మెయన్ ఫీచర్

ప్రశంసలు సరే.. మరి ప్రగతి సంగతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నాయకత్వంలో కొ త్త ప్రభుత్వం ఏర్పాటు, అధికార పార్టీకి అసెంబ్లీలో తిరుగులేని ఆధిపత్యం, నూతన ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభకు వైకాపా నుంచి 22 మంది ప్రాతినిధ్యం వహించడం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోర పరాజయం పొందిన తెలుగుదేశం పార్టీలోనూ మరోరకమైన భావోద్వేగాలు నెలకొన్నాయి. ఇక- సామాజిక న్యాయం పేరిట జగన్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన నలుగురు సీనియర్లకు మాత్రం మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. మిగతా అగ్రవర్ణాలకు తలా ఒకటి చొప్పున పదవులు ఇచ్చారు. ఐదు సామాజిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి ‘ఆరో వేలు’ లాంటిదని 1956లోనే పేర్కొన్న విషయం ఈ తరానికి తెలియకపోవచ్చు.
శాసనసభ స్పీకర్ పదవిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మంచి వాక్చాతుర్యం, ప్రతి అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి మాట్లాడే తమ్మినేని సీతారాంకు అప్పగించడం మంచి నిర్ణయం. శ్రీకాకుళం జిల్లాకు ‘స్పీకర్ల జిల్లా’గా పేరుంది. తమ్మినేనికి ముందు ఈ జిల్లా నుంచి ముగ్గురు నేతలు స్పీకర్లుగా పనిచేశారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనతో విసుగు చెందిన ప్రజలు కొత్తగా కొలువు దీరిన జగన్ ప్రభుత్వానికి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ‘హానీ మూన్ పీరియడ్’ ఎటూ ఇస్తారు. రెండు డజన్ల మంది సభ్యులు కూడా లేని టీడీపీ ఈ విషయంలో హుందాగా వ్యవహరిస్తుందని ఆశించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇపుడు వాతావరణం కొత్తగా కనపడుతోంది. ఐఏఎస్ అధికారులతో జరిగే సమీక్షల్లో ముఖ్యమంత్రి జగన్ కలుపుగోలుగా వ్యవహరించడం, సీనియర్ అధికారులను ‘అన్నా’ అనడం, తాను చెప్పదలుచుకున్న అంశాలను ముక్కుసూటిగా చెప్పడం, సోది లేకుండా సమీక్షలు ముగించడం, భోజన సమయంలో అధికారులను ఆహ్వానించడం అంతా బాగుంది. జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా పెద్దగా ఆడంబరం కనపడలేదు. మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపుపై కూడా ఎలాంటి రాద్ధాంతం లేదు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద మీడియా, రాజకీయ పక్షులు పడిగాపులు పడే అవకాశాన్ని ఇవ్వలేదు. కీలక నిర్ణయాలను చకాచకా తీసుకుంటున్నారు. ఇది సాహసోపేతమైన చర్య అని చెప్పవచ్చు. చంద్రబాబు మంత్రుల ఎంపిక, వారికి శాఖల కేటాయింపుపై రోజుల తరబడి కసరత్తు చేసేవారు. జగన్‌ను చూస్తుంటే మొత్తం వచ్చే ఐదేళ్లకు ‘స్క్రిప్టు’ను ముందుగా సిద్ధం చేసుకున్నట్లు కనపడుతోంది. అప్పటికప్పుడు కొన్ని అంచనాలు తప్పితే, సవరణలు ఎటూ ఉంటాయి.
మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపులో జగన్ అనుసరించిన వైఖరి నిజంగా అభినందించి తీరాలి. రాజకీయాల్లో పట్టుమని పదంటే పదే సంవత్సరాల అనుభవం ఉన్న 46 సంవత్సరాల యువకుడు జగన్ మంత్రివర్గం కూర్పుపై వ్యవహరించిన తీరును అన్ని వర్గాల వారూ ప్రశంసించారు. మంత్రివర్గం నిర్మాణంలో జగన్ సామాజిక న్యాయం అనే నియమాలను అతిక్రమించలేరు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం వల్ల కొందరు సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి మంత్రివర్గంలో స్థానం పొందాల్సిన అంబటి, మర్రి, భూమన, రోజాలకు, సెంటిమెంట్ వల్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావుకు స్థానం లభించలేదని చెప్పవచ్చు. అగ్రవర్ణాలు, బీసీ వర్గాలకు చెందిన మహిళలకు మంత్రిమండలిలో స్థానం లేకపోవడం విచారకరం. ఏదో ఒక కోణంలో ఒకవర్గంలో ఒకరిని తగ్గించి, ఈ రెండు వర్గాలకు చెందిన మహిళలకు స్థానం కల్పించి ఉంటే బాగుండేది. మంత్రి పదవులను ఆశించేవారెవరైనా రెండున్నరేళ్ల దాకా నిరీక్షణ తప్పదు.
సచివాలయంలో సీనియర్ అధికారులు, సాధారణ ఉ ద్యోగులతో ముఖ్యమంత్రి జగన్ ఆప్యాయతగా మెలగడం, వారితో కలిసి ఉన్న దృశ్యాలను చూస్తే ఆయన ‘బాడీ లాంగ్వే జి’లో ఎంతో వినమ్రత కొట్టొచ్చినట్లు కనపడింది. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సమయంలో, మం త్రుల చేత ప్రమాణ స్వీకారం చే యించినప్పుడు అన్ని చోట్ల జగన్ నిరాడంబరత కనపడింది.
మంత్రులకు శాఖల కేటాయింపు అనేది ముఖ్యమంత్రి స్వేచ్ఛకు సంబంధించిన అంశం. ఈ స్వేచ్ఛను ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. కాని ప్రజలు మాత్రం స్క్రూటినీ చేస్తారు. ఈ స్క్రూటినీలో జగన్ గెలిచారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గోదావరి, కృష్ణా జలాలపై చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఆంధ్రాకు కేటాయించిన జలాలపై కసరత్తు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నదీ జలాలపై మాట్లాడుతుంటే రాష్ట్రప్రజలు శ్రద్ధగా వినేవారు. వైఎస్‌ను రాజకీయంగా విభేదించేవారు సైతం ఆయన మాట్లాడుతుంటే అబ్బురపడేవారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ మాదిరి విద్యుత్, సాగునీటి జలాలపై మాట్లాడిన మరో నేత కనపడరు. వైఎస్‌కు దీటుగా సాగునీటి జలాలపై మంచి పరిజ్ఞానం సంపాదించిన మరో దిగ్గజం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నదీజలాల లెక్కలపై వైఎస్, కేసీఆర్‌ల మాదిరిగా మాట్లాడే నేతలు అరుదు. మాజీ మంత్రి హరీష్ రావుకూడా నీటి లెక్కల్లో అఖండుడు.
ఆంధ్ర, తెలంగాణ మధ్య ప్రస్తుతం అనురాగబంధం గాఢంగా సాగుతోంది. కాని నీటి పంపకాల విషయం వచ్చేటప్పటికీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అనుసరించే వైఖరి ఎలా ఉంటుందో కాలం బదులిస్తుంది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై అధ్యయనం చేసి బాగా మాట్లాడాల్సి ఉంటుంది. మొత్తం 25 మంది మంత్రుల్లో కీలకమైన భారీ నీటిపారుదల శాఖను దక్కించుకున్న డాక్టర్ అనిల్ కుమార్ అసెంబ్లీలో తన ప్రతిభను చాటుకుంటారని ఆశిద్దాం. సాగునీటి రంగంలో కార్యదర్శులు రాసిచ్చే ‘ప్రశ్నకు జవాబు’ పద్ధతిలో సమాధానాలు చెప్పే సంస్కృతిని అలవర్చుకుంటే ఎవరూ ప్రశంసించరు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక రంగంపై తన పరిజ్ఞానాన్ని ప్రతిపక్షంలో ఉండి నిరూపించుకున్నారు.
సీఎంఒ కార్యాలయం, రాజకీయ విభాగంలో తన కోటరీని జగన్ నియమించుకున్నారు. ఇది అన్ని ప్రభుత్వాల్లోనూ ఉండే పద్ధతే. ఇది ప్రజలకు సంబంధం లేని విషయం. తన కార్యాలయం, రాజకీయ విభాగంలో ఎవరు ఉండాలనే అంశం పూర్తిగా అంతరంగిక పాలనకు సంబంధించిన అంశం. ఇక్కడ సహజంగా అధికారంలో ఉన్న పాలకుడు తన సా మాజికవర్గం, తాను బ లంగా నమ్మే వ్యక్తులను ఎంపికచేసుకుంటారు. ఈ కోటరీలే ముఖ్యమంత్రికి నడిపిస్తుంటాయి. గతంలో ప్రతిపక్ష నేతగా జనంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం పదేళ్ల పోరాటం చేశారు. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే ఆటుపోట్లను ఎదుర్కొన్న నేతలను మనం అరుదుగా చూస్తాం. తన చుట్టూ ఉండేవారు సరైన సలహా ఇస్తున్నారా? వాటి వల్ల లాభమా? నష్టమా? ప్రభుత్వానికి మచ్చ తెచ్చే సలహానా? అనే విషయమై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. కోటరీలో ఉండే వారు అత్యుత్సాహంతో ఇచ్చే పెడసరి సలహాలను ముఖ్యమంత్రి పట్టించుకోరాదు.
సంక్షేమ రంగానికి ఎడాపెడా నిధులు ఖర్చుపెట్టుకుంటూ పోతే బొక్కసం ఖాళీ అవుతుంది. పాలకుడు వితరణ హృదయంతో ఉంటే, దానిని సాకుగా చేసుకుని ప్రతిదానికి వరాలు ఇవ్వమనే వారికి కొదవ ఉండదు. పిండి కొద్దీ రొట్టె అనే చందంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాల్సి ఉంటుంది. రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికంగా నిలదొక్కుకునే మార్గాలు అనే్వషించాలి. రకరకాల పేర్లతో లేదా గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మార్చి సంక్షేమం పేరుతో నిధులు వ్యయం చేయాల్సిన సమయం ఇది కాదు. 1990 దశకం ముందు కంటే ఉన్న దారిద్య్రం ఈ రోజు సమాజంలో లేదు. అన్ని వర్గాల్లో చైతన్యం వచ్చింది. పనిలేని వారికి పని చూపించి ఆదాయం కల్పించే పథకాలను అమలు చేయాలి. ప్రజలను సోమరిపోతులను చేసే విధంగా సంక్షేమం పేరుతో నిధులు కుమ్మరిస్తూ పోతుంటే అంతంత మాత్రమే ఉన్న ఖజానా పూర్తిగా ఖాళీ అవుతుంది. అప్పుడు కేంద్రాన్ని తిట్టి కూడా ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే, వౌలిక సదుపాయాల లేమి నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా నిధులు కావాలి.
1999-2004 మధ్య చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కఠినమైన ఆర్థిక విధానాలు పాటించి ఓటమి చెందారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కంటే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పరాజయం పాలయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సమానమైనా 2004, 2019 పరాజయాలకు చాలా తేడా ఉంది. 2004లో చంద్రబాబు ఓటమి చెందినా, ఇప్పటి మాదిరి అపకీర్తిని మూటగట్టుకోలేదు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు బలమైన ఆర్థిక అజెండా వల్ల 1999లో కూడా గెలిచి 2004 వరకు అంటే ఎనిమిదిన్నరేళ్లకుపైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు అజెండా వేరు. విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రాధాన్యతల ఎంపికలో తడబాటు, చుట్టూ చేరిన కోటరీ, ఒక సామాజిక వర్గం పెత్తనం పెరిగిందంటూ మీడియాలో జరిగిన ప్రచారం, కేంద్రంతో ఘర్షణ, ఎన్నికల్లో ఒంటరి పోరు, శత్రువుల సంఖ్యను పెంచుకోవడం తదితర కారణాల వల్ల ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో చంద్రబాబు అజెండాతో పాటు, టీడీపీ కూడా చిత్తుగా ఓడింది. ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధికి 1995లో చంద్రబాబు బలమైన పునాది వేశారు. ఆ రోజు ఉచిత కరెంటు ఇవ్వనని మొండికేశారు. ఈ రోజు ఉచిత కరెంటు అంశం కాదు. 1995 నాటి బలమైన ఆర్థిక అజెండాను 2014లో చంద్రబాబు రూపొందించుకోలేకపోయారు.
చంద్రబాబు చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు, మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపు రోజు కొంత మంది ఎమ్మెల్యేలు ఆయనను ‘అభివన కాటన్, అంబేద్కర్, పూలే’ వంటి వారని ప్రశంసించారు. ఇందులో తప్పేమీ లేదు. తమ అభిమానాన్ని, ఆరాధన భావాన్ని ప్రదర్శించేందుకు ప్రతివ్యక్తి తమ నేతలను ప్రశంసిస్తారు. ఈ రోజు జగన్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన ఆర్థిక అజెండాను ఖరారు చేసుకోవాలి. అమరావతి రాజధానికి మార్గనిర్దేశనం చేయాలి. పోలవరం సాగునీటి పథకం నిర్మాణం సత్వరమే పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలి. అమరావతి నుంచి రాయలసీమకు ఐదేళ్లయినా ఇంతవరకు సరైన రోడ్డు లేకపోవడం క్షమించరాని అంశం. కార్యకర్తలు, అభిమానుల భావోద్వేగాలు, కంటతడులు, ఉప్పొంగిపోవడం, ఆనందంతో దుఃఖించడం లాంటి లక్షణాలు కొంతకాలం ఉంటాయి. కేవలం సంక్షేమ పథకాల వల్ల ఎల్లకాలం ఓట్లు రాలవు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రజలు ముఖం వాచిపోయి ఉన్నారు. అవినీతి నిర్మూలనకు దిగువ స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలన్న జగన్ సంకల్పం గొప్పది. దీంతోపాటు పరిపాలన వికేంద్రీకరణకు వేగంగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఆరుకోట్ల ఆంధ్రులు 151 మంది ఎమ్మెల్యేల నుంచి ఆశించేది తమ ప్రాంతాల అభివృద్ధి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని కొత్త పాలకులు మసలుకోవాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097