మెయన్ ఫీచర్

తెలుగు రాష్ట్రాలకు మంచిరోజులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య బంధాలను పటిష్టం చేసేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐక్యతతో చేస్తున్న కృషి వల్ల సమీప భవిష్యత్తులో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య అంతకుముందు 19 ఏళ్లుగా ఉన్న రాజకీయ వైరం వల్ల అనేక అంశాలపై ప్రతిష్టంభన కొనసాగింది. గత డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు జనం నీరాజనాలు పలకడంతో కేసీఆర్ వరసగా రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గత ఐదేళ్లలో చూడని మంచి బంధాలను చూస్తున్నాం. ఈ బంధాలు శాశ్వతంగా కొనసాగాలని, రాజకీయాలకు అతీతంగా నేతలు వ్యవహరించాలని ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. రెండు ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని కేసీఆర్ బలమైన సంకల్పాన్ని ఆవిష్కరిండం రాజనీతిజ్ఞతకు నిదర్శనం.
ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, వైకాపా శాసనసభాపక్షనేతగా ఎన్నికైన వెంటనే జగన్ సతీసమేతంగా హైదరాబాద్‌కు వచ్చి, తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరై, ఆ తర్వాత అక్కడ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించుకున్నారు. ఇది జరిగిన రెండు వారాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కేసీఆర్ విజయవాడకు వెళ్లి జగన్‌ను ఆహ్వానించారు. దీనికి జగన్ సమ్మతించారు. ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి విజయవాడలో హాజరు కావడం అరుదైన ఘట్టం. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్ గవర్నర్ సమక్షంలో చర్చలు జరిపారు. నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు జగన్, కేసీఆర్‌లు కలవడం శుభ పరిణామంగా భావించాలి. భావోద్వేగాలకు తావులేకుండా ఇరువురు నేతలూ ఇదే స్నేహపూర్వక వాతావరణంలో సంబంధాలను కొనసాగించి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలవాలి.
తెలంగాణ రాష్ట్రానికి కొత్త సచివాలయం నిర్మించాలనే ఆకాంక్ష కేసీఆర్‌లో బలంగా ఉంది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు వృథాగా ఉన్నాయి. ఆలనాపాలనా లేనందున అవి పాడైపోతున్నాయి. 15 ఎకరాల్లో ఉన్న ఈ భవనాలను ఇస్తే కొత్త సచివాలయం నిర్మించుకుంటామని కేసీఆర్ అడిగిందే తడువుగా జగన్ సానుకూలంగా స్పందించి గవర్నర్‌కు సమ్మతి తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. సీఎం జగన్ నిర్ణయంతో ఆ భవనాలు తెలంగాణకు దక్కాయి. ఈ భవనాలను 2024లో ఎటూ తెలంగాణకు వచ్చేవే. కాని ఇప్పు డే ఇవ్వడం వల్ల కొత్త సచివాలయం నిర్మించాలన్న కేసీఆర్ స్వప్నం నిజమవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సైతం ఇలాగే పరిష్కారం కావల్సి ఉంది.
ఢిల్లీలో ఆంధ్రా భవన్‌పై రెండు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన ఉంది. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు. దాదాపు 1,100 మంది విద్యుత్ ఉద్యోగులపై కూడా కేసీఆర్ సర్కార్ ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ జెన్కో నుంచి కోట్లాది రూపాయల బకాయిలు రావాల్సి ఉందని ఏపీ జెన్కో చెబుతోంది. 9,10 షెడ్యూళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విభజన అంశం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ అంశాల పరిష్కారానికి రాజకీయ సంకల్పం అవసరం. ఈ సమస్యలను కేంద్రానికి నివేదించడం వల్ల ప్రయోజనం ఉండదు. అనవసరంగా కేంద్రం పెత్తనానికి తావిచ్చినట్లుగా ఉంటుంది. రెండు రాష్ట్రాలూ సమన్వయంతో ఉంటే కేంద్రం జోక్యం అవసరం లేదని కేసీఆర్ చేసిన ప్రకటన తెలుగువారందరికీ ఆనందాన్ని ఇచ్చింది. సాగుజలాలపై కూడా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు 1450 టీఎంసీల గోదావరి జలాలు, 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించారు. ఈ నీటి విభజన తేలాల్సి ఉంది. సాలీనా బంగాళాఖాతంలోకి 3,500 నుంచి 5,000 వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా పోతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైన, తెలంగాణ సర్కార్‌పైన ఉంది. పోలవరం వల్ల భద్రాచలం ముంపునకు గురవుతుందని టీఆర్‌ఎస్ సర్కార్ గతంలో పేర్కొంది. ఇక్కడ అధికంగా నివసిస్తున్న ఆదివాసీలకు పునరావాసం కల్పించేందుకు, నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా భద్రాచలంపై తెలంగాణ సర్కార్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అవరోధాలు తలెత్తకుండా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్థానిక ప్రజల మనోభావాలను ఇరు రాష్ట్రాల పాలకులు గౌరవించాల్సి ఉంటుంది.
ఆంధ్ర, తెలంగాణల మధ్య సంబంధాలు మెరుగైతే ఇరు రాష్ట్రాల ప్రజలు స్వాగతిస్తారు. గత ఐదేళ్లలో ఈ సంబంధాలు అంతంత మాత్రం కావడానికి టీడీపీ అధినాయకత్వం వైఖరి కారణమనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ నుంచే పాలించింది. ఆ సమయంలో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. అవసరమైతే హైదరాబాద్‌లో తాము పోలీస్ స్టేషన్లను పెడతామనే స్థాయి వరకు టీడీపీ ప్రభుత్వం వెళ్లింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నీటి విడుదల విషయమై ఇరు రాష్ట్రాల పోలీసులు ఘర్షణకు దిగడం ఎవరూ మర్చిపోలేరు. ఇవన్నీ నివారించదగిన ఘటనలే. రాష్ట్ర విభజన ఒక వాస్తవం. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉద్యమించి తమ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించుకున్నారనేది అక్షర సత్యం. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలు, ఓర్వలేనితనం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ప్రతి ఏడాది తగ్గుతోంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో ప్రాజెక్టులు నిండిన తర్వాతనే దిగువున ఉన్న తెలంగాణ, ఆంధ్రాకు నీళ్లు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులను నిర్మించడం శ్రేయస్కరం కాదు. శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలకు నీరు పోనూ మిగిలిన జలాలను దిగువున ఉన్న నాగార్జునసాగర్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వాడుకోవాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్‌లోకి గోదావరి జలాలను మళ్లించేందుకు వీలుగా దుమ్ముగూడెం ప్రాజెక్టును ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్మిస్తే శాశ్వత ప్రయోజనం లభిస్తుంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాగునీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపటితే మెట్ట ప్రాంతాలు సస్య శ్యామలమవుతాయి. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది శుభ పరిణామం. 58 ఏళ్ల పాటు ఒకే పాలన కింద ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ఉండేవి. యాసలు వేరైనా తెలుగు భాష ఒక్కటే. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేందుకు దుబాసీలు, మధ్యవర్తులు అక్కర్లేదు. ఒక మంచి పని జరుగుతుంటే విఘ్నాలు కల్పించే పార్టీలు ఎక్కడైనా ఉంటాయి. వారి విమర్శలను పట్టించుకోకుండా- రెండు రాష్ట్రాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, రెండు దఫాల చర్చల వల్ల ఫలితాలు రావు. విభజన సమస్యలతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై నిపుణులతో కమిటీలను వేయాలి. ఇద్దరు సీఎంలు తరచూ కలుస్తూ, సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలి. కృష్ణా, తుంగభద్ర ప్రాజెక్టులపై వరదల కాలంలో నీటిని తోడేందుకు ఉమ్మడిగా ఆనకట్టలను నిర్మించుకుని పొలాలకు నీటిని మళ్లించవచ్చు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురుచూడడం అనవసరం. దక్షిణాది రాష్ట్రాల పట్ల గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో పిల్లిమొగ్గలు వేయడం, కాలయాపన చేయడం మినహా చేసిందేమీ లేదు. రెండు రాష్ట్రాలు భవిష్యత్తులో తగాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలి. రెండు రాష్ట్రాలు బాగుపడేందుకు ఇదే మంచి సమయం. ఈ పని ఇప్పుడు చేయకుంటే- భవిష్యత్తులో ఇంతటి మంచి అవకాశం మరెప్పుడూ రాదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097