మెయిన్ ఫీచర్

భగవంతుని సన్నిధికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అహంకారం కొద్దోగొప్పో పొడచూపుతుంది. ఈ అహంకారం అటు ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టడంలో వెనక్కు లాగేస్తుంది. అట్లానే లౌకిక ప్రపంచంలోను వెనుకడుగుకు మార్గం అవుతుంది. ఎటువైపు చూసినా ముందుకు పోనివ్వని అహంకారం మాత్రం ప్రతిమనిషిలోను కనిపిస్తుంది.
ఏమీ తెలియకుండానే అహంకరిస్తే విజ్ఞానం ఆమడదూరానికి వెళుతుంది. అన్నీ తెలిసి కూడా అహంకరిస్తే సజ్జనులు కూడా దూరమవుతారు.
అహంకారమనేదానికి తమోగుణం, రజో గుణం తోడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకుడిని అథఃపాతాళానికి తోసివేస్తుంది. అనేక వేల జన్మల పరంపరలో చిక్కుకుని జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత సంపాదించలేక పోతుంటాడు.
అలానే లౌకిక ప్రపంచంలో కూడా అహంకారి వద్దకు ఎవరు వెళ్లరు. వారికి కావాల్సిన దానిని ఇతరుల దగ్గర నుంచి పొందలేరు.
ఎపుడూ కూడా సంతోషం, దయ, సహనం, సరళస్వభావం, శమం, దమం లాంటి గుణాలు ఉంటే సర్వమూ శుభకరమే అవుతుంది. ఈ శుభకాలం రావాలంటే సదా సంతోషంగా ఉండాలి. అందరినీ సమాన బుద్ధితో చూడాలి. హెచ్చు తగ్గులు కలిగించుకోకూడదు.
భగవంతుని దృష్టిలోను, సృష్టిలోను అందరూ సమానమే. పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ భగవంతుని సృష్టిలోని ప్రాణులన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయ. ఏ ప్రాణికి అవసరమైన గుణం అవి పొందే ఉన్నాయ. ఆ గుణంలో వాటిని మించిన మరో ప్రాణి కనిపించదు. అట్లాంటపుడు నాకు మాత్రమే ఇది తెలుసు అని కానీ నాకు మాత్రమే ఈ సంపద ఉంది అని అహంకరించటం అవివేకం.
ఉదా ఒక సామాన్యుడు నాకు చాలా అందం ఉంది అని అనకుంటే అంతకన్నా వెర్రితనం ఇంకోటి ఉండదు కదా. అందమనేది ఎన్నాళ్లు ఉంటుంది ప్రతివారికి వారికి సంబంధించిన అందమేదో ఒకటి ఉండనే ఉంటుంది. సర్వ సృష్టిలో ఏ ఇద్దరూ ఒకరిని పోలి మరొకరు ఒకటే లాగా ఉండరు ఏదో ఒక తేడా ఉంటుంది.
మనిషి నేను సుఖంగా జీవించడానికి ఇల్లు కట్టుకున్నాను సృష్టిని పెంచి పోషించడానికి అవసరమైన వైద్య సదుపాయాలను కను గొన్నాను కనుక నేనే గొప్ప అంటే ఏ వైద్య సదుపాయం లేకుండానే ఇతర జీవులు సృష్టిని చేస్తూనే ఉన్నాయ. ఉదా చేప, తాబేలు, ఇంకా ఇతర జీవ జాలం తమ చూపులతోనే చేతలతోనే వాటి సంతాన వృద్ధి చేస్తున్నాయకదా.
మరి ఈవిషయంలోను మానవుడు గొప్పవాడు అని ఎలా అనుకొంటాడు. భవన నిర్మాణంలో నేను గొప్ప అనుకొంటే మనిషి కన్నా గొప్పగా పక్షుల గూటి నిర్మాణం ఉంటుంది. అందుకే అన్నీ తెలిసిన వారు సృష్టిలో చిన్న చేప కన్నా పెద్దచేప దానికన్నా పెనుచేప పెద్దవే అంటారు.
నేను కవితలల్లడంలోను, కవిత్వం చెప్పడంలోను, లేకుంటే ఏ సంగీత స్వరం పలుకడంలోనో, లేక ఏ చిత్రాన్ని గీయడంలోను గొప్ప అనుకుంటే విఘ్నేశ్వరుని కన్నా గొప్ప కవి ఉంటాడా? లేక సృష్టికర్తను మించిన చిత్ర కారుడుంటాడా? లేక గాలిలోను స్వరాలను పలికించే ప్రకృతిని మించిన సంగీతకారుడుం టాడా? అట్లానే ఏదైనా కనిపెట్టాను అని అహంకరిస్తే ఆ వస్తువును కనిపెట్టడానికి వీలుగా ఏర్పరిచిన వారెంత గొప్పనో కదా అన్న విషయం స్ఫురణకు వస్తుంది కదా. అందుకే శాస్తవ్రేత్తలే కాదు విజ్ఞానవంతులెవరైనా భగవంతుని చిద్రూపాన్ని కనుగొనడం ఎవరి తరం అంటారు.
మరి చిన్న చిన్న విషయాల్లో అహంకరించే వారిని ఏమంటారు?
దీన్ని అర్థం చేసుకోవడానికై వివేక చూడామణిలో శ్రీ శంకర భగవత్పాదులు శరీరంలో విషదోషానికి సమానమైన అహంకారం ఏ కొంచెం ఉన్నా అది సాధకునికి భౌతికం గాను, మానసికం గాను అవరోధవౌతుందని చెప్పారు. అహంకారమనే గ్రహాన్ని వదిలించుకుంటేనే ఆత్మ చంద్రునివలె నిర్మలం, పూర్ణం, స్వయంప్రకాశ స్వస్వరూపమును పొందుతుందని తెలిపారు.
ఇక ఆధ్యాత్మిక పథంలో నడవడాలి అనుకొనేవారు నేను ఎన్ని గంటలు ఏకధాటిగా ఒకే ఆసనంలోకూర్చుని ధ్యానించగలను అని, నేను ఎన్నో రకాల పూవులతోపూజ చేస్తున్నాను అని, ఇన్ని వేల పుణ్యకార్యాలు నేను చేస్తున్నాను అని అనుకుంటే వారి మార్గం సుగమమం అవుతుందా? భగవంతుని అనే్వషిస్తున్నాను అని సమయా న్ని వృథా చేసుకోకుండా నీవు ఎవరివో, ఎక్కడ నుంచి వచ్చావో, నీకు నీ శరీరానికి ఉన్న సంబంధం గురించి ఆలోచించుకో. మరునిము షంలో ఏమి జరుగనున్నదో నీకు తెలియనపుడు అన్నీ నాకు తెలుసు అనే అహంకారం దేనికి పనికి వస్తుందని ముముక్షత్వానికి దారి చూపే మార్గాన్ని అనే్వషించు అదేముక్తి ప్రదం అవుతుంది జన్మ సాఫల్యం పొందుతుంది అని పెద్దలు చెబుతుంటారు.
అహంకారం దరికి రాకూడదనుకొనే వారు సర్వమూ ఈశ్వరమయం అని అనుకోవాలి. నేను అనేది ఏదీ లేదు సర్వమూ ఈశ్వరుడే. ఈశ్వరుడే నాచేత కర్మ చేయస్తున్నాడు అని అనుకోగలిగితే భగవంతుడే వాని యోగక్షేమాలు చూస్తానని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. కనుక అహంకారాన్ని సత్వగుణాన్ని ప్రోది చేసుకొంటే ధర్మమార్గం సులభమవుతుంది. భగవంతుని సాయుజ్యం లభ్యమవుతుంది.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి