మెయన్ ఫీచర్

అనైతిక పొత్తు.. ‘కూటమి’ చిత్తు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ ఎత్తుగడలు లేని వ్యూహాల ద్వారా విజయాలను నెమ్మది నెమ్మదిగా సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి వ్యూహాలు లేని ఎత్తుగడలు అపజయం తప్పదని ముందుగానే హెచ్చరిస్తాయి. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల్లో పొత్తులు ఎలాబెడిసికొడతాయి? ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారనే అంశంపై తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పులో వచ్చే వందేళ్లకు సరిపడ సమాధానం ఉంది. ‘హిందీ బెల్ట్’ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు భారతీయ జనతాపార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో వ్యతిరేక ప్రభంజనాన్ని తట్టుకుని గణనీయ స్థానాలు పొంది బలమైన ప్రతిపక్షంగా భాజపా అవతరించింది. అక్కడ జాతీయ పార్టీల మధ్యనే పోటీనే జరిగింది. హిందీ బెల్ట్‌లోని రాష్ట్రాల ప్రజల మైండ్‌సెట్, స్థానిక పరిస్థితులు వేరు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే, ప్రస్తుతం సాధించిన స్థానాల కంటే రెట్టింపు అంటే- కనీసం 35 సీట్లను గెలిచి, పోరాడి ఓడామనే గౌరవం దక్కి ఉండేది. టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్ తన చావుకు తానే ముహుర్తం పెట్టుకుంది. టీడీపీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేయడం చారిత్రక తప్పిదం. రెండు పార్టీల డీఎన్‌ఏలు వేరు. గత వైభవాన్ని తిరిగి పొందేందుకు సరైన నాయకుడు, ఆర్థిక వనరులు, ప్రచార ఎత్తుగడలు లేని తెలంగాణ కాంగ్రెస్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు లీజుకు తీసుకున్నంత పనిచేశారు. ఈ వలలో చిక్కుకుని కాంగ్రెస్ దిగ్గజాలు గిలగిలలాడాయి. తెలంగాణలో కొనే్నళ్ల వరకు ఈ పరాభవం నుంచి కాంగ్రెస్ బయటపడుతుందనే నమ్మకం లేదు.
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సాధించిన అపూర్వ విజయాన్ని అభినందించి తీరాలి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఉన్న హవా టీఆర్‌ఎస్‌కు ఆ తర్వాత కొంత తగ్గింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ల గ్రూప్ ఫోటో, చంద్రబాబు కడుపులో ప్రేమతో గద్దర్ తలపెట్టిన ఫోటో తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేసింది. టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఇవీఎంలలో వోట్ల పంట పండింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పలు పర్యాయాలు చంద్రబాబును కలవడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజాకూటమి గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందే బాబు వద్దకు వెళ్లడం తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించింది. ఇవన్నీ కేసీఆర్‌కు ఆయుధాలుగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దాలు గడవలేదు. తెలంగాణ ప్రజల దృష్టిలో పాత గాయాలను మర్చిపోయేంత కాలం కూడా ముగియలేదు. తెలంగాణ రాజకీయాల్లోకి రానంత వరకు చంద్రబాబు అంటే ఎంతోకొంత గౌరవం ఇక్కడి ప్రజల్లో ఉండేది. కాని ఆయన ఇక్కడ ఎప్పుడైతే అడుగుపెట్టి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారో వేగంగా సమీకరణలు మారాయి. హంగూ ఆర్భాటం ద్వారా పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందు టీఆర్‌ఎస్‌కు పరాజయం తప్పదనే విధంగా ప్రచారం చేసి మానసిక యుద్ధంలో ప్రజాకూటమి గెలవడం తథ్యమనే అభిప్రాయాన్ని చంద్రబాబు సృష్టించారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్రమైన అభద్రతకు లోనయ్యారు. వీరికి కాంగ్రెస్ అంటే కోపం లేదు. కాని కేసీఆర్‌కు మరో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. తెరాసను గెలిపించినా, కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో కంటే సీట్లు పెరిగి ఉండేవి. చంద్రబాబు ఎత్తుగడలకు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుకున్నారు.
ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో గెలుపును చూసి కాంగ్రెస్ మురిసిపోవడం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు పెట్టని కోట. రాష్ట్ర విభజన వల్ల 2014లో ఆంధ్రాలో ఆ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయినా తెలంగాణలో మాత్రం బతికింది. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ సొంతంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణలో ఒక అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని కాంగ్రెస్ నేతలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకునేంత వరకు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే.
తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు టీడీపీతో మూడున్నర దశాబ్దాల పాటు పోరాడారు. ఆ నేతలు, కార్యకర్తలు టీడీపీతో పార్టీ హైకమాండ్ చేతులు కలపడాన్ని ఎలా జీర్ణించుకుంటారు? మర్రి చెన్నారెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కాంగ్రెస్ వారు టీడీపీపై అలుపెరగని పోరాటం చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సోనియాగాంధీకి తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ను దాని మానాన వదిలేసి పోటీచేయమని చెప్పినా పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కాదు. స్వజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయనే భౌతికశాస్త్ర సూత్రం కాంగ్రెస్ -టీడీపీ పొత్తులో రుజువైంది. టీడీపీ ఆవిర్భావ సమయంలో లేని చంద్రబాబు లేరు. ఎంతటి అపర చాణక్యుడైనా చంద్రబాబు ఈ విషయంలో పప్పులో కాలేశారు. కాంగ్రెస్-టీడీపీల మధ్య ‘కెమిస్ట్రీ’ కుదరలేదు. రాహుల్, చంద్రబాబు రోడ్ షోలను చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు మీడియాలో జోరుగా ప్రచారం జరిగినా, ఇవన్నీ ప్రజా కూటమి సమాధికి ప్రమాద ఘంటికలు మోగించాయి.
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను, ప్రజాకూటమికి అప్పగిస్తే ఏమవుతుందనే భయం ఓటర్లను వెంటాడింది. దీనికి తోడు కేసీఆర్ విస్తృత పర్యటనలు చేసి, రాజకీయ వ్యూహాలు, అద్భుతమైన ప్రసంగాలు, ప్రజాకూటమిలోని లోపాలు, రాజకీయ దివాళాకోరుతనం, కాంగ్రెస్-టీడీపీల అనైతిక పొత్తును ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించి చెప్పడంలో విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గత విజయాలే పునరావృతమవుతాయని, చంద్రబాబు అండ ఉంటే ఎన్నికల్లో ఆర్థిక వనరులకు లోటు ఉండదని, గతంలో టీడీపీకి పోలైన 14 శాతం ఓట్లు తమకు దక్కుతాయని కాంగ్రెస్ నేతలు ఆశపడి తమ గోయిని తామే తవ్వుకున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయంటే ఇదే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా తిరస్కరించారు. సీనియర్ నేతలందరూ ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధరబాబు, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు ఎదురుగాలికి నిలిచి గెలుపుతీరాన్ని చేరుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో చాలామంది యువకులే కావడం గమనార్హం. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు చక్రం తిప్పిన కాంగ్రెస్ నేతలందరూ ఇంటిదారి పట్టారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న రెండే రెండు నియోజకవర్గాలకు టీడీపీ పరిమితమైంది. చంద్రబాబు ప్రచారానికి తోడు ఆయన బావమరిది, సినీనటుడు బాలకృష్ణ ప్రచారం కూడా ఎబ్బెట్టుగా సాగింది. ఎన్నికల రణక్షేత్రంలో హరికృష్ణ కుమార్తె సుహాసినిని చివరి నిమిషంలో నిలబెట్టి సాధించిందేమిటి? గ్రేటర్ హైదరాబాద్, పాత రంగారెడ్డి జిల్లాలో స్థిరపడిన ఆంధ్రులందరూ టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేశారు. అందుకే ఇక్కడ టీఆర్‌ఎస్ ‘స్వీప్’ చేసింది. ప్రజాకూటమి గల్లంతైంది. టీడీపీకి ఆంధ్రులు ఎక్కడ ఓట్లేసి గెలిపిస్తారోనన్న అనుమానంతో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు ఓటువేశారు. దీంతో టీఆర్‌ఎస్ గెలుపు నల్లేరు మీద నడకైంది. ఈ ప్రాంతంలో ఉన్న 29 సీట్లలో మజ్లిస్ ఏడు, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్ పోనూ మిగిలిన సీట్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంది.
2019 ఏప్రిల్‌లో లోక్‌సభతో పాటే ఆంధ్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే ఎన్నికల కోలాహలం ప్రారంభమైనట్లే. పొత్తులు లేకుండా టీడీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుందా? లేక కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాలి. ఇప్పటికే చంద్రబాబు ఇద్దరు నేతలను పక్కన పెట్టుకుని ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక కూటమి సమావేశాన్ని నిర్వహించారు. ఆ ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే తెలంగాణలో చేదుఫలాలను రుచి చూశారు. టీడీపీతో తాము జతకట్టి సరిదిద్దుకోలేని తప్పు చేశామని రాహుల్ ఇప్పటికే గ్రహించి ఉంటారు. ఇక రానున్న రోజుల్లో చంద్రబాబు గతంలో మాదిరిగా ఢిల్లీయాత్రలు, బీజేపీ వ్యతిరేక కూటమి సమావేశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటారా? లేక సొంత ఇంటిని చక్కదిద్దుకుంటారా? ఆంధ్రాలో అడుగుపెడతానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ‘మీరు స్నేహితులను మార్చగలరు. కాని పొరుగువారిని మార్చలేరు..’ అన్న ఆంగ్ల సామెతకు విరుద్ధంగా కొనసాగితే చంద్రబాబుకు శృంగభంగం తప్పదు. చంద్రబాబు ఆంధ్రాలో మళ్లీ గెలవాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఒడిశాలో కూడా టీడీపీ పోటీచేస్తుందనే వార్తలు వచ్చాయి. బరంపురం, రాయగడ, పర్లాకిమిడి తదితర చోట ఆంధ్ర ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి మద్రాసు విభజన సమయంలో ఈ ప్రాంతాలన్నీ ఒడిశాలో 1953లో చేరాయి. ఏడు దశాబ్దాల తర్వాత అక్కడ స్థానికంగా ఒరియా ప్రజల ఆధిపత్యం పెరిగింది. అక్కడ స్థానికులతో ఆంధ్రులు కలిసి పోయి హాయిగా ఉన్నారు. టీడీపీ అత్యుత్సాహం వల్ల అక్కడ స్థిరపడిన ఆంధ్రుల్లో అభద్రతాభావం నెలకొంటుంది.
తెలంగాణలో కేసీఆర్ గెలవడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం పొంది ఉంటారు. ఇక్కడ ఎటూ బీజేపీ గెలవదనే విషయం, కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే ఆశలేమీ బీజేపీ అగ్రనేతలకు లేవు. ఒకప్పటి తన మిత్రుడైన టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టుకట్టి పోటీ చేసి ఘోరపరాజయం చెందడం మోదీ, అమిత్‌షాకు తప్పకుండా ఆనందాన్ని ఇస్తుంది. హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చంద్రబాబుకు మానసికానందాన్ని ఇచ్చే అంశం. తాజా ఎన్నికల్లో నిజమైన విజేత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని 2014లో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకపోవడం కేసీఆర్ తీసుకున్న తెలివైన నిర్ణయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబుతో కాంగ్రెస్ జత కట్టడాన్ని ప్రజలు సహించరాదని ప్రచారం చేసి కేసీఆర్ మరోసారి సెంటిమెంటును ఆయుధంగా చేసుకుని విజయఢంకా మోగించారు. దీనికి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, పాలన తీరుతెన్నులు కూడా తోడవడంతో మహాకూటమిని తెరాస చిత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ కోలుకోవడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097