మెయిన్ ఫీచర్

నమో శ్రీ ఖాద్రీ లక్ష్మీనారసింహా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీసింధూజా హృదయ వల్లభ! పావనాంఘ్రే!
భక్తార్తినాశ! భవభంజన! భాగ్యదాయిన్
క్షీరాబ్దివాస! మధుసూధన నిర్మలాత్మన్
శ్రీ ఖాద్రినాథ నృహరే తవసుప్రభాతమ్
అంటూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో పునీతమవుతున్న సుప్రసిద్ధ క్షేత్రం కదిరి..
రాయలసీమ అంటే అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్, కరువు కాటకాలు. అయితే రాయలసీమలోని ఆధ్యాత్మిక చారిత్రకాలు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా కానరావు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు రాయలసీమ. రాయల సీమలో వున్న ఆలయాలు మన దేశ హైందవ సంస్కృతికి నిలువుటద్దంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు జిల్లాలోని అహోబిలం, నెల్లూరు జిల్లాలోని పెంచలకోన, అనంతపురం జిల్లాలోని కదిరి, విశాఖ జిల్లాలోని సింహాచలం, తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది, గూంటూరు జిల్లాలోని మంగళగిరి, కృష్ణాజిల్లాలోని వేదాద్రి, నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, కరీంనగర్‌జిల్లాలోని ధర్మపురిలలో నవ నరసింహస్వామి ఆలయాలున్నాయి. వాటిలో ఒకటిగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక ధామం కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అతి ప్రాచీనమైనది ఈ దివ్యక్షేత్రం అనంతపురం జిల్లా కదిరిలో వుంది. ఆ ఆలయంలో ప్రతి ఏటా మార్చి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తాదులు హాజరై నారసింహుడి నామస్మరణతో భక్తిపారవశ్యంలో తేలియాడుతారు. చుట్టూ ఎతె్తైన ప్రహరీ గోడలతో ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడి వుంది. నాలుగు వైపులా ప్రవేశ గోపురాలతో అత్యంత వైభవంగా వుండే ఈ ఆలయంలో వాస్తుశిల్పాలు ద్రావిడ, విజయనగర రాజుల కాలం నాటివి. ఈ ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణాపథం, ముఖమండపం, అర్ధమండపం, రంగమండపం వున్నాయి. రంగమండపంలోని 4 స్తంభాలపై వున్న శిల్ప కళారీతులు అత్యంత సుందరంగా వుంటాయి. రంగమండపంలో వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి కావడంతో ప్రస్తుతం కొన్ని వెలసినట్లు కనిపించినా ఎంతో అందంగా వున్నాయి. గర్భాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, స్వామి వారికి ఎడమవైపున ఆలయంలో చెంచులక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. వైకాశన ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ ప్రతిరోజు స్వామి వారికి పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడి గర్భాలయాన్ని శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి సన్నిధిగా పిలుస్తారు. ఇందులోని స్వామి వారి మూల విరాట్ అష్ట భుజాలతో వెలుగుగొందుతున్నాడు. స్వామివారు ఉగ్ర నరసింహులు కావడంతో ఆయన కోపతాపాన్ని ఉపశమనింపజేయడానికి స్వామికి ఎడమ వైపున ప్రహ్లాదుడు స్తుతిస్తున్నట్లు భక్తాదులకు దర్శనమిస్తారు. ఈ ఆలయం ముందున్న పెద్దరాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ధ్వజస్తంభం పునాది నుండి కాకుండా ఒక బండరాతిపైన నిలబెట్టివుండటం విశేషం.
పురాణాల ప్రకారం..
శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్యకశిపుని శిక్షణకు, భక్తుడైన ప్రహ్లాదుడి రక్షణకు నరసింహుని అవతారంలో స్థంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామివారు అలాగే ఉగ్రరూపంలో వుండటం లోకానికి మంచిది కాదని భావించిన మహర్షులు, దేవతలు ఆ కొండపైకి చేరుకుని నారసింహున్ని స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింపజేశారు. అలా ఆ కొండకు స్తోత్రాద్రి అని పేరు వచ్చినట్లు చెప్పబడుతోంది. ఆయన క్రోధ తాపాన్ని ఉపసంహరింపజేసేందుకు స్వామి వారి ఎడమవైపున ప్రహ్లాదుడు నిలబడి స్థుతిస్తున్నట్లు మనకు దర్శనం ఇస్తున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. దుష్ట శిక్షణ, శిస్ట రక్షణకై శ్రీ మహావిష్ణువు సగం మనిషి, సగం సింహంలా నారసింహుడి అవతారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్యకశిపుడి సభానందలి స్థంబం నుంచి స్వామి ఆవిర్భవించాడు గనుక శ్రీవారిని కంబాల రాయుడని పిలుచుకుంటారు. అదేవిధంగా స్వామి వారికి కాటమరాయుడు, బేట్రాయుడు అనే పేర్లు కూడా వున్నాయి. అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కాటమరాయుడా అని కిర్తించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్ర (ఖాద్రిచెట్టు)వృక్షపు కొయ్య స్థంభం నుంచి నరసింహస్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఈకారణంగానే స్వామివారిని ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి అని కూడా పిలుస్తుంటారు. ఆ కొండకు ఆనుకుని కాటం అనే కుగ్రామం కూడా వుండటంతో స్వామి వారిని కాటమరాయుడిగా కూడా పిలుస్తున్నట్లు పురాణాలు చెప్తున్నాయి.
ఆలయ చరిత్ర..
క్రీ..శ..1323 పూర్వపు నాటిదని చెప్పబడుతున్న ఈ ఆలయం మొదటి దశ నిర్మాణాన్ని కంపరాయలు 1353నాటికి పూర్తి చేశారు. రెండవ దశ నిర్మాణాలను హరిహర రాయలు 1386 నుండి 1418 మధ్య కాలంలో పూర్త్తి చేశారు. అదేవిధంగా 3వ దశ నిర్మాణాలను శ్రీకృష్ణదేవరాయలు 1509నుండి 1529 సంవత్సరాల మధ్య కాలంలో పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ దర్శనానికి హాజరయ్యే భక్తాదులు ముందుగా ఎంతో ఎత్తుగా వుండి సుందర శిల్పాలతో నిర్మింపబడిన గాలిగోపురాలను దర్శించుకుంటారు. తర్వాత ప్రధాన ఆలయ ప్రాంగణంలోని కుడివైపు భాగాన కోదండరామాలయం వుంది. ఆ ఆలయంలోని సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న భక్తులు నాగుల కట్టవద్దకు చేరుకుంటారు. నాగుల కట్టను దర్శించి పూజలు నిర్వహిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణం ఎడమవైపు భాగంలో గోవిందరాజుల స్వామివారి ఆలయం వుంది. ఆ ఆలయంలో గోవిందరాజుల దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్త్భివంతో పులకిస్తారు. అనంతరం కదిరి క్షేత్ర పాలకుడిగా వెలుగొందుతున్న శ్రీ చెన్నకేశవస్వామిని దర్శించుకుంటారు. ఆ పిమ్మట నరసింహస్వామి దర్శనార్థమై ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోని ప్రహ్లాద వరద లక్ష్మినరసింహస్వామి వారి దివ్యమంగళ మూర్తిని దర్శించుకున్న భక్తాదులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ముఖ్యంగా కదిరి నారసింహుడు స్వయంభూగా వెలిసాడని కథనం. ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేసినప్పుడు విగ్రహానికి స్వేదం పట్టడమే ఇందుకు నిదర్శనమని అర్చకులంటారు. కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదంటూ భక్తాదులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ప్రతి ఏటా ఈ ఆలయంలొ నృసింహజయంతిన వైశాఖ శుద్ధ చతుర్ధశీన మల్లెపూల తిరునాళ్ళను, శుద్ధ పౌర్ణిమ రోజున చింతపూల తిరుణాళ్ళను, ఆషాఢ పౌర్ణమిన ఉట్ల తిరుణాళ్ళను, శ్రావణ బహుళ నవమిన దసరా వేడుకలను జరుపుతారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ ఉత్తర గోపుర ద్వారాన్ని తెరవడం జరుగుతుంది. ఇది కేవలం ఏడాదికి ఒక్కసారి వైకుంఠ ఏకాదశి రోజునే తెరవడంతో ఆ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తాదులు విశ్వసిస్తారు.
అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు..
శ్రీ అమృతవల్లీ సమేత ఖాద్రి నరసింహస్వామి వారికి ఏటా జరిపే బ్రహ్మోత్సవాలు అనబడే కళ్యాణోత్సవాలు ఎంతో విశిష్టమైనవి. ఫాల్గుణ శుద్ధ అష్టమినాడు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అదేరోజు సాయంత్రం వేళ అంకురార్పణ జరిగి మట్టిని సంగ్రహించడం జరుగుతుంది. దీనిని మత్స్య గ్రహణం అని అంటారు. నవమినాడు పగలు, ఉదయం నుండి వివిధ అహ్నిక క్రియలు ప్రారంభం అవుతాయి. యాగశాలలో ఉదయం పుణ్యాహవచనం జరిపి, వాస్తు ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, గరుడ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. గరుత్మంతుని ప్రీతిగా గరుడాంగ హోమాలను నిర్వహిస్తారు. రంగమండపంలో పంచగవ్యప్రాశన, భేరీ పూజ, ధిక్తాళతాపనము జరుపుతారు. బలిహరణము చేస్తారు. ఆ పిదప ఎనిమిది దుక్కులకు చెందిన వైదిక సూక్తములతో దిక్కులనారాధించి గద్యపఠనము చేస్తారు. శ్రీ స్వామివారికి గజారోహణోత్సవము నిర్వహిస్తారు. కళ్యాణము రాత్రివేళ నిర్వహిస్తారు. వాటితోపాటు అక్షతారోపణము చేసి నివేదనలు జరుపబడుతాయి. ఆ పిదప ఆస్థానాన్ని నిర్వహించి యాగశాలలో నవకుంభారాధనను జరుపుతారు. రెండవరోజంతా కళ్యాణానికి ముందు పనులు.
మూడవరోజున స్వామివారికి మండపోత్సవం నిర్వహించి విశేషమైన అలంకారములు చేసి రాత్రి హంస వాహనం మీద తిరువీధులలో ఊరేగింపు జరుపుతారు. మూడవరోజు మొదలుకుని వివిధ వాహన సేవలు కళ్యాణోత్సవాలలో నిర్వహిస్తారు.
నాలుగవరోజున స్వామివారిని తిరువీధులలో సింహవాహనం మీద ఊరేగిస్తారు. ఐదవరోజున హనుమంత సేవ నిర్వహిస్తారు. ఇదే రోజున ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఆరోజు స్వామి వారి భక్తాదులు ఉపవాసాలతో స్వామివారిని స్మరించుకుంటారు. ఆరవరోజున బ్రహ్మ గరుడ సేవ నిర్వహిస్తారు. ముల్లోకాలలోని దేవతలకు ప్రతినిధిగా బ్రహ్మయే ఆద్యుడయిన శ్రీ స్వామి వారికి ఈ సేవ నిర్వహిస్తాడని సంకేతం, అదే బ్రహ్మ గరుడ సేవ ప్రత్యేకత.
ఏడవరోజున శేషవాహన సేవ. ఎనిమిదవరోజున పగలు సూర్యప్రభ వాహనసేవ. రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. తొమ్మిదవరోజున మోహినీ అలంకారము చేసి పదవరోజున ప్రజా గరుడ సేవ కొనసాగిస్తారు. పదకొండవరోజున గజవాహన సేవ చేస్తారు.
పనె్నండవ రోజున అత్యంత ప్రధాన ఘట్టమైనది బ్రహ్మ రథోత్సవ సేవ (తేరు) అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముందుగా బ్రహ్మ రథాన్ని అత్యంత సుందరంగా అలంకరించి వేదపండితులు బలిహరణ చేస్తారు. కుటాగుళ్ళ, మూర్తిపల్లి, గజ్జలరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్థులు తొలుత బ్రహ్మరథాన్ని లాగడం జరుగుతుంది. కదిరి సాంస్కృతిక వైభవానికి ప్రతీక బ్రహ్మరథంగా చెప్పుకోవచ్చు. ఈరథానికి 130 సంవత్సరాల చరిత్ర వుంది. తమిళనాడులోని ఆండాళ్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతి పెద్ద రథం కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిదేనని చెప్తారు. ఈ బ్రహ్మరథోత్సవాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుండి అశేషంగా భక్తులు హాజరై బ్రహ్మ రథాన్ని తిలకిస్తారు. బ్రహ్మరథం తిరువీధులలో తిరుగాడే సమయంలో లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో భక్తిపారవశ్యం నిండుకుంటుంది. భక్తాదులు మిరియాలు, సువాసనలు వెదజల్లే ధవణం తేరుపైన చల్లుతూ మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతంగా లక్షల మంది భక్తులు తరలిరావడం విశేషం.
పదమూడవరోజున స్వామివారి అలుకోత్సవము, అశ్వవాహనము, పదునాలుగవరోజున తీర్థవాది, పదిహేనవరోజున ద్వాదశారాధన, దేవతా ఉద్వాసన, పుష్పయాగోత్సవాలు నిర్వహించి ఆ సాయంత్రం బ్రహ్మోత్సవాలు పూర్తీ చేస్తారు. అదేరోజున పగలు మహా సంప్రోక్షణ, వాస్తుహోమం నిర్వహించి కళారోపణ, అక్షతారోపణ చేసి ప్రభూతబలిని నివేదించి శ్రీ స్వామివారిని వివాహానికి ముందుస్థితిలో వుంచుతారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తాదులు కదిరి కుంకుమను తప్పకుండా ఇళ్ళకు తీసుకెళ్తారు. ఈ కుంకుమ పసుపుతో తయారు చేస్తారని ఖాద్రి క్షేత్రంలోని కుంకుమ ఎంతో పవిత్రమైనదిగా భక్తాదులు నమ్ముతారు. అదేవిధంగా కదిరి మల్లెలు సువాసనల గుభాళింపులను వెదజల్లుతుంటాయి. కదిరి మల్లెల్లో నుంచి వచ్చే సువాసన ఎక్కడ కూడా వుండదని కదిరి మల్లెల కోసం మహిళలకు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
ఖాద్రీ క్షేత్రంలోని తీర్థములు ..
పూర్వం కదిరి కొండ వద్ద నుంచి ప్రవహించే వేర్వేరు సెలయేళ్ళు వివిధ తీర్థాలుగా రూపాంతరం చెంది తపస్వులకు కేంద్రాలుగా వుండేవని పురాణాల కథనం. ఆలయానికి తూర్పున శే్వత పుష్కరిణి, పశ్చిమమున భృగు తీర్థము (కోనేరు), ఉత్తరమున శ్రీ తీర్థము, ఆగ్నేయ దిశలో గంగాతీర్థము, నై ఋతీ దిశలో అర్జున తీర్థము, మందిరం పక్కనే భవనాశినీ తీర్థము కలవు.
శే్వత పుష్కరణీ తీర్థమందు పంచభక్ష్య పరమాన్నములతో బ్రాహ్మణోత్తముడికి ఆహారము సేవింపజేస్తే వెయ్యి మంది బ్రాహ్మణులకు అన్నదానము చేసిన పుణ్యము పొందుతారని పూర్వీకుల కథనం.
భృగుతీర్థము (కోనేరు) నందరు స్నానము చేసి పితృతర్పణము, తిలోదక దానము చేయుట, మృతి చెందిన వారి ప్రేత కార్యములు చేయుట మంచిదని ప్రతీక. ఇక్కడ ఒకసారి చారెడు నువ్వులు దానం చేస్తే ఒక పెద్ద పర్వతమంత నువ్వులను దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందంటారు. అదేవిధంగా ఒక గోదానము చేస్తే వెయ్యి గోవులు దానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్తారు.
శ్రీ తీర్థములో స్నానము చేసి శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తే సంతానము లేనివారికి సత్పుతృడు జన్మించడంతో పాటు సకల సంపదలు లభిస్తాయంటారు.
గంగా తీర్థమందు స్నానమాచరిస్తే సంతతి లేనివారికి సంతాన ప్రాప్తి, రోగ గ్రస్థుల రోగములు నయం కావడం, కుష్టు రోగుల కుష్టుపోవును, గురుడుని అనుగ్రహముతో వైష్ణవత్వము పొందగలరు. ఇక్కడ దశదానములు చేస్తే కోటి యజ్ఞములు చేసిన ఫలితము పొందగలరు.
అర్జున తీర్థమునందు విధ్యుక్తముగా స్నానమాచరించి నరంహుని సేవించువారికి మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఇక్కడ అనుమాత్రము దానం చేసిన కూడా అనంతమైన ఫలితాలు గోచరిస్తాయి. సాంగముగా పొందిన మంత్రాలను ఇక్కడ జపిస్తే మంత్ర సిద్ధి చేకూరుతుంది.
భవనాశినీ తీర్థమునందు స్నానము చేసినచో మోక్షము పొందుటకు ఆటంక ప్రాయములైన అన్ని పాపములు నశించి ఆ బ్రహ్మ కూడా పొందలేని పరమపదము లభించును.
బ్రహ్మాండ పురాణములలో చెప్పిన ఈ ఆరు తీర్ధాలే కాక ప్రస్తుతం తేరు గల ప్రాంతంలో కుంతీ తీర్థము, గజ్జెలరెడ్డిపల్లి వద్ద గల తుమ్మల రోడ్డులోని పుత్తమాను చెరువు వద్ద గరుడ తీర్థము, కదిరికి 9కిలోమీటర్ల దూరంలో వున్న ముత్యాల చెరువు వద్ద పాలబావి అని పిలువబడే క్షీరతీర్థము, దేవాలయ సమీపంలోనే గజేంద్ర తీర్థము అనబడే నాలుగు తీర్థాలు సూచించబడ్డాయి. గజేంద్ర తీర్థము అనే కొలను ప్రాంతం ప్రస్తుతం జనావాసాలలో కలసిపోయింది. ఇవే కాక యాగశాలకు తూర్పున స్వర్ణతీర్థము, పాకశాల వద్ద కూర్మతీర్థము, వేయి కాళ్ళ మండపం వద్ద అల్వారుల తీర్థము, కదిరికి ఉత్తరాన సైదాపురం వద్ద నాగుల తీర్థము అనేవి వుండేవి. ఈ తీర్థాలలో పురాణ ప్రసిద్ధమైనవి ఆరు కాగా గరుడ తీర్థం పేరుతో పిలువబడే గంగాతీర్థం, భవనాశినీ, భృగు (కోనేరు) తీర్థం అనేవి మాత్రం ప్రస్తుతం మిగిలు వున్నాయి. వేద ప్రోక్త్ధ్వనితో, స్తోత్రాలతో ప్రతిధ్వనించిన ఈ కొండపై ఈ క్షేత్రంలో వెలసిన మూర్తిని వైశాఖ మాసమందు స్వాతీ నక్షత్రములో భరద్వాజన గోత్రములో జన్మించిన శ్రీ ఖాద్రీ నరసింహస్వామి అని, వసంత వల్లభుడని, వారి ఉత్సవ మూర్తులను భోగ నరసింహమూర్తి అని, ప్రస్తుతం పూజింపబడుతున్న అమ్మవారిని అమృతవల్లీ తాయార్‌గా పిలువబడుతోంది.
అనంతపురం జిల్లా కదిరిలోని ఈ దివ్య క్షేత్రాన్ని తిలకించడానికి వచ్చే భక్తాదులు కదిరికి 25 కిలోమీటర్ల దూరంలో వున్న 1100 ఊడలతో ఏడున్నర ఎకరములలో విస్తరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన తిమ్మమ్మ మర్రిమాను, కదిరికి 12 కిలోమీటర్ల దూరంలో వున్న కటారుపల్లిలోని యోగివేమన మహా సమాధిని దర్శించుకునే అవకాశం వుంది.
ఈ నెలలో జరిగే ఖాద్రి లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవముల వివరములు...
15-03-2019 బ్రహ్మోత్సవములకు అంకురార్పణ.
16-03-2019 శ్రీ ఖాద్రి కళ్యాణోత్సవము
17-03-2019 హంస వాహనము
18-03-2019 సింహవాహనము
19-03-2019 హనుమంత వాహనము
20-03-2019 బ్రహ్మ గరుడ సేవ
21-03-2019 శేష వాహనము
22-03-2019 పగలు సూర్యచంద్ర ప్రభ, రాత్రి చంద్ర ప్రభ
23-03-209 మోహినీ ఉత్సవము
24-03-2019 ప్రజాగరుడ సేవ
25-03-2019 గజవాహనము
26-03-2019 బ్రహ్మరథోత్సవము (తేరు)
27-03-2019 అలుకోత్సవము, అశ్వవాహనము
28-03-2019 తీర్థవాది
29-03-2019 ద్వాదశారాధన, దేవత ఉద్వాసన పుష్పయాగము
10-04-2019 వసంతోత్సవము, 16రోజుల పండుగ
సింధూద్భూతాం శ్రీదాం లక్ష్మీం పద్మాం భద్రామాద్యాం పూజ్యామ్ భాగ్యోపేతాం శ్రేయోదాత్రీం వందే నిత్యం ఖాద్రీ వాసామ్.
నమస్తే నమస్తే నమో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహా నమో..నమో..

-నల్లమాడ బాబ్‌జాన్ 8500083799