మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌కు ‘కొత్త నెత్తురు’ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ‘క్రాస్ రోడ్’లో ఉంది. సరైన నాయకత్వం కోసం ఆ పార్టీ అనే్వషిస్తోం దా? అదే నిజమైతే- ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది త్వరలోనే తేలబోతోంది. అప్రతిహతంగా ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీకి అడ్డుకట్టవేసేందుకు కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మార్చుకుంటుందని ప్రజాస్వామవాదులు భావించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ‘గాంధీ కుటుంబం’ దాటి ఇప్పట్లో బయటకు రాదని సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మే 25న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. పార్టీ తమ కుటుంబం నుంచి కాకుండా వేరే నేత ఆధ్వర్యంలో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆకాంక్షించారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ నవతరానికి ప్రతినిధి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలకు బాధ్యత వహించి రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 44 సీట్లు, 2019 ఎన్నిల్లో 52 సీట్లు వచ్చాయి. రాహుల్ రాజీనామా చేశాక 75 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు సోనియా గాంధీని పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని కాంగ్రెస్ పేర్కొంది. తాత్కాలికమంటే ఎన్ని రోజులు? అనే అంశంపై స్పష్టత లేదు. రాహుల్ రాజీనామాను ఆమోదించేందుకు అనేక వారాల పాటు పార్టీలో ప్రతిష్టంభన కొనసాగింది. పార్టీ ఇంకా అప్రతిష్టపాలవుతుందని, సరైన నాయకత్వాన్ని చూపించలేదనే విమర్శలకు జడిసి రాహుల్ రాజీనామాను ఆమోదించి, ఆ స్థానంలో సోనియాకు పార్టీ సారథిగా బాధ్యతలు అప్పగించారు.
కాంగ్రెస్ పార్టీ ‘గాంధీ కుటుంబ’ చట్రంలో చిక్కుకుంది. విమర్శల సంగతి ఎలా ఉన్నా, జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ దేశానికి సేవలు అందించారు. ఆ కుటుంబానికి చెందిన మేనకా గాంధీ కాంగ్రెస్‌ను మూడు దశాబ్దాల క్రితమే వీడి బీజేపీలో చేరారు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా బీజేపీ ఎంపీగా ఉన్నారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి అనంతరం 2017లో ఏఐసీసీ అధ్యక్షుడయ్యారు. ఇటీవలనే ప్రియాంకా గాంధీ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని 60 ఏళ్లకుపైగా పాలించిన ఘన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, తప్పొప్పులు, చారిత్రక తప్పిదాలు పక్కనపెడితే- ప్రజలు అనేక పర్యాయాలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిన మాట వాస్తవం.
కాలంతో పాటు కాంగ్రెస్ మారలేదు. బ్రాండెడ్ కంపెనీలకు ఎంత మంచి పేరున్నా, కాలానికి తగ్గట్టు అప్‌డేట్ కాకపోతే ఎలా మార్కెట్లో పతనమవుతాయో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ ఇమేజి, గుడ్‌విల్ ప్రజల్లో ఉంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అనే చందంలా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నా, వైఫల్యాల నుంచి బయటపడలేకపోతోంది. రోజురోజుకు అత్యంత శక్తివంతంగా బీజేపీ అవతరించినా, బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలని ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటారు. దేశాన్ని పట్టి పీడించే అన్ని సమస్యలకు పరిష్కారం బీజేపీ వద్ద ఏమీ లేదు. ఈ రోజు బీజేపీ సిద్ధాంతాలపై పరస్పర వైరుధ్యాలతో కూడిన ఆలోచనలు, భావాలు ప్రజల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, బీజేపీకి దేశాన్ని నడిపించే మంచి నాయకత్వం లభించింది. బలమైన నాయకత్వాన్ని ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు విఫలం కావడం దురదృష్టకరం.
యువతరాన్ని ఆకట్టుకునే నేతలకు కాంగ్రెస్‌లో సరైన స్థానం లేకుండాపోయింది. పార్టీలో క్రమశిక్షణ కొరవడింది. దిగువ స్థాయిలో జనం ఏమనుకుంటున్నారు? పార్టీలో ఏమి జరుగుతోంది ? పొత్తుల విషయంలో సరైన దిశలోనే నిర్ణయాలు తీసుకుంటున్నామా? పార్టీ విధానాలపై జనం స్పందన ఎలా ఉంది ? యువతరం తమ నుంచి ఏమి ఆశిస్తోంది ? అనే అంశాలపై కాంగ్రెస్‌లో విశే్లషణ లేదు. మండల స్థాయి నుంచి సీడబ్ల్యుసీ వరకు కోటరీల ఉచ్చులో కాంగ్రెస్ చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది.
రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్త నాయకత్వానికి ఎర్ర తివాచీ పరచాలి. రాహుల్ రాజీనామా చేసినప్పుడు తమ కుటుంబం నుంచి ఎవరినీ పార్టీ అధ్యక్ష పదవికి నామినేట్ చేయవద్దని కోరారు. పార్టీ హైకమాండ్ రాహుల్ నిర్ణయాలను బేఖాతరు చేసింది. సైకోఫ్యాన్సీ మనస్తత్వం ఉన్న నేతలతో నిండిన కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు చేసి చివరకు సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. సోనియా కూడా పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశనం చేసి పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగేటట్లు చేసిన గట్టి నాయకురాలు. తాత్కాలికంగా పార్టీని నడిపించేందుకు ఆమె సేవలు ఉపయోగపడతాయే తప్ప, 2024లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన ఎత్తుగడలు, వ్యూ హాలు లేవు. అన్నింటికీ మించి విశేషమైన ప్రజాదరణ ఉన్న నేత కాంగ్రెస్‌కు కావాలి. ఇప్పటికిప్పుడు కాకపోయినా, త్వరలో జరిగే పార్టీ సంస్థాగత మార్పుల్లో మంచి నాయకత్వాన్ని పార్టీకి అందించే అవకాశాన్ని కాంగ్రెస్ పెద్దలు చేజార్చుకోకూడదు. ఢిల్లీ నుంచి దిగువ స్థాయి వరకు జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే ప్రజలకు సరైన వేదిక లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీని సరైన మార్గంలో నడిపించే నేతను ఎంపిక చేసుకోవడంలో కాంగ్రెస్ సాహసంతో కూడిన నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ వందిమాగధుల చెర నుంచి బయటపడితే తప్ప జాతీయ స్థాయితో పాటు అనేక రాష్ట్రాల్లో అధికారానికి చేరువ కాలేదు. 370వ అధికరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి ఆ పార్టీకి శాపంగా మారింది. హర్యానాలో బలమైన జాట్ వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హుడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాధిత్య సిం ధియా కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో బలమైన నేతలకు కొదవేమీ లేదు. వారి కి అవకాశాలు ఇవ్వాలి. 1991లో పీవీ నరసింహారావుకు అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ అధ్యక్షుడిగా ఆయన రాణించలేదా? ఐదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా నడపలేదా ? ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు. అంతవరకు ఆయన కొద్దిమందికి మాత్ర మే తెలుసు. బహుభాషా కోవిదుడు, మృదు స్వభావి అని మాత్రమే చాలా మంది భావించారు. ఒక్కసారి కీలకమైన ప్రధానమంత్రి పదవిని అప్పగించిన తర్వాత తన చతురత, చాణక్యనీతితో దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పరుగెత్తించారు. ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాంబినేషన్ బాగుందని దేశమంతా ప్రశంసిస్తోంది. 1991 నుంచి 1996 మధ్య ఆ నాటి మన ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్టయింది. పీవీ, మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక సంస్కరణలను మించి ఏ పార్టీ కూడా పాలన సాగించలేదు. 1996 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొదలుకుని ప్రస్తుతం మోదీ సర్కార్, భవిష్యత్తులో అధికారంలో ఏ పార్టీ వచ్చినా పీవీ బాటనే శరణ్యం.
కాంగ్రెస్ పార్టీ గాంధీయేతర కుటుంబానికి చెందిన నేతకు ఒక్కసారి అవకాశం ఇవ్వడం వల్ల పీవీ నరసింహారావుప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి దేశానికి వనె్న తెచ్చారు. రాహుల్ చెప్పినట్లు గాంధీయేతర కుటుంబానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన తరుణం ఆసన్నమైంది. బాధ్యతలు అప్పగించనంతవరకు అంద రూ అనామకులే. సరైన నేతను ఎంపిక చేసి పార్టీ పగ్గాలు అప్పగిస్తే నిర్వీర్యమవుతున్న కాంగ్రెస్‌ను రేసు గుర్రంలా పరిగెత్తింప చేసే అవకాశాలు లేకపోలేదు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, సీనియర్ నేతలు మనీష్ తివారీ, కేరళ ఎంపీ శశి థరూర్ లాంటి గట్టినేతలు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇంకా ఆనే్వషణ చేస్తే రాష్టస్థ్రాయిలో గట్టి నేతలు చాలా మంది కనపడుతారు. గత ఏడాది ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంచి నేతను ఈ ప్రాంతాల నుంచి ఎంపిక చేయవచ్చు. గాంధీయేతర కుటుంబానికి నాయకత్వ బాధ్యతలు ఇస్తే- ఆ తర్వాత గాంధీ కుటుంబం రోజూవారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదు. ఒక వేళ అదే జరిగితే రెండు అధికార కేంద్రాలు ఏర్పడి పార్టీ భ్రష్టుపడుతుంది. పీవీ నరసింహారావుకు పార్టీ అధ్యక్ష పదవి, ప్రధాని పదవి అప్పగించిన తర్వాత అధికారంలో, పార్టీలో గాంధీ కుటుంబం వేలు పెట్టలేదు. పీవీ కూడా గాంధీ కుటుంబం నీడ పడకుండా చాణక్య నీతితో వ్యవహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్‌లో దశాబ్దాల తరబడి పాతుకుపోయిన ‘ ఓల్డ్ హార్సెస్’ (ముసలి గుర్రాలు) చాలా ఉన్నాయి. వీరికి పార్టీ భవిష్యత్తు, కేడర్ అక్కర్లేదు. తమ పబ్బం గడిస్తే చాలు. ఎఐసీసీని పట్టిపీడిస్తున్న అనేక జబ్బుల్లో ఇది ఒకటి. బాహుబలిగా విస్తరిస్తున్న బీజేపీని ఎదిరించినిలబడే వ్యూహాలు కాంగ్రెస్ కొత్త నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. ఇంకా వారసత్వ రాజకీయాలే దిక్కు అనుకుంటే కాంగ్రెస్ పార్టీని ఎవరూ రక్షించలేరు.
వరుస తప్పిదాలతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆత్మరక్షణలో పడింది. లోక్‌సభలో, రాజ్యసభలో బీజేపీని నిలువరించే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. జాతిని ఏకతాటిపైకి నడిపించే అంశాలపై మద్దతు ఇస్తూనే, ప్రజల్లో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేకుండా కొత్త శక్తులు, యుక్తులతో పోరాడే నేత పార్టీకి కావాలి. కాంగ్రెస్‌ను వీడి సొంత కుంపట్లు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలను కలుపుకుని పోవాలి. మైనారిటీలకు కొమ్ముకాచే పాత మైండ్‌సెట్ విధానాలకు తిలోదకాలివ్వాలి. దళిత, బీసీ వర్గాలను అక్కున చేర్చుకునే కొత్త ప్రణాళికలతో జనంలోకి కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ఉండవచ్చు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాల్లో నిలబడి పోరాడే సత్తా కాంగ్రెస్‌కు ఒక్కటే ఉందనే విషయం మర్చిపోరాదు. ఆ స్థానం దక్కించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వరుస చారిత్రక తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని కొత్త నాయకత్వంతో ప్రజల్లోకి రావాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097