ఎడిట్ పేజీ

అమెరికా దూకుడుకు భారత్ పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి, సరళీకృతం చేయడానికి ప్రారంభమైన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ (డబ్ల్యూటీవో) పై అమెరికా ‘పెద్దన్న’ పాత్ర ఇక ఎంతో కాలం కొనసాగే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గ్రహించిన అమెరికా కొద్ది రోజులుగా తాను ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి తప్పుకుంటానంటూ గాండ్రింపులు ప్రారంభించింది. దానికి కారణాలు లేకపోలేదు. చాలా దేశాలు అమెరికా వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘనను తప్పుపట్టడమే. మరోవైపు- 1947లో ప్రారంభమైన డబ్ల్యూటీవో మతలబులు ప్రపంచంలో అన్ని దేశాలకూ ఇంతకాలానికి తెలిసివచ్చాయి.
డబ్ల్యూటీవో ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో చిన్న పెద్ద, ధనిక పేద దేశాలు అనే వివక్ష లేకుండా అన్ని దేశాలనూ సమానంగా చూడటం, పరస్పరం సహకరించుకోవడం, అన్ని దేశాల పట్ల మిగిలిన వారు బాధ్యతగా వ్యవహరించడం, అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించడం, భద్రతా కవాటాలను వాడుకోవడం ద్వారా అందరికీ సహజ వనరులను అందించాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సహజ వనరులను వినియోగించుకోవడం, కొరత ఉన్న వారికి కొరత తీర్చడం దీని లక్ష్యం.
ఆ క్రమంలోనే వాణిజ్యంపై రూపొందించుకున్న సాధారణ ఒప్పందానికి బదులు అధికారికంగా మారికేష్ ఒప్పందాన్ని డబ్ల్యూటీవో 1995 జనవరి 1 నుండి అమలులోకి తెచ్చింది. ‘గాట్’ ఆధ్వర్యంలో ఇంతవరకూ ఏడు రౌండ్ల చర్చలు జరిగాయి. మొదటి ‘గాట్’ చర్చల్లోనే సుంకాన్ని మరింత తగ్గిచడంపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత కెనడీ రౌండ్‌లో దిగుమతి నిరోధక ఒప్పందం, టోక్యో రౌండ్‌లో సుంకాల రూపంలోనే కాకుండా వాణిజ్య ఆటంకాల బాధ్యతను కూడా తీసుకోవల్సి వచ్చింది. ఈ ఒప్పందాలను సభ్య దేశాలన్నీ నిర్బంధంగా అమలు చేయాల్సిందే. 1986-94 మధ్య జరిగిన 8వ గాట్ చర్చలు- ఉరుగ్వే రౌండ్ ద్వారా ప్రపంచ వాణిజ్యంలో ఎదురయ్యే సమస్యలన్నీ అర్థం చేసుకోవడం జరిగింది. వాణిజ్య వ్యవస్థను పలు కొత్త రంగాలు ప్రత్యేకంగా సేవలు, మేధో సంపత్తి వాణిజ్యంలో విస్తరించడానికి, వ్యవసాయం, నేత పరిశ్రమల్లో వాణిజ్యాన్ని సంస్కరించడానికి చర్చలు జరిగాయి. డబ్ల్యూటీవోకు అనుబంధంగా దాదాపు 60 ఒప్పందాలున్నాయి. అవన్నీ ఆ సంస్థ లక్ష్యాలు నెరవేర్చడం, వస్తువులు- పెట్టుబడి బహు పాక్షిక ఒప్పందాలు, సేవల్లో వాణిజ్యంపై సాధారణ ఒప్పందం, మేధో సంపత్తి హక్కుల వాణిజ్య సంబంధాల ఒప్పందం (ట్రిప్స్), వివాదాల పరిష్కారం (డిఎస్‌యూ), వైద్య సంబంధిత ఫైటోవైద్య ఒప్పందం , వాణిజ్యానికి సాంకేతిక హద్దులపై ఒప్పందం, ప్రభుత్వాల వాణిజ్య విధానాల సమీక్షలు (టీపీఆర్‌ఎం) కీలకమైనవి అని చెప్పవచ్చు.
మరింత లోతుగా పరికించి చూస్తే డబ్ల్యూటీవో లక్ష్యాలు సమున్నతమైవే అని చెప్పవచ్చు. పేద దేశాలు సైతం అగ్రదేశాల సరసన స్వేచ్ఛా వాణిజ్యం చేయగలిగే స్థాయికి తీసుకురావడానికి 2001లో దోహా డెవలప్‌మెంట్ అజెండాను ప్రారంభించింది. దిగుమతుల్లో కల్లోలాల నుండి రైతులను రక్షించడానికి ఒక ప్రత్యేక రక్షిత ప్రామాణిక సూచికలను రూపొందించింది. 164 సభ్య దేశాలు, 30 దేశాలు పరిశీలకులుగా కొనసాగుతున్నాయి. ఏదైనా ఒక దేశం మరో దేశ వాణిజ్య అంశాలపై సవాలు చేయదల్చుకుంటే డబ్ల్యూటీవో ముందు క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. 30 రోజుల వ్యవధిలో ఆ క్లెయిమ్‌పై డబ్ల్యూటీవో కమిటీ స్వీకరణ లేదా తిరస్కరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. తిరస్కరణ చేయాలంటే ఏకాభిప్రాయం అవసరం. స్వీకరించిన క్లెయిమ్‌ను పరిశీలించి కమిటీకి 60 రోజుల్లో పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కమిటీ సానుకూలంగా ఉభయ పక్షాలతో చర్చించి ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తుంది. ఒక వేళ ఏకాభిప్రాయం సాధించలేని పక్షంలో కమిటీ స్వీయ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
సుంకాలు లేని స్వేచ్ఛా వాణిజ్యం దేశాల మధ్య ఆర్థిక పోటీతత్వాన్ని పెంపోందిస్తుంది. దీనివల్ల ఉత్పత్తి, వాణిజ్యం పెరిగి వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులు లభిస్తాయి. ఆయా దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. మరోపక్క దిగుమతుల ధరలు పెంచుతాయి. ప్రపంచ జాతీయ ఆదాయాల్లో మూడో వంతు స్వేచ్ఛా వాణిజ్యం వల్లనే సమకూరుతుందని ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు వెన్నుదున్నగా నిలిచే ఒక నిర్ణయం ఇటీవల వెలువడింది.
ప్రపంచ వాణిజ్య సంస్థపై పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాపై వాణిజ్య వివాదంలో భారత్ ఘన విజయం సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్ చేసిన వాదనే నెగ్గడంతో అమెరికా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై దాఖలు చేసిన కేసులో భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వివాదాల పరిష్కారాల కమిటీ తీర్పు ఇస్తూ పునరుద్ధరణీయ ఇంధన వనరుల రంగంలో అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలు ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. అమెరికా చేపట్టిన చర్యలు, సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్), డబ్ల్యూటీవో నిబంధనల్లోని కొన్ని అంశాలకు అనుగుణంగా లేవని కూడా తేల్చి చెప్పింది. భారతదేశానికి రావల్సిన ప్రయోజనాలను అమెరికా రద్దు చేసిందని వివాదాల పరిష్కారాల కమిటీ గుర్తించింది. అమెరికాలోని 8 రాష్ట్రాలు ఇస్తున్న సబ్సిడీలపై భారతదేశం 2016 సెప్టెంబర్‌లో డబ్ల్యూటీవోను ఆశ్రయించింది. కస్టమ్స్ సుంకాల లాంటి వాణిజ్య అడ్డంకులను తొలగించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయాలనేదే ‘గాట్’ ఉద్దేశం. కానీ పునరుద్ధరణీయ ఇంధన వనరుల రంగంలో అమెరికా అమలుచేస్తున్న పది చర్యలు 1994 నాటి గాట్ నిబంధనలకు అనుగుణంగా లేవని భారత్ నిలదీసే సరికి డబ్ల్యూటీవో తేల్చి చెప్పాల్సి వచ్చింది. వాషింగ్టన్, కాలిఫోర్నియా సహా 8 రాష్ట్రాలు ఈ రంగంలో సబ్సిడీలు ఇస్తున్నాయి. దానివల్ల అక్కడి ఉత్పత్తుల కంటే భారత్ వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. డబ్ల్యూటీవో తాజాగా ఇచ్చిన తీర్పును ‘అప్పిలెట్’లో సవాలు చేయడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లపై ఎక్కువ పన్ను విధిస్తోందని భారత్‌ను అమెరికా నిలదీయడం తదనంతర పరిణామాలు తెలిసినవే. దీంతో పాటు 28 రకాల అమెరికన్ ఉత్పత్తులపై భారత్ అధిక కస్టమ్స్ సుంకాలను విధిస్తోందని వాదించిన అమెరికా చివరికి ఎగుమతి ప్రోత్సాహకాలను ఉపసంహరించుకుంది. అమెరికా చర్యలను లోతుగా అధ్యయనం చేస్తున్న భారత్ ఒక పక్క విదేశీ వ్యవహారాల విధానంలో ఎలాంటి పెను మార్పులకూ పాల్పడకుండానే మాటల ద్వారా అమెరికాను గాడిలోకి తెచ్చే ఎన్నో చర్యలను ఇటీవలి కాలంలో చేపట్టింది.
వాస్తవానికి డబ్ల్యూటీవో కేవలం వాణిజ్య వ్యవహారాలకే పరిమితం కాలేదు. ఉపాధి, పెట్టుబడి, పరిమిత వ్యాపార ఆచరణలు, సరకు ఒప్పందం సహా వాణిజ్యంతో పరోక్షంగా సంబంధం ఉన్న అంశాలను కూడా నిర్వహిస్తుంది.
ఇలా ఎంత కాలం..?
ఇప్పటికే దాదాపు 110 దేశాలు 573 కేసులను దాఖలు చేశాయి. వాటి పరిష్కారానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలీదు. 51 దేశాలు కేసులు దాఖలు చేయగా, వాటిని 60 దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసుల్లో 88 దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ద్వైపాక్షిక అవగాహన కుదరనపుడు ఒక కన్సల్టేషన్ కమిటీని డబ్ల్యూటీవో నియమిస్తుంది. బ్రెజిల్, కెనడా, చైనా, యురోపియన్ యూనియన్, ఇండియా, జపాన్, కొరియా, మెక్సికో, నార్వే, రష్యా, థాయిలాండ్, అమెరికా అత్యధిక కేసులను ఎదుర్కొంటున్నాయి. అనేక దేశాలు చేసిన ఫిర్యాదుల్లో సింహభాగం అమెరికాపైన చేసినవే. భారత్ వరకూ వచ్చే సరికి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, యుఎస్, కెనడా, గ్యాటిమల, జపాన్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, చైనా, యురోపియన్ యూనియన్‌లతో కేసులను ఎదుర్కొంటోంది.
స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడంలో భాగంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలకు ఇష్టమున్నా లేకున్నా ఆర్థిక వాణిజ్య సంస్కరణలను చేపట్టాయి. ఈక్రమంలో తూర్పు ఆసియా దేశాలు ముందంజలో ఉండి అభివృద్ధి సాధిస్తున్నాయనేది నిస్సందేహం. అమెరికా పరిస్థితి ఏమిటంటే కొంతకాలం గడిచాక భారత్‌కు ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతి చేసుకునే వస్తువులే ఎక్కువగా ఉంటాయి. దాంతో రానున్న ముప్పును ఎదుర్కొనే చిట్కాలను ఇప్పటి నుండే అమెరికా ప్రయోగిస్తోంది.
నిజానికి అమెరికా ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థలో తనదే పైచేయిగా నిరూపించుకోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ అంతర్జాతీయ విపణిలో భారత్ అగ్రస్థానాన్ని సాధించే రోజు ఎంతో దూరంలో లేదు.

-బీవీ ప్రసాద్ 98499 98090