ఎడిట్ పేజీ

ఫలించని కొత్త ఎత్తుగడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో కొద్దీ నెలల్లో తిరిగి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సహజంగానే తన బలాబలాలను సింహావలోకనం చేసుకొంటున్నారు. 50 నెలల పాలనలో బిజెపిని సభ్యుల సంఖ్య రీత్యా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా చేయడమే కాకుండా, దేశంలో 20 రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ద్వారా రాజకీయంగా దేశంలో తనకు ఎదురే లేదని నిరూపించుకో గలిగారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంలో గాని, భావాత్మకంగా ప్రజలకు సందేశాలను ఇవ్వడంలో గాని నేడు మోదీకి పోటీ పడగల నాయకుడే దేశంలో లేరని చెప్పవచ్చు.
అదే విధంగా జాతీయ స్థాయిలో బిజెపికి గట్టి పోటీ ఇవ్వగల రాజకీయ పక్షం గాని, రాజకీయ కూటమి గాని నేడు లేదు. వచ్చే ఎన్నికలలోపు ఆ విధంగా ఏర్పడే సంకేతాలు సహితం కనిపించడం లేదు. అయినా వచ్చే ఎన్నికలలో సునాయాసంగా తిరిగి గెలుపొందగలమనే భరోసా బిజెపి నాయకత్వంలో కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణాలు సాంప్రదాయకంగా బిజెపికి మద్దతు ఇస్తూ వస్తున్న వర్గాలు, గత ఎన్నికలలో అండగా ఉన్న వర్గాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పట్ల ఒకవిధమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. బిజెపికి వ్యతిరేకంగా వోట్ వేయాలన్నంత ఆగ్రహం ఈ వర్గాలలో కలగక పోయినా మొన్నటి ఎన్నికలలో వలే ఛాతి చరచుకోని బిజెపికి వోట్ వేయాలనే ఉత్సాహం మాత్రం వీరిలో కనబడటం లేదు. మరోవంక, గత నాలుగేళలుగా కొత్తగా మరో కొన్ని వర్గాలకు చేరుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా గత సంవత్సరకాలంగా చేస్తున్నారు. సాంప్రదాయకంగా బిజెపి బలహీనంగా ఉంటూ వస్తున్న గ్రామీణ, వ్యవసాయ రంగాలలో బలం పుంజుకోవడం కోసం, తన ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు మాత్రమే అండగా ఉంటున్నదనే అభిప్రాయాన్ని తొలగించడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అయితే ఆయా వర్గాలలో అటువంటి కృషి చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోతున్నది.
ఎన్నికల ఎత్తుగడలను రూపొందించి అమలు పరచగల సమ ఉజ్జి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కు నేడు దేశంలో లేరని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆయనను బిజెపి నేతలే మాత్రం సీరియస్‌గా తీసుకొంటున్నారో ప్రశ్నార్థకమే అని చెప్పవచ్చు. రాజస్థాన్‌లో ఉపఎన్నికలలో పార్టీ ఓటమిని సాకుగా చూపి ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సొంత మనిషిగా పేరొందిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడితో రాజీనామా చేయించారు. ఆ స్థానంలో కేంద్ర మంత్రి షెకావత్‌ను నియమించాలి అనుకున్నారు. అయితే అందుకు వసుంధర రాజే తీవ్ర ప్రతిఘటన చేయడంతో మూడు నెలలపాటు రాష్ట్ర అధ్యక్షుడు లేకుండానే అక్కడ పార్టీ కార్యక్రమాలు సాగాయి. చివరకు ఆమె మాట విని, ఒక రాజీ అభ్యర్థిని నియమించవలసి వచ్చింది.
బీహార్‌లో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలో చేరినా గత లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 40 సీట్లు ఉండగా వాటిల్లో 22 సొంతంగా (మరో 9 సీట్లు మిత్రపక్షాలకు) గెల్చుకున్న బిజెపి ఇప్పుడు కూడా అన్ని సీట్లకే పోటీ చేస్తామని పట్టుబడుతూ వచ్చింది. బిజెపి నాయకత్వంలో ఎన్డీయే పోటీ చేస్తుందని చెబుతూ వచ్చారు. అయితే జెడియు ఇక్కడ ఎన్డీయేకు నాయకత్వం వహించవలసిందే అని నితీష్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా స్వయంగా మొదటిసారిగా నితీష్ కుమార్ ఇంటికి వెళ్లి, బిజెపికన్నా ఒక సీట్ అన్నా జెడియు ఎక్కువగా పోటీ చేసేందుకు ప్రాథమికంగా అంగీకరించవలసి వచ్చింది.
అమిత్ షా ఒకరోజు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం గురించి పార్టీ సీనియర్ నాయకులతో సమాలోచనలు జరిపారు. కేవలం 14 మంది నాయకులు ఆ సమావేశంలో ఉన్నారు. గతంలోని వారి కన్నా భిన్నంగా క్రియాశీలకంగా పనిచేస్తూ, రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తున్న రాష్త్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నాయకత్వం పట్ల పార్టీలోని కొందరు సీనియర్లు అసహనంతో ఉన్నారు. అమిత్ షా ఆ సమావేశంలో లక్ష్మణ్ పట్ల కొన్ని పరుషమైన వ్యాఖ్యలు చేసారంటూ ఆ సమావేశం జరుగుతూ ఉండగానే మీడియాకు లీక్ అయింది. అంటే సమావేశం జరుగుతుందనగానే కొందరు మీడియా ప్రతినిధులకు మొబైల్స్ ద్వారా లీక్ చేసినట్లు స్పష్టం అవుతుంది. అమిత్ షా వంటి బలమైన నాయకుడి సమావేశంలో ఆ విధంగా ప్రవర్తించే ధైర్యం కొందరు రాష్ట్ర స్థాయి నాయకులు ప్రదర్శిస్తూ ఉండటం పార్టీలో తగ్గుతున్న ఆయన ఆధిపత్యాన్ని వెల్లడి చేస్తున్నది.
అదేవిధంగా ఒకరోజు పాట్నా పర్యటనకు అమిత్ షా వెళ్ళినప్పుడు ఆయన పాల్గొన్న నాలుగు సమావేశాలలో గాని, మరెక్కడా గాని పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న స్థానిక యంపీ శత్రుఘ్నసిన్హా కనిపించనే లేదు. కానీ అదే రోజున కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆయనకు భద్రతను పటిష్టం చేస్తూ వై- కేటగిరి భద్రత కల్పించింది. తరచూ మోదీ అమిత్ షా పట్ల తిరుగుబాటు ధోరణిలో ప్రకటనలు చేస్తున్న నాయకులకు కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రుల మద్దతు ఏ మేరకు లభిస్తున్నదో స్పష్టం అవుతుంది.
కర్ణాటకలో అధికారం చేపట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, జమ్మూ కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వానే్న తామే కూల్చుకోవలసి రావడం, వరుసగా పలు ఉపఎన్నికలలో పరాజయాలు ఎదురు కావడంతో బిజెపి జైత్రయాత్ర తిరగబడినట్లే అని ఇప్పుడు ఆ పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. దానితో అలజడికి లోనైన మోదీ, అమిత్ షా జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు వంటి ఎత్తుగడలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు అందుకు కూడా సాహసం చేయలేని పరిస్థితులలో చిక్కుకున్నారు.
వాస్తవానికి నేడు బిజెపికి ఎదురవుతున్న కీలక సమస్య దేశంలో పెరుగుతున్న పట్టణ - గ్రామీణ అంతరం. జనసంఘ్ రోజుల నుండి గ్రామీణ ప్రాంతాలలో చెప్పుకోదగిన బలం లేదు. పార్టీ నాయకులు దాదాపుగా అందరు పట్టణ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే కావడం, ముఖ్యంగా అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో గ్రామీణ ప్రాంతాలలో చెప్పుకోదగిన బలం సంపాదించుకోలేక పోతూ వస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, మధ్య తరగతి వర్గాలలో పార్టీ పట్టు పెరుగుతూ వస్తున్నది. అదే బిజెపికి కొండంత అండగా ఉంటూ వచ్చింది. బిజెపి ప్రధాన కార్యదర్శిగా పార్టీకి బలం మరింతగా పెంచుకొనే మార్గాలను అనే్వషించిన కె.ఎన్.గోవిందాచార్య మొదటి సారిగా ఓబిసి, బలహీన వర్గాలను పార్టీ వైపు ఆకట్టుకొనే ప్రయత్నం చేపట్టారు. కళ్యాణ్ సింగ్, ఉమాభారతి వంటి నాయకులను ప్రోత్సహించారు. దానితోనే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అధికారంలోకి రాగలిగింది.
మరోవంక దేశంలో పట్టణీకరణ వేగవంతం కావడం, పట్టణాలలో ఉండే జనాభా పెరుగుతూ ఉండడం కూడా బిజెపికి కలసి వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ జనాభా పదేళ్ల ముందున్న 27.8 శాతం నుండి, 31.2 శాతానికి పెరిగింది. మొత్తం మీద గ్రామాలలో పదేళ్ల కాలంలో పెరిగిన జనాభా 9.05 కోట్లు మాత్రమే కాగా, పట్టణాలలో మాత్రం 9.1 కోట్లకు పెరిగింది. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న 13 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో పట్టణ ప్రాంతాలలో బిజెపి బలం పెంచుకోగా, గ్రామీణ ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలు బలం నిలబెట్టుకో గలిగాయి. అయితే గ్రామాలలో సహితం బీజేపీ కొంత చొచ్చుకు పోతున్నట్లు వెల్లడి చేసింది. ఈ పరిణామమే 2009 నుండి 2014 మధ్య కాలంలో దేశంలో ప్రబలమైన రాజకీయ శక్తిగా బీజేపీకి ఎదగడానికి దోహదపడింది. అదే పార్టీకి ఎన్నికలలో ఘనమైన విజయాలు చేకూర్చడానికి మోదీకి సహకరించింది. ఉదాహరణకు గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పట్టణ ప్రాంతాలలో బిజెపి 48 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ 10 మాత్రమే గెలుపొందింది. కానీ గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ 67 సీట్లు గెలవగా, బిజెపి 51 మాత్రమే గెలిచింది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక విధానాల కారణంగా సాంప్రదాయకంగా బిజెపిని బలపరుస్తూ వస్తున్న పట్టణ ప్రాంతాలలోని వర్గాలు తీవ్ర నష్టానికి గురవుతూ ఉండడంతో వారంతా బిజెపికి వ్యతిరేకంగా వోట్ వేయడానికి సిద్దపడక పోయినా, గతంలో వలే ఇప్పుడు ఆసక్తిగా వోట్ వేయడానికి ముందుకు రావడం లేదు. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక సంస్కరణల కారణంగా ఎక్కువగా నష్టపోయింది చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగ వర్గాలు. వీరంతా బిజేపికి అండగా ఉంటూ వస్తున్నవారే. ఎవ్వరు అధికారంలో ఉంటే వారితో ఉండే పారిశ్రామిక వర్గాలు, సంపన్న వర్గాలకు ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రయోజనం కలిగిస్తున్నదని అభిప్రాయాలు బలపడుతున్నాయి.
ఇప్పటి వరకు నోట్ల రద్దు వలన ఒనగూరిన ప్రయోజనాలు - నల్లధనం అరికట్టడం, తీవ్రవాదులకు ఆర్థిక వనరులను కట్టడి చేయడం, బినామీ లావాదేవీలను రూపుమాపడం- ఏమేరకు సమకూరాయో ప్రధాని నోరు మెదపలేక పోతున్నారు. ఈ అంశాలపై పార్లమెంట్‌లో చర్చలకు సిద్ధపడటం లేదు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నట్లు గ్రహించిన మోదీ ప్రభుత్వం ఈ రంగం పట్ల దృష్టి సారించింది. వ్యవసాయ బీమా నుండి తాజాగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను గణనీయంగా పెంచడం వరకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ ప్రభుత్వంలో విధానాలు రూపొందిస్తున్న వారిలో వ్యవసాయం పట్ల, గ్రామీణ స్థితిగతుల పట్ల తగు పరిజ్ఞానం ఉన్నవారు లేకపోవడం కారణంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆచరణలో ఆయా వర్గాలకు చెప్పుకోదగిన ప్రయోజనం కలగక పోవడంతో పెద్దగా ప్రభావం చూపడం లేదు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికలలో గ్రామీణ ప్రజలలో ప్రజలు పెద్ద ఎత్తున వోటింగ్‌లో పాల్గొనడం, పట్టణ ప్రాంతాలలో పాల్గొనక పోవడం చూసాము. కర్ణాటక ఎన్నికలలో బెంగుళూరు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా అదే జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్‌లో గత నాలుగేళ్లలో అంతకన్నా వేగంగా తిరోగమన చర్యలకు పాల్పడడంతో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ పేర్కొనడం గమనార్హం. బిజెపి యంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి వంటి వారు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ తీరుతెన్నులు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండేళ్ల క్రితమే తక్షణం దృష్టి సారించనిదే ప్రమాదకర పరిస్థితులకు నెట్టివేయబడతామని హెచ్చరిస్తూ నేరుగా ప్రధాని మోదీకి లేఖ వ్రాసారు కూడా. అయినా పరిస్థితులలో చెప్పుకోదగిన మార్పు కనబడటం లేదు.
తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసం గణాంకాల ప్రమాణాలనే మార్చి వేయడం ద్వారా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. జిడిపి గణనలో ఆ విధంగానే చేసి మందగించిన జిడిపి వృద్ధి రేట్‌ను తక్కువ చేసి చూపగలుగుతున్నారు. తాజాగా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల విషయంలో సహితం అదే విధంగా చేశారు. 2014 నాటి కన్నా భిన్నంగా రైతులకు ఎటువంటి మేలు చేయలేక పోతున్నట్లు నిపుణులు స్పష్టం చేయడం గమనార్హం.
ఉత్పత్తి వ్యయాన్ని (పెట్టుబడులు, శారీరక శ్రమ) మొత్తంగా పరిగణనలోకి తీసుకుని దానికి అదనంగా 50శాతం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ విషయమై నాలుగేళ్ల పాటు పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో అంతా చేస్తున్నామని చెప్పుకొనే ప్రయత్నం చేశారు. అందుకోసం కేవలం రైతు పెట్టిన పెట్టుబడులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం గమనార్హం. పైగా ఆహార ధాన్యాల సేకరణకు కూడా హామీ ఇచ్చినా అందుకు నిర్దుష్టంగా ఎటువంటి చర్యలను చేపట్టడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా అమ్ముకొనే సౌలభ్యం రైతులకు లభించనంత కాలం పెంచిన మద్దతు ధరలు రైతులకు కాకుండా దళారులకు, వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం కలిగించగలవు. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశంగా చెప్పుకొంటాము. వారికి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం ద్వారానే మోదీ అధికారంలోకి రాగలిగారు. కానీ నాలుగేళ్లలో నికరంగా ఉన్న ఉద్యోగాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రయత్నాలు చేయడం లేదు. ఇటువంటి పరిస్థితులలో బిజెపి నాయకత్వం ఒక సందిగ్థతను ఎదుర్కొంటున్నది. రాజకీయ ప్రయత్నా ర్ధులను చూసి కాకుండా తమ అంతర్గత వ్యవహారాలే అంతుబట్టకుండా ఉన్నాయి. సమిష్టి నాయకత్వం భావనకు తిలోదకాలు ఇవ్వడంతో పార్టీ ఒక బృందంగా పనిచేయలేక పోతున్నది. దానితో తమ నీడను చూసి తామే జాగ్రత్త పడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

- చలసాని నరేంద్ర