలని కోరుకుంటూ ఉంది. అమ్మవారిని ఇక్కడనుంచి కదిలించే ప్రయత్నం చేయవద్దు. ఇలాగేఉంచి పూజలు చేయండి అని పలికారు. అంతేకాకుండా అమ్మవారు ‘రేణుకా మాత ఎల్లమ్మ తల్లి’ అని వారు చెప్పారు. దీంతో రైతు తన పొలంలో అమ్మవారు బయటపడడం అదృష్టంగా భావించాడు. గ్రామస్థుల సహకారంతో చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత నగరం విస్తరించడంతో ప్రస్తుతం బల్కంపేట హైదరాబాద్ నగరంలో భాగమైంది. ఈ విధంగా శ్రీ ఎల్లమ్మతల్లి బల్కంపేట ప్రాంతంలో స్వయభువుగా కొలువుతీరినట్టు ఇక్కడి వారు చెబుతారు. ఈ విషయమే స్థలపురాణంగా ప్రసిద్ధి కెక్కింది.
బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంది. ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై గోపురం నిర్మించబడి ఉంది. ఐదు అంతస్థులు కలిగిన ఈ గోపురం పైభాగంలో ఐదు గోపుర కలశాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. గోపురంపై అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ గోపుర ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తునే ప్రధాన ఆలయం దర్శనిమిస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజ స్థంభం ప్రతిష్టింబడి ఉంది. ఆలయ ప్రాకారాన్ని ఆనుకుని ఆలయం లోపల ఆలయం చుట్టు ప్రాకార మండపం ఉంది. ఈ ప్రాకర మండపం అద్భుతమైన చిత్రలేఖనం ఉన్న స్తంభాలతో నయనానందకరంగా దర్శనమిస్తుంది.
ప్రధాన ఆలయం మహామండపం, ముఖ మండపం గర్భాలయాలను కలిగి ఉంది. మహా మండపం కంటే ముఖ మండపం, గర్భాలయాలు లోతుగా ఉన్నాయి. కొన్ని మెట్లను దిగి గర్భాలయం వద్దకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తిరిగి మెట్ల ద్వారం ద్వారా భక్తులు మహామండపం చేరుకుంటారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ వినాయకుడిని ముందుగా దర్శించుకుని తర్వాత అమ్మవారి దర్శనానికి వెడతారు. ఇక ప్రధాన గర్భాలయంలో శ్రీ ఎల్లమ్మ తల్లి వివిధ ఆయుధాలను చేతులతో ధరించి ఆభరణాలు, పుష్పమాలలు ధరించి, భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింప చేస్తు దర్శనమిస్తుంది.
కాగా అమ్మవారి మూల విరాట్టుకు ముందువైపు శయన భంగిమలో మరో మూర్తి దర్శనమిస్తుంది. వాస్తవంగా స్వయంభువుగా కొలువుతీరిన అమ్మవారు ఈమె. శయనమూర్తి, తర్వాతి కాలంలో మూలవిరాట్టును ప్రతిష్టించారు. అమ్మవారి భక్తులు శ్రీ ఎల్లమ్మ, శ్రీ రేణుకా దేవి, శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లి వంటి పేర్లతో పూజిస్తారు. కాగా అమ్మవారు ‘జలాధి వాసిని’. అంటే జలాన్ని ఆవాసంగా చేసుకున్న అమ్మవారు. అమ్మవారి తలవద్ద బావి ఉంది. ఆ బావినుంచి ఎప్పుడూ నీరు వస్తుంటుంది. అందుకే అమ్మవారు జలాధివాసిని గా సంభావిస్తారు. ఈ జలాన్ని భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు. ఇక్కడ ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఒక్క హైదరాబాదు వాసులే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజిస్తారు. పక్కరాష్ట్రం నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనార్ధం వస్తుంటారు.

- చివుకుల రామమోహన్