మెయిన్ ఫీచర్

ఉత్తరాంధ్రకూ మరో కవిత్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ప్రఖ్యాత కవిత్రయం ఉండగా.. వారి రచనగా మహాభారతం, దక్షిణ భారతదేశంలోనే తొలి సంపూర్ణ భారత అనుసృజనగా వెలువడిన చరిత్ర ఉండగా... ఈ ఉత్తరాంధ్ర కవిత్రయం ఎవరు? అన్న ప్రశ్న వస్తుంది. వీరు కూడా ఆ కాలంలో ఒకరినొకరు ఎరుగరు. కానీ వేర్వేరు రాజుల కొలువులో ఒకే రాజాస్థానంలో పనిచేశారు. ఆ రాజ్యం విజయనగర సంస్థానం. ఆ రాజులు పెద విజయ రామరాజు, చిన విజయరామరాజు, ఆనంద గజపతి మహారాజు. ఆ కవులు గోగులపాటి కూర్మనాథ కవి, అడిదం సూరకవి, గురజాడ అప్పారావు. 18, 19 శతాబ్దాలు వీరి కాలం. విజయనగరం ఒక ప్రాంతీయ రాజ్యంగా ఆవిర్భావం, విస్తరణ, విస్తరణ రణాలు, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారితో సైనిక ఒప్పందాలు, బొబ్బిలి యుద్ధం, పద్మనాభ యుద్ధం జరిగిన కాలం ఇది.
విజయనగరం కోట ఎప్పుడూ రక్తసిక్తం కాలేదు. యుద్ధాలు ఈ కోట దరిదాపుల్లో జరగలేదు. పాలక మహారాజుల మరణం, దూరాన 1757లో బొబ్బిలి యుద్ధ మైదానాలలోనూ (పెద విజయరామరాజు), అలాగే 1794లో పద్మనాభం దరిలోనూ (చిన విజయ రామరాజు) మరణం జరిగింది. కోట బ్రిటిష్ అధీనంలోకి వెళ్లడం, చిన విజయరామరాజు మరణం తరువాతే జరిగింది. పెద విజయరామరాజు కాలంలో గోగులపాటి కూర్మనాథ కవి, చిన విజయరామరాజు కాలంలో అడిదం సూరకవి, ఆనంద గజపతి మహారాజ కాలంలో గురజాడ అప్పారావు కవిత్రయంగా వెలుగొందారు.
1712లో మొదలైన కోట నిర్మాణం, పెద విజయరామరాజు కాలంలో జరిగింది. అంతకుముందు పూసపాటి రేగ, కుంబిళాపురం (ఇప్పుడు కుమిలి) నుంచి మట్టికోట ఉన్న ఒక చిన్న రాజ్యంగా ఉండేది వీరి జమీందారీ. 1712లోనే ఈ రాతి కోట నిర్మాణం మొదలయింది. కోట కట్టడం పూర్తి అయ్యాక, పెద విజయరామరాజు పేరిటే, విజయనగరం ఊరు క్రమేపీ ఏర్పడ్డది. ఈ రాజు పాలనలో దేవాదాయ ధర్మాధికారిగా గోగులపాటి కూర్మనాథ కవి పనిచేసేవారు. జననం 1872 ప్రాంతం అని అంచనా ఉంది. వీరు అప్పట్లో రామతీర్థం, శ్రీకూర్మం, అరసవిల్లి, సింహచలం తదితర ఆలయాలకు పర్యవేక్షకులుగా ఉండేవారు. ప్రసిద్ధ కవి కూడా. కూర్మనాథ కవి కాలానికి నవాబుల పాలనలు కూడా చూసిన ప్రాంతం ఉత్తరాంధ్ర. వారి దేశ భాషలు, వేష వ్యవహారాలు కూడా జన సామాన్యంలో నిలదొక్కుకుని ఉన్నాయి. అయితే తురుష్క దండుల దాడులు పాలన కోసం కాక, కేవలం దోచుకోవడం కోసం జరిగేవి. అటువంటి దాడి, సింహాచలం క్షేత్రంపై 1750 కాలంలో జరిగింది. సింహాచల నరసింహమూర్తిని, ఈ దౌష్ట్య నిర్మూలన చేయమని, దాడికొచ్చిన తురుష్క దండులు కొండ ఎక్కి వస్తుండగా, ఆలయ గర్భగుడి తలుపులు మూసి, కూర్మనాథ కవి చెప్పిన రోషాత్మక శతకం ‘వైరిహర రంహ సింహాద్రి నారసింహ’ శతకం. ఇందులో సింహాద్రి స్వామిపై నిందాస్తుతితో పాటు ఆ రోజుల్లో మహమ్మదీయ నవాబుల పాలనలో జరిగే దురాగతాలను కూడా కూర్మనాథ కవి విపులంగా ప్రస్తావిస్తారు. మొదటి పద్యంలోనే తుమ్మెదల పేరిట (‘సరస చిత్తాబ్జ బంభర’ అని స్వామిని సంబోధిస్తారు) ప్రస్తావన చేస్తారు. అరవై ఎనిమిది పద్యాలు పూర్తికాగానే కంచు ముక్కులు గల తుమ్మెదల దండులు బయలుదేరి, ఆ తురుష్కుల గుంపులను వెంట దరిమి దాదాపు విశాఖ వైపుగా పనె్నండు మైళ్ల దూరానికి తరిమికొట్టాయి. అక్కడ ఒక బిలంలో దూరి అదృశ్యమయ్యాయి. ఆ మెట్టకే తుమ్మెదల మెట్ట అని పేరు అప్పట్లో. ప్రస్తుత పేరు చావుల మదుం. మొదటి పద్యం ఇది.
సీ॥ శ్రీమద్రమారమణీ మణీరమణీయ / సరస చిత్తాబ్జ బంభర పరాకు / శంఖ చక్రగదాసి శార్జ చాపాది భా / సుర దివ్య సాధనకర! పరాకు / ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక / భక్త సంరక్షణ పర! పరాకు / బహుతర బ్రహ్మాండ భాండ పరం పరాకు / భరణ లీలాదురంధర! పరాకు
పద్యాలలో అన్య దేశ్యాలను వాడి శక్తివంతంగా పద్యం చెప్పడం కూర్మనాథ కవి 18వ శతాబ్దంలోనే ప్రవేశపెట్టిన ఒరవడి. బహుశా కూర్మనాథ కవి క్రీ.శ. 1030 కాలపు సోమనాథ దేవాలయంపై మహమ్మద్ గజనీ దాడి నుంచి మొదలుకుని అసంఖ్యాకంగా పలు శతాబ్దాలలో భారతీయ ఆరాధనా మందిరాలపై జరిగిన మహమ్మదీయ దాడుల్లో, ఒక కవి ఎదిరించి నిలబడి, చండ ప్రచండ కవిత్వం చెప్పిన సంఘటన ఒక్క సింహాచల క్షేత్రంలోనే జరిగింది. ఆ విధంగా కూర్మనాథ కవి జాతీయ కవి. సింహాద్రి నరసింహ శతకం పరాక్రమ కవిత్వం. ఇక జరిగే దురాగతాలను చెప్పిన తీరులో చేసిన పద ప్రయోగాలు విలక్షణమైనవి.
‘బేగి ఆరే అరబ్బీ పడోరేయని / బోడి సన్యాసుల బొడుచువారు / మత్ రఖో మూకెపర్మాటీ యను వైష్ణ / వుల బొట్లు దుడువగా బోవు వారు / పత్తర్ కాయకు బందేయరే చోడు / దే యని శైవుల దిట్టువారు / క్యా బొమ్మన్ జన్నిద్ నికాల్దేయటంచు స్మా / ర్తుల ప్రల్లదములాడి త్రోయువారు నగుచు యవనులు / వయనులు మమునిట్టు లడలజేయ / నట్టివాండ్రకు ద్విజులెంతగద గడి / మ్రింగువానికి లింగమూర్బిండివడెము /వైరి/
ఈ శతకమే కాక కూర్మనాథ కవి ‘ఏకాంత సేవ’ అనే గేయ ప్రబంధము, పద్య సంక్లిష్టత నుంచి యక్షగాన ప్రబంధం ‘మృత్యుంజయ విలాసము’, ‘లక్ష్మీనారాయణ సంవాదం’ మొదలైనవి కూడా రచించారు. కళింగ ప్రాంత దేవతల అబేధం, సాన్నిహిత్యం తెలిసేలా జగన్నాథస్వామి రాయబారంగా కూడా వ్యవహరిస్తారు. 1720లో జన్మించిన వీరు చివరి రోజుల్లో గజపతినగరం దరి దేవులపల్లిలో జీవించారు అని చెప్తారు. వీరి రూపురేఖల గురించి ఏ వివరాలూ లేవు. కేవలం ఊహామూర్తిగా మానవాకృతి అయినా లేకున్నా మిగిలివున్న తన అక్షరాల్లో బృహత్రూప పరివ్యాప్తుడు గోగులపాటి కూర్మనాథ కవి.
వీరి తరువాతి కవి అడిదం సూర కవి. వీరు కూర్మనాథ కవి శతాబ్దంలోనే ఉన్నారు కానీ ఎక్కువగా చిన విజయ రామరాజు కాలంలో వీరి ప్రస్తావన వస్తుంది. ‘సూరకవి తిట్టు కంసాలి సుత్తిపెట్టు’ లాగా శాపానుగ్రహ సమర్థత గల తెలుగు కవుల్లో వేములవాడ భీమకవి తరువాత అటువంటి కవి అడిదం సూర కవి. ‘ఇదం బ్రహ్మమ్, ఇది క్షాత్రమ్’ అన్న చందాన, వీరి పూర్వీకులు తొమ్మిది తరాల పూర్వం, వందలేళ్ల కిందట, రాజుల తరపున యుద్ధాల్లో పాల్గొని విజయాలకు కారకులైనందున వీరికి ఒక కత్తి బహూకరించారు. అడిదం అంటే కత్తి. అంతకుముందరున్న ఇంటి పేరు అడిదం వారిగా మారింది అంటారు. ఈయన నల్లని మనిషి. ఎత్తరి. బొడ్లో ఒకవేపు గంటం, మరొకవేపు బాకు పెట్టుకుని ఆరోజుల్లో ఊళ్లు తిరిగేవారట. ఊర్ల మధ్య అటవీ ప్రాంతం కనుక దోపిడీ దొంగల బారిన పడకుండా ధైర్యంగా కుటుంబ పోషణ కోసం ఇలా పలు రాజులను, జమీందారులను దర్శించేవారని చెప్తారు. ఆత్మాభిమానంలో, ఆత్మవిశ్వాసంలో సూర కవి సాహసకృత్యాలు కథలుగా ఉత్తరాంధ్రలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ శతాబ్దపు కవుల కన్నా ముందరే ‘గడియకు నూరు పద్యములు రచింతు గంటము లేకుండ రచింతు దిట్టగా’ అని చెప్పిన కవి ఎవరని అడిగితే తన గురించి పరిచయం ఇలా చెప్తారు.
‘ఊరెయ్యది చీపురుపలి / పేరో సూరకవి ఇంటిపేరు అడిదమువార్ / మీ రాజు విజయరామ / హారాజతడేమి సరసుడా భోజుడయా’ - చిన విజయ రామరాజు కాలంలో, తాను చిన్నవాడు కావడం వల్ల సీతారామరాజు అనే రాజ వంశీకుడి దివాన్‌గిరీ నడిచేది. తాను సూరకవి అంటే కిట్టనివాడు. ఒకసారి రాజు కొలువులో, ఒక పద్యం రాజ ప్రశంసగా సూరకవి చెప్పగా, రాజుగారు సంతోషించగా, దివాన్ సీతారామరాజు మాత్రం సూరకవిని ఇరుకున పెట్టాలని ‘అందులో రాజుని పట్టుకుని నువు అని ఏకవచన ప్రయోగం చేశావు. ఇది ఉచితమేనా? అని అడిగాడు. అప్పుడు విద్వాన్, మనీషా సంపన్నుడు అయిన సూరకవి ఈ పద్యం నిండు సభలో చెప్పి అందరి మెప్పు పొందాడు.
‘‘చిన్నప్పుడు రతికేళిని / నున్నప్పుడు కవితలోన యుద్ధములోనన్ / వనె్న సుమీ‘రా’ కొట్టుట / చెన్నగునో పూసపాటి సీతారామా’’
శతాబ్దపు పద్యం అని 18వ శతాబ్దంలో చెప్పాలి అంటే ఒకసారి పెద్దాపురం సంస్థానంలో రాజప్రశంస చేస్తూ తమ రాజైన విజయరామరాజుతో సహా ఎందరో రాజులుండగా ఈ పద్యం చెప్పారు సూరకవి. ప్రమాదకరమైన పద్యం ఇది. కవి సాహసిక ప్రవృత్తికి ఇది ఎంతగానో నిదర్శనం.
‘రాజు కళంకమూర్తి, రతి రాజు శరీర విహీనుడంబికా / రాజు దిగంబరుడు మృగరాజు గుహాంతర సీమవర్తివి / భ్రాజిత పూసపాడ్విజయ రామ / నృపాలుడు రాజుగాక రుూ / రాజుల్ రాజులే పెనుతరాజులు గాక ధరాతలంబునన్’
ఆ సభలో కొలువుదీరిన మిగతా రాజులకు తెగని కోపాలు వచ్చి యుద్ధాలకు దారితీసే పరిస్థితిలో ఆ పద్యానికి మరొక అర్థం చెప్పి శాంతింపజేసినవాడు సూరకవి. 1794లో చిన విజయరామరాజు మరణానికి తొమ్మిదేళ్ళ ముందర ఈయన చనిపోయారు అని చెప్తారు. వీరి రూపురేఖల గురించి కూడా ఏ ఆధారాలు లేవు. ఇంగ్లిష్ వారి ‘తెజారస్’ కన్నా తెలుగులోనే ముందర, పైడిపాటి లక్ష్మణ కవి ద్వారా సమానార్థక పదకోశం ‘ఆంధ్ర నామ సంగ్రహం’ వెలువడింది. ఈయన దానికి అనుబంధంగా ‘ఆంధ్ర నామశేషం’ జోడించిన భాషాశాస్త్ర పరిజ్ఞాని కూడా. కొన్ని ఇతర గ్రంథాలు కూడా రాశారు.
ఈ ముగ్గురిలో మనకి బాగా పరిచయం ఉన్నవారు గురజాడ (1862-1915) కవిత్వం, నాటకం, కథ, వ్యాసాలుగా వీరి రచనలు సాగాయి. తన నాటకంలో గురజాడ, తన పూర్వకవి సూరకవి పద్యం వాడుకున్నారు. అది కన్యాశుల్కం నాటకంలో మూడో అంకంలో గిరీశం స్వగతంలో వస్తుంది. ‘చుక్కల వలె కర్పూరపు ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్ దిక్కు దిక్కుల పిక్కటిల్లున్’ అన్నది ఆ పాత్ర స్వోత్కర్ష. కానీ సూరకవి పద్యమే. తనకు భూరి సహాయకారైన శృంగవరపు కోట దివాన్ పొనుగుపాటి వెంకన్న మంత్రి గురించి సూరకవి చెప్పిన పద్యరత్నమే గురజాడ ఇక్కడ పొదిగింది.
‘చుక్కల వలె గర్పూరపు ముక్కల / వలె నీదు కీర్తి ముల్లోకములన్ / గ్రిక్కిరిసి పిక్కటిల్లెను / వెక్కసముగ బొణ్గుపాటి వేంకట మంత్రి’
ఆధునిక కాలంలో కూడా, ‘‘ఎవరు బతికేరు మూడు యాభైలు’’ అన్నది ప్రఖ్యాతమైన శ్రీశ్రీ కవితాత్మక వ్యాఖ్య. కానీ ఇది కూడా మరొక సందర్భంలో పాలకొండలో, పేరుగల పెద్దలు పట్టించుకోకపోతే, అయ్యన్న అనే బట్టల నేతగాడైన బత్తుల కుల భూషణుడు తనకు చేసిన సాదర సమ్మానానికి సంతసించి సూరకవి చెప్పిన కంద పద్యమే - ‘మూడేబదులెవరుండరు మూఢులునది గానలేరు ముల్లోకములన్, వాడుక పడవలె మనుజుడు వేడుకతో బత్తులయ్య వినగదవయ్య’.
గురజాడ కవిత్వం ఎంత ప్రసిద్ధమో, తమ కాలంలో తమ సమాజంపై వారు చెప్పిన కవిత్వ ధారకు, ఉత్తరాంధ్ర కవిత్రయంలో మొదటి ఇరువురుగా అంతటి పేరు రావలసిన వీరు, మనకు గురజాడ ముందరి కాలంలో కళింగాంధ్ర కవిత్వ తేజాలు కూర్మనాథ కవి, అడిదం సూరకవి.

- రామతీర్థ, 9849200385