మెయన్ ఫీచర్

‘సమాఖ్య’ ముసుగులో వేర్పాటు వాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి ‘ఇండియన్ యూ నియన్’గా వ్యవహరిస్తున్నారు. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైనట్టు భారత్‌ను కూడా కొన్ని దేశాలుగా విడదీయాలని చైనా, పాకిస్తాన్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యూహంలో కాంగ్రెస్‌తోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు చిక్కుకున్నాయి. ‘ఫెడరల్ స్ఫూర్తికి భంగం- కాంగ్రెస్ పెత్తనం కుదరదు’ అనే నినాదం కొందరు ముఖ్యమంత్రుల నుండి వినబడడానికి ఇదే కారణం.
కేరళలో కమ్యూనిస్టులు బలంగా ఉండడానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. మధ్యయుగాలలో సముద్ర మార్గం నుండి విదేశీ ముస్లిం వ్యాపారులు కేరళకు వచ్చి స్థిరపడ్డారు. క్రైస్తవ మతప్రచారకులు ఈ రాష్ట్రానికి వలస వచ్చారు. దీంతో కేరళలో ముస్లిం, క్రైస్తవ జనసంఖ్య గణనీయంగా ఉంది. పారిశ్రామికీకరణలో భాగంగా ఫ్యాక్టరీలు రావడంతో ‘కార్మికులు- యజమానులు’ అనే కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రవేశించింది. కాలం మారినప్పటికీ కేరళలో కమ్యూనిస్టుల రక్తకాండ కొనసాగుతూనే ఉంది. ఈ వర్గాలు కేంద్రాన్ని ధిక్కరిస్తున్నాయి. బిషప్ కాల్డ్‌వెల్ ఉత్తరాది, దక్షిణాది అని దేశాన్ని విడదీశాడు. అలా ద్రవిడోద్యమం తమిళనాడులో ప్రవేశించింది.
1977లో దేశమంతా కాంగ్రెస్‌ను తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ విజయం సాధించింది. అలాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ స్వార్థం కోసం బలిపెట్టింది. ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ దాదాపు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. తెదేపా, తెరాస పార్టీలకు దేశ ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం. ప్రాంతీయవాదం ఒక ముసుగు మాత్రమే. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్రంపై ద్వేషం పెంచారు. ఉత్తరాది వేరు, దక్షిణాది వేరు అన్నారు. ఈ విభజన భావన అమెరికా, చైనా, బ్రిటన్, పాకిస్తాన్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. ఫెడరలిజం దేశ విచ్ఛిత్తికి కారణమైతే, భాషాప్రయుక్త రాష్ట్రాలను రద్దుచేసి జాతీయ సమైక్యతను కాపాడాల్సి ఉంది. ఈ దేశంలో ఉన్నది భారత జాతి మాత్రమే. కన్నడ జాతి, ద్రవిడ జాతి, తెలుగు జాతి, తెలంగాణ జాతి అంటూ వేర్వేరు జాతులు లేవు. భారత్‌లోని ముస్లింలను వేరే జాతిగా కాంగ్రెస్ మార్చింది.
* * *
‘ఇంటి కన్నా గుడి పదిలం’ అనే సామెత కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విషయంలో నిజమైంది. లాకర్లలో, బాత్‌రూముల్లో, సెల్లార్లలోనే కాదు.. ఓ శివాలయంలో ఆయన డబ్బు దాచినట్లు ఆదాయపుపన్ను శాఖ వారు గుర్తించి దాడి చేశారు. ఆ గుడికి కుమారస్వామి కుటుంబ సభ్యులే ధర్మకర్తలు. తమిళనాడులో డీఎంకే నేతల నుండి 135 కోట్ల నగదు, డ్రగ్స్, వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎన్నికల్లో వోటర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. వందల కోట్లు ఖర్చు చేసి ఎంపీ అయినవాడు వేయి కోట్లయినా సంపాదించుకోకుండా ఎలా ఊరుకుంటాడు? అందుకే ధనవంతులు మాత్రమే పార్లమెంటుకు పోటీ చేయగలుగుతున్నారు. కర్నాటకలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సహా ఆయన కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు పోటీ చేస్తున్నారు. ఇదేనా ‘జనతాదళ్ సెక్యులర్’ అని ప్రజలే కాదు, కుమారస్వామి మిత్రులైన కాంగ్రెస్ వారు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇక, వెల్లూరు (తమిళనాడు)లో డీఎంకే వారు తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు.
* * *
బంగ్లాదేశ్ నుంచి ‘సాంస్కృతిక బృందాల పేరు’తో బెంగాల్‌కి వచ్చినవారు తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాణిజ్య వీసాలతో ప్రవేశించినవారు భాజపాకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చింది.
ఇది దేశద్రోహం కిందికి వస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదార్లకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధార్‌కార్డులు ఇచ్చి ఓటర్లుగా నమోదు చేయించింది. అస్సాంలో లక్షల సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు చొరబడ్డారు. మన హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న రోహింగ్యాల సంఖ్య ఎంతో తెలంగాణ ప్రభుత్వం తెలుసుకోగలిగిందా?
* * *
కుటుంబ రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లోనూ జోరుగా ఉన్నాయి. కేరళలో కరుణాకరన్ కుమారుడు మురళీధరన్, కర్ణాటకలో దేవెగౌడ కుమారులు కుమారస్వామి, రేవణ్ణలు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ తనయుడు జగన్, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు , ఒడిశాలో బిజూ పట్నాయక్ తనయుడు నవీన్ పట్నాయక్, ఛత్తీస్‌గఢ్‌లో రమణిసింగ్ కొడుకు అభిషేక్ సింగ్, మహారాష్టల్రో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, యూపీలో ములాయం కొడుకు, కోడలు, తమిళనాడులో కరుణానిధి కుటుంబ సభ్యులు.. ఇలా అనేక రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు వర్ధిల్లుతున్నాయి. ముఖ్యమంత్రుల కొడుకులు, కూతుళ్ళు డబ్బు పంచి ఓట్లు కొనడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా?
* * *
సామాజిక స్పృహ అంటే మన చుట్టూ ఉన్న సమాజంలోని కష్టసుఖాలకు స్పందించడం. ఛత్తీస్‌గఢ్‌లో బీం మాండవీ అనే ప్రజాప్రతినిధిని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు కిరాతకంగా చంపారు. అయితే- సామాజిక స్పృహగల ఒక్క రచయిత కూడా ఒక్క గేయం కూడా ఎందుకు రాయలేదు? తాజాగా శ్రీలంకలో ఉగ్రవాదులు 250 మంది క్రైస్తవులను చర్చిలలో, హోటళ్లలో చంపారు. అయినా ఈ సామాజిక స్పృహ ఉద్యమకారులు స్పందించలేదు. కశ్మీరులో 45 మంది జవాన్లను, ఛత్తీస్‌గఢ్‌లో భారీగా సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు, మావోయిస్టులు హతమార్చినపుడు సామాజిక కార్యకర్తలు నోరు మెదపలేదు ఎందుకని? ఎందుకంటే ఈ ఉగ్రవాదులు వీరికి మిత్రులు కనుక. సామాజిక స్పృహ పేరుతో కొందరు అర్బన్ నక్సలైట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. హింసకు పాల్పడిన వారిపై ఉన్న స్పృహయే సామాజిక స్పృహ అని చైనా ఉగ్రవాదులు కొత్త నిర్వచనం చెప్పారు.
* * *
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ‘కంప్యూటర్’ స్వైరవిహారం చేసిందట! ప్రథమ సంవత్సరం టాపర్‌గా ఉన్న విద్యార్థి ద్వితీయ సంవత్సరంలో ఎలా ఫెయిల్ అయినాడు? అసలు పరీక్షకు రాని విద్యార్థి పాస్ అయినట్లు కంప్యూటర్ ఎలా చూపించింది? దాదాపు పది లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఇంటర్ బోర్డు చెలగాటమాడిందన్నది ఆరోపణ. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనలు మిన్నుముట్టాయి. వివిధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. కాంగ్రెస్ సహా మిగతా విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా రోడ్డెక్కి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయవలసిందే.. అందుకు ఆయన నిరాకరిస్తే మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాల్సిందే..’ అని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వారు డిమాండ్ చేశారు.
అనుభవం గల సంస్థను పక్కనపెట్టి ఏ ప్రయోజనాలు ఆశించి నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యతలు అప్పగించారు? అని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. విద్యా వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దు అని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాలు వినడం లేదు. ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. కార్పొరేట్ శక్తులు రెండు దశాబ్దాలుగా విద్యావ్యాపారం చేస్తున్నాయి. అందుకే ఆయా కళాశాలల హాస్టళ్లలో మానసిక ఒత్తిడికి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దారుణ పరిణామాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు నియంత్రించలేక పోయాయి. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థల నుండి ప్రభుత్వాల నిర్వాహకులకు భారీగా విరాళాలు అందుతున్నాయన్నది ఆరోపణ. అంతేకాదు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలే విద్యారంగాన్ని శాసిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం.
పరీక్షలలో ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవటం దురదృష్టకరం. అలా జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. పరీక్షలో ఫెయిల్ కాగానే తమ బిడ్డలను మందలించడం వల్ల వారు ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారు. విద్యారంగంలో అడ్మిషన్లు, ఫీజులు, పరీక్షలు, ర్యాంకులు మొదలైన అంశాలన్నీ విష వలయంగా మారాయి. 1970కి ముందు హైదరాబాద్‌లోని విద్యావ్యవస్థను క్రైస్తవ పాఠశాలలు శాసించేవి. వాటి స్థానంలో ఇప్పుడు కార్పొరేట్ కళాశాలలు వచ్చాయి. వాటిని నియంత్రించే శక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండాపోయింది. తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలకు ఇంటర్ పరీక్షల రూపంలో ఇపుడు ఒక సువర్ణావకాశం లభించింది. ఈ ఉద్యమాలు దేనికి దారితీస్తాయో తెలియదు.
తెలంగాణ, ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా విద్యావిధానం భ్రష్టుపట్టింది. జేఎన్‌యూ, అలీగఢ్,జాదవ్‌పూర్, హెచ్‌సీయూ, చెన్నై విశ్వవిద్యాలయం వంటి అనేక విద్యా ప్రాంగణాలు ఉగ్రవాదుల అడ్డాలుగా మారిపోయాయి. దీనిని పట్టించుకున్నవాడెవడు? వోట్ల రాజకీయం, పదవుల పంపకం, అధికార వైభోగాన్ని ప్రజాస్వామ్యం అని పిలుస్తున్నాము. దేశవ్యాప్తంగా మొత్తం విద్యావ్యవస్థను భారతీయం చేయవలసిన ఆవశ్యకతను ఈ ఉద్యమాలు సూచిస్తున్నాయి. చాలా విశ్వవిద్యాలయాల్లో దేశద్రోహులు వైస్ చాన్సలర్లుగా ఎలా నియమితులయ్యారో అధికారంలో ఉన్న నేతలు సమాధానం చెప్పాలి.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్