మెయన్ ఫీచర్

రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ ప్రక్షాళన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో అంతర్గతంగా ఒక రకమైన సంక్షోభానికి దారితీసింది. విజయం లభిస్తే అందరూ తమ ఘనకార్యం అనుకొంటారు. కానీ పరాజయాలకు బాధ్యత వహించేవారు చాలా అరుదు. పలువురు నేతలు రాజీనామాకు సిద్ధపడినా అది కేవలం తాత్కాలిక ప్రచారం కోసమే. కానీ రాహుల్ మొత్తం కాంగ్రెస్ నాయకత్వంపైననే ఒక రకమైన విరక్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరాజయానికి నిర్దిష్టమైన కారణాలు కూడా చెప్పారు.
రాహుల్ గాంధీ నిజంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటే అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఆ పదవికి ఎంచుకోవడం ఆ పార్టీ నేతల ముందున్న ప్రధాన సమస్య. కాంగ్రెస్ పార్టీలో రేగిన అంతర్గత సంక్షోభం ఎట్టకేలకు సమసిపోయిందని, అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాపై రాహుల్‌గాంధీ వెనక్కి తగ్గారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రకటించినా, ఆ విధమైన సంకేతాలు రాహుల్ నుండి రావడం లేదు. నేరుగా ఏఐసీసీ కార్యవర్గ సమావేశంలోనే మే 25న రాజీనామా ప్రకటన చేసి, అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్నది. వాస్తవానికి రాజీనామా నిర్ణయంపై రాహుల్ ఇంతగా మంకు పట్టు పడతారని ఎవరూ అనుకోలేదు. గత రెండు దశాబ్దాల కాలంలో పరాజయానికి బాధ్యత వహించి పదవికి ఆ విధంగా రాజీనామా చేసిన నేత దేశంలో లేరని చెప్పవచ్చు. ఒక వేళ బలవంతంగా పదవి నుండి దించితే తప్ప. పైగా, పార్టీ ఓటమికి రాహుల్ చెప్పిన ఒక ప్రధాన కారణం వారసత్వ రాజకీయాలు. ఆయనే రాజకీయ వారసత్వానికి మారుపేరు. అటువంటిది పార్టీ నేతలు తమ వారసులకు సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడం వల్లన ఇబ్బందులు ఎదుర్కొన్నామని రాహుల్ పేర్కొనడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వారసత్వ రాజకీయాలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తి కలుగుతుంది. ఇటీవలి ఎన్నికల్లో వారసులను బరిలోకి దించిన పార్టీనేతల పేర్లు కూడా రాహుల ప్రస్తావించారు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వల్లే ఇంత ఘోరంగా ఓడిపోయామని స్పష్టం చేశారు. వారు పార్టీ గెలుపుకన్నా కొడుకులకే ప్రాధాన్యం ఇచ్చారని, ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో అవమానకర ఓటమి ఎదురైందని ఆయన మండిపడ్డారు. రాహుల్ ప్రస్తావించిన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీపై నెహ్రూ-గాంధీ కుటుంబం పెత్తనం గురించి ఏర్పడుతున్న వివాదం ఒక అంశమైతే, నేడు కుటుంబ వారసత్వమో, ధనబలమో ఉండనిదే రాజకీయాలలో రాణించలేని పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే అంశమే. ఈ ఎన్నికలలో ప్రజలు వారసత్వ రాజకీయాలను తిరస్కరించారని ప్రధాని మోదీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ చెప్పినా, గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వారసులు పార్లమెంట్ లో ప్రవేశించడం గమనార్హం.
ఎన్నికల్లో పోటీ చేసిన వారికంటే గెలిచిన ఎంపీల్లో రాజకీయ వారసులు ఎక్కువగా ఉన్నారు. అంటే- రాజకీయ వారసులే ఎక్కువ మంది గెలిచారన్నమాట. ఇక్కడ మరో విశేషముంది. లోక్‌సభకు మొట్టమొదటిసారి 78 మంది (14 శాతం) మహిళా ఎంపీలు ఎన్నిక కాగా వారిలో రాజకీయ వారసులే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం మహిళా ఎంపీల్లో సగం మంది ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే. సాధారణంగా రాజకీయ పార్టీలు రిజర్వ్‌డ్ సీట్లకే మహిళల పేర్లను ప్రతిపాదిస్తాయి. మహిళా ఎంపీల్లో 24 మంది రిజర్వ్‌డ్ స్థానాల నుంచి విజయం సాధించిన వారే. బిజూ జనతా దళ్ నుంచి ఏడుగురు మహిళలు పోటీ చేయగా, వారిలో ఆరుగురు రిజర్వ్‌డ్ స్థానాల నుంచే పోటీ చేశారు. మొత్తం పురుష ఎంపీల్లో 15 శాతం మంది రాజకీయ వారసులు కాగా, 42 శాతం మంది మహిళలు రాజకీయ కుటుంబం వారసులు. వారసత్వ రాజకీయాలను ఎండగట్టే భాజపాకు సంబంధించి ఎన్నికైన ఎంపీలలో సుమారు 25 శాతం మంది రాజకీయ వారసులే కావడం గమనార్హం. 303 మంది బీజేపీ ఎంపీల్లో 75 మంది రాజకీయ వారసులు కాగా, 52 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 23 మంది రాజకీయ వారసులు ఉన్నారు. ఆ తర్వాత 23 మంది డీఎంకె ఎంపీల్లో పది మంది, 22 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల్లో ఏడుగురు రాజకీయ వారసులు ఉన్నారు.
అయితే ఒక పార్టీ ఒక కుటుంబం గుప్పెటలో ఉండటాన్ని, కుటుంబ వారసత్వంగా రాజకీయాలలో ప్రవేశం పొందటాన్ని ఒకటిగా చూడలేము. కాంగ్రెస్, ఆర్‌జెడి, ఎస్పీ, డీ ఎంకే, టిడిపి, టిఆర్‌ఎస్, వైసిపి, జేడీఎస్, శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలలోని రాజకీయ వారసత్వాన్ని కుటుంబ వారసత్వంతో చట్టసభలకు ఎన్నిక కావడాన్ని ఒకటిగా పరిగణించలేము. వారసత్వంతో పదవులు దక్కినా మొత్తం పార్టీ నాయకత్వం అదే కుటుంబంలో బందీగా ఉండదు. మిగిలిన పార్టీలలో సహితం ఒకరిద్దరు మాత్రమే పెత్తనం చేస్తున్నా, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించక పోయినా, సమష్టిగా నిర్ణయాలు తీసుకొనే సంస్కృతి నేడు దాదాపుగా ఏ పార్టీలో కూడా లేకపోయినా నేడు ఒక కుటుంబమే ఒక పార్టీని సొంత ఆస్తిగా పరిగణించడం దారుణమైన అంశమే.
రాజీనామా ద్వారా ఈ సంస్కృతికి రాహుల్ మంగళం పాడే ప్రయత్నం చేస్తే అభినందనీయం. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీలు పార్టీపై, ప్రభుత్వంపై అదుపు పెట్టుకున్నా పార్టీ అధ్యక్షులుగా ఇతరులకు అవకాశం ఇస్తూ ఉండేవారు. కానీ 1980 నుండి ఈ సంస్కృతికి చరమగీతం పాడారు. నేడు వేరే వారిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినా రాహుల్, సోనియాలను ధిక్కరించే వ్యవహరించే పరిస్థితులు లేవు. గతంలో పీవీ నరసింహారావు వలే వ్యవహరించగల నాయకత్వం కాంగ్రెస్ లో లేదు. నేడు కాంగ్రెస్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పాతతరం వారి ఆధిపత్యం. వారిని ధిక్కరించి యువతరం ముందడుగు వేయలేకపోవడం. ఢిల్లీ చుట్టూ తిరిగే వారికే కీలక పదవులు ఇవ్వడం. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే కొత్తతరం నాయకత్వం అన్ని స్థాయిలలో పార్టీ నాయకత్వం చేబడుతుందని భావించారు. అందుకు ఆయన భారీ కసరత్తు కూడా చేసారు.
అయితే యువ నాయకత్వానికి రాజకీయ అనుభవం లేకపోవడం, పాత నాయకత్వం విద్రోహపూర్వకంగా వ్యవహరించే అవకాశం ఉండడంతో సోనియా గాంధీ అందుకు భయపడి అలా సాగనీయలేదు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో జరిగిన నాటకీయ పరిణామాలను చూసాము. యువతరానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ పట్టుబడితే సోనియా, ప్రియాంక కలసి పడనీయలేదు. ఆ విధంగా చేస్తే లోక్ సభ ఎన్నికలలో పాత తరం సహాయ నిరాకరణ చేయవచ్చని భయపెట్టారు. యువతరం నాయకత్వం వహించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఫలితాలు కొంచెం మెరుగుగా ఉండి దేశంలో అత్యధికంగా ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకొనే అవకాశం కలిగేది. రాహుల్ గాంధీ ఒక విధంగా అయిష్టంగా రాజకీయ ప్రవేశం చేశారు. ఏనాడు కూడా పదవుల పట్ల వ్యామోహం చూపలేదు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి మూడేళ్లకు పైగా కాలయాపన చేశారు. 2009లో స్వయంగా మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గంలో చేరమని కోరినా విముఖత వ్యక్తం చేశారు.
ఒక విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఒంటరిగా పోరాడారు. నరేంద్ర మోదీని పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం కలిగిస్తున్న నేతగా, చౌకీదార్ చోర్ హై... అంటూ ఆయన చేసిన ప్రచారం ప్రజామోదం పొందక పోయినా, వ్యూహాత్మకంగా కొన్ని తప్పట డుగులు వేసినా, ప్రజల ముందు మోదీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ నుండే చెప్పుకోదగిన సహకారం లభించ లేదు. అంతేకాకుండా రాఫెల్ కుంభ కోణంపై తాను పోరాడినప్పుడు మిగతా నాయకులెవరూ మద్దతుగా నిలువలేదని స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు వారాలకు పైగా అధ్యక్ష పదవి వద్దని భీష్మించుకుని కూర్చున్న రాహుల్ ఇప్పుడు ఒక విధమైన ఇరకాట పరిస్థితులలో చిక్కుకున్నారు. రాజీనామాను ఇప్పుడు ఉపసంహరించుకొంటే ప్రజల్లో ఆయన విశ్వసనీయత కోల్పోతారని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వంటివారు హెచ్చరిస్తున్నారు. కనీసం రెండేళ్లపాటు పార్టీ అధ్యక్ష పదవికి దూరంగా ఉంటే ఒక గట్టి సందేశాన్ని పంపినవారు కాగలరు. ఇప్పుడు ఎక్కువగా ఆందోళన చెందుతున్నది ఆయన చుట్టూ చేరిన భజన బృందమే. రాహుల్ అధ్యక్ష పదవిలో లేకపోతే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో అని మధన పడుతున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులెవరూ ఇక పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన రాహుల్ ఆ మాటకు కట్టుబడి ఉంటే సరికొత్త ఒరవడికి అంకురార్పణ చేసిన వారు కాగలరు. లోక్‌సభలో పార్టీ నేతగా ఆయన కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య- క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చెదురుకావడం. స్థానిక నాయకత్వం కనుమరుగైనది. ఆ లోటును భర్తీ చేసేందుకు రాహుల్ రెండు, మూడేళ్లపాటు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అన్ని స్థాయిలలో నూతన నాయకత్వాన్ని సైతం ప్రోత్సహించాల్సి ఉంది.

-చలసాని నరేంద్ర 98495 69050