మెయన్ ఫీచర్

తెరాసకు ప్రత్యామ్నాయం ‘కమల దళం..’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. అలా కాదని, జమిలి ఎన్నికలే వచ్చి నా ఇంకా మూడేళ్ళకు పైగానే కాలవ్యవధి ఉంది. అప్పుడు గాని రాష్ట్రంలో ఎవరి బలం ఎంతో, ఎవరి బతుకు ఏమిటో తేలదు. ఈ మూడు, నాలుగేళ్ళ కాలంలో ఏమైనా జరగవచ్చు.. ఏమీ జరగకపోనూ వచ్చు.. అయితే నడుస్తున్న చరిత్రను గమనిస్తే అటు నుంచి ఇటు, ఇటు నుచి అటు దేశం అంతటా రాజకీయాలు అనూహ్యంగా వేగంగా మారి పోతున్నాయి. నిజానికి ఈమార్పు 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మరింతగా వేగం పెరిగింది. నదులన్నీ స ముద్రంలో కలిసినట్లు వివిధ పార్టీల నాయకులు క్యూ కట్టి కమల దళంలో చేరిపోతున్నారు. మరో వంక బీజేపీయేతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో కొత్త తప్పులకు స్వాగతం పలుకుతోంది. కొత్త చిక్కులు,కొత్త ఉచ్చులు సిద్దం చేసు కుంటోంది. అందుకేనేమో రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మ హత్యలు మాత్రమే ఉంటాయని అంటారు.
ఇటీవలి కాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే రాజకీయ సమీకరణలు, విశ్వాసాలు, విధేయతలు చకచకా మారిపోతున్నాయని అ నిపిస్తుంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీలో మేధావిగా పే రొందిన జైరామ్ రమేష్ సొంత పార్టీ అగ్రనేతలకు సున్నితంగా చురకలు అంటించారు. ‘అయినదానికి కాని దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ‘తప్పు’ అని జైరామ్ రమేష్ కుండ బద్దలు కొట్టారు. అంతే కాదు మోదీ ప్రభుత్వం చేసిన మంచిని గుర్తించకపోవడం కూడా అంతే తప్పని అన్నారు. అలాంటి ధోరణి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇంకా ఇంకా అధః పాతాళానికి నెట్టేస్తుందనే అర్థం వచ్చే విధంగా గట్టిగానే వాతలు పెట్టారు. జైరామ్ మాటల తీరు తెన్నులు (టోన్ అండ్ టినోర్) గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించక పోయినా బహుశా రాహుల్ గాంధీని, ఆయన కోటరీని దృష్టిలో ఉంచుకునే జైరామ్ రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారనేది అర్థం అవుతూనే ఉంది. మరోవంక- ‘అవును జైరామ్ రమేష్ అన్నది నిజం, విచక్షణా రహితంగా విమర్శించడం ద్వారా విపక్షాలు మోదీకి మేలు చేస్తున్నాయని, ప్రజల్లో ఆయన పట్ల అభిమామానాన్ని పెంచుతున్నాయని మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సైతం జైరామ్ రమేష్ ను సమర్ధించారు. ఓ వంక చిదంబరం చిక్కులోంచి కాంగ్రెస్ పార్టీని మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రథమ కుటుంబాన్ని రక్షించేందుకు ‘విధేయ’ పాత్రను పోషిస్తున్న సింఘ్వి, ఈసమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సింఘ్వీతో పాటుగా మరో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కూడా జైరామ్ రమేష్ వ్యాఖ్యలను సమర్ధించారు.
అలాగే, జమ్మూ కశ్మీర్ విషయంలోనూ అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీ స్టాండ్‌ను వ్యతిరేకించారు. మోదీ ప్రభుత్వన్ని సమర్ధించారు. అంటే, ప్రజల ఆలోచనలో వస్తున్న మార్పును రాజకీయ నాయకులు, రాజకీయ పండి తులు అని వార్యంగానైనా గుర్తిస్తున్నారు. ఈశాన్యం నుంచి మధ్య భారతం మీదుగా దక్షిణాది రాష్ట్రాల వరకు ప్రతిపక్షాల నుంచి బీజీపేలోకి కొనసాగుతున్న వలసలే ఇందుకు నిదర్శనం. ఒక విధంగా చూస్తే విపక్షాలు చేస్తున్న విమర్శలు మోదీ గ్రాఫ్‌ను మరింతగా పైకి తీసుకుపోతున్నాయి. టీవీ చర్చల్లో ఒక విశే్లషకుడు పేర్కొన్నట్లుగా విపక్షాల విసిరే రాళ్లను మోదీ ఒడుపుగా పట్టుకుని ఇంచక్కా తమ పునాదులను మరింత బలోపేతం చేసుకుంటున్నారనిపిస్తుంది.
నాయకుల ఫిరాయింపుల విషయం ఎలా ఉన్నప్పటికీ, ప్రజల ఆలోచనలలో వస్తున్న మార్పు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం అయిన విషయంగా కనిపించడం లేదు. ఇంతవరకు రాజకీయాలను,రాజకీయ ప్రాధాన్యతలను ప్రభావితం చేసిన వ్యక్తిగత, ప్రాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ, కుల రాజకీయ భావజాలం స్థానాన్ని జాతీయ భావాలు, జాతీయ ప్రయోజనాలు అక్రమించు కుంటున్నాయి. ఇది ప్రత్యక్షంగా పైకి కనిపించక పోవచ్చును కానీ, వౌనంగా జరుగుతున్నది అదే. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 300 పైచిలుకు స్థానాల్లో బీజేపీని గెలిపించారు.
ఇక ఇప్పడు అసలు విషయానికి వస్తే, నిజమే ఒకప్పుడు జాతీయ, ప్రాంతీయ రాజకీయాల మధ్య అంతరం లాంటిది ఏదో ఉండేది. కానీ, 2019 ఎన్నికల అనంతరం జాతీయ ప్రాధమ్యాల ప్రభావం పెరుగుతోంది. అయినా ఇప్పటికీ, జాతీయ రాజకీయాలు, వేరు రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు మరీ ప్రత్యేకం అనుకునేవారు అనుకోవచ్చు, గానీ వాస్తవ పరిస్థితులను విశే్లషించుకుంటే జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపైనా పడుతోంది. నిజానికి జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో వస్తున్న మార్పుకు తెలంగాణ రాష్ట్రం మినహాయింపు కాదనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో లేదా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, ఇతర రాష్ట్రాలకు తెలంగాణాకు ఏదో గొప్ప తేడా ఉందని అనుకోవచ్చును. కానీ, వాస్తవం అది కాదు. అలా కనిపించడం లేదు. రాష్ట్రంలోనూ సామాన్య ప్రజలు మొదలు రాజకీయ నాయకుల వరకు ప్రాంతీయ సరిహద్దులు దాటి జాతీయ దృక్పథంతో రాజకీయాలను చూడడం జరుగుతోంది.
ఈ విషయం తెరాస నాయకులు సహా అందరికీ తెలుసు. నిజానికి జాతీయ స్థాయిలో ఏదైతే మార్పు చోటు చేసుకుంటోందో, ఆ ‘మార్పు’ తెలంగాణలో మరింత స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదారు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ‘మార్పు’ కు అద్దం పట్టాయి. తెరాస మొత్తం 17 స్థానాల్లో ఒక స్థానాన్ని మిత్ర పక్షం ఎంఐఎంకి వదిలేసి మిగిలన 16 స్థానాలపై గురిపెట్టింది. మొత్తం స్థానాల్లో గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తపరిచింది. నిజంగా కూడా అంతకు కొద్ది నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అలాగే ఉంది. ఆ ఫలితాల ఆధారంగాచూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం ఏర్పడడం సహజం. అయితే, తెరాస ధీమా నీరుకారిపోయింది. కారు ‘పదహారు’ జోరు తొమ్మిది దక్కరే ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయిన బీజీపే అనూహ్యంగా నాలుగు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది. ఆటలో అరిపండు ఆని తీసేసిన కమలం పార్టీ కొడితే కుంభస్థలానే్న కొట్టాలి అన్నట్లుగా నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసింది.
మరో వంక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన 18మంది ఎమ్మెల్యేలలో 13మంది పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరినా, హస్తం పార్టీ మూడు లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంది. ఇక్కడా తెరాస లెక్క తప్పింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకుంటే లోక్‌సభ ఎన్నికలలో విజయం ఈజీ అవుతుందని అనుకుంటే అలా జరగలేదు. ఒక విధంగా చూస్తే రాష్ట్ర విభజన అనంతరం 2019 లోక్ సభ ఎన్నికలు తెరాసకు తొలిసారిగా షాక్’ ఇచ్చాయని భావించాలి. ఈ ఎన్నికలలో కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవిత, కరీంనగర్‌లో కేసీఆర్ కుడి భుజం అనుకునే వినోద్ కుమార్ ఓటమి నిజంగా ‘మార్పు’ కు స్పష్టమైన సంకేతంగా నిలిచింది.
అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేటీఆర్ ఇంచుమించుగా 90 వేల మెజారిటీతో గెలిచారు. కానీ, లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి సీన్ మారిపోయింది. తెరాస గెలిచిన లోక్‌సభ సీట్లలోనూ గత వైభవం కనిపించలేదు. స్వల్ప మెజారిటీతోనే తెరాస అభ్యర్ధులు గట్టెక్కారు. అంటే కొద్ది నెలల తేడాలోనే ప్రజాభిప్రాయం మారిపోయింది. అందుకే, రాజకీయ విశే్లషకులు లోక్ సభ ఎన్నికల ఫలితాలు తెరాసకు హెచ్చరిక చేశాయి, ముందస్తు ప్రమాద ఘంటికలు వినిపించాయనే అభిప్రాయం వ్యక్తపరిచారు.
కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామాలు లేదా గోవా, సిక్కింలలో చోటు చేసుకున్న పరిణామాలు (కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ ఎస్ ప్రభుత్వ పతనం, గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిక్కింలో పది మంది సిక్కి డెమోక్రటిక్ ఫ్రంట్-ఎస్డీ ఎఫ్-ఎమ్మెల్ల్యేలు బీజేపీలో చేరారు) తెలంగాణలో యథాతథంగా రిపీట్ కాకపోవచ్చును. కానీ, ప్రజా భిప్రాయం మారుతోంది అనేంతవరకు ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే తెరాసకు ప్రత్యామ్నాయం ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు తమకు తామే ప్రత్యామ్నాయం అని పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. మరో వంక లోక్ సభ ఎన్నికల ముందువరకు కూడా కాంగ్రెస్ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్ధిగా పేర్కొన్న తెరాస నాయకత్వం ఇప్పుడు బీజేపీ టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో తెరాస-బీజేపీ నాయకుల మధ్య విమర్శల జోరు పెరిగింది. ఈ రెండు పార్టీల మధ్య జుగల్బందీ లేని రోజు లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరో వంక తెరాసకు ప్రత్యామ్నాయం ఎవరన్న విషయంలోకి వస్తే, ప్రస్తుతానికి బీజేపీది పైచేయిగా ఉందని వేరే చెప్పనక్కరలేదు. బీజేపీకి జాతీయ స్థాయిలో సమర్ధ నాయకత్వం ఉంది, రాష్ట్ర స్థాయిలో సైద్ధాంతిక పునాదులు ఎంతో కొంత బలంగా ఉన్నాయి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సుమారు 20 శాతం ఓటు షేర్‌తో నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. నిజానికి గతంలోనూ ఒంటరిగా పోటీచేసిన సమయంలో బీజేపీకి తెలంగాణలో 20 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. కాబట్టి, కొంతకాలంగా తె లంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్నా పార్టీ పునాదులు మాత్రం బలంగానే ఉన్నాయి. ఇంచుమించుగా గత దశాబ్ద కాలానికి పైగా వివిధ కారణాల చేత చెల్లచెదరైన పార్టీ నాయకులు, క్యాడర్ సొంత గూటికి చేరు కుంటున్నారు. మరో వంక తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఖాళీ కావడంతో ఆ పార్టీ చిన్నా పెద్దా నాయకులు చాలావరకు ఇప్పటికే కమలం గూటికి చేరారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఎవరో కాదు, మరో గత్యంతరం లేక మరో మారు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నెత్తికెత్తుకున్న సోనియా గాంధీనే, రెండు రోజుల కితం రాజీవ్ గాంధీ జయంతి సభలో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అంగీకరించారు. నిజానికి, కాంగ్రెస్ దయనీయ స్థితి రహస్యమేమీ కాదు, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. మరో వంక బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీ కరించింది. పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కడుపుతున్నారు. ఇటీవల నడ్డా సమక్షంలోనే చాలాపెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. అలాగే, తెరాస ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాల నిర్మాణం జరుగుతోంది. ఫలితంగా రానున్న కాలంలో తెరాస వ్యతిరేక ఓటు బీజేపీ ఖాతాలో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని రాజకీయవర్గాల్లో విని పిస్తోంది.అందుకే, ఇతర పార్టీల నాయకులు బీజీపీ వైపు చూస్తున్నారు. సరే, నాయకులు చేరినంత మాత్రాన పార్టీ బలపడుతుందా? బీజేపీ గొప్పగా చెప్పుకునే సిద్దంతాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది.
రాష్ట్రం వరకే చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 18మంది ఎమ్మెల్యేలలో 13 మంది కారెక్కి వెళ్ళిపోయారు. దీంతో ప్ర జల దృష్టిలో కాంగ్రెస్ పలచనై పోయింది. ప్రతిష్ట దిగజారిపోయింది. కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించినా ప్రయోజనం లేదని, ఎటూ వారు తెరాసలోకే పోతారని ఒక సాధారణ అభిప్రాయం బలపడిపోయింది. మరో వంక కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు పార్టీని మరింతగా బలహీన పరుస్తున్నాయి. కోమటిరెడ్డి సోదరులే కాదు, నెహ్రూ-గాంధీ కుటుంబ వీర భక్త హనుమాన్ అయన వీహెచ్ కూడా పార్టీ అధినాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎంత చక్కగుందో రాష్ట్రంలోనూ అంటే చక్కగుందన్న అభిప్రాయం బల పడుతోంది. అందుకే తెరాసకు ప్రత్యామ్నాయం బీజీపీనే అనేది, కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు కూడా అంగీ కరిస్తున్నారు. అయితే, బీజేపీ నాయకులు ఆశపడుతున్నట్లుగా తెలంగాణలో వారు అధికారంలోకి వస్తారా? అంటే .. అది ఇప్పుడే చెప్పడం అసాధ్యం. రేపో మాపో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కొంత వరకు క్లారిటీ వస్తుంది. అంతవరకూ.. నో కామెంట్ .. అనుకోవడం అందరికీ మంచిది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722