ఎడిట్ పేజీ

మహిళలే తెలంగాణ కీర్తి పతాకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏం అవ్వా.. బాగున్నావా..?’
‘హా.. బాగున్న..’
‘నీకు ఫించన్ వస్తుందా..?’
‘వస్తుంది.. ఇస్తురు.. దండం పెడుతా..’
‘నీకు ఎంతమంది కొడుకులు..?’
‘నాకు ఒక్క కొడుకమ్మా.. ఆడికి ముగ్గురు బిడ్డలు, ఒక బిడ్డ పెళ్లి చేసిండు.. ఇంక ఇద్దరు బిడ్డల పెండ్లిలు చేయాలె.. కేసీఆర్ కడుపు సల్లంగ ఉండాల.. నా మనుమరాలి పెండ్లికి లక్ష
రూపాయలు ఇచ్చిండు.. ఇపుడు నాకు 70 ఏళ్లు నిండినయ్.. బతికి చేసేది ఏమీ లేదు,
నా ఆయస్సు కూడా తీసుకొని కేసీఆర్ సల్లంగ ఉండాలె.. మా ఇద్దరు మనుమరాళ్ల పెండ్లిలు అయ్యేవరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలె..’
... ఇదీ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఒక సాధారణ మహిళ నుంచి వస్తున్న స్పందన.
సంక్షేమ పథకాలను ప్రారంభించే సమయంలో నాకు ఎదురవుతున్న ఇలాంటి మంచి అనుభవాలు ఎన్నో.. ఇవేకావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నరేళ్లలో చేసిన మహిళా సంక్షేమ పథకాలతో- ‘అమ్మో.. ఆడపిల్ల పుట్టిందా..?’ అనే ఆందోళన నుంచి ‘హమ్మయ్య.. ఆడపిల్ల పుట్టింది..’ అన్న ధీమా వరకు వచ్చామని ఓ మహిళా ప్రజా ప్రతినిదిగా గర్వంగా చెబుతున్నాను. మహిళలే తెలంగాణకు కీర్తి పతాకాలుగా గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలోనూ పెద్దపీట వేసింది. స్వరాష్ట్రం సాధనకు జరిగిన సంగ్రామం ముగిశాక, తెలంగాణ ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు అపూర్వం, అద్భుతం. ఈ ప్రగతిని ప్రజలకు నివేదించేందుకు ‘తెలంగాణ వెలుగులు’ కురిపించే సభ సెప్టెంబర్ 2న జరగబోతోంది. సుదీర్ఘ ఉద్యమంలో విజేతగా నిలిచి, విజయ సింహాసనంపై కిరీటాన్ని ధరించి, గత నాలుగున్నరేళ్లకాలంలో ఉన్నత శిఖరాలకు తెలంగాణను తీసుకుపోయి చరిత్ర సృష్టించిన నాయకుడు తెలంగాణ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
‘ప్రగతి నివేదన సభ’ వైపు- నలువైపులా గులాబీ పతాకాలను రెపరెపలాడిస్తూ మహిళలంతా ‘మళ్లీ రాబోయే రారాజు కేసీఆర్’ అని గర్జిస్తుండగా- విజయ ఢంకా మ్రోగనుంది.
నాలుగేళ్లకు ముందునాటి పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే, మహిళల అభివృద్ధిలో గత ప్రభుత్వాలు చేసింది స్వల్పమే. గర్భిణులు ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే జంకేవారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే భర్త మొహం చాటేసి వెళ్లిపోయేవాడు. భార్యను చీదరించుకున్న జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. ఆడపిల్ల పుడితే అపరాధం చేసినట్టుగా చూసేవారు. అనాగరిక పరిస్థితులను ఆడపిల్లను కన్న తల్లులు ఎదుర్కొన్నారు. కడుపులో ఆడపిల్ల ఉందని తెలిస్తే చాలు భ్రూణహత్యలకు పాల్పడి, శారీరకంగా మానసికంగా తల్లిని వేదనకు గురిచేసిన సందర్భాలు కోకొల్లలు. 12 ఏళ్లకే ఆడపిల్లకు పెళ్లిచేసి బాధ్యతలను వదిలించుకోవాలని చూసే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువగానే ఉండేది. ఆడపిల్లలకు చదువు దండగ అంటూ వారిని ప్రభుత్వ పాఠశాలల్లో, మగపిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించే పరిస్థితి ఉండేది. ఇక, ఒంటరి మహిళల పరిస్థితి గురించి చెప్పలేం. ఒక్క విషయంలో చెప్పాలంటే మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో గొప్ప మార్పు వచ్చింది. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారు. ప్రపంచ దేశాలు మెచ్చేవిధంగా పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. వృద్ధ మహిళల కోసం ‘ఆసరా’ పథకం, అమ్మాయిల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, వితంతువులకు పెన్షన్లు, బీడీ కార్మికులకు జీవనభృతి, ఆరోగ్య లక్ష్మి, బాలింతలకు కేసీఆర్ కిట్లు, అమ్మఒడి, 102 వాహనం ద్వారా సేవలు వంటివి అందుబాటులోకి వచ్చాయి.
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు జీతాలు పెంపు, 6 నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థినులకు హెల్త్ కిట్లు, వీ హబ్ ద్వారా పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడం, షీ టీమ్‌లు, గర్భిణులు, కిశోర బాలలకు ఐసిడిఎస్ సెంటర్ల ద్వారా పౌష్టికాహరం అందజేత, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మహిళా సాధికారతలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముందంజలో ఉంచారంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాల హయాంలో మహిళలు అర్ధరాత్రి వేళ బయట తిరగాలంటే భయపడే రోజులు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. షీటీమ్‌ల ఏర్పాటు వల్ల సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులు అర్ధరాత్రి వేళల్లోనూ ధైర్యంగా ఇంటికి చేరుతున్నారు.
పేద మహిళలకు ఉచితంగా మెరుగైన వైద్యం లభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వసతులు కల్పించి, దవాఖానాలపై ప్రజలకు విశ్వాసం కల్పించారు. ‘ఆరోగ్య తెలంగాణ’ సాధనలో భాగంగా తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ‘కేసీఆర్ కిట్’లను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రసూతి మరణాల నియంత్రణలో భాగంగా తల్లుల ఆరోగ్య రక్షణకు అన్ని విధాలా సాయం అందుతోంది. గర్భిణులకు రూ.12వేల ఆర్థిక సాయం అందించడంతోపాటు నవజాత శిశువులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయడం ద్వారా తెలంగాణలో ప్రసూతి మరణాలు సున్నా శాతానికి చేరాలని, భావితరం ఆరోగ్యంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష నెరవేరింది.
‘అక్కో.. పోదాం రావే సర్కార్ దవఖానకు.. నేను రాన చెల్లో గండాల దవఖానకు’అనే కాలం నుంచి ‘అక్కో పోదాం రావే కేసీఆర్ దవఖానకు’ అంటూ ఆనందంగా దవాఖానకు వెళ్ళే రోజులు వచ్చాయి. గత నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అర్ధరాత్రి సమయంలో పురిటినొప్పులు వచ్చే గర్భిణులను నేరుగా దవాఖానకు తరలించేందుకు 102 వాహనాలు చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి. 102 నెంబర్‌కు ఫోన్ చేస్తే చాలు 10 నిమిషాలలో స్పందించి గర్భిణులకు ఆసుపత్రి సిబ్బంది అండగా ఉంటున్నారు. దారిద్య్రరేఖకు దిగువన వున్న నిరుపేద కుటుంబాలకు చెందిన బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేసి ప్రభుత్వం పురోగతి సాధించింది. తమ ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపే రక్తహీనత సమస్యను మహిళలు అధిగమిస్తున్నారు. ఈ పథకం అమలులో భాగంగా అర్హులైన గర్భిణులకు ఇస్తున్న కోడిగుడ్ల సంఖ్యను 18 నుంచి 30కి పెంచడంతో వారికి కడుపు నిండా భోజనం అందుతోంది. కిశోర బాలికలకు కోడిగుడ్లతోపాటు బియ్యం, కందిపప్పు, మంచినూనె, పొలిక్ యాసిడ్ మాత్రలు సకాలంలో అందుతున్నాయి.
ఇక రాష్ట్రంలో బాలికల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేక గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవలి కాలంలో సివిల్స్ పరీక్షల్లో ఎంతోమంది తెలంగాణ అమ్మాయిలు ఉత్తీర్ణత పొందారంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు మహిళల అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అని చెప్పొచ్చు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆడబిడ్డల వివాహాలకు అందించే సాయాన్ని రూ.75116 నుంచి లక్షా నూట పదహారువేల వరకు పెంచారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే వర్తింపజేసిన ఈ పథకాన్ని ఆర్థికంగా వెనుకబడిన బీసీ, ఈబిసి, ఓసీ వర్గాలకు సైతం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో పేదల ఇంట్లో కళ్యాణవేడుకలు సంబురాలతో జరుపుకుంటున్నారు. షాదీ ముబారక్ కోసం మైనారిటీ సంక్షేమ శాఖ నిధుల్లో ప్రత్యేకంగా కేటాయింపులు జరిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మహిళా ప్రజాప్రతినిధిగా గర్వంగా చెబుతున్నాను. ఇది మహిళా సంక్షేమంలో పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. నిరుపేద కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత వంటి అడ్డంకులతో సామాజిక మార్పు సాధ్యపడటం లేదని భావించిన ముఖ్యమంత్రి ఒకవైపు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూనే, మరోవైపు పేద కుటుంబాల్లో ఆడపిల్లలకు భరోసానిచ్చే కల్యాణ లక్ష్మి వంటి పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహిళల భద్రత కోసం మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన షీ టీమ్ పథకం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. పలు రాష్ట్రాలు షీ టీమ్‌లను ఆదర్శంగా తీసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ‘డయల్ 181’ పేరిట హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి 24 గంటలూ మహిళలకు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. లైంగిక వేధింపులు, బాలకల అక్రమ రవాణా, మహిళల వెంటబడి హింసించడం, గృహహింస, వరకట్నం వేధింపులకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్న ఈ నిర్ణయంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాలు, సేవ్ అవర్ సోల్ మహిళా కౌనె్సలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్టాప్‌లు, కళాశాల ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ వంటి నేరాలను అదుపుచేసేందుకు మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. కుటుంబ తగాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు.
జనావాసాల మధ్య పేకాట, గుడుంబాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. మహిళలపై దాడుల నివారణకు యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించారు. ప్రజారోగ్యం దృష్ట్యా నిత్యావసర వస్తువుల ధరలకు చెక్ పెట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100 నెంబర్ ద్వారా, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా చేసే ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ పోలీసులు అండగా నిలుస్తున్నారు. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా మహిళల రక్షణ కోసం పని చేస్తున్న షీ టీమ్‌లు రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎలాంటి ఢోకాలేదనే విషయాన్ని నిరూపించాయి. అంతర్జాతీయ స్థాయిలో పలు సర్వేలు నిర్వహించిన అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, నాథన్ అసోసియేట్స్ సంస్థలు తెలంగాణ షీ టీమ్స్ పనితీరుకు కితాబునిచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటరి మహిళలను ఆదుకోవడానికి ఆర్థికపరమైన భరోసాను ఇచ్చారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక కుటుంబంలో అర్హులైన వారందరికీ పింఛన్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఏదైనా పథకం ద్వారా పింఛన్ పొందితే ఆ ఇంట్లో మరొకరికి పింఛన్ ఇచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సాహోపేత నిర్ణయంతో బీడీ కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఎంతమంది వుంటే వాళ్ళందరికీ ఫించన్ ఇచ్చారు.
గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అడగకముందే వారిని హైదరాబాద్‌లోని ‘ప్రగతి భవన్’కు పిలిపించి చర్చించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను టీచర్లుగా మార్చి, వారికి 7 వేల నుంచి 10,500 వరకు, హెల్పర్లకు రూ.4 వేల నుంచి 6 వేలకు వేతనాలను పెంచారు. చిన్నారులకు టీకాలు ఇచ్చే ఆశా వర్కర్లకు రూ.6 వేల వరకూ జీతం పెంచి వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ మహిళలు సాధికారత సాధిస్తూ విజయ పథంలో దూసుకుపోతున్నారు.

--గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ప్రభుత్వ విప్ (ఆలేరు ఎమ్మెల్యే)