మెయిన్ ఫీచర్

వ్యాసానికి శ్వాస ఇనాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాసం - ఈ ఏడాది తెలుగులో సాహిత్య అకాడెమీ మన్నన పొందిన ప్రక్రియ. విమర్శ ఒక రచన పైన కానీ, ఒక ధోరణి పైన కానీ, ఒక కాలం పైన కానీ ఒక ఉద్యమం విషయమై కానీ ఒక రచయిత సంపూర్ణ కృషి గురించి విరివిగా విశాలంగా, సాకల్యంగా రాయబడ్డప్పుడు, అది వ్యాస రూపంలోనే ఉంటుంది. విమర్శకు కాదు, వ్యాసాలకు వచ్చింది ఈ అవార్డ్ అని కొందరు అంటున్న పరిస్థితి ఉన్నది. అకాడెమీ కూడా వ్యాసాలు, విమర్శ అని రెండు వేరుగా గుర్తించి అవార్డులు ఇవ్వడం కూడా ఈ గందరగోళానికి కారణం.
తెలుగులో విమర్శకులు లేరు అనేది ఒక హ్రస్వ దృష్టి గల పరిశీలన. విమర్శ అనే మాటకే బాగా పట్టించుకోవడం అని అర్థం. వ్యాసం వచనంలో ఉండడం, తెలుగులో రాసిన స్థానిక కైఫీయత్తుల్లో మొదలైంది. వీటికి మూడు వందలేళ్ళ చరిత్ర పైబడి ఉన్నది. విమర్శ అంటే పూర్వ రచనలను బాగా పట్టించుకోవడం, వాటిపై పలు వ్యాఖ్యలు, ఉల్లాసాలు, మంజరీ వ్యాఖ్యలు క్రిటికల్‌గానే చేశారు ఆనాటి పండితులు. క్రిటికల్ ట్రెడిషన్ అంటే ఒక రచనను తూర్పార బట్టడం మాత్రమే కాదు - దాని మేలుబంతి లక్షణాలను, రానున్న కాలాల వారికి సుబోధకంగా తమ పరిజ్ఞాన సంపన్నం చేసి సారస్వత విస్తృతం చేయడమే. సంస్కృత సాహిత్యంలో విశిష్ట కావ్యాలకు హృదయోల్లాసిని వ్యాఖ్యలు, బాల సుభోధక వ్యాఖ్యలు ఇలా ఎన్నో రావడం జరిగింది. ఆ కావ్యాల గాఢతకు ఈ వ్యాఖ్యలు అవసరం అయ్యాయి అనుకుంటే, అప్పట్లో, వచన రచన లేదు కనుక, ఈ వ్యాఖ్యాన రచనలన్నీ, అలంకారిక దృష్టి గల పరిశీలనలే, పరిగణనకు నిల్చిన విమర్శలే. వావిళ్ల వారి ప్రచురణాల్లో, మనకు తొలిగా తెలుగు ప్రబంధాలు, ఇతర కావ్యాలు, సుబోధక వ్యాఖ్యతో రావడం, అంటే ఆ పద్యం గురించి, వచనంలో అర్థ విస్తృతిపై చర్చ, కవి నైపుణ్యంపై విమర్శ చోటుచేసుకున్నాయి. కైఫీయత్తుల / స్థానిక చరిత్ర రచనలు కవిలె కట్టలుగా, అక్కడి కరణాలు, గ్రామ పంచాయతీ మండలి పెద్దలు, రాయడం జరిగి, కనీసం తెలుగు, కన్నడ, తమిళ భాషా ప్రాంతాల ఈ వచన పద్ధతి, వ్యాస రూపేణా తొలి రచనలకు దారితీసింది. ‘‘వ్యాసము’’ అంటే ‘‘ఏదేని విషయంపై విరివిగా వ్రాయుట’’ అని శబ్ద రత్నాకరము చెప్తున్నది.
తెలుగులో కాల్పనిక వచన రచనకు ముందరే వ్యాసం ఏర్పడి ఉన్నది. హందె రాజాస్, అనంతురం, తొలి వచన రచన (1790-1800) కాగా, అనువాద వచన రచనలో విశాఖపట్నం నుంచే 1818లో బైబిల్ అనువాదం వెలుగులోకొచ్చింది. ఇది గురజాడ వాడుక భాష రాయడానికి దాదాపు ఎనభై ఏళ్ళ కిందటి మాట. 1836 సరికి, నాలుగు వందల పేజీల పైబడిన కాశీ యాత్రా చరిత్ర పూర్తి వచన రచనగా, ఏనుగుల వీరాస్వామయ్య రాశారు. ఇవన్నీ అంటే - కైఫీయత్తులు స్థానిక చరిత్ర వ్యాసాలు, బైబిల్ అనువాద వచన మతగ్రంథము. కాశీయాత్ర చరిత్ర, యాత్రా వ్యాస రూప చరిత్ర, ఇవన్నీ సాహిత్య / సామాజిక / భాషా ఆధునికీకరణ ప్రక్రియలో తొలి అడుగులే. సామినేని ముద్దు నరసింహనాయుడు ‘హిత సూచని’ వచన రచన 1862లో అచ్చు పడినా, రచన అంతకుముందే జరిగింది. 1861 చిన్నయసూరి మరణం, గురజాడ జననం కూడా. వచనలో తెలుగు కథలు, నవలలు పాశ్చాత్య సమాజ సాహిత్య సంప్రదాయం నుంచి రావడానికి ముందరే, ఆంగ్ల సమాజ ప్రభావంతో, మన వ్యాస రచనా ప్రయాస కొన్ని అడుగులేసింది.
1900కి ముందరే, కందుకూరి పత్రికా రచనలో వ్యాసం తన ఆధునికతను బలమైన పరిచయం చేసింది. 1910 ప్రాంతానికే, ఆంధ్ర భారతి వంటి పత్రికల్లో, భోగరాజు పట్ట్భా సీతారామయ్యగారి వ్యాసాలుగా కనిపించ సాగింది. ఇంకా తెలుగు వారి తొలి డైలీ ఆంధ్ర పత్రిక ఏర్పడక ముందరే వ్యాసాలు వివేక వర్ధినిలో, ఆంధ్రభారతిలో, ఏదన్నా విషయం పై విరివిగా రాయడం అనే పనిచేస్తూనే ఉన్నాయి. వ్యాసం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కట్టమంచి రామలింగారెడ్డి, గురజాడ (మాటా - మంతి వ్యాసాలు) కొమర్రాజు లక్ష్మణరావుగారి చరిత్ర వ్యాసాలు, ఇవన్నీ 1910 నాటికే వస్తున్నాయి. గురజాడ తొలి కథ 1910 సంవత్సరంలో అనుకుంటే, అదే ఏడాది ‘‘ఏబది వేల బేరము’’ క. రామానుజ రావు గారి కథానిక (అంటే కొమర్రాజు లక్ష్మణ రావు గారే) 1910 ఆంధ్రపత్రికలో వెలువడింది.
వ్యాసం - సాహిత్య విమర్శా వ్యాసం కావడం ఒక సహజ పరిణామం. తెలుగు సాహిత్యంలో విమర్శ లేదు అన్నది నన్నయ నుంచి కందుకూరి కాలం దాకా వర్తిస్తుంది. కందుకూరి కవుల చరిత్రలో చెప్పినది కూడా కవి వివరాలతో కూడిన అతని రచనల విమర్శే. సమగ్రాంధ్ర సాహిత్యంలో కూడా, ఆరుద్ర కవులు, యుగాలపై సాహిత్య విమర్శ చేశారని తెలుస్తుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో విమర్శ లేదు అన్న అభిప్రాయం చెప్పేవారు మన పద్య సాహిత్యం గురించి మాట్లాడ్డం లేదు. సంస్కృత కవుల కావ్యాలపై మూల కావ్యాలై వచ్చిన కొన్ని వందలేళ్ళ వ్యవధిలోనే తమ జీవిత కాల కృషిగా ఎందరో వెలువరించిన సెకండరీ వ్యాఖ్యాల గ్రంథాల వలె (మల్లినాథ సూరి, ఇంకా ఎందరో చేసిన వ్యాఖ్యల వలె) తెలుగులో లేవు. అంటే - తెలుగులో నన్నయ మొదలుకుని, పద్దెనిమిదో శతాబ్దం దాకా, ఎవరి రచనలు వారివే తప్ప, ఒకరి వౌలిక రచనను తరువాతి కాలంలో వ్యాఖ్యా సంపన్నం చేసే పని మన తెలుగు కవులు చేసినట్టు కనపడదు. ఆ ఆర్థంలో విమర్శ లేదు అనేది పద్య యుగానికి చెందిన ఒక సాహిత్య చారిత్రక వాస్తవం.
కానీ ఆధునిక కాలంలో, తెలుగులో దాదాపుగా యాభై మందికి పైగా ప్రసిద్ధ సాహిత్యవేత్తలు, వ్యాఖ్యలు, ప్రైమరీ రైటింగ్ పై సెకండరీ రైటింగ్స్ చేసిన శతాబ్ద్ధాక కాల నేపథ్యం ఉండగా, ఆధునిక సాహిత్యంలో ఈ మాట అనే వారు, వారి దృష్టిలో విమర్శ అంటే ఏమిటో ముందు తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అది సాహిత్యం గురించే ఉండాలా - ఒక సామాజిక ధోరణి, సంఘటన, సాంస్కృతిక ప్రక్రియ, వీటి గురించి విరివిగా రాస్తే- మంచి చెడు చెప్తే, అది ప్రపంచ సమాజాలకు క్రిటికల్ ఎస్సే అవుతున్నది కానీ, మన తెలుగు వారికి మాత్రం విమర్శ కాదా? అంటే కావడం లేదనే వీరి అభిప్రాయం. విమర్శ అంటే, వీరి పడికట్టు రాళ్ళు ఏమిటో ఆధునిక సాహిత్యం నెలకొని నూరేళ్ళు పైబడినా, ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు.
ఈ సందర్భంలో, ఇనాక్ గారి వ్యాసాలకు, సాహిత్య అకాడెమీ అవార్డ్ - అంటే నిజానికి వారి ఈ వ్యాస ప్రక్రియా సంపన్న కృషిలో ఈ గౌరవం పొందిన ‘‘విమర్శిని’’ ఒక్కటే పుస్తకం కాదు. వారి డాక్టరేట్ పట్టా పరిశ్రమ ‘‘వ్యాస పరిణామం’’ పై 1968లోనే సాగింది. తరువాత కూడా క్రమం తప్పకుండా వారు నేటివరకూ పదమూడు పుస్తకాలుగా సాహిత్య విమర్శ, ఇతర ప్రత్యేక దృష్టి గల వ్యాస సంకలనాలను వెలువరించారు. తెలుగు వ్యాసాలు, సాహిత్యదర్శిని, సాహిత్య సందర్శనం, సమీక్షణం, సమీక్షా సాహిత్యం, పీఠికా సాహిత్యం, తెలుగు కథానికా పరిణామం, చిన్ని కథల వెనె్నల, తెలుగు నవలా వికాసం, సాహిత్య ప్రయోజనం, శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం, జానపద సాహిత్య విమర్శ, మరియు ఆంగ్లంలో ‘ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మాడ్రన్ లిటరేచర్’ వగైరా వెలువడ్డాయి. ఇప్పుడు ‘‘విమర్శిని’’కి సాహిత్య అకాడెమీ అవార్డు రావడం ఈ క్రమానుగత వ్యాస సృజనలో ఒక ఘట్టం మాత్రమే. తన డాక్టరేట్ సిద్ధాంత గ్రంథంలో, వ్యాసాన్ని సాహిత్య వ్యాసం గానే కాక, సృజన వ్యాసం, స్ర్తీ వ్యాసం, పత్రికా వ్యాసం, వివాద వ్యాసం, విమర్శనా వ్యాసం అంటూ విభజన చేసి, విశే్లషించి, తెలుగు వ్యాస శైలి ఎలా ఉన్నదో ఈ పరిశోధనలో విస్తృత చర్చ చేశారు కొలకలూరి ఇనాక్. వారు పలు ప్రక్రియలు రాసినా, కథలు, నవలలు, అనువాదాలు, నాటకాలు, వ్యాసం విషయంలో వారి కృషి ఇరవయ్యో శతాబ్దపు ఉత్తరార్థంలో ఎన్నదగ్గది. కాల్పనిక సాహిత్యం మిన్నగా ఉన్నప్పటికీ, వారికి వ్యాస ప్రక్రియకు, ఈ అకాడెమీ అవార్డ్ రావడం వెనుక ఒక కవితాత్మక న్యాయం ఉన్నది.
నవలల్లో కూడా వ్యాసాలు ఉండే అవకాశం ఉంది అనే నిశిత పరిశీలన తన చిన్నప్పుడే చేసారు ఇనాక్. దానికి రంగరాజ చరిత్రము, విశ్వనాథ వేయిపడగలు ఉదహరిస్తారు ఇనాక్. ప్రమేయము, సంగ్రహము, గా తొలుదొల్త వెలువడినది, 1880ల నాటికి కందుకూరి మాటలాడితే ఉపన్యాసము, అదే రచన చేస్తే వ్యాసంగానూ ఏర్పడి, కందుకూరి కాలానికి నిలదొక్కుకున్న పరిణామ క్రమ వికాసం చెప్పిన చారిత్రక దృష్టి గల ఇనాక్, తెలుగు ఆధునిక వచన సాహిత్యంలో తొలి ప్రక్రియ వ్యాసమే అని అప్పట్లో ప్రతిపాదించక పోయినా, ఇప్పుడు చాలా స్పష్టమైన అంశం అది. ఆంగ్ల సమాజంలో వ్యాసం ముద్రిత రూపం కాగా, తెలుగు నాట ఉపన్యాసంగా కందుకూరి సృష్టిగా నిలిచిందని చెప్తారు. ఆధునిక తెలుగు వ్యాసం ఎందరో రాసినా, వ్యాసం పుట్టుక గురించి తన పరిశోధన తో మొదలైన ఒక నిరంతర సాహిత్య కారుడు, ఆ కోవలో, పదమూడు పుస్తకాలు గూడా భిన్న సాహిత్యాంశ సంబంధితమైన, విరివిగా విషయ రచన చేయడం ఒక సహజ ప్రతిభా లక్షణంగా భావిస్తే, ఈ వ్యాస రూప జిజ్ఞాసాత్మక ప్రయాస, దశాబ్దాల ముందర ఇనాక్ గారికి డాక్టరేట్ పట్టా అందించగా, నేడు, అదే వ్యాస రూప సాహిత్యం వారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ కూడా తెచ్చి పెట్టింది. ఈ క్రమంలో వ్యాసం , లేదా ఉత్తమ సాహిత్యం ఏం చేస్తుంది అంటే, పదకొండో శతాబ్దం వాడైన మమ్మటుని మాటల్లోనే చెప్పుకుందాము.
‘‘కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేత రక్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతసమ్మిత తయోపదేశయుజే
(కావ్యప్రకాశం, 1-2).
కీర్తి, ధనం, వ్యవహార జ్ఞానం, అమంగళ నాశం, ఉత్కృష్టమైన ఆహ్లాదము కాంతా అమ్మితమైన ఉపదేశము అను ఆరు కావ్య ప్రయోజనాలను ఈ ధ్వని వాద ప్రవర్తకుడు గుర్తించగా, చాలా మంది వీటిని సాహిత్య ప్రయోజనాలుగా అంగీకరించారు. వ్యాసం ప్రపంచ సమాజాల్లో, తెలుగులో కూడా, సాహిత్య గౌరవం పొందాకా ఇవన్నీ కూడా సాధించింది అనేది నిర్వివాదాంశం. ఆధునిక తెలుగు సాహిత్య తొలి ప్రక్రియగా వ్యాసం విశిష్టత, ఇనాక్ చేతుల మీదుగా పెరిగిన ఈ మొక్క ఇనే్నళ్లకు, నేడు వారికే జాతీయ స్థాయిలో ఫల ప్రదాన సందర్భంగా పరిణమించడం, ఒక ఉన్నత సందర్భం. విమర్శకు వ్యాస ప్రక్రియలోనే అస్తిత్వం, అంతే కాక, సామాజిక, రాజకీయ, మనో వైజ్ఞానిక సిద్ధాంతాల పై ఆధార పడి ఒక రచనపై పడే విస్తృత దృష్టిని , విమర్శ, అనుకుంటే, అలా జరిగిన మంచి సందర్భాలు కూడా ఈ ఆధునిక సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి.
తెలుగులో విమర్శ లేదు అనేవారు సామాజిక, రాజకీయ, మనో వైజ్ఞానిక సిద్ధాంతాల పై ఆధార పడి ఒక రచన పై పడే విస్తృత దృష్టినివిమర్శ అనుకుంటున్నారు. అది ప్రత్యేకం అని ఎలా భావిస్తున్నారో మరి. ఏ భాషలో అయినా, విమర్శ వ్యాస మహా స్వరూపంలో ఒక భాగం కావచ్చు తప్ప, విమర్శ అంటూ వేరే రూప విభాగం, ఉండదు అని, ప్రస్తుతం తెలుగులో విమర్శ లేదు అంటున్న వారు, తమకు స్పష్టత లేని ఈ ప్రతిపాదన గురించి మరొక సారి పునరాలోచించుకోవలసిన అవసరం, ఈ విషయమై విశాల ప్రాతిపదికన చర్చ జరగవలసిన అవసరం కూడా ఈ అవార్డ్ కల్పిస్తున్నది. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి సాహిత్య ప్రజ్ఞా పాటవాలు ముందరి తరాలు అలవర్చుకోదగ్గవి.

- రామతీర్థ, 9849200385