మెయన్ ఫీచర్

ఉత్తరాంధ్ర గోడు ఆలకించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీళ్లు, నిధులు, నియామకాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనాదిగా తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే ఇపుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘ఉత్తరాంధ్ర గోడు’ ఆలకించి, దానిపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. లేని పక్షంలో సమీప భవిష్యత్‌లోనే ఈ ప్రాంత ప్రజలలో చెలరేగుతున్న అసంతృప్తి తీవ్రమై ఉద్యమబాట పట్టే అవకాశం వుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతం అనడంలో ఎవరికీ సందేహం లేదు. పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండటం, వౌలిక సదుపాయాలకు నోచుకోకపోవడం ఈ ప్రాంత ప్రజల ప్రస్తుత దుస్థితికి తార్కాణం. ఈ విషయానే్న గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా గణాంకాలతో పేర్కొన్నది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఉత్తరాంధ్ర ‘ఉత్త ఆంధ్ర’గా మారే ప్రమాదం ఉన్నది.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ‘ఉత్తరాంధ్ర అజెండా- 2019 ఎన్నికలు’ అంశంపై మూడు జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో సదస్సులు, సమావేశాలు ఏర్పాటుచేసాము. ‘ఉత్తరాంధ్ర గోడు’ను ఒక అజెండాగా రూపొందించి అన్ని రాజకీయ పార్టీలకు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చి, తమ తమ ఎన్నికల ప్రణాళికలలో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పొందుపరిచి ‘ఉత్తరాంధ్ర గోడును ఆలకించమని’ కోరాము. అయితే, ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు, మద్యం, డబ్బు పంపిణీ తదితర అంశాలకే అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయే తప్ప ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఏ ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం- ఈ ప్రాంతం పట్ల అన్ని రాజకీయ పార్టీలకు వున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా విశేషంగా కృషిచేస్తున్న ప్రొఫెసర్ కె.ఎస్.చలం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వి.రమణ, మాజీ ఎంపీ డా.డీవీజీ శంకరరావు, రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణ, నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముత్యాల నాయుడు తదితరులు ‘ఉత్తరాంధ్ర డిక్లరేషన్’ను రూపొందించి మార్చి రెండవ వారంలో విడుదల చేశారు. నిపుణులు రూపొందించిన ‘ఉత్తరాంధ్ర డిక్లరేషన్’ను నూతన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అధ్యయనం చేసి ఉత్తరాంధ్ర గోడును అర్థం చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
ఉత్తరాంధ్ర ప్రజల ప్రధానమైన ఆకాంక్ష జలవనరులు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే సాగునీరు, తాగునీరు అవసరం. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్దగెడ్డ, కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వగెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి నదులకూ, నిత్యం ప్రవహించే సెలయేళ్ళకూ ఆలవాలం ఈ ప్రాంతం. రాష్ట్రం మొత్తంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో సాగునీటి సౌకర్యాలు కనీస స్థాయిలో కూడా లేవు. ఈ నదులలో, సెలయేళ్ళలో ప్రవహించే జలాలను సక్రమంగా వినియోగిస్తే ఉత్తరాంధ్రలో సాగుకు అనువైన ప్రతి ఎకరానికి నీటి పారుదల సౌకర్యం కలిగించవచ్చు. ఉత్తరాంధ్రను వ్యవసాయోత్పత్తులలో అన్నపూర్ణగా మార్చవచ్చు. దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాల ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, ప్రస్తుతం అందులో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా కాలువల కింద సాగునీటి పారుదల సౌకర్యం లేదు. అత్యంత ప్రాధాన్యత గల సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై ఉమ్మడి రాష్ట్రంలోను, ఇపుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం వెనుకబడి పోతోంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జీవనాడి బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్. దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇది పూర్తయితే దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వలసలను కూడా అరికట్టవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను తక్షణమే ప్రారంభించి, నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని మూడు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని అంటున్న ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రలోని పంట భూములన్నిటికీ సాగునీరు, అన్ని పట్టణాలకూ, గ్రామాలకూ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై శ్రద్ధచూపుతూ బడ్జెట్‌లో సంవత్సరానికి కనీసం 5 వేల కోట్ల రూ పాయలను కేటాయించి, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలి.
సాగునీటికి, తాగునీటికి ఉద్దేశించిన పథకాలను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళించకూడదని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రవహించే నదుల్లో ఎక్కువ భాగం ఒడిశాలో పుట్టిన అంతర్రాష్ట్ర నదులు కనుక ఆ రాష్ట్రంతో చర్చలకు, సామరస్య పూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నించి ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించాలి.
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర సగటు అక్షరాస్యత (67.4 శాతం) కన్నా తక్కువ అక్షరాస్యతతో (విశాఖపట్నం 66.9 శాతం, శ్రీకాకుళం 61.7 శాతం, విజయనగరం 58.9 శాతం) ఉన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలలో అక్షరాస్యతలో విజయనగరం 13వ స్థానంలో, శ్రీకాకుళం 11వ స్థానంలో, విశాఖపట్నం 8వ స్థానంలో ఉన్నాయంటే విద్యారంగంలో ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడి ఉందో స్పష్టమవుతుంది. పంతొమ్మిదో శతాబ్ది చివరికి విద్యల నగరంగా ఉండిన విజయనగరం ఇరవయ్యొకటో శతాబ్దిలో అక్షరాస్యతలో చిట్టచివరికి చేరడం, దాన్ని సవరించడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం, తగిన నిధులు కేటాయించి విద్యా సౌకర్యాలు కలిగించకపోవడం కొట్టవచ్చినట్టు కనబడుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విషయంలో, కళాశాల, విశ్వవిద్యాలయాల రంగంలోనూ ఈ నిర్లక్ష్యం కొనసాగుతూనే వుంది. నూతన ప్రభుత్వం ‘అమ్మఒడి’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి.
ఉత్తరాంధ్రలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉంది. మూడు జిల్లాల్లోను ఆదివాసీ ప్రాంతాలున్నాయి. వీరి అభివృద్ధి కోసం 2012లో విడుదలైన ‘అరకు డిక్లరేషన్’ను- ఏజెన్సీ ప్రాంతాలలో అమలుచేయవలసిన అభివృద్ధి పథకాల గురించి, విధానాల గురించి వివరమైన సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక అస్థిత్వాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టడం, 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అన్యాక్రాంతమైన భూములను తిరిగి ఆదివాసులకు అప్పగించడం, రాజ్యాంగం 73, 74 సవరణల ప్రకారం, పంచాయితీరాజ్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో పంచాయితీ పాలనను ప్రవేశపెట్టడం, గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, బాక్సయిట్ తవ్వకాలను ఆపివేయడం వంటి ఎన్నో డిమాండ్లను గిరిజనులు ముందుకు తెస్తున్నారు. ఆదివాసీల గోడును ప్రభుత్వం ఆలకించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలి.
ఉత్తరాంధ్రకు నీళ్లు, నిధులు, నియామకాలలో నిర్దిష్టమైన వాటాను కేటాయించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014, సెక్షన్ 46(3)లో నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలి. ఆ ఆర్థిక ప్యాకేజీ- ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌లో కనీసం 15 శాతం (విస్తీర్ణాన్ని బట్టి) నుంచి 20 శాతం (జనాభాను బట్టి) ఉండాలి. అంటే రాష్ట్ర బడ్జెట్ ప్రకారం ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి రూ.22,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లు నిధులు అవసరం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్ ఖండ్, బొలంగీర్-కలహండి-కోరాపుట్ తరహా ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న విధంగా ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిగల అభివృద్ధి మండళ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలుగులు నింపే, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలుకావాలంటే, ప్రభుత్వం తరఫున అదే లక్ష్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి. ఈ మండలిలో చిత్తశుద్ధిగల వారిని నియమించాలి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను, వారి గోడును ఆలకించే వారిని ఈ మండలిలో భాగస్వామ్యం చేయాలి. విద్య, ఉపాధి, తదితర రంగాలలో స్థానికుల హక్కులను కాపాడాలి. అందుకోసం వారికి తగిన రిజర్వేషన్లను కల్పించాలి. నూతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసి ఈ ప్రాంతంలో ఉన్న స్థానికులు, స్థానికేతరుల సంఖ్యను ముందుగా తేల్చాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో లాభదాయకంగా పనిచేసేందుకు వీలుగా క్యాప్టివ్ మైన్‌లను ఏర్పరచాలి. హైకోర్ట్ బెంచ్‌ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలి. ఉత్తరాంధ్ర భాష, సంస్కృతి, పలుకుబడులను పరిరక్షించేందుకు తగుచర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్ర భాష, యాసలను కించపరిచే విధంగా వస్తున్న సినిమాల, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
ఉత్తరాంధ్రలో మత్స్యకారులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలి. ముఖ్యంగా వారికి కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనపరచుకొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్థులు అధిక శాతంలో ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం రెల్లి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకొని, భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విశాఖలోని ‘విమ్స్’ ఆసుపత్రిని ఎయిమ్స్ వలే అభివృద్ధిచేయాలి. విశాఖ మెట్రో రైల్ పనులను వెంటనే చేపట్టాలి. విశాఖపట్నం ప్రముఖ పారిశ్రామిక కేంద్రం కూడా కావడంతో ఈ ప్రాంతం మరో భోపాల్ కాకుండా పర్యావరణ పరిరక్షణకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులను వెంటనే ప్రారంభించాలి. విశాఖ పోర్ట్‌కు అనుబంధంగా భావనపాడు, నక్కపల్లిలలో శాటిలైట్ పోర్టులను నిర్మించాలి.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను సత్వరం కల్పించాలి. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడానికి తగుచర్యలు తీసుకోవడంతోపాటు నిర్వాసితులకు తగు పరిహారం, పునరావాసం పనులను సత్వరం చేపట్టాలి. విస్తారమైన సహజ వనరుల, వౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, జాతీయ రైలు మార్గం, వెడల్పయిన రహదారులు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ వనరులు, అన్నిటికన్నా సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రనే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఇక్కడి ప్రజల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడటం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్థిక, పాలనా విధానాలు లేవు. కనుక ‘మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి’, ‘మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు’ అని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ ఆకాంక్షను నూతన ప్రభుత్వం ముందుకు ఎలుగెత్తవలసిన అవసరం వచ్చింది.
ఉత్తరాంధ్ర మనుగడకూ, ఆకాంక్షకూ, నినాదానికి, స్వప్నానికీ ఏమవుతున్నదో, ఎందుకు ధ్వంసమైపోతున్నదో గుర్తించవలసిన చారిత్రక సమయం ఆసన్నమైనది. పురోభివృద్ధి సాధించవలసిన ఈ ప్రాంతం, పురోగమనానికి అవసరమైన అన్ని సహజ వనరులూ ఉండి కూడా- ఎందుకు నానాటికీ వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నదో తెలుసుకోవలసిన చారిత్రక సమయం ఆసన్నమయింది. ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల సాగుతున్న నిర్లక్ష్యం, వనరుల విధ్వంసం, అభివృద్ధి రాహిత్యం అనే ముప్పేట దాడిని అడ్డుకోవడానికి కనీసం చెయ్యి అడ్డుపెట్టవలసిన బాధ్యత ఉత్తరాంధ్ర బిడ్డలపై ఉంది. ఆ బాధ్యతను చేపట్టవలసిన అనివార్య తరుణం ఆసన్నమయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఫలాలలో ఈ ప్రాంత ప్రజల న్యాయమైన వాటాకోసం ఎలుగెత్తవలసిన సమయం, నిలదీయవలసిన సమయం ఆసన్నమయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, ఈ ప్రాంత ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వారి గోడును, ప్రజాఆకాంక్షలన్నింటినీ సవివరంగా ప్రభుత్వం ముందుకుతేవడం, ఈ ఆకాంక్షలు పాలకులు ఆలకించే విధంగా అన్నిరకాల ప్రచారం, ఉద్యమ నిర్మాణం, సంఘీభావ సమీకరణ వంటి ప్రయత్నాలకూ పూనుకోవడం ఈ ప్రాంతపు బిడ్డలు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, యువజనులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అన్ని ప్రజాసంఘాల బాధ్యత. ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసినపుడే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం కొంతైనా అభివృద్ధి చెందుతుంది.
ఉత్తరాంధ్ర ప్రజలవి గొంతెమ్మ కోర్కెలు కావు. న్యాయబద్ధమైనవి. సహేతుకమైనవి. చట్టబద్ధమైనవి. కాబట్టి వీటిని ప్రభుత్వం తన ఎజెండాలో పొందుపరిచి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తమకుగల చిత్తశుద్ధిని, నిజాయితీని ప్రకటించడంలో మొదటి అడుగువేయాలి.

-కొణతాల రామకృష్ణ కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక