ఎడిట్ పేజీ

ఎన్నికల వ్యూహ సారథ్యం సోనియా బృందానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత సుదీర్ఘకాలం ఈ పదవిలో ఉన్న సోనియా గాంధీ ఇక దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతారని అందరూ భావించారు. ఆందోళన కలిగిస్తున్న ఆమె ఆరోగ్యం కూడా అందుకు కారణం కాగా, కొంత స్వతంత్రత ఇస్తేగానీ రాహుల్ ఒక నాయకుడిగా ఎదగలేరని ఆమె కూడా భావించడమే ప్రధాన కారణం. పార్టీలో ఒకే అధికార కేంద్రం ఉండాలనే భావనతో చివరకు ప్రియాంక గాంధీ క్రియాశీల పాత్ర వహించాలని ఎంతగా ఒత్తిడులు వస్తున్నా ఆమె స్పందించడం లేదు.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తూ వస్తున్న సోనియా బృందంలోని సీనియర్ నాయకులు అందరూ తెరమరుగు అవుతారని, రాహుల్ బృందంలోని యువనేతలకు కీలక పదవులు కట్టబెడతారని విశేషంగా ప్రచారం సాగింది. పార్టీలో వివిధ స్థాయిలలో నియమించే కమిటీలన్ని రాహుల్ బృందంలోని సభ్యులతో నింపుతారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం ఎంతోకాలం నిలవలేదు.
ఎంతోకాలం ఎదురు చూసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియామకంలో ఈ విషయం బయటపడింది. ఎప్పుడైతే సోనియా రాజకీయ కార్యదర్శిగా గత దశాబ్దకాలానికి పైగా పార్టీలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్న అహ్మద్ పటేల్‌ను కోశాధికారిగా నియమించారో అప్పుడే పార్టీలో ఇంకా సోనియా బృందం పెత్తనమే కొనసాగుతున్నట్లు స్పష్టమైంది. అట్లాగే వృద్ధాప్యంలో ఉన్న మోతీలాల్‌ను కోశాధికారిగా తప్పించినా ప్రధాన కార్యదర్శిగా నియమించడం కూడా ఈ అంశానే్న స్పష్టం చేసింది.
కుమారుడు రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పదవిని అప్పజెప్పినా 2019 ఎన్నికల బాధ్యతను కూడా అప్పజెప్పడానికి సోనియా గాంధీ వెనుకడుగు వేస్తున్నారు. అందుకనే వచ్చే ఎన్నికలలో రాహుల్ బృందానికి పెద్దగా ప్రాధాన్యత లభించే అవకాశాలు లభించడం లేదు. పార్టీ అధ్యక్షుడు మారినా ఇంకా పార్టీలో పెత్తనం సోనియా సన్నిహితులదే సాగుతున్నది.
ఈ నియామకాలతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే పార్టీలోను ‘వృద్ధ తరం’ నాయకులను పక్కన పెట్టి, యువతరం అన్ని స్థాయిలలో నాయకత్వ బాధ్యతలను చేపడుతుందని రెండేళ్ళుగా జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ తెర దించింది. సుమారు రెండు శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తున్న సోనియా గాంధీ హయాంలో పార్టీ వ్యవహారాలపై పెత్తనం సాగిస్తూ వస్తున్న వృద్ధతరం సారథ్యంలోనే 2019 ఎన్నికలను ఎదుర్కోబోతున్నారన్న స్పష్టమైన సంకేతాలు వెలువడి నట్లు అయింది.
రాహుల్ గాంధీ బృందంలోని యువనాయకులకు ఇంకా చెప్పుకోదగినంత ప్రజాదరణ లేకపోవడం, రాజకీయ ఎత్తుగడలలో వారికి తగిన అనుభవం లేకపోవడం, ముఖ్యంగా ఇతర పార్టీ నేతలతో చెప్పుకోదగిన సంబంధాలు లేకపోవడంతో వారికి సారధ్యం అప్పచెబితే పార్టీ ముందుకు వెళ్ళడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అందుకనే రాహుల్ తరహా ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా లేదు.
కాంగ్రెస్ సారధ్యంలో పనిచేయడానికి దేశంలో ఏ రాజకీయ పక్షం, రాజకీయ నేత నేడు ముందుకు రావడం లేదు. తమ సారధ్యంలో కాంగ్రెస్ పనిచేయాలనే ధోరణిని మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్ వంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకులతో మాట్లాడి, రాజకీయ వ్యవహారాలను సరిదిద్దగల స్థాయి రాహుల్ గాంధీకి కూడా ఇంకా అలవడలేదు. ఈ విషయం సోనియా గాంధీ కూడా గ్రహించారు. అందుకనే ఆమె, ఆమె బృందమే ఇంకా పార్టీలో నిర్ణయాత్మక పాత్ర వహించక తప్పడం లేదు.
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి పార్టీలో వివిధ స్థాయిలలో పలువురు యువ నేతలకు రాహుల్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చినప్పటికీ ‘సోనియా బృందం’ ఇంకా కీలక నిర్ణయాలు తీసుకొంటున్నది. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడిని, 19 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పరచిన బీజేపీని ఎదుర్కోవడం యువనేతలకు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రమైన వనరుల సమస్య ఎదుర్కొంటున్నది. అపారమైన ఆర్థిక, మానవ వనరులు ఉన్న బీజేపీతో పోటీపడటం కాలపరీక్ష వంటిదే.
పార్టీ సంస్థాగత వ్యవహారాల నుండి, పార్టీకి నిధులు సమకూర్చడం, ఇతర రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపడం వంటి అన్ని వ్యవహారాలను సీనియర్ నేతలే పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారిగా తొమ్మిది మంది సభ్యులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసారు. 2019 ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాలు పర్యవేక్షించడం కోసం తొమ్మిది నెలల ముందే ఈ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీ సారథ్యంలోనే 2019 ఎన్నికలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ కమిటీలో ఏడుగురు సోనియా గాంధీతో దీర్ఘకాలంగా సన్నిహితంగా పనిచేస్తున్నవారే ఉండటం గమనార్హం. అంటే ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో చివరకు రాహుల్ గాంధీ సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పలు సంవత్సరాలుగా రాహుల్ బృందంగా పేరొందిన యువనేతలు మరో ఐదేళ్ళు తమ అదృష్టం కోసం వేచి ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబి ఆజాద్, కొత్తగా పార్టీ కోశాధికారి బాధ్యతలు చేపట్టిన అహ్మద్ పటేల్, మాజీ కేంద్ర మంత్రులు ఏ.కే.ఆంటోని, పి.చిదంబరం, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్ ఈ కమిటీలో ఉన్నారు. ఇక రాహుల్ బృందంగా పేరొందిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ కమిటీలో ఉన్నారు. వారు కె.సి.వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాల.
2014 ఎన్నికలలో పార్టీలో కీలక పాత్ర వహించిన దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది మాత్రమే ఈ పర్యాయం ఎక్కడా పార్టీ వ్యవహారాలలో కనిపించడం లేదు. మిగిలిన అందరూ దాదాపు క్రియాశీలంగానే ఉన్నారు. అంటే 2014 ఎన్నికల బృందమే ఇప్పుడు 2019లో కూడా కాంగ్రెస్‌కు సారధ్యం వహిస్తున్నది. అంటే సోనియా బృందమే ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎన్నికల వైపు నడిపిస్తున్నది. రెండు, మూడేళ్ళుగా రాహుల్‌గాంధీ చేసిన ప్రయోగాలను 2019లో చేయడానికి పార్టీ సిద్ధంగా లేదని కూడా వెల్లడైంది.
కోర్ గ్రూప్ సభ్యుడిగా ఉండడంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సైతం గేహ్లాట్‌ను ఇన్‌చార్జ్‌గా చేసారు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా దీర్ఘకాలం పార్టీ వ్యవహారాలలో కీలక భూమిక వ్యవహరించిన అహ్మద్ పటేల్ తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న పార్టీకి కోశాధికారి అయ్యారు. ఇక ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి, పొత్తులకు రంగం సిద్ధం చేసే బాధ్యతలను పటేల్, ఆజాద్‌లకు అప్పజెప్పారు. పైగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌కు ఇంచార్జ్‌గా కూడా ఆజాద్‌ను నియమించారు.
రాహుల్‌గాంధీ దేశంలో లేని సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేపట్టే విధంగా పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా సెప్టెంబర్ 10న ‘్భరత్ బంద్’ జరపాలని పార్టీ సీనియర్ నేతలు వోరా, పటేల్, ఖర్గే, గేహ్లాట్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఖర్గేకి ఈమధ్య కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను కూడా అప్పజెప్పారు. శరద్ పవర్ వంటి నేతలతో సంప్రదింపులు జరపడానికి సీనియర్ నేత ఒకరు కావాలని ఆయనను నియమించారు.
అయితే రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లేని 19 మందితో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రణాళిక కమిటీలో సీనియర్లు ముగ్గురు - పి.చిదంబరం, సల్మాన్ ఖుర్షిద్, భూపేందర్ సింగ్ హూడా మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా సుష్మిత దేవ్, మన్‌ప్రీత్ బాదల్, ముకుల్ సంగమ వంటి యువనేతలు ఉన్నారు. అట్లాగే 13 మందితో ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో కూడా ఆనంద్ శర్మ, ప్రమోద్ తివారి, భక్త చరణ్ దాస్ - ముగ్గురే సీనియర్లు ఉన్నారు. మనీష్ తివారి, దివ్య స్పందన, మిలింద్ దేవర వంటి యువకులే ఎక్కువగా ఉన్నారు.
ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశేష ప్రజాదరణ ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను కాకుండా సీనియర్ నేత కమల్‌నాథ్‌ను నియమించడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. రాజస్థాన్‌లో యువనేత సచిన్ పైలట్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొంతకాలంగా కొనసాగుతున్నా అక్కడ మాజీ ముఖ్యమంత్రి గేహ్లాట్ లేకుండా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఎన్నికల వ్యూహం, ప్రచారం విషయాలలో ఆయన మీదనే రాహుల్ గాంధీ ఎక్కువగా ఆధారపడటం తెలిసిందే. అంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పైలట్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లుగా అంతగా ప్రాధాన్యత లేని నాయకులనే రాహుల్ గాంధీ నియమించారు. దానితో ఆయా రాష్ట్రాలలో ఇతర పార్టీలతో పొత్తులు వంటి విషయాలను ఇన్‌ఛార్జ్‌లు కాకుండా పటేల్, ఆజాద్ వంటి కేంద్ర నాయకులే నేరుగా చూస్తున్నారు. బీహార్‌లో శక్తిసిన్హా గోహిల్, పశ్చిమ బెంగాల్‌లో గౌరవ్ గొగోయ్, తెలంగాణ లో కుంతియా వంటి నాయకులను ఆయా రాష్ట్రాలలో పొత్తు ఏర్పర్చుకొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు వంటి నేతలు లెక్కచేసే పరిస్థితి లేదు.
చమురు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ‘్భరత్ బంద్’కు మమతా బెనర్జీ, మాయావతి వంటి నాయకులు మద్దతు ఇవ్వలేదు. అంటే వారు రాహుల్ గాంధీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం అవుతోంది. పైగా చమురు ధరల పెరుగుదలకు బీజేపీని మాత్రమే కాకుండా కాంగ్రెస్‌ను కూడా నిందించడం ఒక విధంగా కాంగ్రెస్ నాయకత్వం ఖంగు తిన్నది. రాహుల్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా బహిరంగం గా ప్రకటించదానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నది. ఎన్నికల తర్వాతనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తామని ప్రాంతీయ పక్షాల నేతలు చెబుతూ ఉండటం ఒక విధంగా రాహుల్ పేరుకు తమ మద్దతు లేదని వ్యక్తం చేయడమే.
అందుకనే బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రాలలో వీలున్న చోట్ల తప్ప జాతీయ స్థాయిలో ఒక ‘మహాకూటమి’ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. పరిస్థితుల వాస్తవికతను గ్రహించి, సంయమనంతో అడుగులు వేయక తప్పడం లేదు.

--చలసాని నరేంద్ర