మెయన్ ఫీచర్

నేర పరిశోధనకు ‘చట్టాల’ ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జాతి ఆవిర్భావం నుండే నేరాలు ఏదో ఒక రూపంలో జరుగుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ నేర స్వభావంతో పాటు దర్యాప్తుల తీరుతెన్నులు మారుతున్నాయి. తెలివైన నేరస్థులు తమ నేరచర్యలకు శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. మరో వైపు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తాతల నాటి దర్యాప్తు నిఘా విధానాలను పక్కన పెట్టి ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. దర్యాప్తుల సందర్భంగా చిత్ర హింసాపూర్వకమైన విధానాలకు నేటి నాగరిక సమాజంలో తావు లేదు. దాంతో నేడు న్యాయ వైద్య, విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. తదనుగుణంగా చట్టాలలో ఆధునిక, శాస్ర్తియ నిబంధనలను చేర్చడం అనివార్యమైంది.
సమాచార హక్కు చట్టం, సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం, సైబర్ లా, కంపెనీల చట్టం, బ్యాకింగ్ చట్టం, సాక్ష్య చట్టంతో పాటు భారతీయ శిక్షా స్మృతి, నేర విచారణ ప్రక్రియ స్మృతులలో ఎన్నో సవరణలు చేయాల్సి వచ్చింది. నేడు న్యాయ వైద్య విజ్ఞాన శాస్త్రం మరింత విస్తృతమైంది. ఇటీవలి కాలంలో న్యాయస్థానాల ముందు సాక్ష్యాలుగా ఆధునిక అంశాలనే చూపించాల్సి వస్తోంది. ఒకపుడు నేరస్థుల వేలిముద్రలు, తల వెంట్రుకలు, గోళ్లు వంటివి ప్రధాన ఆధారాలు కాగా, నేడు మరింత కచ్చితత్వానికి తిరుగులేని ఆధారాలుగా సెల్ ఫోన్లు, వీడియో టేపులు, సిమ్ కార్డులు, ఆడియో-వీడియో రికార్డులు, కాల్‌డేటా వంటివి నిలుస్తున్నాయి. నేరం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితులు లేదా నేరస్థులను పోలీసులు పట్టుకోగలుగుతున్నారంటే ఈ ఆధునిక అస్త్రాలే కారణం. బాధితులు చివరిసారిగా ఎవరితో మాట్లాడారో కాల్‌డేటా తీసి అవతలి వారిని ప్రశ్నించేసరికి సగం వివరాలు తేలికగానే వచ్చేస్తున్నాయి.
జీపీఎస్ ఆధారంగా ఏయే సెల్ టవర్ల సమీపంలో నేరం జరిగిందనేది గుర్తించి ఆ సమాచారంతో బాధ్యులను పోలీసులు తేలికగా గుర్తించగలుగుతున్నారు. గతంలో ఏ చిన్న దొంగతనం కేసులోనైనా పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించి హింసిస్తేతప్ప సమాచారం రాబట్టడం చాలా కష్టంగా ఉండేది. చట్టానికి దొరక్కుండా పోలీసులు తమదైన శైలిని ప్రదర్శించాల్సి వచ్చేది. కాని నేడు ఆధునిక ఉపకరణాలు ఇట్టే నిందితులను పట్టిస్తున్నాయి. జీపీఎస్ డేటాతో పాటు శరీర అవయవాలు, తుపాకీ గుళ్లు, జీవశాస్త్ర- రసాయన శాస్త్ర అంశాలు, పత్రాలు, అసత్య నిర్దేశక యంత్రాల ద్వారా వాస్తవాల నమోదు, భౌతిక శాస్త్ర అంశాలు, విష విజ్ఞాన విభాగాల మద్దతు తీసుకుని కేసుల లోతులను అర్థం చేసుకోవడమేగాక, నూటికి నూరు శాతం కచ్చితత్వాన్ని సాధిస్తున్నారు.
అమెరికాలో ఫోరెన్సిక్ సైన్స్‌ను ‘క్రిమినలిస్టిక్స్’గా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో న్యాయ, వైద్య, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు ఉన్న స్థాయిలో మనదేశంలో లేకున్నా, మనం ఏ మాత్రం తీసిపోం అని చాలా కేసుల్లో ఈ ప్రయోగశాలలు నిరూపించాయి. విదేశాలు సైతం మన దేశంపై ఆధారపడే రోజులు వచ్చాయి. నేర న్యాయపాలనకు సహాయం అందించడానికి మానవ శరీర మాపనం, వేలి ముద్రలు, పాదముద్రలు, తుపాకీ గుళ్లు, దంత విజ్ఞానం అభివృద్ధి చెందాయి.
నేరం అంటే ఆంగ్లంలో క్రైమ్ అంటాం. దీనికి మూలం లాటిన్‌లో క్రీనో. ‘నేను నిర్ణయించుకుంటాను, నేనే తీర్పు ఇస్తాను’ అనే భావనను క్రినో అంటారు. దీనికి గ్రీకు పదం క్రీమో. ఫ్రెంచిలో దీనిని క్రేమో అని వ్యవహరించే వారు. వాస్తవానికి ఈ పదానికి మూలం 13వ శతాబ్దానికి పూర్వమే ఉంది. సమాజపరంగా జరిగే వ్యతిరేక ఘటనలను మాత్రమే నేరాలుగా భావించేవారు, వ్యక్తిగతంగా జరిగే నేరాలను అప్పటి రాచరిక వ్యవస్థలు స్వల్ప అంశాలుగా చూసేవి. 14వ శతాబ్దం తర్వాత చట్టం ద్వారా శిక్షార్హమైన నేరాల గుర్తింపు ప్రారంభం అయింది. అప్పటి నుండే మోసం,దగా,ద్రోహం కూడా నేరాలుగా గుర్తించారు.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం నేరవిచారణలో శాస్ర్తియ పద్ధతులను అన్వయించడంలో లోకార్డు సాధించిన విజయాలు, బెర్లిన్, వియన్నా, స్వీడన్, ఫిన్లాండ్, హాలెండ్ వంటి దేశాల్లో పోలీసు ప్రయోగశాలల ఏర్పాటుకు దోహదం చేశాయి. 1923లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్ పోలీసు శాఖలో న్యాయ వైద్య ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. 1932లో ఎఫ్‌బీఐ ఒక జాతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. 1935లో స్కాట్లాండ్ యార్డ్‌లో మెట్రోపాలిటన్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేసి బ్రిటన్ కూడా అమెరికా బాటలో పయనించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పేలుడు ఆయుధాలు పెద్ద ఎత్తున లభ్యం కావడం వల్ల నేరాల రేటు అకస్మాత్తుగా పెరిగిపోయింది. గమనశీలత , సమాచార ప్రవాహం పెరిగి వ్యవస్థీకృత నేరాలు, వైట్‌కాలర్ నేరాలు పెరిగిపోయాయి. హింసాయుతమైన వ్యవస్థీకృత నేరాల బెడదను ఎదుర్కోవడానికి పాశ్చాత్య దేశాలు శాస్ర్తియ సాధనాలను నవీకరించుకోవల్సి వచ్చింది. అమెరికా, బ్రిటన్, కామనె్వల్త్ దేశాలు ,యురోపియన్ దేశాలు, మధ్యతరహా న్యాయ వైద్య ప్రయోగశాలలను ఏర్పాటు చేశాయి. అమెరికాలో నేడు 350 వరకూ ప్రయోగశాలలు ఉన్నాయి. బ్రిటన్ సైతం దాదాపు 20 ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, స్విట్జర్లాండ్‌లలో కూడా పెద్ద ఎత్తున ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ప్రారంభం అయ్యాయి.
భారత్‌లో తొలి రోజుల్లో కెమికల్ ఎగ్జామినేషన్ ల్యాబ్‌లు ఉండేవి. వీటిని 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు చెన్నై, కోల్‌కత, ముంబయి, ఆగ్రాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగ శాలలు రసాయన విశే్లషణలను , విష విజ్ఞాన శాస్త్భ్రావృద్ధికి ఎంతో కృషి చేశాయి. తర్వాత సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్‌లో 1967లో ఏర్పాటైంది. కోల్‌కతలో జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటైంది. ఈ రెండూ బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటితో పాటు ట్రూత్ ల్యాబ్స్ పేరిట ప్రైవేటుసంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్రపంచంలో 89 దేశాల్లో ప్రస్తుతం ఇలాంటి ల్యాబ్‌లు 1200 వరకూ ఉన్నాయి.
ప్రపంచంలో మొట్టమొదటి వేలి ముద్రల బ్యూరో 1897లో కోల్‌కతలో ఏర్పాటుచేశారు. రాష్టస్థ్రాయిలో సీఐడీ విభాగాలను ఏర్పాటు చేయాలని 1902 పోలీసు కమిషన్ నివేదిక ఫలితంగా 1910 నాటికి చాలా రాష్ట్రాల్లో వేలిముద్రల బ్యూరోలు ఏర్పాటయ్యాయి. 1906లో సిమ్లాలో తగాదాలో ఉన్న పత్రాలను పరిశీలించడానికి ప్రభుత్వ పరిశీలకుడిని నియమించారు. 1910లో కోల్‌కతలో రసి విజ్ఞానవేత్తను (సెరాలజిస్టు)నూ,రసాయన పరిశీలకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పేలుడు ఆయుధాలు, పాదముద్రలు, ఫొటోగ్రఫీ వంటి ప్రాథమిక శాస్ర్తియ పరీక్షలను నిర్ణయించడానికి సీఐడీ ఆధ్వర్యంలో శాస్ర్తియ విభాగాలను ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం గవర్నమెంట్ కెమికల్ ఎగ్జామినర్స్ ల్యాబ్స్‌ను విలీనం చేసి 1952లో కోల్‌కత స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1955లో సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో, 1957లో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటయ్యాయి, 1974 నుండి కేంద్ర న్యాయ వైద్య సంస్థల పాలనా నియంత్రణను కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి తెచ్చారు. 1959లో కేంద్ర హోం శాఖ ఆధీనంలో న్యాయ వైద్య విజ్ఞానానికో కేంద్ర సలహా సంఘం ఏర్పాటైంది. కేంద్ర వేలిముద్రల సంస్థను తర్వాతి కాలంలో సీబీఐ ఆధీనంలోకి తీసుకువచ్చారు.
సంఘటన స్థలం నుండే న్యాయ వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని వినయోగించుకోవడం మొదలవుతుంది. ప్రత్యక్ష సాక్ష్యం, వేలిముద్రలు, పాదముద్రలు, ట్రేస్ మూలకాలు గుర్తించడం అంటే వెంట్రుకలు, పోగులు, వస్త్రాలు, రక్తం, మరకలు, పితృత్వ రుజువుల నిర్ధారణ, వీర్యం, ఇతర శరీర ద్రవాలు, లాలాజలం, చెమట, మట్టి, మురికి, దుమ్ము, టైర్ ముద్రలు, స్కిడ్ గుర్తులు, గాజు పదార్థాలు, గాజు పగుళ్ల మూల్యాంకనం, గాజులో రంద్రాల వరుస, అభిఘాత కోణం, తిరోగామి ఖండీకరణం , పెయింట్లు, పత్రాలు, చేతిరాత, చేర్పులూ, మార్పులు, ప్రక్షేపణాలు, టెలిగ్రాఫ్, ట్రాక్షన్ వైర్లు, కేబుళ్లు, ఓడాంటాలజీ, ఫొటోగ్రాఫిక్ అధ్యారోపణం, చెరిగిపోయిన గుర్తులు, నకిలీ నాణాలు, ద్రవ్యనోట్ల పరీక్ష, సారాయి, మద్యం, మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు, విషపదార్థాలు, చిత్తరువులు, విస్ఫోటనాలు, బహుచిత్రితం, గొంతు పరీక్ష, కృతి కల్పన వంటి ప్రాథమిక ఆధారాలను వినియోగించుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో డీఎన్‌ఏ అత్యంత కీలక ఆధారం కాబోతోంది. ఇది నేరపరిశోధనకు ఉత్తేజం ఇవ్వడం ఖాయం.

-బీవీ ప్రసాద్ 98499 98090