మెయిన్ ఫీచర్

దర్శనమే ముక్తిప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శ్రీశైలా శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం పునః
సారంగేశ్వర బిందు తీర్థం మమలం ఘంటార్క సిద్దేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతా మా రామ వీరేశ్వరమ్
శంఖం చక్ర వరదా ఈర్థమనిశం శ్రీశైలం నాథం భజే’’
అంటూ పురాణాలలో పేర్కొన్న శ్రీశైలం అత్యంత మహిమాన్వితమైంది. అంతేకాదు కేవలం దర్శిస్తేనే ముక్తినిచ్చే క్షేత్రం శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలో అడుగుపెట్టితే కరుణాంతరంగడు శ్రీశైల నాథుడు తోడునీడగా ఉంటాడు.
‘‘శ్రీశైల దర్శనాన్ముక్తిః
కాశ్యాంతు మరణాద్ధృవమ్’’ అని పురాణాలలో పేర్కొన్నారు. కాశీక్షేత్రంలో మరణిస్తే తప్ప ముక్తికలగదు. శ్రీశైలంలో స్వామిని దర్శిస్తే చాలు భక్తులకు ముక్తి లభిస్తుంది. అందువల్లనే ఈ క్షేత్రం యుగయుగాల నుంచి మహిమాన్విత క్షేత్రమై శ్రీశైలం విలసిల్లుతుంది.
పురాణపురుషుడు వ్యాసమహర్షి ‘శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిధ్యతే’ అని క్షేత్రం గురించి వివరించారు. శివ శరణులు ఈ క్షేత్రంలో స్వామిని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామి దర్శనం పొంది స్వామిలో శివైక్యం పొందారు. అలాంటి మహిమలు కలిగిన పుణ్యక్షేత్రం శ్రీశైలం కావటంవల్లనే ఇక్కడ కొలువుదీరిన మల్లికార్జునుడు, భ్రమారాంబదేవి భక్తుల పూజలు అందుకుంటున్నారు.
శ్రీశైలంలో వెలసిన పరమాత్మ లింగం దేశంలో వున్న జ్యోతిర్లింగాలలో రెండవది. రాష్ట్రంలో మొదటిది. ఇక్కడ వెలసిన భ్రమరాంబ దేవి అష్టాదశ పీఠాలలో ఒకటిగా వుంటూ యుగయుగాలనుంచి పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు.
శ్రీశైలం క్షేత్రం గురించి సంస్కృత వాఙ్మయ స్కాంద పురాణాలలో, మహాభారత గ్రంథాలలో వివరించారు. ఈ క్షేత్ర మహిమలు రత్నావళి, మాలతీమాధవ, కాదంబరి మొదలగు గ్రంథాలలో కూడా శ్రీశైలం క్షేత్రం మహిమలు వివరించబడ్డాయి.
శ్రీపర్వతంబు మహిమం
బ్రస్తుతింపంగ శక్యమే బ్రహ్మకైన
గండశిలలెల్ల శంభు లింగంబులిందు
సిద్ధమును లిందు వసియించు చెంచులెల్ల’’ అని మహాకవి శ్రీనాథుడు శ్రీశైల క్షేత్రం గురించి వివరించారు.
‘శ్రీశైలం శివభక్తులకు కామధేనువు, కల్పతరువు’ అని అభివర్ణించారు మహాకవి పాల్కురికి సోమనాధుడు. అంతేగాక పురాణాలలో శ్రీశైల క్షేత్రం గురించి ఎంతో వర్ణించారు.
శ్రీశైల క్షేత్రంలో దివ్య శిఖరాలతో విలసిల్లుతూ, సకల పాపహరం పాతాళగంగా, కృష్ణ జలాలలతో, సూర్య, చంద్రలు పుష్కరిణలతో ఎన్నో మహిమలు గలిగిన క్షేత్రాలని పురాణాలలో స్పష్టం చేయబడింది.
ఈ క్షేత్రం మహిమాన్వితంతో కూడుకున్నది కాబట్టి ఈ క్షేత్రంలో భాగంగా వున్న పాలదార, పంచదార ప్రాంతంలో ఆదిశంకరాచార్యులు తపమాచరించి ‘శివానందలహరి’ అనే గ్రంథం వ్రాసి స్వామివారికి అంకితం చేశారు.
కృతయుగంలో హిరణ్యకశ్యపుడు శ్రీశైలం క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించి పునీతుడయ్యాడు. త్రేతాయుగంలో రావణుని సంహరించిన శ్రీరాముడు సీత సమేతంగా వచ్చి రావణ హత్య పాతకం నుంచి బయటపడటానికి గాను శ్రీశైల క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి బ్రహ్మణ హత్య పాతకం నుంచి ముక్తిపొందారు. శ్రీరాముడు, సీత దేవి ప్రతిష్ఠించిన విగ్రహాలు నేటికి పూజలందుకుంటున్నాయి.
పూర్వం చంద్రగుప్తుడు అనే రాజుకు సంతానం లేకపోవటంతో శ్రీశైల స్వామని పూజలు చేయగా స్వామి చంద్రగుప్తునికి దర్శనం ఇచ్చి ఒక కుమార్తెను ప్రసాదించాడు. రాజు ఆ బిడ్డకు చంద్రావతి అని పేరు పెట్టారు. యుక్తవయస్సు వచ్చిన చంద్రావతి స్వామిపైనే మనస్సును లగ్నపరచి కొలవడం చేసింది. స్వామియే తనను గ్రహించాలని స్వామిపైనే తన మనస్సు వుందని ఆమె తండ్రికి చెప్పటంతో రాజు ఆమెకు శ్రీశైలంలో ఒక ఆశ్రమం నిర్మించారు. చంద్రావతి అక్కడే వుంటూ క్షేతంలోని అడీలు మల్లెపూలతో పూజలు చేసింది. తెల్లని మల్లెపువ్వుల దండ వేసుకొని స్వామి చంద్రావతికి దర్శనం ఇచ్చి ‘దీర్ఘసుమంగళిగా’ వుండాలని ఆశీర్వదించారు. దాంతో నాటినుంచి స్వామి మల్లికార్జునునిగా పిలవబడటం జరిగింది. క్షేత్రంలోని లింగాన్ని మల్లికార్జున లింగంగా భక్తులు పిలిచారు. చంద్రావతి క్షేత్రంలో స్వామి పూజలు చేస్తూ స్వామి వారిని దర్శిస్తూ క్షేత్రంలోనే ముక్తిపొందారు.
శివశరణి అయిన అక్కమహాదేవి కూడా స్వామిని మనసా వాంఛా కొలుస్తూ స్వామివారినే మనస్సులో వుంచుకొని శ్రీశైల క్షేత్రం చేరుకొని క్షేత్రం సమీపంలో వున్న గుహలో అక్కమహాదేవి స్వామి దర్శనం కోసం తపస్సు చేసి స్వామిలోనే శివైక్యం పొందారు. శివ సన్నిధిలో ముక్తి పొందారు. ఇప్పటికీ అక్కమహాదేవి గుహలు క్షేత్రం సమీపంలో ఉన్నాయి. హేమారెడ్డి మల్లమ్మ అనే భక్తురాలు ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం కోసం తపస్సు చేయగా స్వామి జంగమ దేవర రూపంలో దర్శనం ఇచ్చి ముక్తి ప్రసాదించారు.
అల్లం ప్రభుదేవు, బసవన్న మొదలగు శివశరణులు కూడా స్వామి దర్శనం చేసుకొని పునీతులయ్యారు. ఈ విధంగా ముక్తి ప్రదాయ క్షేత్రం కావటంవల్లనే కలియుగంలో కూడా భక్తుల పూజలందుకుంటూ మహాక్షేత్రంగా శ్రీశైల క్షేత్రం విరాజిల్లుతోంది.

-టి.వీరన్న