మెయన్ ఫీచర్

ఇది ‘విశ్వశ్రేయస్సు దినం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ స్వరూప స్వభావాలను, నిచ్చెనమెట్ల కుల సమాజ స్థితిగతులను, ప్రజల ఆకాంక్షలను డా.అంబేద్కర్ అర్థం చేసుకున్నట్టుగా మరే తాత్త్వికుడు అర్థం చేసుకోలేదు. బుద్ధుని ధర్మం, సత్యం, అహింస మార్గావలంబియైన అంబేద్కర్ ఈ దేశ మూల జాతులనుంచి వచ్చిన అసలైన ‘్భరతరత్న’. బుద్ధుని ప్రేమమయ సిద్ధాంతాన్ని జీర్ణించుకొని, మహాత్మ జ్యోతిబా ఫూలేను గురువుగా భావించి దేశం కోసం తనను తాను అంకితం చేసుకున్న అపర బోధిసత్వుడు. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరొందిన భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా, మూలజాతుల విముక్తికోసం అపారమైన జ్ఞాన సంపాదనను అందించిన మేధావి. దేశ సమస్యల పరిష్కారానికి ఏ విప్లవాలూ, రక్తపాతమూ అక్కర్లేదు. అంబేద్కరిజాన్ని నూటికినూరుపాళ్ళు పాటిస్తే సరిపోతుంది. ఈ దేశానికి మాత్రమేకాదు, ప్రపంచవ్యాప్త సమస్యలన్నింటికీ పరిష్కారాలు బౌద్ధంలో, అంబేద్కరిజంలో ఉన్నాయి. అందువల్ల దేశమంటే అంబేద్కరుడే, విశ్వమంటే బుద్ధుడే అనేది వాస్తవం. బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు ఇంకెవరో కావాలని వాదించేవాళ్ళు బోధిసత్వుడు, అపర బోధిసత్వుడు చాలనే విషయాన్ని గమనిస్తే మంచిది. అందుకే ప్రపంచమంతా ఈ దుఃఖపూరిత, హింసామయ, అసంతృప్త, ఒత్తిళ్లమయమైన సమాజంలో బుద్ధుని గురించి ఆలోచిస్తుంది. ప్రపంచంలోని మూడవవంతు జనాభా బౌద్ధ్ధర్మాన్ని జీవనమార్గంగా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ప్రపంచ ప్రజలిప్పుడు అంబేద్కర్‌ను కేవలం భారతీయ మూల జాతుల, బహుజనుల నాయకుడిగా భావించడం లేదు. విశ్వస్థాయి నాయకుడిగా భావిస్తుంది. అందుకే ఐక్యరాజ్యసమితి అంబేద్కర్ జన్మదినాన్ని విశ్వశ్రేయస్సు, విశ్వవిజ్ఞాన దినంగా ప్రకటించింది. ప్రపంచంలోని ఏ నాయకునికీ లభించని అపూర్వ గౌరవమిది. ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ జయంతిని (ఏప్రిల్ 14) విశ్వశ్రేయస్సు దినంగా జరుపుకుంటాయి.
రోజురోజుకూ అంబేద్కర్ సిద్ధాంతాలు నిత్యనూతనమై విశ్వవ్యాప్త ఆదరణ పొందడానికి కారణం అందులో ఉన్న విశ్వజనీనత, మానవీయ కోణం. ఆర్థిక సామాజిక సమానత్వ భావం. ప్రజాస్వామిక దృక్పథం. ఆర్థిక సమానత్వాన్ని, సోషలిజాన్ని సాయుధ పోరాటం ద్వారా సాధించవచ్చని మార్క్స్ చెబితే, అంబేద్కర్ ఏమాత్రం రక్తపాతం లేకుండా సోషలిజం సాధించవచ్చని చెప్పాడు. అందుకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నాడు. భారతీయులందరికీ ఓటుహక్కు అనే ఆయుధాన్ని అందించాడు. దేశ ప్రజలందరికీ ఓటుహక్కును అంబేద్కర్ ప్రతిపాదించినప్పుడు అప్పటికి అగ్ర నాయకత్వ స్థానంలో ఉన్నవారంతా వ్యతిరేకించారు. ఆదాయపు పన్ను చెల్లించే స్థితిలోఉన్న సంపన్నులకు మాత్రమే ఓటుహక్కు ఇవ్వాలని గాంధీజీ అన్నాడు. ఓటు హక్కును పాలక కులాలుగా ఉన్న రాజకుటుంబాల వారికి మాత్రమే ఇవ్వాలని నెహ్రూ పేర్కొన్నాడు. సర్దార్ పటేల్ గ్రాడ్యుయేషన్ వరకు చదివినవారికి మాత్రమే ఓటుహక్కు ఇవ్వాలన్నాడు. ఈ ముగ్గురు నాయకులు చెప్పింది దాదాపు ఒక్కటే. అప్పట్లో ఆదాయపుపన్ను చెల్లించే స్థితిలో ఉన్నవారు, రాజకుటుంబీకులు, గ్రాడ్యుయేషన్ వరకు చదివినవారు 99% అగ్రవర్ణాలవారే. బహుజనుల్లో ఈ స్థాయివాళ్ళు దాదాపు శూన్యం. అంటే ఆ ముగ్గురు నాయకులూ ఈ దేశ బహుజనులందరికీ ఓటుహక్కును నిరాకరించాలనే చూశారు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ 21 సంవత్సరాల వయసున్న భారతీయులందరికీ ఓటుహక్కు ఇవ్వాలని వాదించి నెగ్గాడు. ఇలా భారతీయులందరికీ తమను ఏలేవారిని ఎన్నుకునే హక్కును కల్పించింది అంబేద్కర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో నీగ్రోలకు, నల్లవారికి ఓటుహక్కును అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత 1964లో కల్పించారు. అంబేద్కర్ చలువవల్ల భారతదేశంలో అమెరికా నల్లజాతి నీగ్రోలకంటే కూడా హీనస్థితిలో ఉన్న అంటరాని కులాలకు కూడా ఓటుహక్కు ముప్పై ఏళ్ళముందే కల్పించబడింది. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కనేది ఆర్థిక, సామాజిక, జాతి, వర్ణ వివక్షలకు అతీతంగా ఉండాలని గుర్తించిన మొట్టమొదటి మేధావి అంబేద్కర్.
అంబేద్కర్ సిద్ధాంతాలకు, రచనలకు ప్రాసంగికత రోజురోజుకూ పెరగడానికి, అతన్ని విశ్వశ్రేయస్సునుకోరే విశ్వమానవుడిగా నిలబెట్టడానికి కారణం అందులో ఉన్న విశ్వజనీన భావాలు. సార్వకాలీన భావజాలం. ఓటు హక్కును కలిగించడం అందులో ఓ ముఖ్యమైన అంశం. అంబేద్కర్ సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనదిగా చెప్పబడేది సామాజిక సమానత్వం. ఇది కులాల కుంపట్లున్న ఒక్క మన దేశానికే పరిమితమైంది కాదు. విదేశాల్లో కులాలు లేకున్నా జాతి వివక్ష ఉంది. నలుపు, తెలుపు తేడాలున్నాయి. ఇవి భారతదేశంలోని ‘అంటరానితనం’ అంత తీవ్రమైనవి కాకున్నా దుర్మార్గమైనవే. మానవజాతి పుట్టుకే ఆఫ్రికాలో ఏడు లక్షల ఏళ్లక్రితం నలుపు వర్ణంతో ప్రారంభమైందని సైన్సు చెబుతోంది. ఆ నలుపు మూలజాతి ప్రజలను శే్వత జాతీయులు ‘నీగ్రోలు’గా తీసుకొచ్చి బానిసలను చేసారు. అమానవీయ వేదనకు, పీడనకు గురిచేసారు. అమెరికా ప్రజాస్వామ్య దేశమైన తర్వాత కూడా జాతి వివక్ష కొనసాగింది. మార్టిన్ లూథర్‌కింగ్ లాంటివాళ్ళు అందుకు వ్యతిరేకంగా పోరాడారు. నల్లజాతుల పక్షం వహించాడని అమెరికా అధ్యక్షుడు లింకన్‌ను హత్యచేసారు. యూరోప్ ఖండంలో పుట్టిన మార్క్స్‌లాంటి ప్రపంచ మేధావులు సామాజిక వివక్షకు ప్రాధాన్యమివ్వలేదు. అంబేద్కర్ అటు సామాజిక సమానత్వానికి, స్టేట్ సోషలిజం ద్వారా ఆర్థిక సమానత్వానికి ప్రాధాన్యతిచ్చాడు. అంబేద్కర్‌లా ఏ విదేశీ తాత్వికుడైనా జాతి వివక్షకు, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చివుంటే ప్రపంచానికే తొలి మానవున్ని ప్రసాదించిన ఆఫ్రికా చీకటి ఖండంగా పేర్కొన్నబడేది కాదేమో. విదేశాల్లో సామాజిక సమానత్వ పోరాటాలు అంతగా జరుగలేదు కాబట్టే సామ్రాజ్యవాదం పెల్లుబికింది.
అంబేద్కర్ సామాజిక సమానత్వ సిద్ధాంతం ప్రపంచమంతటా ప్రాసంగికత కలిగివుంది. మార్క్స్ భారతదేశంలో పుట్టివుంటే అంబేద్కర్‌లా సామాజిక సమానత్వానికి, అంబేద్కర్ యూరప్‌లో పుట్టివుంటే మార్క్స్‌లా ఆర్థిక సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చేవాడని అనేవాళ్లూన్నారు. అంబేద్కర్ భారతదేశంలో పుట్టినా సామాజిక ఆర్థిక సమానత్వాలను కోరుకున్నాడు. కేవలం ఆర్థికానికో, సామాజికానికో పరిమితం కాలేదు. దేశంలోని అతిశూద్రులు నీగ్రోజాతి బానిసలకంటే ఘోరమైన వివక్షను, జీవితాన్ని అనుభవిస్తున్న వారన్న స్పృహ అంబేద్కర్‌కుంది. నీగ్రో బానిసల దుర్భర జీవితం దాదాపు రెండువందలేండ్లు కొనసాగింది. భారతీయ అతిశూద్రుల బానిసత్వం కుల విభజన జరిగిన మూడు వేల ఏళ్ల నుంచి కొనసాగింది. ఈ అమానవీయ వివక్షను స్వయంగా అనుభవించినవాడు అంబేద్కర్. అందుకోసం దళితులకు ప్రత్యేక గ్రామాలను కోరాడు. ప్రత్యేక నియోజకవర్గాలను కోరాడు. అలా అయితే తమవాళ్ళు ఆ గ్రామాలకు, ప్రాంతాలకైనా పాలకులుగా మారే అవకాశముంది. దళితులను ఎలాగూ ఊరవతలే ఉంచుతున్నారు. ప్రత్యేక గ్రామాలు, నియోజకవర్గాలిస్తే నష్టమేంటి?
కానీ గాంధీజీ సహా అగ్రవర్ణ నాయకులెవరూ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే వాళ్ళపై అగ్రవర్ణాల పట్టుపోతుంది. అలాఅయితే తమకు సేవలు చేసేదెవరు? ఈ నేపథ్యంలో అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాలను సాధించలేకపోయాడు. రిజర్వేషన్లను మాత్రం సాధించగలిగాడు. రాజకీయ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడంవల్ల ఈమాత్రంగానైనా ఈ కులాలనుంచి నాయకులుగా ఎదిగారు. చదువుకోగలిగారు. కొంతమందయినా ఉన్నత స్థితిలోకి రాగలిగారు. బి.సిలకూ రిజర్వేషన్లు కావాలని కోరుకున్నా అగ్రవర్ణ నాయకత్వం సాగనీయలేదు. వేల కులాలుగా విభజింపబడియున్న బహుజనులను ఇలాగైనా కలిసుంటారని ఎస్సీ, ఎస్టీ, బి,సి మైనారిటీలుగా ఐక్యం చేసాడు. కానీ రిజర్వేషన్లు అనుభవిస్తున్న దళితులు కనీసంగా తమ జాతికైనా ఉపయోగపడకుండా అగ్రవర్ణ పార్టీలకు చెంచాలుగా మారి తమ కుటుంబానికి తమ పిల్లల భవిష్యత్తుకే పరిమితం కావడాన్ని చూసి దుఃఖించాడు. రాజ్యాంగంలో ఎన్ని అవకాశాలు కల్పించినా పాలన ‘త్రివర్ణాల’ చేతుల్లోకే పోవడంవల్ల అందాల్సిన ఫలితాలు అందడంలేదని వివరించాడు. అందుకు కారణమైన కుల వ్యవస్థను నిర్మూలించాలన్నాడు. కుల వ్యవస్థకు మూలమైన మతాన్ని వదిలి మతవాసనలు లేని బౌద్ధాన్ని ఆశ్రయించాడు. దేశాన్ని బుద్ధ్భూమిగామార్చితే కులాలు, తద్వారా ఏర్పడిన వ్యత్యాసాలు పోతాయని భావించాడు కానీ ఆరు లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత అంబేద్కర్ ఎక్కువకాలం బతకలేదు.
అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడానికి ఇప్పటికీ ప్రాసంగికత ఉందని ప్రపంచమంతా బౌద్ధంలోని మానవీయ కోణం దిక్కు చూడటాన్నిబట్టి అర్థమవుతుంది.
మూలజాతుల రాజ్యాంగాన్ని సాధించడమే అంబేద్కరిజం అంతిమ ధ్యేయం.
‘త్రివర్ణాల’ అధికారం బహుజనుల అధికారం కాదు. ‘త్రివర్ణాల’ అభివృద్ధి బహుజనుల అభివృద్ధికాదు. రాజ్యాధికారంలోకి రాని జాతి నశంచిపోతుంది అని స్పష్టంగానే చెప్పాడు అంబేద్కర్.
భారతదేశంలో త్రివర్ణాల అధికారం కింద నలిగిపోతున్న బహుజనుల్లాగే, పాశ్చాత్య దేశాల్లో శే్వతజాతీయుల సామ్రాజ్యవాద పదఘట్టనల కింద నల్లజాతివారు, ప్రపంచ మూలజాతులు నలిగిపోతున్నాయి. అయినప్పటికీ ఆధునిక నాగరికతను, ప్రజాస్వామ్యాన్ని ముందుగా అందుకున్న పాశ్చాత్యులు అంబేద్కర్ సిద్ధాంతాల్లోని విశ్వ శ్రేయస్సును గుర్తించారు. కాని ఈ దేశ రాజకీయ నాయకులు పైకి అంబేద్కర్ మంత్రం జపిస్తూ విగ్రహాలు కట్టి మభ్యపెడుతూ మనువర్ణ రాజకీయాలనే ప్రమోట్ చేస్తున్నారు. ఒకే ఒక్కడు కాన్షీరాం మాత్రం అంబేద్కర్ రాజకీయాభిప్రాయాలకు ప్రయోగాత్మకత కల్పించిన మహానాయకుడు. అంబేద్కర్ ప్రసక్తిలేకుండా, అంబేద్కరిజం ఆచరించకుండా ఏ పార్టీకి భారతదేశంలో మనుగడ లేదని ఈ ‘విశ్వశ్రేయస్సు’ దిన సందర్భంగా అందరూ గుర్తించాల్సిన అవసరముంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అంబేద్కరిజమంటే మూలజాతులకు రాజ్యాధికారమే. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాసంగికత ఉంది. అందుకే అంబేద్కర్ జన్మదినం ‘విశ్వశ్రేయస్సు దినంగా’ ప్రాచుర్యం పొందింది.

-డా. కాలువ మల్లయ్య 91829 18567