మెయిన్ ఫీచర్

చిటారు కొమ్మల కవితా ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వరం ఖల్విదం బ్రహ్మ (మనకు కనిపించేదీ, కనిపించనిదీ, కదిలేదీ, కదిలించేది, కదలనిదీ -యావత్తూ-పరబ్రహ్మ స్వరూపమే)’’ అంటుంది ఛాందోగ్యోపనిషత్తు మూడవ అధ్యాయం 14వ ఖండంలోని ఒక ‘మహావాక్యం’. అంతటి విరాట్‌స్వరూపానికి బొమ్మ-బొరుసుల్లాగా సగుణాత్మక సారూప్యమూర్తులు శివకేశవులు. ఆ రెండు రూపాల వౌలిక తత్త్వానికి భేదం లేదు. ఇదే చెప్తుంది -
‘‘శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే!
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్‌ం శివః
(విష్ణుస్వరూపుడే శివుడు. శివస్వరూపుడే విష్ణువు. ఆ ఇద్దరూ ఒకరికి మరొకరు హృదయం లాటివాళ్ళు)’’ అంటూ మన ఒక సనాతన సూక్తి. అనాదికాలం నుంచీ మన అందరి హృదిలోకి ఏకైక ఆధ్యాత్మిక భావన ఇది.
ఈ భావజాలాన్ని త్రికరణశుద్ధిగా తన కవితా, జీవితప్రస్థానాల చివరివఱకు ఆచరణలో పెట్టుకొనిమరీ సమగ్ర సముదాత్త ఆత్మసమర్పణ భావంతో కవి సమ్రాట్ విశ్వనాథ తన ‘రామాయణ కల్పవృక్షం’లో చివరి పద్యాలు రాశారు. ఆ పద్యాలు రసరమ్య సుమధుర సుధాస్రవంతులు, అనన్యసామాన్య అనల్ప ధ్వని శిల్ప శ్రీసౌధాలు.
‘‘సద్యోనిర్గతమైన సర్వ కవితా సంభారమున్ నీకు నై
వేద్యం బిచ్చితి రామచంద్ర! ప్రభువా! విశ్వాసముంబూనవే
యాద్యంబై చను జీవలక్షణము సంహారంబుగావింపవే
హృద్యంబై చను నీదు తేజమును సారింపంగదే గుండియన్’’
- అంటాడు. (యుద్ధకాండ ఉపసంహార ఖండం 412వ పద్యం)
‘విశ్వనాథ’ ప్రతి రచన ఆశువుగా చెప్పిందే. తన కృతిలో వస్తువు ఏదైనా సరే ప్రతిదీ తన ప్రభువైన శ్రీరాముడిని మనసులో స్మరిస్తూ, ధ్యానిస్తూనే చెప్పినదే అంటున్నాడు పై పద్యం మొదటి పాదంలో పరోక్షంగా. ఇది ఆదిశంకరులు చెప్పిన ‘ఆత్మాత్వం; గిరిజా మతిః...’ అనే శ్లోకంలోని ‘స్తోత్రాణి సర్వాః గిరాః (నేను చేసే ప్రతి సంభాషణలోని అంతః స్పృహ నీ గుఱించే)’ అనే సముదాత్త ఆత్మ సమర్పణ భావాన్ని తలపిస్తుంది. కారణం యావద్భారతీయ వాఙ్మయ కృషీవలుల ఆత్మ ఒక్కటే.
‘విశ్వాసముంబూనవే’ - నన్ను నమ్ము ప్రభూ - అంటూ వేడికోలు. అవును మరి. అది తనకున్న అచంచల భగవద్భక్తి విశ్వాసమే. కాకపోతే ‘కట్టుకత లైహికమా? పరమా? వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి నంచనిపించుకో’ అని ఏదో ప్రాసంగికంగా తన తండ్రి తనతో అన్నంత మాత్రానే రామాయణ రచనకు పూనుకున్నాడా ఆ మహాకవి? కాదు. ‘జీవుని వేదన’ అనేది ఒకటి రగిలింది. ‘తనదైన అనుభూతి తనది’ అని గుండె లోతుల్లోంచి ఒక కవిత్వానుభూతి తన్నుకొచ్చింది. నా ఊహలేవో నావి అనుకున్నాడు. ‘తలచిన రామునే తలచెద. నా భక్తి రచనలు నావి’ అనుకున్నాడు. అలా అనుకుంటూ ‘తత్పురుషు’ని గుఱించి భావనా తాదాత్మ్యం పొందాడు.
‘పునరపి జననం, పునరపి మరణం’, పాప పుణ్యాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు మొదలైన వాటి ద్వంద్వ సంకుల పంకపు మునకలలో కొట్టుకుపోతూ ఉండే తన మానవ జీవలక్షణానికి భరత వాక్యం పలుకు స్వామీ అని ప్రాధేయపడ్డాడు. ఈ కాలాతీతపు, ప్రకృతి విరుద్ధపు పనికి ఆ పని చేయగలవాడైన పరాత్పరుని వేడుకున్నాడు. రామచంద్ర! ప్రభువా!’ అంటూ ‘సాభిప్రాయ’ సంబోధనలతో సంప్రార్థన చేశాడు. భగవంతుడికున్న శతకోటి నామాలలో ఇక్కడ రుూ రెండే తీసుకున్నాడు. అదీ- అలంకార ధ్వని శిల్పం అంటే. ‘ప్రభవతి సమర్థ్భోవతి ఇతి ప్రభుః’ అంటుంది అమరం. ప్రభువు అంటే సమర్థుడైనవాడు అని అర్థం. ‘జీవలక్షణాన్ని, జీవియొక్క జన్మల కొనసాగింపును అంతంచేయగల సమర్థత’ గలవాడు రాముని రూపంలో ఉన్న విష్ణువు.
ఇక రామచంద్ర శబ్దం. రమయతి ఇతిరామః- సంతోషింపజేయువాడు రాముడు అని భావం. చంద్రుడు అంటే శ్రేష్ఠుడు అని, కర్పూరం వంటి వాడు అనికూడా అర్థాలున్నాయి. కనుక రామచంద్రుడు అంటే సంతోషింపజేయగల సమర్థులలో శ్రేష్ఠుడు, కర్పూరం లాంటివాడు అనే అర్థం వస్తుంది.
ప్రపంచంలో మనిషికి అత్యుత్తమ సంతృప్తి, సంతోషాలను ఇచ్చే ఏకైక ఆహ్లాదకర చర్య ఏమిటి అంటే ముక్తిప్రదానం. దానిని అనుగ్రహించమని అడగటానికి ‘రామచంద్ర’, ‘ప్రభువా’ అనే పదాలతోడి సంబోధనకన్న మిన్నయైన సముచిత, సముదాత్త సంబోధన మరేముంటుంది? ఇలాటి సమయోచిత సమ్యగ్భావ పద సహిత రచనే ‘రీతి’ అనే ఉత్తమ కావ్యాత్మ అన్నాడు ప్రసిద్ధ ఆలంకారికుడు వామనుడు. ఈ ‘రీతి’ అనే కావ్యాలంకారిక ఆత్మవద్వస్తువునకు లక్ష్యప్రాయాలుగా విశ్వనాథ రచనల్లో పలు పదాలు అడుగడుగునా కుప్పలుతెప్పలుగా అగుపిస్తుంటాయి.
నా రుూ అవాంఛనీయ జీవలక్షణాన్ని సమాప్తంచేయటానికి ‘హృద్యం బైచను నీదు తేజమును సారింపంగదే గుండియన్’ అంటాడు. భగవంతుని తేజస్సు హృద్యం. హృద్యము అంటే హృదయానికి సంబంధించినది. అంటే గుండెలోంచి ఉబికి వచ్చేదీ, ఎదటివాని గుండెను తాకేదీ అని రెండు అర్థాలు. అది తన గుండెలో సారించాలట. ఎంత అద్భుతమైన ఊహ! ఎంతటి చమత్కార భావన! ఏమి అభివ్యక్తి! పైగా ఆ తేజస్సును ‘సారించాలట’. ‘సారించు’ అనే క్రియకు చాలా అర్థాలున్నాయి. కానీ వాటిలో చాచు, లాగు, నెలకొల్పు, విసరు అని ఉన్న అర్థాలు నాలుగూ కూడా సమర్థవంతంగా సరిపోతాయి ఇక్కడ. ‘‘చాచు- అంటే- నీలోని తేజస్సు నీలోనే ఉండనీ. కానీ అది నా గుండె దాకా చాచు స్వామీ! Please stretch it or extend'' అని ఒక అన్వయం.
‘నా గుండెను లాగు నీలోనికి’ అని మరో అన్వయం. ‘‘నీ తేజస్సును నాలో నెలకొల్పు install చేయి. establish చేయి’’ అని ఇంకో అర్థం. ఈ అర్థాలన్నింటికంటె ‘సారించు’ పదానికి ఉన్న ‘విసరు’ అనే అర్థం ఇంకా చాలా శక్తిమంతమైనది. విసరటం అంటే దేనినైనా నేరుగా, సూటిగా దూసుకుంటూపోయేట్టు చేయటం. నీ హృద్యమైన తేజాన్ని నా హృదయంలోకి నేరుగా, సూటిగా ఒక్క క్షణం కూడా జాప్యం కాకుండా చేర్చాలి అంటున్నాడు. ఇదీ భావ తీవ్రత-లేక- భావావేశం అంటే, అసలుసిసలు నిసర్గ కవిత్వం అంటే. 'Emotion recollected in tranqulity is poetry' అన్న విలియమ్ వర్డ్స్‌వర్త్ సాహిత్య ఆలంకారిక సూక్తి గుర్తొస్తుంది. ఇలాంటి కవితా పంక్తులు చదివినప్పుడు.
పద్యం చివరలో ‘హృత్తు’నన్ అనలేదు. ‘గుండియన్’ అన్నాడు. హృత్తు అన్నా గుండె. ‘హృత్తునన్’ అనవచ్చు. గణభంగం కాదు, రాదు. కానీ గుండె అనటంలోని తెలుగువాడి యొక్క, తెలుగు భాషా నాడియొక్క సమగ్రత, స్వచ్ఛత, ఆత్మీయత, భావ తీవ్రత, సాంద్రత, తెలుగుదనపు మిసమిస, బాస జిగిలోని కొసమెఱుపు ‘హృత్తునన్’ అంటే పొడసూపవు, కొట్టొచ్చినట్టు కనిపించవు. అక్కడ ‘గుండె’ అతుకుతుంది. పాఠకుడి గుండె ‘అనుభూతిస్తుంది.’
ఇదే వ్యావహారిక భాష సౌరు అంటే. ఇది విశ్వనాథకు అభిమాన శైలి. రస సృష్టికి తనకు వ్యావహారిక భాషే ఆలంబనము, సముచిత సాధనము అన్నాడు ‘‘నాది వ్యవహార భాష, మంధరము శైలితత్త్వము రసధ్వనులకు ప్రాధాన్యమిత్తు; రసము పుట్టింప వ్యవహారము నెఱుంగజనును; లోకమును వీడి రసమ్ములేదు’’ అంటూను, నిర్ద్వంద్వంగా కుండబద్దలుకొట్టినట్టు చెప్తూను.
‘నా కవితా సంభారాన్ని నీకు నైవేద్యంబిచ్చితి’ అన్నాడు. నైవేద్యం అనే తద్ధిత రూపానికి ప్రాథమిక రూపం ‘నివేదన’. నివేదన అంటే అప్పగించటం అనే అర్థం కూడా ఉంది. నా రుూ కావ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. అంటే ఇక ఇది నాది కాదు. నీకు దఖలుపరుస్తున్నాను. నీ రుూ కథా కావ్యాన్ని నీవేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం. దీనికి సాహితి ప్రపంచంలో ప్రాచుర్యమే ప్రాప్తింపజేస్తావో, పనికిరాని పసలేని కవితా గ్రంథంగా అనామకంగా అదృశ్యం కావిస్తావో. దేనికీ నేను కర్తనుకాను. అంతా నీదే బాధ్యత, భవితవ్యతా నిశ్చయత’-ఇదీ- విశ్వనాథ మనోభావం. గడుసరితనంతో కూడిన భక్తి పరాకాష్ఠ విశ్వనాథది. ఆ గడుసరితనపు పలుకులకు మూలం భగవంతునితో తాను మానసికంగా పెంచుకున్న చనువు, ఆత్మీయత, తాదాత్మ్యమూను.
ఆ చివరి పద్యాలలో మరో పద్యం -
‘‘నీలగళా! రఘోత్తముడు నీవును నిద్దఱు కానియట్టుగా
నోలి భజించితిన్; మఱియు నున్న దినంబులు నట్లె చేసెదన్
వ్రాలెడు మేనుదాక నభవా! బ్రదుకైన వికార భావనా
జాలము తప్పకున్నఁ దుది జన్మగఁ జేయుమ దీని ధూర్జటీ!
ఇది హరునిపరంగా రాసిన పద్యం. ‘‘నీలకంఠా! నీల శరీరుడైన విష్ణువు, నీవు వేఱుకాదు అనే అద్వైతభావంతో ఇన్నాళ్ళూ ‘ఓలిన్’-అంటే - క్రమంగా ఆరాధిస్తూ వచ్చాను’’ అన్నాడు. ఇక్కడ విశ్వనాథ ‘ఓలిన్’ అనే శబ్దాన్ని ఏదో ప్రాసకోసం ప్రయాసపడుతూ వాడలేదు. ఆయన అనుదినమూ కొన్ని వేలు తారకనామ జపము, కొన్ని వేలు షడక్షరీ (ఓం నమశ్శివాయ) జపము మార్చిమార్చి చేసుకునేవాడు ఒక క్రమ నిర్ణీత పద్ధతిలో అందుకని ‘ఓలి భజించితిన్’ అన్నాడు.
ఇంక ముందున్న రోజులుకూడా అలాగే చేస్తాను అన్నాడు. నా రుూ తపస్సు ఎన్నటికీ విరమించను అన్నాడు. అయితే ఇక్కడ ‘వ్రాలెడు మేనుదాక’ అనటంలో అద్భుత శబ్ద ధ్వని ఉంది. మనిషి అంతిమ ఘడియలు, క్షణాలు, ఎంత గంభీరంగా, ఎంత నిర్వేదంగా, ఎంత దీనంగా, ఎంత కరుణాభావ సాంద్రతాభారంగా ఉంటాయో ‘మేను వాలిపోవటం’ అనే దృశ్యపు ఊహలోకి ఆలోకిస్తే పాఠకుడిని అది ఒక సంకీర్ణ ఆలోచనా నిశే్చష్టితుణ్ణి చేస్తుంది. అదీ శబ్దప్రయోగ చిత్రం అంటే. ‘వ్రాలెడు’, ‘మేను’, ‘దాక’- మూడు శబ్దాలలోను మొదటి అక్షరాలు గురువులు. తరువాతవి లఘువులు. అది ఊపిరి ఆగిపోవటాన్ని సూచిస్తుంది. అందుకే ఆ భావస్ఫోరక వాక్య నిర్మాణంకోసం ఈ ఉత్పలమాల పద్యంలోని మొదటి భాగాన్ని ఎన్నుకున్నాడు ‘రస సమ్రాట్’. ఇది ఒక ఛందశ్శబ్ద శిల్పం. ‘‘నా బ్రతుకే అరిషడ్వర్గాల వికృతభావాల ముసురుడు, మూగుడూను. దీనిని తప్పించుకోలేను. బయటపడలేను. అయినా సరే ఇదే నాకు ఆఖరి జన్మగా చేయుము అభవా’’ అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ‘పరికరాలంకార’ సుందర రచనా శిల్పమే. న భవతి- ఇతి అభవః. పుట్టుకలేనివాడు అభవుడు (శివుడు). పుటక అనేది లేనివాడవు నీవే. అందుకే నీవే ‘తుది జన్మగ జేయుము దీనిధూర్జటీ!’ అన్నాడు.
‘‘స్వతః- అంటే- ఆత్మగతంగా నాకు కామక్రోధాది గుణాలు లేవు స్వామీ! కానీ లోక వ్యవహారంకోసం మాత్రమే ‘లేని కోపంబు వీరికై పూనుచుండి. లేని కామమ్ము వీరికై పూనుచుంటి. కృతకమయ్యెన ఈ బ్రతుకెల్ల’ అంటాడు తరువాతి పద్యంలో. ఇక్కడ ‘వీరికై’ అంటే బంధు, సహచర, సంఘ జనులకోసం అని అర్థం. తన మానవ జన్మంతా ఒక నాటకమై పోయింది తప్పని పరిస్థితులలో. తన ఆత్మ నిసర్గతను చూచి తనకు జన్మరాహిత్యం ఇమ్మంటున్నాడు భగవంతునితో. ఇది ఒక అమాయకుడైన ముద్దాయి బోనులో ఎక్కి విలపించే సహజమైన తీరు. ఇది విశ్వనాథ ఆత్మక్షోభ, జీవుని వేదన.
అదే పద్యాల (భావాల) వరసలో ఆఖరి పద్యం -
‘‘కల వొక కొన్ని వేళలు నికామభవత్పదచింతనానలో
జ్జ్వలిత శిఖాసనాధములు స్వామి! ననున్ మృతి బొందనీవె యు
జ్జ్వలమగు తన్నిమేషమున జన్మయికొక్కడులేకయుండ; వి
హ్వల కరణాభితప్త మయినట్టి జనుస్సులు చాలు ధూర్జటీ!’’
‘‘ఒక్కొక్కప్పుడు నీ గుఱించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ, నీ సాక్షాత్కారం కోసం తపిస్తూ తపిస్తూ నేను ధ్యాన చిత్పరాకాష్ఠ జ్వాలలు దర్శించేవాడిని. అలాంటి క్షణాలలో ఏ ఒక్క తృటిలోనైనా నాకు మరణము నివ్వకపోతివే! ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిస్సారత, నిష్ఫలతలతో అంటకాగుతున్న, మాడిపోతున్న ఈ జన్మలు అనేవి నాకు ఇక చాలు ప్రభూ!’’అంటూ ఆక్రోశిస్తాడు పై పద్యంలో.
తీవ్రమైన సంక్షోభము, మానసిక క్షోభ, ఆర్తి-ఇవి విశ్వనాథ ఎప్పుడూ మొత్తుకుంటూ ఉండిన తనయొక్క ‘జీవుని వేదన’ ముఖ్యాంశాలు. శాశ్వత విముక్తి, బ్రహ్మైక్య స్థితి-ఇవీ విశ్వనాథ ఆకాంక్షలు. వీటికోసం ఇలా విశ్వనాథ వ్రాసుకొని పండించుకున్న రామాయణ కల్పవృక్షపు చిటారుకొమ్మల సముదాత్త, రసప్రపూర్ణ, ధ్వని గంభీర కవితామృత ఫలాలు ఈ కావ్యాంత పద్యాలు. ఇవి ప్రతి జిజ్ఞాసువును, ప్రతి ఆస్తిక భావుక సాహితీ పిపాసువును, ప్రతి ముముక్షువును ఆర్ద్భ్రీత హార్దికులుగాను, పారవశ్యసాంధ్ర మనస్కులుగాను చేస్తాయి.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290