మెయన్ ఫీచర్

ఎన్నికల ప్రచారాస్త్రంగా ‘యుద్ధం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు వస్తే చాలు.. హామీల సునామీ మనకు కొత్తేమీ కాదు. గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, తాము అధికారంలోకి రాగానే సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం పరిపాటి. ఒకప్పుడు జాతీయ అంశాలు ఎన్నికల వేళ ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉండేవి. ఆ తర్వాత జాతీయ సమస్యలు ప్రధానాస్త్రాలుగా మారాయి. కూడు, గూడు, గుడ్డ ఉంటే చాలు అనే భావనతో ఉన్న భారతీయ సమాజం అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, శాస్ర్తియ, విజ్ఞాన పరిణామాల అనంతరం ఆధునికతను సంతరించుకుంది. రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల్లో ప్రచారాస్త్రాలను సంధిస్తూ, ఓటర్లను ఆకర్షిస్తూ గెలుపే ప్రధానంగా పనిచేస్తున్నాయి. హామీలను నిలబెట్టుకోని పార్టీలను ప్రజలు ఇంటిముఖం పట్టిస్తున్నారు. ఈ ధోరణి కూడా మారుతోంది.
చాలా దేశాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆర్థిక,రక్షణ, సరిహద్దు అంశాలతో పాటు వైరి దేశాలపై యుద్ధకాంక్షను వ్యక్తం చేస్తూ ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి. కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చేస్తున్న హెచ్చరికలు, దానికి ప్రతిగా ఇరాన్ దీటైన సమాధానం ఇవ్వడం చూస్తుంటే భారత్‌లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాక్‌తో జరిగిన కవ్వింపులు పతాకస్థాయికి చేరిన వ్యవహారాలు గుర్తుకురాక మానవు. దానికి కారణం ఒక్కసారి ఆలోచిస్తే అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2021 జనవరి 5న కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఫలితాలను ప్రకటిస్తారు. 2021 జనవరి 20న కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది.
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికల బరిలోకి దిగి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని ఉవ్విళ్లూరుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో తాను పూర్తి చేయదలచిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి, సరిహద్దు సమస్యలు, మెక్సికో ఒత్తిడి , ఆర్ధిక సమస్యలు, విదేశీయుల వలస అంశాలను ప్రధానంగా తెరమీదకు తెచ్చి ట్రంప్ అందరి అంచనాలను తలకిందులు చేసి తొలిసారి అధ్యక్షుడయ్యారు. స్ర్తిలోలుడనే ప్రచారాన్ని ట్రంప్‌కు వ్యతిరేకంగా తీసుకువచ్చినా అమెరికా పౌరులు దానిని పట్టించుకోలేదు. సరికదా స్థానికులకు ఉపాధి కల్పించాలనే కాంక్షకే అతనికి ఎక్కువ మార్కులు వేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో అదే అస్త్రాన్ని మరోమారు ప్రయోగించడానికి కుదరదని గ్రహించిన డోనాల్డ్ ట్రంప్ యుద్ధ హెచ్చరికలను చేస్తున్నారు.
అమెరికాలోని పరిణామాలతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. చైనాపై విధించిన ఆంక్షలతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా ఏకపక్షంగా ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. 20వేల కోట్ల రూపాయల విలువైన చైనా ఉత్పత్తులపై అకస్మాత్తుగా సుంకాన్ని పెంచింది. మరో 30వేల కోట్ల వస్తువులపై సుంకాల మోతను మోగించింది. అమెరికా బెదిరింపులకు తాము లొంగేది లేదని చెప్పిన చైనా అమెరికాకు చెందిన ఆరువేల కోట్ల డాలర్ల వస్తువులపై 25 శాతం మేర సుంకాలను విధించింది. ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య తలెత్తిన ఈ యుద్ధం కేవలం దైపాక్షిక వాణిజ్యానికే పరిమితం అవుతుందని అనుకోలేం. ఈ రెండు దేశాలతో సన్నిహిత వాణిజ్య సంబంధాలున్న మిగిలిన దేశాలపై కూడా దీని ప్రభావం అనివార్యం. వాణిజ్య రంగంలో తలెత్తిన ఈ యుద్ధం రాజకీయ రంగానికీ విస్తరించే ప్రమాదం లేకపోలేదు.
1930లో ఆర్థిక మహా మాంద్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిందనేది సుస్పష్టం. దాంతో ఫాసిస్టు శక్తులు ఎలా పెట్రేగిపోయాయో కూడా ప్రపంచం చూసింది. క్యూబా, వెనుజులా, ఇరాన్‌లపై అత్యంత దుర్మార్గమైన ఆర్థిక ఆంక్షలు అమలుచేస్తున్న అమెరికా- ఆసియా దేశాలపై ముఖ్యంగా భారత్‌పై పరోక్ష ఆంక్షలను విధిస్తూనే ఉంది. బెల్టు అండ్ రోడ్ పేరుతో చైనా వేస్తున్న పెద్ద పెద్ద అంగలకు ముకుతాడు వేయాలని అమెరికా చూడటం తప్పులేదు. కానీ చైనాను అదుపుచేసేందుకు భారత్‌కు మొట్టికాయలు వేయాలని చూడటం సరికాదు. అమెరికా ఆంక్షలతో లక్షలాది కుటుంబాలు ఉపాధి సమస్యలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇంకో పక్క ఇరాన్ సహా పలు దేశాలపై సైబర్ దాడులకు అమెరికా తెగబడుతోంది. కానీ ఏ మాత్రం వెరవని ఇరాన్ అమెరికాకు చెందిన డ్రోన్‌ను కూల్చేసింది. తాము యుద్ధానికి ఎపుడైనా సిద్ధమేనని హెచ్చరించింది. ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచారాన్ని ఆడంబరంగా ప్రారంభించిన డోనాల్డ్ ట్రంప్ కాస్తా వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి కన్నుకుట్టేలా ఎదిగిందని, దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని పరోక్షంగా డెమోక్రాట్లను, వైరి దేశాలనూ హెచ్చరించారు.
అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి పలికితే ఇరాన్‌కు తాను మంచి స్నేహితుడిని అవుతానని, అపుడే ఇరాన్ ధనిక దేశంగా ఎదుగుతుందని ట్రంప్ చెబుతున్నారు. మరో పక్క ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న ఐరాస ఉద్రిక్తతలను పెంచొద్దని ఇరుదేశాలనూ హెచ్చరించింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ తరఫున గూఢచర్యం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక గుత్తేదారుడికి ఇరాన్ మరణ శిక్షను అమలుచేసింది. మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక వౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైబర్ దాడులను పెంచింది.
యుద్ధం మానవ సమాజానికి కొత్త కాదు, ఏదో ఒక రూపంలో అనాదిగా అనేక రకాల ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. నాయకత్వం, సైన్యం, దేశ ప్రజలు ఈ మూడు వర్గాలకు యుద్ధానికి సంబంధించి వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. ‘దేశాలు యుద్ధాలు ఎందుకు చేస్తాయి?’ పేరిట జాన్ స్టోస్పింగర్ రాసిన పుస్తకంలో యుద్ధ కాంక్ష, లక్ష్యాలు, తీర్పు గురించి చక్కగా రాశారు. యుద్ధంలో ఇరు పక్షాలూ తమ లక్ష్యం చాలా ధర్మబద్ధమైనదేనని చెప్పుకుంటాయి. యుద్ధం మొదలుపెట్టే పక్షంలో దాని ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావంతోనే ఉంటాయి. శత్రుపక్షం స్థితిని తప్పుగా అంచనా వేస్తుంటారు. వారు తమకంటే తక్కువే అనే భావనతో ఉంటారు. నాగరిక సమాజంలో దాదాపు అన్ని దేశాలూ ఏదో ఒక సమయంలో యుద్ధంలో పాల్గొన్నవే. యు ద్ధంలో పాల్గొనని దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు. జనాభా పెరిగే కొద్దీ అక్కడి వనరులు స్థానికులకు సరిపోవు, దాంతో ఇతర ప్రాంతాల వనరులపై ఆధిపత్యం సంపాదించడానికి యుద్ధాలు అనివార్యమవుతాయి, పనిలోపనిగా యుద్ధం కారణంగా చెలరేగే హింస, అంటువ్యాధులు, కరవు, ఇతర ఉత్పాతాలతో అక్కడ జనాభా కూడా తగ్గుతుంది. ఉన్న కొద్ది మందీ అక్కడి నుండి వలస వెళ్లాలని చూస్తుంటారు. దీనే్న ‘మాల్తూసియన్ సిద్ధాంతం’ అంటాం. దీన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాగా జీర్ణించుకున్నారు.
మన దేశంలో తొలుత నక్సలైట్ల ఉద్యమం, నేడు మావోయిస్టు ఉద్యమం, కశ్మీర్‌లో తీవ్రవాదం ఇవన్నీ యూత్‌బల్ట్ సిద్ధాంతం కిందకు వస్తాయి. సౌకర్యవంతమైన జీవనం, ఉపాధి లేక నిరుద్యోగం పెరిగి హింసవైపు చూసే దృక్పథ పెరగడమే ఈ సిద్ధాంతం. ఇది సహజంగా సరిహద్దుల్లో ఎక్కువగా ఉంటుంది. దీనినే శామ్యూల్ హింటింగ్‌టన్ స్వల్పంగా మార్పులు చేసి ‘సంఘర్షణ సిద్ధాంతం’గా మలిచారు. ఇవన్నీ అర్థం కాకముందే అనేక యుద్ధాలు జరిగాయి. ప్రధానంగా 9 నుండి 13 శతాబ్దాల్లో పెచెనెగ్మరియు క్యూమన్ దళాలు రుస్‌పై చేసిన దోపిడీ యుద్ధం, క్రీ.పూ 326 నుండి 323 మధ్య కాలంలో అలగ్జాండర్ దండ యాత్రలు, చైనా- ఫ్రెంచి వలస యుద్ధాలు, అల్జీరియా సామ్రాజ్యవాద యుద్ధం, క్రూసేడుల మత యుద్ధాలు, స్పానిష్ వంశపారంపర్య యుద్ధాలు, నల్లమందు యుద్ధంగా పిలిచే వాణిజ్య యుద్ధం, ఫ్రెంచి విప్లవం, పెనిన్సులార్ గెరిల్లా యుద్ధాలు, స్పానిష్ అంతర్యుద్ధం, అమెరికా స్వతంత్య్ర యుద్ధం ఇవన్నీ ఒక ఎత్తు. ఆ తర్వాత జరిగిన యుద్ధాలు మరో ఎత్తు. రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగించడంతో యుద్ధం రూపు రేఖలు మారిపోయాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల భారత్ ఇప్పటికే ఎంతో నష్టపోయింది. ఒకపుడు ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకున్న అతిపెద్ద దేశం భారత్. అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులను తగ్గించుకుంటూ వచ్చింది. ఇరాన్ ఇరుగుపొరుగు దేశాల నుండి దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. యుద్ధమే కనుక వస్తే తన భూభాగం నుండి భారత్‌కు దిగుమతులను ఇరాన్ అనుమతించదు. పైగా అరేబియా ద్వీపకల్పంలో 70 లక్షల మంది భారతీయులున్నారు. కువైట్, ఖతార్, బెహ్రైన్ , యూఏఈ , ఒమన్‌లలో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఆ కారణంగా ఇరాన్ సైనిక దళాలు వాటిపై దాడులకు పాల్పడితే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పవు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అంటే ఇదే!

-బీవీ ప్రసాద్ 98499 98090