మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మాటలు విన్న దమయంతి తొల్లి హంస చెప్పిన నాటి నుండి నలునిపై తన వలపు నిలుపుకొని కృంగికృశిస్తూ ఉన్నట్టిది ఇప్పుడు నలుడినే కనులారా చూచింది. కానీ నలుని మాటలను విన్న తరువాత మిక్కిలి దుఃఖించింది. అయినా దుఃఖాన్ని దిగమ్రింగుకొని చిరునవ్వుతో నలునికి నమస్కరించి...
రాజోత్తమా! మానవ మాత్రురాలైన నేనెక్కడ? దేవతలైన ఇంద్రాదులెక్కడ? నేను వారిని సదా నమస్కరించి అర్చిస్తాను గదా?
ఓ నలమహారాజా! నేను ఎప్పటికి నీ సొత్తును! నీ గుణాలు ఆ రాజహంస వక్కాణించిన నాటినుండి నినే్న సదా నా మనసులో నిలుపుకొని నీవే నా సర్వస్వమని భావిస్తున్నాను. ఈ విషయము నీకు బాగా తెలుసు. ప్రభూ! దయచేసి నన్ను వివాహం చేసుకో! హంస చెప్పిన మాటలే నన్ను దహిస్తున్నాయి.
ఓ నిషధ దేశాధిపతీ! రాజా! దయచేసి నాకు పతిగా ఉండటానికి అంగీకరించమని ప్రార్థించుచున్నాను. నీ రాకకొరకేగదా ఇపుడు ఈ రాజులందరిని ఆహ్వానించవలసి వచ్చింది?
జగమంతా ప్రసిద్ధిగాంచిన యశస్సుచేత వెలుగొందే వాడివి. కరుణించి నీవు నా భర్తగా ఉండటానికి సమ్మతించకపోతే, నినే్న ఆరాధించే నన్ను గూర్చి నీవు మరో విధంగా చెప్పితే నీ కారణంగానే మరణించటానికి విషంత్రాగి లేదా నిప్పులోదూకి లేదా నీటిలోపడి లేదా రజ్జువులను ఏర్పాటుచేసికొంటాను. ఉరిపోసుకొని ప్రాణత్యాగం చేస్తాను’’ అని దమయంతి తన నిర్ణయాన్ని కుండబ్రద్దలు గొట్టినట్లుగా ప్రకటించింది. అందుకు నలుడు
‘‘ఓ కమలాక్షీ! గొప్ప శక్తికలవారు, సకల లోక పాలకులు, ఐశ్వర్య సమృద్ధులు, దేదీప్యమానమైన తేజస్సుకలవారు అయిన దేవతలు నిన్ను కలవాలని వస్తుంటే, వారి పాద ధూళితో కూడా సాటిరాని ఒక మానవ మాత్రుడిని, జనన మరణ రూపమైన ఇహలోక సంసార బంధంలో చిక్కుకొన్న వాడిని ఎలా కోరుకొంటావు? ఇది తగునా? దేవతలకు ఇష్టం గాని పనిచేసిన మానవుడు మృత్యువును కోరుకొన్నట్లేగదా?
ఓ సుందరాంగి! భూలోకంలో దేవతలకు అప్రియాలు చేసినవాడు అష్టకష్టాలను అనుభవింపవలసి వస్తుంది. కావున నన్ను రక్షించుము. సురశ్రేష్ఠులైన వారిని వరించి ధూళిసోకని వస్త్రాలను, చిత్రాలైన దివ్యమాలికలు, దివ్యాభరణాలు ధరించి స్వర్గసుఖాలను అనుభవింపుము.
అగ్నిదేవుడు ఈ భూమండలాన్నంతా కుంచించి మ్రింగగలడు. ఎవని దండ భయంవల్ల సమస్త భూత సమూహాలు కలసి ధర్మాన్ని ఆచరిస్తున్నాయో అలాంటి యమధర్మరాజు తక్కువవాడా?్ధర్మాత్ముడు, మహాత్ముడు, దైత్యులను, దానవులను అణచివేయగల దేవతాప్రభువు ఇంద్రుడు.వీరంతటివాడే వరుణుడు గదా?
ఎవరు తక్కువవారు? అందువల్ల వీరిలో ఒకరిని నీవు భర్తగా వరించుము. ఇది మిత్రవాక్యం. దయచేసి నా మాట వినుము’’అని అనునయ వాక్యములతో పలుకగా.
‘‘ప్రభూ! దేవతలందరికీ నమస్కరించి నీకీ సత్యాన్ని చెబుతున్నాను. మనసా వాచా నేను నినే్న భర్తగా వరిస్తున్నాను. ఈ నిర్ణయం తిరుగులేనిది’’అని అన్నది దమయంతి.
‘‘కల్యాణీ! దూతగా వచ్చిన నాకు ఏది క్షేమమో నీవే నిర్దేశించుము. దేవతలకు నీవుచెప్పిన విషయాన్ని నేనెలా వినిపించగలను? వారికొరకై ప్రయత్నమారంభించిన నేను స్వార్థానికి ఎలా పాల్పడగలను. నా యొక్కస్వార్థం కూడా ధర్మమే అయితే నేను అట్లే చేయగలను. నాకు ఏది నీవు క్షేమమని తలుస్తావో దానినే విధించుము’’అని నలుడు అనగా
దమయంతి కన్నులవెంట నీరుగారాయి. బాష్పాలు పెల్లుబికి దమయంతి యొక్క రెండు చెక్కిళ్ళపై ప్రవహింపసాగాయి. విచలిత చిత్తయై చాలాసేపు ఆలోచించింది. తదుపరి చిరునవ్వు తెచ్చిపెట్టుకొని
‘మహానుభావా! నీ అభిప్రాయానికి కీడుకలుగనట్లు ఒక ఉపాయము స్ఫురించింది.చెప్తాను వినుము.’
- ఇంకాఉంది