ఎడిట్ పేజీ

‘గోప్యత’ భద్రతకు ఇక పదునైన చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోప్యతను సాధారణ హక్కుగా గుర్తిస్తూ, వ్యక్తిగత సమాచార భద్రతపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక బిల్లును తీసుకురానుంది. దీనికోసం గత నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున కసరత్తే జరిగింది. జస్టిస్ బిఎస్ శ్రీకృష్ణ కమిటీ ‘డేటా రక్షణ-్భద్రత చట్టాని’కి ముసాయిదాను అందజేసింది. గత ఏడాది జూలైలో 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభు త్వం నియమించింది. వ్యక్తిగత సమాచారానికి భద్రతను ఇచ్చే ఒక వ్యవస్థ ఏర్పాటుకు తగిన సూచనలు ఇవ్వాలని కోరింది. ఈ కమిటీ సమాచార భద్రతపై నివేదికను, ము సాయిదా బిల్లును కూడా ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ ఇచ్చిన 67 పేజీల ముసాయిదాను ప్రభుత్వం ప్రజల అభిప్రాయ సేకరణకు బహిర్గతం చేసింది. ముసాయిదాలో 15 చాప్టర్లు, రెండు షెడ్యూళ్లు, 112 సెక్షన్లు పొం దుపరిచారు. మొదటి షెడ్యూలులో ఐటీ యాక్టు-2000 (21/2000)కు, సమాచార హక్కు చట్టం-2005 (22/2005)కు సవరణలు చేశారు. కొత్త చట్టం అమలులోకి వస్తే దానిని ‘ద పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు- 2018’గా వ్యవహరిస్తారు.
ఈ బిల్లు అమలులోకి వస్తే ఆధార్ చట్టం-2016, క్లౌడ్ యాక్టు -2018, కాంపిటీషన్ యాక్టు-2002, ఇండియన్ కాంట్రాక్టు యాక్టు -1872, చిల్ట్రన్స్ ఆన్‌లైన్ ప్రైవసీ ప్రొటక్షన్ యాక్టు-1998 యూఎస్, సీఆర్పీసీ-1973, ఇన్‌కం టాక్స్ యాక్టు-1961, ఐఆర్‌డిఎ యాక్టు -1999, ఐటీ యాక్టు-2000, ఎన్‌ఐఎ యాక్టు-2008, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు-2002 చట్టాల అమలుకు చట్టం కొత్త నిబంధనలను చేరుస్తుంది.
దేశంలో ఇప్పటికే పటిష్టమైన ఐటీ యాక్టు అమలులో ఉంది. రానున్న రోజుల్లో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న అవగాహన ఒప్పందాలు, నూతన సాంకేతిక పరికల్పనలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత చట్టాన్ని మరింత పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనికి తోడు అత్యున్నత న్యాయస్థానం ముందు ‘ఆధార్’ అమలుపై విస్తృతమైన చర్చ జరిగినపుడు వ్యక్తిగత గోప్యత అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బిఎన్ శ్రీకృష్ణ కమిటీని నియమించి డేటా ప్రొటక్షన్‌పై ముసాయిదా బిల్లును రూపొందించమని కోరింది. ఈ ముసాయిదా త్వరలో పూర్తిస్థాయి చట్టరూపాన్ని సంతరించుకోనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న సమాచార శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన నిబంధనావళికి విస్తృత రూపం అవుతుంది. మత , రాజకీయ విశ్వాసాలు, శృంగారంపై వైఖరి, బయోమెట్రిక్ సమాచారం వంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవాలంటే స్పష్టమైన అనుమతి ఉండాలని కొత్త చట్టంలో చేర్చబోతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే భారీగా అపరాధ రుసుం విధించే వీలుంటుంది. ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సమాచార బదిలీపై షరతులను విధించవచ్చు. ‘డేటా ప్రోటక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఏర్పాటుతో వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. ముసాయిదాలో అనేక కీలక అంశాలను కమిటీ చర్చించింది. ఏదైనా డేటా సేకరణ సంస్థ వ్యక్తిగత సమాచార నిబంధనలను ఉల్లంఘించినట్టుయితే ప్రపంచ వ్యాప్త టర్నోవర్‌లో 4 శాతం లేదా 15 కోట్ల మేర జరిమానా విధించే వీలుంది. డేటా భద్రత ఉల్లంఘనపై సరైన చర్యలు తీసుకోకపోతే ఐదు కోట్లు లేదా టర్నోవర్‌లో రెండు శాతం మేర జరిమానా విధించవచ్చు.
సున్నిత వ్యక్తిగత సమాచారం అంటే పాస్‌వర్డ్‌లు, ఆర్ధిక గణాంకాలు, ఆరోగ్య గణాంకాలు, శృంగార జీవితం, శృంగార వైఖరి, బయోమెట్రిక్, జెనిటిక్ సమాచారం, ట్రాన్స్‌జండర్ స్థితి, శృంగార అభిరుచి, కులం, మతం, రాజకీయ విశ్వాసాలు వంటి వివరాలు గోప్యంగా ఉంచాల్సిందే. వ్యక్తిగత సమాచారాన్ని డేటా ప్రిన్సిపల్ అనుమతి తీసుకున్న తర్వాతనే సేకరించాల్సి ఉంటుంది. దానికి కూడా స్పష్టమైన , నిర్ధిష్టమైన, చట్టపరమైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. జాతీయ భద్రత, నేర దర్యాప్తు, న్యాయవిచారణలు, కొన్ని పాత్రికేయ అవసరాలకు మాత్రం చట్టం నుండి మినహాయింపు ఉంది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని డేటా ప్రొటక్షన్ అథారిటీ ఆఫ్ ఇండియా అరికడుతుంది. సమాచార భద్రతపై స్పృహను, అవగాహనను. చైతన్యాన్ని పెంచుతుంది. అపిలెట్ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. వ్యక్తిగత సమాచారాన్ని చేజిక్కించుకోవడం, బదిలీ చేయడం, విక్రయించడం అనేవి నేరం కిందనే పరిగణిస్తారు. గోప్యత హక్కును సాధారణ హక్కుగా ఈ బిల్లు అందజేస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఈ ముసాయిదా చెబుతోంది. ఏదైనా చట్టం, పార్లమెంటు చర్య లేదా రాష్ట్ర చట్ట సభల కోసం మాత్రమే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలి. అయితే శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన ప్రొఫెసర్ రిషీకేశ్ టి.కృష్ణన్ మాత్రం కొన్ని అంశాలపై భిన్నంగా స్పందించారు. నిరంతరం డేటా విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా ముఖ్యమైనప్పటికీ, ఇంటర్నెట్ ప్రాధమిక తత్వానికి విరుద్ధంగా డేటా లేకుండానే విశ్వసనీయత పేరుతో అధికంగా ఖర్చు చేయడం, ప్రతి ఒక్కరికీ కాపీలను అందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీ తన పరిధిని దాటి ఆధార్ యాక్టు గురించి మాట్లాడిందని , ఇది కూడా తనకు నచ్చలేదని ఆయన పేర్కొన్నారు. మరో సభ్యుడు రామవేదశ్రీ కూడా పాస్‌వర్డ్‌లను, ఆర్థిక వివరాలను వ్యక్తిగత గోప్యత కిందకు తీసుకురావడం నచ్చలేదన్నారు. రానున్న రోజుల్లో దీనిపై విస్తృతస్థాయి చర్చ అయితే అనివార్యంగా కనిపిస్తోంది. ఆ చర్చలో వచ్చిన ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుని ముసాయిదాను చట్టరూపంలోకి తేస్తేనే అపుడు అది సమగ్రతను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డిజిటల్ చెల్లింపులు నూరు శాతానికి చేరుకునే సమయానికి సమస్యలు ఉండకపోవు. అందుకే సన్నద్ధత కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలను సమన్వయ దృష్టితో విశే్లషించి, తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి), నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రొటక్షన్ సెంటర్ , డేటా ప్రైవసీ ప్రొటక్షన్ సెంటర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
చాలా ఊగిసలాటల మధ్య భారత్‌లో ఐటీ చట్టాన్ని 2000లో రూపొందించారు. 2008లో దీనికి కొన్ని సవరణలు చేశారు. 2009 ఫిబ్రవరి 5న ఈ చట్టానికి రాష్టప్రతి ఆమోద ముద్ర వేశారు.2009 అక్టోబర్ 27 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. 2016లో బిల్లు -3 ద్వారా మరో సవరణ తీసుకువచ్చారు. పోలీస్ ఇనస్పెక్టర్ స్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలనే నిబంధనను సవరించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని మార్పు చేశారు. ఈ చట్టంలో 13 చాప్టర్లు, 90 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 91 నుండి 94 సెక్షన్లు సవరించినవి. ఇండియన్ పీనల్ కోడ్ -1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు-1872 , ద బ్యాం కర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్టు-1891, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యాక్టు- 1934 వాటికి అనుబంధంగా తీసుకువచ్చిన సవరణలు, ఎన్‌ఐఎ -1881 సెక్షన్ 13, పవర్ ఆఫ్ అటార్నీ యాక్టు 1882, ఇండియన్ ట్రస్ట్సు యాక్టు -1882, ఇండియన్ సక్సేసన్ యాక్టు -1925లలో పలు క్లాజులు ఈ చట్టం పరిధిలోకి రావు. కంప్యూటర్ల విధ్వంసానికి సెక్షన్ -43 కింద శిక్షలు సూచించారు. సెక్షన్ -65 ట్యాంపరింగ్, సెక్షన్ 66 తప్పుడు సందేశాలు, వ్యక్తిగత వివరాల చౌర్యం, సెక్షన్ -67 అసభ్య సందేశాలు, సెక్షన్ -69లో ఎన్‌క్రిప్షన్, డిస్క్రిప్షన్‌లను వాటికి శిక్షలను వివరించారు. తప్పుడు ప్రాతినిధ్యం వహిస్తే అందుకు సెక్షన్ -71 కింద జరిమానాలను సూచించారు. రహస్యాలను చేరవేయడం వంటి నేరాలకు సెక్షన్ -72 ఉండనే ఉంది. అనుమతి లేకుండా సమాచారాన్ని వెల్లడించడం, తప్పుడు ఆధారాలతో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఇవ్వడంపై శిక్షలను సెక్షన్ -73లో పేర్కొన్నారు. మోసగించాలనే ఆకాంక్షకు సెక్షన్ -74లో వివరాలు పొందుపరిచారు. మొత్తం మీద ఐటీ చట్టాన్ని చాలా పటిష్టంగా రూపొందించినా, దానిపై సరైన అవగాహన లేక శాస్ర్తియ శిక్షణ లేక, శాస్త్ర సాంకేతిక ఉపకరణాలు అందుబాటులో లేక చాలా కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయి. దర్యాప్తు సిబ్బంది చేతిలో ఆధునిక ఉపకరణాలు లేనందున అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగానికి సంబంధించిన సైబర్ కేసుల దర్యాప్తునకు అన్నిరాష్ట్రాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐటీ చట్టం పరిధిలో కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ పనిచేస్తోంది. దాని ఆధీనంలో సైబర్ అపిలెట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. 1908 పౌరపరిపాలనా చట్టం మాదిరిగానే సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలను ఈ ట్రిబ్యునల్స్‌కు ఉంటాయని ఐటీ చట్టం చెబుతోంది.
న్యాయపరంగా, విధానపరంగా, వ్యవస్థీకృతంగా గట్టి చట్టాలను రూపొందించి, అమలులోకి తెచ్చేందుకు సైబర్ నేరాల నియంత్రణ దిట్టగా ఉన్న 15 దేశాలతో భారత్ ఇప్పటికే సమాచారాన్ని పంచుకుంటోంది. అన్ని విభాగాల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారులను నియమిస్తోంది. నేషనల్ ఈ- గవర్నెన్స్ ఆధ్వర్యంలో ‘సురక్షిత్ భారత్’ పథకాన్ని అమలుచేస్తోంది. త్వరలోనే ఈ-ఎఫ్‌ఐఆర్‌లకు రూపకల్పన జరుగుతుంది. దీనివల్ల ఎవరూ పోలీసు స్టేషన్లకు వెళ్లాల్సిన పనే్లదు. న్యాయస్థానాలను సైతం డిజిటలైజ్ చేయడం వల్ల ప్రత్యక్షంగా హాజరుకావల్సిన పనే్లకుండానే ఆన్‌లైన్‌లో వెబ్ ఆధారితంగా తమ సాక్ష్యాలను, వాదనలను వినిపించుకునే వీలు కలుగుతుంది. హ్యాకింగ్‌కు అవకాశం లేని క్వాంటం అంతర్జాల సృష్టిలో ఇప్పటికే చైనాతో పాటు భారత్‌లోనూ పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. రక్షణ రంగంలోనూ, అంతరిక్ష పరిశోధన రంగంలోనూ, భూ గర్భ అనే్వషణ, సముద్ర అనే్వషణ, మంచుపర్వతాలైన అంటార్కిటికా, ఆర్కిటికా ధృవప్రాంతాల్లో అనే్వషణకు కూడా ఈ డిజిటల్ ప్రయోగాలు దోహదం చేయబోతున్నాయి.
సెల్‌కు ఫోన్ చేసి ‘ఓటీపీ’ అడిగి బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్న రోజులివి. బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం, సెల్‌కు వచ్చిన మెసేజ్ చెప్పమని అడిగి ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డులను , క్రెడిట్ కార్డులను అడ్డగోలుగా దోచుకుంటున్న ఉదంతాలెన్నో. మతిమరుపు పెరిగి చివరికి పిన్ నెంబర్లను సైతం సెల్‌ఫోన్లలోనో, యాప్‌లలోనో దాచుకుంటున్నా, వాటిని మరో యాప్ ద్వారా బురిడీ కొట్టించి డేటా మొత్తం క్షణాల్లో తస్కరిస్తున్న ఘనులున్నారు. సాధారణ లావాదేవీలు త్వరలోనే నిలిపి వేసి, పూర్తిగా డిజిటల్ లావాదేవీలను మాత్రమే అనుమతించాలని కేంద్రం యోచిస్తోంది. చట్టాలను చేస్తోంది. చట్టం పని చట్టం, దోపిడీ పని దోపిడీదారులదే అన్నట్టు పరిస్థితి తయారైంది. ఎన్ని చట్టాలు చేసినా వ్యవస్థల మధ్య సమన్వయం అనివార్యం. వ్యక్తిగత సమాచార భద్రతలో ఎలాంటి వైఫల్యం ఉండబోదని, ముప్పు వాటిల్లబోదని గట్టి భరోసా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే.

--బీవీ ప్రసాద్ 98499 98090