మెయిన్ ఫీచర్

సాహితీ శ్రద్ధ.. రామతీర్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమర్శ ఆకస్మికంగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కవిత్వం కల్లోలంలో కొట్టుమిట్టాడింది. అనువాదం కృంగిపోయింది. అలసిపోకుండానే అర్ధాంతరంగా ఆగిపోయిన అక్షరయోధుని శ్వాసను నిరసిస్తూ సాహిత్యమే తన వంతు నివాళి అర్పించడానికి విశాఖ ప్రయాణమైంది. చదవడం రాయడం తప్ప ఏమి చేయాలో తెలియనితనం కలాన్ని కాలానికి అప్పగించి హఠాత్తుగా ఆకాశంలో ఆవిరైపోయి సాహిత్య లోకంలో భూకంపం సృష్టించింది. వై.ఎస్.రాంబాబుగా జన్మించి రామతీర్థగా అవతరించిన ఆ అక్షర ప్రస్థానం అరవై ఏళ్ళు నిండకుండానే విశ్రమించాలని తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం. ఒడిశాలో ఖుర్దారోడ్ ప్రాంతంలో 1960 జూలై 17న పుట్టిన రాంబాబు తండ్రి డాక్ సేఫ్టీ ఉద్యోగి. అదే వరమైంది. వంగ, కళింగ భాషల్ని జన్మతహా అబ్బించుకున్నాడు. అందుకే ఒడియా ఫకీర్ మోహన్ సేనాపతి అంటే అమితమైన ప్రేమ. ఒడియా సాహిత్యం ప్రస్తావన వచ్చినా, బాల్య స్నేహితులు కలిసిన చాలు పులకించిపోయి ఒడియాలో కవిత్వం వల్లిస్తాడు. బెంగాలీ సాహిత్య ప్రస్తావన వస్తే బిద్రోహి కవినో టాగోర్‌నో గుర్తుచేస్తాడు. 1921లో కాజి నజ్రుల్ ఇస్లాం రాసిన బెంగాలీ కవితని బెంగాలీ యాసలో హావభావాలతో పాడేస్తాడు. బెంగాలీయులకు రవీంద్రనాథ్ టాగోర్ అన్న తమ సాహిత్యం అన్నా ఎంతో గౌరవం. మన ఆంధ్రులు కూడా అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవులను గౌరవించాలని అభిలషిస్తాడు. తన జీవితంలోని అన్ని దారుల్నీ మూసేసుకుని ఒక్క సాహిత్య ద్వారాన్ని మాత్రం తెరచి ఆ గవాక్షంలోంచి ప్రపంచ సాహిత్యాన్ని వీక్షించాడు. ఉభయాంధ్ర రాష్ట్రాల్లో సాహిత్యాన్ని తన చిరునామాగా చేసుకుని ఎక్కడ ఏ వేదిక దొరికినా నిర్మొహమాటంగా తనదైన గొంతును వినిపించేవాడు.
కవిత్వం, కథా రచన, అనువాదమూ, గేయ రచన, రేడియో రూపక రచన, నిర్మాణం, నాటికలు, సాహిత్య విమర్శ, పరిశోధన, పత్రికా సంపాదకత్వం, సమకాలీన జాతీయ / ప్రపంచ సాహిత్య విషయంగా శక్తివంతమైన ప్రసంగాలు, తెలుగు ఇంకా ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన, సమాంతరంగా ప్రాచీన ఆధునిక ధోరణుల్లో సామాజిక నిష్ట, భాషా చరిత్రలో పరిపూర్ణ సదవగాహన... వెరసి రామతీర్థ. ఆధునిక సాహితీ సమాజంలో మనుగడలోనున్న అన్ని సాహిత్య ప్రక్రియలను అలవోకగా ఒక్క రామతీర్థలోనే మనం చూడగలం అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ప్రక్రియలోనూ నిత్య నవీనతను తన బాణీగా చేసుకుని సాహిత్యమే సమాజం అనే సజీవ బంధాన్ని నిరంతరం కొనసాగిస్తున్న భాషా మాంత్రికుడు రామతీర్థ. వక్తగా ఏకధాటిగా సాగే అయన ప్రసంగం వింటే శ్రోతలు చేష్టలుడిగి పోవాల్సిందే. దీనికి ఎందరో సాక్షులు మనకు నిత్యం కనపడుతూ ఉంటారు. సామాన్యంగా ఎంతో నిబ్బరంగా హుందాగా ప్రశాంతంగా కనిపించే ఇతడు సాహిత్య విమర్శకుడిగా ఉగ్రరూపుడైపోతాడు. విమర్శను విమర్శగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకునేవారందరూ అతడికి శత్రువులుగా మారిపోతారు. తన విమర్శను తట్టుకోలేనివారెందరో శత్రువులుగా మారిపోయారు.
తెలుగునుండి ఆంగ్లంలోనికి, ఆంగ్లంనుండి తెలుగులోకి వందమందికి పైగా కవుల కథకుల రచనలను ఉభయ భాషలలోనికి అనువదించడం బహుశా రామతీర్థకు మాత్రమే సాధ్యం. దాదాపు మూడు వందలకు పైగా ముద్రితమైన సాహిత్య విమర్శ, విశే్లషణ పరిచయ వ్యాసాలు ఆయన సొంతం. జనగణమన గీతానికి నూరేళ్లను పురస్కరించుకుని ‘నూరేళ్ల జనగణమన’ అంటూ జాతీయ గీతానికి శతవత్సరోత్సవాన్ని జరిపి అదే పేరుతో పుస్తకాన్ని ప్రచురించిన జాతీయవాది. అందులో మనకు చాలామందికి తెలియని జాతీయగీతం పూర్తి గీతాన్ని, అలాగే టాగోర్ 1905 యువకుడిగా ఉద్వేగభరితంగా రాసిన ‘అమార్ సోనార్ బాంగ్ల...’ గీతాన్ని ‘నా బంగారు బెంగాలు సీమ, నీకేనమ్మా నా ప్రేమ’ అంటూ అనువాద గీతాన్నీ అందించారు. జనగణమన గీతం వివాదాన్నీ, గీతాంజలి నేపథ్యాన్ని మరెన్నో వివరాలను ఆ పుస్తకంలో పొందుపరిచాడు. శ్రీశ్రీ అంటే వల్లమాలిన పిచ్చి, గురజాడ అంటే అమితమైన గౌరవం. శ్రీశ్రీకి ఎన్నివిధాలుగా అక్షర నీరాజనం అర్పించాలో అన్ని రకాలుగా విభిన్న సాహితీప్రక్రియల ద్వారా ప్రకటించి శ్రీశ్రీపట్ల తనకున్న సాహిత్య నిబద్ధతను చాటుకున్నాడు. ‘శ్రీశ్రీ శతజయంతిక పాటల ఆల్బం’ను రచించి ప్రసార మాధ్యమాల ద్వారా శ్రీశ్రీని సామాన్యులకు మరింత చేరువ చేశాడు. దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగే సాహిత్య అకాడమీ సభల్లో రామతీర్థ చేసిన తెలుగు ఆంగ్ల సాహితీ ప్రసంగాలు విన్నవారిలో ఎందరో ప్రముఖులూ, ప్రజా ప్రతినిధులు ఇతర భారతీయ భాషా కవులూ అతని అభిమానులుగా మారిపోయారు. ఆంధ్రా యూనివర్శిటీ అకాడమిక్ స్ట్ఫా కాలేజీలో ఉపాధ్యాయులకూ ఇతర అకడమిక్ శ్రేణులకు శిక్షణా ప్రసంగాలు చేశాడంటే అతడి సాహిత్య ప్రవీణ విస్తృతి అవగతం అవుతుంది. ఎంతసేపూ సాహిత్య ప్రసంగాలే అయితే మూస పద్ధతిగా ఉండి సాహితీ ప్రియులను విసిగిస్తాయని పసిగట్టి, పవర్ పాయింట్ ద్వారా ఎందరో ప్రాచీనాంధ్ర కవులను, ఆధునికాంధ్ర కవులను పరిచయం చేసి యువతకు విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తినీ, అవగాహనను పెంచిన సాహితీ సృజనశీలి రామతీర్థ. భాస కవి, గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కే.లక్ష్మణ్, చాసో, సలీం ఇలా ఎందరినో సాహితీ అభిమానులకు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా సామాన్యులకు పరిచయం చేసి దగ్గర చేశాడు. మొజాయిక్ సాహిత్య వారపత్రికకు ఈమధ్యే జీవం పోశాడు. రామతీర్థ రచనల్లోకి చూస్తే అవి ఎంత ప్రకాండముగా శ్లాఘనీయంగా రాసాడోనని ఆశ్చర్యం కలుగుతుంది. తొలి కవితా సంపుటి ‘తెల్ల మిరియం’ ఆరోజుల్లో ఒక సంచలనం. అనువాదాల్లోకి వెళితే కెన్ సారో వివా స్మృతికి పదేళ్ళు సంపుటి గురించి చెప్పాలి. ప్రతిభావంతుడైన నైజీరియా దేశపు కవి కెన్ సారో వివా సామాజిక విప్లవకారుడు. నైజీరియా ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించిన చైతన్యవంతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. అతడ్ని నైజీరియా ప్రభుత్వం ఉరితీసి చంపింది. అతడు 1995లో మరణిస్తే ఆయన స్మృతికి పదేళ్ళు నివాళి సంపుటిని 2005లో ప్రచురించడం తెలుగు సాహితీలోకానికి పరిచయం చేయడం ఇతని గొప్పతనం. ‘శతాబ్ది శ్రీశ్రీ’, కన్యాశుల్క కవితోత్సవం, రామతీర్థ సాహిత్య పరిశీలనకు మరో ఉదాహరణ. కేవలం గురజాడ కన్యాశుల్కం నాటకం మీదే ముప్పై వరకు విస్తృతంగా కొత్త దృక్కోణాల నుండి వ్యాసాలు రాస్తూనే మరొక ప్రక్క అదే నాటకం ఆధారంగా అక్షర శీర్షికలతో అంటే ‘అ’ నుండీ ‘ఱ’ వరకు 52 కవితలు రాయడం ఒక అరుదైన సాహిత్య విన్యాసం.
సుమారు 40 సంవత్సరాల అక్షర సేద్యం చైతన్యవంతంగా దాదాపు 40 పుస్తకాల వరకూ పండించింది. జూన్ 1వ తారీకున ఉపరాష్టప్రతి చేతుల మీదుగా రామతీర్థ చేసిన కందుకూరి ‘సత్యవతి చరిత్రము (ఆంగ్లానువాదం) ఆవిష్కరణ కావాల్సి వుంది. చెన్నై తెలుగు వాణి తూమాటి సంజీవరావు సంకలనం చేసిన ‘వీరేశలింగం స్మృతిలహరి’ ఆవిష్కరణకు సిద్ధవౌతున్న తరుణంలో ఈ దుర్విధి విషాదకరం.
సాహితీ నూతన అంశాలను వెలికితీసే సాహసాన్ని ఊపిరిగా జీవించిన అసాధారణ సాహిత్య కృషీవలుడు రామతీర్థ. కందుకూరి శ్రీశ్రీ గురజాడ, చలం, చాసో మీద చేసిన విశేషమైన పరిశోధనలు సాహిత్య చరిత్రలో రానున్న కాలంలో మరిన్ని పరిశోధనలకు మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కన్యాశుల్కంలోని పంచతంత్ర పరిమళాలు, కన్యాశుల్కంలోని ముద్దుల సంఖ్యను విశే్లషిస్తూ ముద్దుల గురజాడ, ఉర్దూ పదాల ఔచిత్యాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం, మృచ్ఛకటికము నేపథ్యాన్ని అన్వయిస్తూ మట్టిబండిలో కన్యాశుల్క జైత్రయాత్ర రాష్టవ్య్రాప్తంగా పెద్దచర్చకే దారితీసింది. ప్రసిద్ధ విమర్శకులు యు.వి.ఎన్. నరసింహమూర్తి నాటకాల మీద చేసిన పరిశోధన గ్రంథం ఆధారంగా తన వాదనను నిరూపించుకోగలిగాడు. ఆయన వ్యాసాల్లో కన్యాశుల్కం నాటకం పాశ్చాత్య ప్రభావాలు వివరించడం మరొక కొత్త కోణం. తెనుగు త్రిజట (తెలుగు రామాయణాల్లో త్రిజట పాత్ర సమాంతర అధ్యయనం), గురజాడ రచనలకు ప్రేరణ అయిన ప్రపంచ సాహిత్య రచనలను ఆవిష్కరించడం, కన్యాశుల్కం 1887 మొదటి ప్రతిని సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరచడం, కాలగర్భంలో కలిసిపోయిన కందుకూరి ఆంగ్ల ప్రసంగాన్ని వెలికితీసి సాహిత్య లోకానికి పరిచయం చేయడం చెన్నై తెలుగు సంస్థ, చెన్నై తెలుగు ప్రకాశంతో కలిసి క్రాంతదర్శి కందుకూరి శతవర్ధంతి సంచిక ప్రచురణలో భాగస్వామిగా పనిచేయడం లాంటి అనేక విస్తృత పరిశోధనాధ్యయన రామతీర్థను ఇతర సమకాలీన సాహితీవేత్తలకు భిన్నంగా ఔత్సాహిక సాహితీవేత్తలను స్ఫూర్తిగా నిలిపాయి. ఇటు అభ్యుదయ సాహిత్యాన్ని అటు సంప్రదాయ సాహిత్యాన్ని మరొకప్రక్క పాశ్చాత్య సాహిత్యాన్ని సమాంతరంగా ఔపోసన చేసిన రసజ్ఞతతో అన్వయించడానికి ఎంతో అసాధారణ మేధ అవసరం. దాన్ని పరిపుష్టి చేసుకున్నవాడు రామతీర్థ.
ఆంగ్లం నుండి తెలుగులోనికి అనువదించబడినవి కూడా సుమారు అదే సంఖ్యలో ఉండడం ఆశ్చర్యమే కాదు, ఏదైనా అనిర్వచనీయమైన శక్తి ఇతనిని పూనిందా అనే అనుమానమూ వస్తుంది. టిఎస్ ఇలియట్ రాసిన వేస్ట్ అండ్ దీర్ఘ కవితను వృధాత్రి పేరుతో అలాగే అతని అనేక ఇతర రచనలను, నజ్రుల్ ఇస్లాం బిద్రోహి కవిత్వాన్ని బెంగాల్ నుండీ తెలుగులోనికి, అపోలోనర్ రాసిన జోన్, రష్యా కవి అలెక్షాండర్ బ్లాక్ ‘ది ట్వెల్స్’, లాటిన్ అమెరికా కవి వోట్తో రినో కాస్టిలో కవితల అనువానం, సిరియా దేశపు కవిత్వ అనువాదం, విపుల పత్రికలో ప్రచురితమైన అనేక ప్రపంచ కథానికలు రామతీర్థ సాహిత్య వైశాల్యాన్ని అతనికిగల ప్రాపంచక చుట్టూ చూపునూ, ఆధ్యాయన విస్తృతినీ, పరిపూర్ణ రూపాత్మక సాహిత్య అవగాహనను రేఖామాత్రంగా తెలియజేస్తాయి. రంజని కుందుర్తి పురస్కారం, శ్రీశ్రీ వచన కవిత్వ అవార్డు, ఒడిస్సా వారి ఉత్కల్ సాంస్కృతిక సమ్మాన్, గురజాడ అవార్డు, లైన్స్‌క్లబ్ విశాఖ అవార్డు, రావి శాస్ర్తీ పురస్కారం, చాసో పురస్కారం, మునిపల్లి రాజు స్మారక పురస్కారం లాంటివి ఎన్నో అందుకున్నా మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలెన్నింటికో అర్హత ఉన్నవాడు. సభల నిర్వహణలో కూడా అతనిది అరుదైన పంథా. ఇంకా ఎన్ని నవీన సాహితీ వేడుకలు నిర్వహించడానికి పథకాలు తయారుచేసాడో కానీ జీవం మొండికేసింది. సభల నిర్వహణలో వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టడానికి, ప్రయోగాలు చేయడానికి వెనుకాడని దృఢ సంకల్పం కలవాడు.
మొజాయిక్ సాహితీ సంస్థ స్థాపించడం వెనుక ఎంతో ఆలోచనాత్మకమైన ఆచరణ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. విభిన్న రంగురంగుల సాహితీ సుమాలను పుష్పించే పూలతోటగా కొందరనుకుంటే నిజమే ‘‘గార్డెన్ ఐడియాస్’’ అని రామతీర్థ ఉద్దేశం. అన్ని రకాల రంగుల రాళ్ళు అద్దిన నేల లేదా వివిధ రకాలతో కూడిన రంగుల ప్రక్రియ అని అర్థం చేసుకుంటే మొజాయిక్ అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అతని భావన. దక్షిణాఫ్రికాలో మొజయిక్ అనేది చిన్నచిన్న రంగుల పలకలతో గోడల మీద నగిషీలతో చిత్రాలను అద్దే సాంస్కృతిక కళగా ప్రాచుర్యం పొందిన విద్య. అందరూ సాహిత్యంలో వారివారి వివేకం, వివేచన మేరకు తమ రుచులను వెతుక్కోవచ్చు అనేది ఆ పేరు పెట్టడంలో మరొక ఎత్తుగడ. అమెరికా న్యూయార్క్‌లో మనుగడలో ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ల అంటే అమెరికా నల్ల జాతీయుల సాహితీవేత్తల వారసత్వంగా వస్తున్న నిరసన గళం వినిపిస్తున్న సాహిత్యం సంస్థ పేరు కూడా మొజాయిక్. ఇన్ని దృష్టి కోణాల నేపథ్యాన్ని ఆలోచించి వాటన్నిటికీ ప్రతీకాత్మగా ఈ పేరు పెట్టడం జరిగింది. ‘‘మండే మొజాయిక్’’ పేరున ప్రతీ సోమవారం సాయంత్రం పౌర గ్రంథాలయంలో సాహితీసభలు నిర్వహించాడు. సాహిత్యంతో రంజింప చేయడానికి సంస్థ సిద్ధంగా ఉన్నా సాహితీ ప్రియులు కరువు అవడంతో అది తాత్కాలికంగా ఆగింది. అయితే అదే పేరుతో ప్రతీ వారం వెబ్ మాగజైన్ ప్రచురించడం ప్రారంభించాడు. లీడర్ దిన పత్రికలో రైటర్స్ అకాడమీ పేరుతో సాహిత్య పేజీని కూడా నిర్వహిస్తున్న సాహితీ సవ్యసాచి. మొజాయిక్ సంస్థ వందల్లో సాహిత్య సభలను నిర్వహించి పదుల సంఖ్యలో దేశవ్యాప్తంగా లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలను ఆహ్వానించి విశాఖ సాహితీ లోకానికి పరిచయం చేసి తన ప్రత్యేకతను చాటుకుంది మొజాయిక్ సంస్థ రామతీర్థ ద్వారా. మొజాయిక్ సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్లతో కలిసి ‘‘అక్షర గోదావరి’’ పురస్కారాలను కథకు కవిత్వానికి, విమర్శకు ప్రతీ ఏడాది అందిస్తున్నారు.
వ్యక్తిగా రామతీర్థ సహృదయుడు, సంస్కారి, నిబద్ధత కలిగిన కార్యశీలి, స్నేహ స్వభావి. పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరితోనూ వ్యక్తిగతమైన సౌహార్ద సత్సంబంధాలను కొనసాగించడం రామతీర్థకే ప్రత్యేకం. సాహిత్యపరంగా అందర్నీ కలుపుకుని పోవాలని తపన కలిగినవాడు. కానీ కొన్ని సందర్భాల్లో అతడు ప్రదర్శించిన సాహిత్య అసహనం తన వ్యక్తిత్వ స్థాయిని కొంత తగ్గించిందని చెప్పవచ్చు. కొందర్ని దూరం కూడా చేసుకోవాల్సి వచ్చింది. అలాగే కేవలం ఒంటెద్దు పోకడలా ఒకే వర్గానికి చెందిన వారినే భుజాన ఎత్తుకున్నాడనీ అపవాదు కూడా అక్కడక్కడ వినిపించడం కూడా నిజమే. ఏదేమైనా తనదైన జీవితాన్ని తనదైన శైలిలో స్వేచ్ఛా విహంగ దృష్టితో సాహితీ సహచరణం చేసాడు. సహచరిణిగా జగద్ధాత్రి అందించిన సాహితీ మద్దతు, నైతిక ఆసరా, విద్వత్ చేదోడు త్యాగమూ అతని కృషినీ ప్రయత్నాలను సఫలీకృతం చేయడానికి ఎంతో తోడ్పడ్డాయి.
విశిష్టమైన సాహితీ శ్రద్ధ రామతీర్థ. వర్ధమాన కవులను రచయితలను నిరుత్సాహపరచకుండా తనవంతు నూరు శాతం సహాయ సూచనలను అందిస్తూ ప్రోత్సహించాడు. అతని సాహిత్యాన్ని అభిమానించేవారు రామతీర్థ ఒక విశ్వవిద్యాలయం అని పిలుచుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. బహుశా ఈ మధ్యకాలంలో సాహిత్యాన్ని, సాహిత్య వేదికలను, దిన వార మాస పత్రికలను ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక సాహిత్య వ్యవహార్త రామతీర్థ. రామతీర్థ సాహిత్య కృషి, విశాఖ సముద్ర అలల ఘోష సర్వకాలీనం. ఆయన వక్తృత్వపు స్వర ధార నిరంతరం తెలుగు సాహిత్య నాడుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. విశాఖ సాహితీ శిఖరం మీద రామతీర్థ పాండిత్య పతాకం నిరంతరం ఎగురుతూనే ఉంటుంది.

- డాక్టర్ మాటూరి శ్రీనివాస్, 9849000037