మెయిన్ ఫీచర్

కఠినమైంది సత్యమే( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గీతంలో రవీంద్రనాధ్ ఠాగూర్ ఇలా అన్నారు- ‘‘నాకు గుర్తున్నంతవరకు, అనేక జన్మల నుంచి, ఇంకా చెప్పాలంటే, అస్తిత్వ ప్రారంభం నుంచి నేను ‘దేవుణ్ణి చూడాలి’ అనే కోరితో అనే్వషిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఆయన ఎంతో దూరంలో వున్న నక్షత్రం ప్రక్కనే కనిపించేవాడు. ఆయన కనిపించగానే నేను ఆనందంతో నాట్యం చేసేవాడిని. నాకు తెలుసు, నేను వెళ్ళలేనంత దూరంలో ఆయన ఉన్నారని. అయినా ఆయన కోసం ఎలాగో కష్టపడి ఆ నక్షత్రాన్ని నేను చేరుకునేవాడిని. కానీ, నేను అక్కడికి చేరుకునే సమయానికి ఆయన అక్కడినుంచి మరొక నక్షత్రం దగ్గరకు వెళ్లిపోయేవాడు. అలా అనేక శతాబ్దాలుగా ఆయన కోసం నా అనే్వషణ కొనసాగుతూనే ఉంది.
చివరికి ఆ అనే్వషణే నా జీవితంగామారింది. ఆయనను కనుక్కోవడం నిజంగా ఆత్మహత్య చేసుకోవడమంత కష్టమైన పని. ఒకవేళ కనుక్కున్నా ‘‘ఆయనతో నేను చేసేదేముంటుంది?’’ అని నాలో నేనే ప్రశ్నించుకున్నాను. ఇలా ఇంతవరకూ ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, అనే్వషణకు ముందే అలా ఆలోచించి ఉంటే బాగుండేదని ఇపుడు నాకు తెలిసింది.
‘‘అయినా ఇంతకాలం వెతికి ఇపుడు మానడమెందుకు?’’ అనుకుంటూ మెల్లగా, చప్పుడు చెయ్యకుండా చెప్పులు చేతిలోకి తీసుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నా ఇంట్లోంచి బయటపడి పరుగు ప్రారంభించాను. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు.
ఎందుకంటే, ‘‘నేను ఇక్కడే, నీ ఇంట్లోనే ఉన్నాను. నాకోసం ఎక్కడెక్కడో వెతుకుతావెందుకు?’’ అంటూ దేవుడు ఎక్కడ పిలుస్తాడోనని భయం. అలా నేను నిజంగా దేవుడున్న నా గదిని వదిలి ఎక్కడెక్కడో తిరుగుతూ నా అనే్వషణ యాత్ర కొనసాగిస్తున్నానే తప్ప, నా ఇంట్లో వెతకదలచుకోలేదు.
ఈ కథలోని అంతర్దృష్టి చాలా అద్భుతమైనది.
‘‘తెలుసుకున్న సత్యంతో నేనేం చెయ్యాలి?’’ అని ఏ మాత్రం ఆలోచించని అనేకమంది సత్యానే్వషకులున్నారు. పైగా, తెలుసుకున్న సత్యంతో మీరు ఏమీ చెయ్యలేరు. కనీసం, దానిని మీరు తినలేరు, అంగడిలో అమ్మలేరు, దాని సహాయంతో మీరు రాష్టప్రతి కాలేరు. మహా అయితే, సత్యాన్ని తెలుసుకున్నందుకు మిమ్మల్ని శిలువ వేస్తారు.
నాకు చాలా ఋణాలున్నాయి. నా వైఫల్యాలన్నీ అద్భుతమైనవే. అయినా నాకు మంచి జరగాలని కోరేందుకు నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా, నా ప్రార్థన ఫలించదేమో అనే సందేహంతో భయపడి వణికిపోతున్నాను... అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ సరిగానే చెప్పారు. ఎందుకంటే, ఇలాంటివన్నీ దేవుడు, సత్యం, సౌందర్యం, మంచి, చెడు, నీతి, న్యాయం లాంటి అంశాల గురించి చక్కగా మాట్లాడేందుకు, సిద్ధాంత గ్రంథాలు రాసి విశ్వవిద్యాలయాలనుంచి పిహెచ్.డి. పట్టాలుపొంది నోబెల్ బహుమతి సాధించేందుకు మాత్రమే చాలా చక్కగా ఉపయోగపడతాయి. కానీ, అవన్నీ మీకు అనుభవంలోకి వస్తే, మీరు సమస్యలలో చిక్కుకుంటారు. అందుకే ఆయన నా ప్రార్థన ఫలించదేమో అనే సందేహంతో భయపడి వణికిపోతున్నాను... అన్నారు.
దేవుడికి చెవుడు. ఆయనకు చెవుడు ఉండడమే మంచిది. ఎందుకంటే, అప్పుడే ఆయనకు మీ ప్రార్థనలు వినిపించవు. ఒకవేళ మీ ప్రార్థనలన్నీ ఆయనకు వినిపిస్తే మీరందరూ అనేక సమస్యలలో చిక్కుకుంటారు. కాబట్టి, మీ ప్రార్థనలే మీకు సమస్యలను సృష్టిస్తాయి. ఎందుకంటే, మీరందరూ ఏవేవో వింత కోరికలు కోరుకుంటూ ప్రార్థిస్తారు. వాటి ప్రభావం ఏదోవిధంగా సాఫీగా సాగిపోతున్న మీ దుర్భర జీవితంపైనా పడుతుంది. దానితో మీ జీవితం మరింత భారమవుతుంది.
సత్యం శిలువగా మారుతుంది. అప్పుడు జీవితం దుర్భరమవుతుంది. సోక్రటీసుకు సత్యమే విషమయింది. అలాగే, సత్యమే ‘‘అల్‌హిలాజ్ మన్సూర్’’ ప్రాణం తీసింది. సత్యమే జీసస్ క్రీస్తును శిలువ వేసింది. అయినా మీరు ‘‘సత్యాన్ని ప్రసాదించు స్వామీ’’అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ, దేవుడికి చెవుడు. అందుకే ఆయనకు మీ ప్రార్థనలు వినిపించవు. కాబట్టి, మీరు చక్కగా ప్రార్థనలు చేస్తూ, మీ దుర్భర జీవితాన్ని కూడా హాయిగా గడిపేస్తూ ఉంటారు.
నిజానికి, మీ కోరికల పోరుపడలేక, కావాలనే దేవుడు చెవిటివాడయ్యాడు. అందుకే ఆయనకు మీ ప్రార్థనలు వినిపించవు. కాబట్టి, మీ ద్వేషం, అహంకారం, కోపతాపాలు, ఈర్ష్య, అసూయలు మీలో అలాగే ఉంటాయి. అందుకే మీరు ‘‘వినయ విధేయతలు కలిగేలా ఆశీర్వదించు స్వామీ’’ అని ప్రార్థిస్తారు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.