మెయిన్ ఫీచర్

అద్భుతావతారుడు నందనందనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థరాత్రి
చిక్కని చీకటి
కంసుని కారాగారం
చల్లని మలయమారుతాలు
కావలిగాండ్ర గాఢనిద్ర
దేవకీదేవి , వసుదేవుల కళ్లల్లో
అనిర్వచనీయమైన ఆనందాశ్రువులు
అంతలో
చల్లని వెనె్నలలాంటి ప్రకాశం, దివ్యమైన, పరిమళమైన సుగంధం అంతటా వ్యాపించింది.
చిరుజల్లులవలె పుష్పవాన, దేవకీదేవి గర్భం పండింది. పండంటి బిడ్డ అనుకొని కళ్లు తెరిచింది.
నీలమేఘశ్యాముడు, మకుటకుండల కేయూరధారుడు అయిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు.
దేవకీ వసుదేవుల సమక్షంలో శ్రీమన్నారాయణుడు చిరునవ్వులు చిందిస్తున్నాడు.
దేవకీ వసుదేవుల హృదయంలో అవధులు లేని అనందసాగరం,
ఆ జగన్నాట సూత్రదారే తమకు పుత్రునిగా జన్మించినందుకు తమ జన్మ సార్థకమైందని అమిత ఆనందం.
తమను తాము మర్చిపోయి చూస్తూ ఆనందభాష్పాలు రాలుస్తున్న అనేక స్తోత్రపాఠాలు చదవాలనుకొంటూ చదువుతూ అంతలోనే మర్చిపోతూ ఆ విరాట్ పురుషుని చూస్తూ చేతులు జోడిస్తూ తిరిగి చేతులను చాస్తూ.. ఇలా...ఏదేదొ అనుకొంటూ మరేదో మరేదో చేసేయబోతూ..ఉన్న ఈ జన్మలోని తన తల్లిదండ్రులను చిరునవ్వుతూ చూసి
ఓ వసుదేవా! ... ఇది మీకు కొత్త కాదు.. అంటూ వారి పూర్వజన్మవృత్తాంతాలు చెప్పి.. ఇక నీవు నేను చెప్పినట్లు చేయి.
నేను ముద్దులొలుకే చిన్నపాపడిని అవుతాను.
నీవు నన్ను బుట్టలోపెట్టుకొని యమునానది దాటి నందుని గ్రామం చేరి నందుని ఇంట యశోదమ్మ చెంత నన్ను పరుండబెట్టు. అక్కడి చిన్నారిని తీసుకొని తిరిగి అదే బుట్టలో తిరిగి వచ్చి ఈ దేవకీదేవికి ఇమ్ము.
ఇక నేనుచూసుకొంటాను. మీకు దుఃఖం అక్కర్లేదు.. అంతాసుఖమే..
శుభం అంటూ పలికి అంతలోనే మాయలమారి అపుడే పుట్టిన శిశువువోలే మారిపోయాడు. దేవకీ
దేవి ఒడిలో ఉన్న ఆ శిశువు వసుదేవుడు బుట్టలో పెట్టుకుని కారాగారం తలుపుల వద్దకు రాగానే అక్కడే కావలి గాయాల్సిన వాండ్రు గాఢనిద్రలో ఉన్నారు. తాళాలు వాటికవే ఊడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. మెల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆనందపరవశంతో ఉప్పొంగుతూ కృష్ణయ్య వస్తున్నాడనుకొని ప్రవహిస్తున్న యమునమ్మ చప్పుడు చేయకుండా దారిచ్చింది. ఆ దారిలోనే వసుదేవుడు నందుని ఇంటికి చేరాడు. కృష్ణయ్య చెప్పినట్లే వసుదేవుడు చేశాడు.
***
వసుదేవుడు వెళ్లగానే దేవకీదేవి కనులమ్మట ధారాపాతంగా నీళ్లు వద్దనకొలదీ ఊరి వస్తూనే ఉన్నాయి. ఏమీ జన్మ. మహావిష్ణువు పరమాత్మనే నేను గర్భాన మోసానే.. చిన్ని వాడు లిప్తకాలమైనా చూడకుండానే ననుబాసిపోయాడే అని ఎంతో దుఃఖిస్తోంది.
అంతలో వసుదేవుడు రానే వచ్చాడు. ఆ పాపను దేవకీదేవి చెంత పెట్టాడు. కారాగారం తలుపులు వాటికవే మూసుకుపోయాయి. తాళాలు గట్టిగా ఉన్నాయి.ఎప్పటివలె కావలి గాండ్రు అప్రమత్తులై కావలి గాస్తున్నారు ఉన్నట్టుంటి ఆ పాప కెవ్వున ఏడ్చింది. వెంటనే ఆ ఏడుపుకు కావలి గాండ్రు తొంగిచూశారు. దేవకీదేవి చిన్న పాపని కన్నదని కంసునికి సమాచారాన్ని అందించారు.
అంతే ఉన్నట్టుండి తన మృత్యువు తనింటికే వచ్చిందన్న ఆరాటంతో ఏమి చేయాలో పాలుపోక అహర్నిశమూ మహావిష్ణువే తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న కంసుడు హుటాహుటిన పరుగెత్తుని చెరసాలకు వచ్చాడు.
అన్నను చూడగానే అన్నా ఇది మేనకోడలన్నా ..అంటూ దేవకీదేవి కన్నీళ్లను తుడుచుకుంది. కంసుడు ఒక్క నిముషం తత్తరపడ్డాడు. నన్ను చంపడానికి పుత్రుడు కదా అష్టమ గర్భంలో జనిస్తాడని చెప్పాడు. మరి నేడు ఈ పాప పుట్టిందేమిటి. ఇపుడు నేనేమి చేయాలి అనుకొన్నాడు. నిజమే ఇది అష్టమగర్భం కాదేమో తరువాత పుడతాడేమో.. ఇంకా పుట్టలేదేమో అని కాస్త ఆనందించాడు. అయినా కీడెంచి మేలెంచాలి.. ఆడపిల్ల పుట్టినా నన్నుచంపదన్న మాట ఏమిటి? అంటూ ఆ పాపను కర్కశంగా తన చేతిలోకి తీసుకొని ఆకాసానికి ఎగురవేయబోయాడు.
దేవకీవసుదేవులిద్దరూ కంసుని కాళ్లావేళ్లాపడ్డారు. చంపొద్దని బతిమాలారు.
కాని కఠ్కోటకుడైన కంసుడు ఆ మాయాదేవిని పాపనుకొని ఆకసంలోకి విసిరేశాడు. తిరిగి పడితే తన కత్తికి ఎరవేద్దామని తలచాడు. మాయ ఆకసంలో నిలిచిపోయింది. భీషణమైన భీకరమైన పలుకులు ఆకసవీధుల నుంచి కంసుని చెవులకు తాకాయి. ‘ఓరి కంసా!దుర్మార్గా! ఇక నీవు తప్పించుకోలేవు. నేను కాదురా నిన్ను చంపేది. నాతో పాటు పుట్టిన వీరుడొక్కడు నిన్ను చంపడానికి మహాగౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే’ ఆ పలుకులు వినగానే కంసుడు హతాశుడయ్యాడు. అప్పటినుంచి కూర్చున్న చోట కూర్చోకుండా, నిల్చున్న చోట నిల్చోకుండా చేసిన ఆలోచన చేయకుండా ఆలోచనాస్రవంతిలో కొట్టుకుపోయాడు ఆ కంసుడు.
***
యశోదమ్మ కనులు తెరిచింది. చుట్టూ బంధువులు, చుట్టాలు, గోపికలు అందరూ కనులు మిరుమిట్లు గొలిపే ఆనందంతో యశోదను చూస్తున్నారు. తన పక్కన చూసుకొంది. ముద్దులు మూటకట్టే బాలుడు చిన్నివాడు తన కొడుకు తాను కన్న కొడుకు తననే చూస్తూ చిరునవ్వులొలుకుతున్నాడు.
అపరిమితానందం పొందిన యశోదమ్మ చిన్ని వాడిని స్పృశించింది. తల్లి స్పర్శకు పొంగిపోతున్నట్లు చిన్ని కళ్లు మిలమిలాడించాడు ఆ శిశువు.
నందుని ఇంట పండుగ రాశి వెలిసింది. తనకు కుమారోదయం కలిగిందని ఇరుగుపొరుగు చుట్టపక్కాలకు చెప్పిపంపించాడు. పెద్ద ముతె్తైదువులంతా వచ్చారు. యశోదమ్మ శుభాభినందనలు చెప్పారు. బాలింత స్నానాలు చేయంచారు. అంగనలంతా కూడి శిశువులకు లాలలు పోశారు. విజ్ఞానం కలుగుతుందని పాపడికి తేనెలు పెట్టారు. అన్నీ ఉపచారాలు చేస్తున్నారు.. నందుడు బ్రాహ్మణాదులను పిలిపించాడు. భూరి విరాళాలు ఇచ్చాడు.వాళ్లనడిగి ఏయే పుణ్యకార్యాలు చేయాలో అవి జరిపిస్తున్నాడు. జాతక కర్మలు చేయించాడు. నామకరణాదులు చేయించాడు. ఉయ్యాలలోపరుండబెట్టారు.
ఆనాటి నుంచి ఎక్కడెక్కడ నుంచో నందుని ఇంటికి తండోప తండాలుగా జనం వస్తున్నారు. పుట్టినవానిని చూడడానికి వస్తున్నారు. పాపడిని ఎత్తుకుంటున్నారు. తల్లులంతా తమ స్తనాలను అందిస్తున్నారు. తన జన్మ ధన్యమైందని ఆనందిస్తున్నారు. ఇలా పండుగ వాతవరణం నెలకొని ఉందక్కడ.
బాలుడు దినదిన ప్రవర్థమానమవుతున్నాడు.
కంసునికి దినగండం మాటిమాటికీ గుర్తు వస్తోంది. ఏం చేయాలో తెలియక తికమకలవుతున్నాడు. తన అనుచర గణాన్నంతా పిలిచాడు. వాడవాడలా వెతికి ఆ నన్ను చంపబోయే ఆ పిల్లడిని చంపిపారేయని ఆజ్ఞలిచ్చాడు. మృత్యువుకే మృత్యువునవుదామనే కంసుని అత్యాశ మానవుని దురాశకు అద్దం పట్టినట్లుంది.
నందుని ఇంట ఉత్సవాలు జరగడమూ, అందరూ ఆనందశిఖారోహణం చేయడం కంసుని అనుచరిణి పూతన చూసింది. ఒకవేళ ఈ ఇంట పుట్టి న బిడ్డడేమో కంసుని చంపేది చూసి వద్దామను కొంది. లోపలికి చక్కని గోపభామ లాగా అడుగు పెట్టింది. దాదా నీకోసమే అన్నట్టు కృష్ణుడు చిరునవ్వుతో పూతన వైపు చూశాడు. పూతన మేను మరిచింది. పరుగెత్తుకు వెళ్లి కృష్ణుడిని తన చేతుల్లోకి తీసుకొంది. పొంగిపోయంది. ఎంతటి అదృష్టం తనది తాను ఈ చిన్నారిని ఎత్తుకున్నాను ఏదో అపరిమితానందం నన్ను చుట్టు ముడు తోందని ముద్దులు కురిపించింది.
కృష్ణాకర్షణ తొలగింది. పూతనకు చేయవలసిన పని గుర్తుకు వచ్చింది. తన స్తన్యం ఇద్దామనుకొంది. ఆ పని చేయబూనింది. అంతే కృష్ణుడు ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. కొద్దిసేపటికే హాహా కారాలు పూతన నోటి నుంచి మరికొద్ది క్షణాల్లోనే పెద్ద ఆకారంలో విగతజీవి అయంది.శకటాసురుడు, బకాసురుడు ఇలా ఎంతో మంది... కృష్ణుని చేతిలో మృతు లయ్యారు.
అదిగో మొదలు రాక్షసులను సంహరించండం. ఇలా ప్రతిచర్య లోనూ తన లీలలను ప్రకటించాడు. అలాంటి శ్రీకృష్ణుడు తననే నమ్ముకొన్న అర్జునునికి రథ సారథి అయ్యాడు. యుద్ధ్భూమి నీరుకారి పోయన తన భక్తుని కర్తవ్యోన్ముఖుని చేయడానికి విశ్వరూపాన్ని చూపాడు. ఎవరి పనులను ఎవరి కర్తవ్యాన్ని వారు చేస్తూ ఫలితాన్ని నాపై వదిలి వేయండి మీ యోగక్షేమాల బాధ్యత నేను చూసుకొంటానని కర్మయోగాన్ని చెప్పాడు. ఆ శ్రీకృష్ణుడే ‘‘ఉద్ధరే దాత్మనీత్మానమ్’’ అని దేవ రహస్యం చెప్పాడు. ఎందుకంటే లోకంలో ఎవరినైనా ఉద్ధరించేది వారి వారి శుద్ధమైన మనస్సే తప్ప, బంధు మిత్రులు కాదు. మలినమైన మనస్సు పతనమునకు దారి చూపుతుంది. మలినం కాని పవిత్రమైన మనస్సు ఆధ్యాత్మికం వైపు తొంగిచూసి మెల్లగా ప్రయాణం సాగించి చివరకు భగవంతుని చేరటానికి రహదారి నేర్పరుస్తుంది.
నిశ్చల భక్తితో నిరాడంబరతతో, త్యాగ చింతనతో, స్వార్ధ రహిత్యముతో, అంతర్యామినే స్మరిస్తూ ఉంటే చాలు శ్రీకృష్ణ కృప దానికదే లభిస్తుంది. ఒక్కసారి శ్రీకృష్ణు ని కృపను పొందిన వారు మరల తిరిగిరాని వైకుంఠానికి వెళ్లి కృష్ణ స్వరూపులు అవు తారు.కృష్ణుని జీవితంలో ఏ ఘట్టాన్ని ఏ లీలను స్మరించినా చాలు వారి జీవితం ధన్యం.

- ఆర్. పురందర్