మెయన్ ఫీచర్

చెదపట్టిన చట్టాలకు కొత్తరూపం.. వేజ్ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సంప్రదాయ పారిశ్రామికత నుండి ఆధునికతను సంతరించుకోవడంతో శారీరక శ్రమ కంటే మేధస్సుకు, విజ్ఞానానికి, ఆలోచనలకు, విశే్లషణలకూ ప్రాధాన్యత పెరిగింది. రెండు వందల ఏళ్ల క్రితం అక్షరాస్యత లేని వారు, సాక్షరాస్యులు మాత్రమే కార్మికులుగా చేరేవారు, వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది, మనస్సుతో ఆలోచించి చేసే పనులకు వేరే వర్గాన్ని నియమించుకునేవారు. దాదాపు రెండు వేల ఏళ్ల నుండి ఇదే తీరు కొనసాగుతున్నా పారిశ్రామిక విప్లవం 1760 తర్వాతనే మొదలైంది. యూరప్, యుఎస్‌లతో పాటు ఇంగ్లాండ్‌లలో 1820- 1840 మధ్య వస్త్ర పరిశ్రమ మిల్లులు ఎక్కువై కార్మికుల సంఘర్షణలు పెరిగాయి. అదే కాలంలో పారిశ్రామిక ఔత్సాహికత బ్రిటిష్ ఇండియాలో మొదలైంది. పనివాతావరణం, పని గంటలు, ఆరోగ్యం, వేతనాలు చెల్లింపు, యాజమాన్యాల వేధింపులు తదితర ఘటనల పరంపరలో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో 1784లో చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడింది. కార్మికుల అంశాలను వినేందుకు ప్రపంచంలో మొట్టమొదట నియమితుడైన న్యాయాధికారి డాక్టర్ థామస్ పెరిసివల్ చేనేత పరిశ్రమ సంక్షోభంపై నివేదిక తయారుచేశారు. ఆ నివేదికలోని అంశాల ఆధారంగా బ్రిటన్‌లో 1819లో ఫ్యాక్టరీల చట్టం అమలులోకి వచ్చింది. దానికి కొన్ని సవరణలు చేస్తూ 1833లో మరిన్ని అంశాలను చేర్చారు. సమగ్రంగా టెక్స్‌టైల్ ఫ్యాక్టరీల చట్టాన్ని 1844లో తీసుకువచ్చినా, పనిగంటల విషయంలో నెలకొన్న వివాదాలకు పరిష్కారంగా 1847లో మరో చట్టాన్ని తెచ్చారు. దాదాపు కార్మిక చట్టాలు అన్నీ ఇంగ్లాండ్ చట్టాలే యథాతథంగా భారత్‌లోనూ అమలులోకి తెచ్చినా, 1947లో భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించడం, నూతన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి రావడంతో భారత్‌లోనూ కార్మిక చట్టాలు పటిష్టమయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14-16, 19(1)(సీ), 23,24,38,41,43ఏలు కార్మిక హక్కులకు సంబంధించినవే.
ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న కార్మిక చట్టాల వ్యవహారం ఆగస్టు 8న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రతో వేతన కోడ్ బిల్లు -2019గా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. దాదాపు 40 చట్టాల్లో 13 చట్టాలను మిళితం చేసి వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులు-స్మృతిబిల్లు- 2019 రూపంలోకి తీసుకువచ్చారు. మరో నాలుగు ప్రధాన చట్టాలు వేతన కోడ్ బిల్లు-2019గా మారాయి. 1948 నాటి కనీస వేతనాల చట్టం, 1936 వేతనాల చెల్లింపు చట్టం, 1965 బోనస్ చెల్లింపు చట్టం, 1976 సమాన వేతన చట్టం వేతన కోడ్ బిల్లుగా వచ్చేశాయి. కొత్త కోడ్‌లో 69 క్లాజులను పొందుపరిచారు. తొలి చాప్టర్‌లో నిర్వచనాలు, త ర్వాత కనీస వేతనాలు గురించి, వేతనాల చెల్లింపు, బోనస్ చెల్లింపు, సలహా మండళ్లు, బకాయిల చెల్లింపు, ఆడిటింగ్, ఇనస్పెక్టర్ల నియామకం, నేరాలు, ఇతర అంశాల గురించి ఈ స్మృతిలో వివరంగానే చేర్చారు.
తాజా స్మృతి ప్రకారం త్రైపాక్షిక కమిటీ కనీస వేతనాలను ఖరారుచేస్తుంది. 2017 ఆగస్టు 10న వేతనాల కోడ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడితే దానికి కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేశారు. స్టాండింగ్ కమిటీ 2018 డిసెంబర్ 18న తమ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికలోని 24 సిఫార్సుల్లో 17 సిఫార్సులను అమలుచేస్తూ ప్రభుత్వం తొలుత రాజ్యసభలో ఈ బిల్లును ఆగస్టు 2న తీసుకురాగా ఆమోదం పొందింది. వెనువెంటనే రాష్టప్రతి ఆమోద ముద్ర కూడా పడింది. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జండర్ల వేతనాల్లో ఇంత కాలం కొనసాగిన వ్యత్యాసాలు తొలగిపోతాయి. పని గంటల్లో ఉన్న వ్యత్యాసం సైతం పోతుంది. ఈ రెండు అంశాలు చాలా ముఖ్యమే అయినా, రానురాను పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లేందుకు ఒక ప్రధాన కారణంగా భావిస్తున్న యూనియన్లను స్థాపించుకునే హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(సీ) ప్రతి వ్యక్తీ తనకు నచ్చిన సంఘాల్లో కలిసి పనిచేసే హక్కును కల్పించినా, కొత్త కోడ్ ప్రకారం యూనియన్ల ఏర్పాటు , దురుసు ప్రవర్తన, ఉత్పత్తికి ఆటంకం కలిగించడం వంటి పదాల చాటున హక్కు నిర్వీర్యం అయ్యే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తుంటే కార్మిక చట్టాలను సంస్కరించడం, సరళీకరించడం అనే మాటున విదేశీ, కార్పొరేట్ పెట్టుబడి సంస్థలకు దాసోహం అయ్యేలా కొత్త కార్మిక స్మృతి కనిపిస్తోంది.
ట్రేడ్ యూనియన్ చట్టం 1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ యాక్టు 1946, పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం 1947, వారాంతపు సెలవుల చట్టం 1942, ఫ్యాక్టరీల చట్టం 1948, వన కార్మికుల చట్టం 1951, గనుల చట్టం 1952, భవన కార్మిక చట్టం 1996, మోటారు రవాణా కార్మికుల చట్టం 1961, బీడీ కార్మికుల చట్టం 1966, కాంట్రాక్టు ల్యాబర్ కార్మికుల చట్టం 1970, వెట్టి చాకిరీ నివారణ చట్టం 1976, అమ్మకాల ప్రొత్సాహక కార్మికుల చట్టం 1976, అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979, సినీ కార్మికులు చట్టం 1981, నౌకాయాన కార్మికుల చట్టం 1986, బాలకార్మికుల నివారణ చట్టం 1986, వర్కింగ్ జర్నలిస్టుల , పత్రికల్లో పనిచేసే కార్మికుల చట్టం 1955, వర్కింగ్ జర్నలిస్టులు వేతనాల నిర్ధారణ చట్టం 1958, ఎంప్లాయిస్ పరిహార చట్టం 1923, ఉద్యోగుల పీఎఫ్ ఇతర అంశాల చట్టం 1952, ఉద్యోగుల బీమా చట్టం 1948, ఉద్యోగుల మరణానంతర ప్రయోజనాల చట్టం 1961 సహా మరో 14 చట్టాలు కార్మిక శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ చట్టాలు అన్నింటిలోనూ వేతనాల నిర్ధారణ, పనిగంటలు, సెలవులు, పనితీరు, పరిహారాలు, చర్యలు, విచారణ తదితర అంశాలు ఉన్నాయి. అన్ని చట్టాల్లోని కనీస వేతనాల అంశాలను కలిపి కొత్త స్మృతి పరిధిలోకి తీసుకువచ్చారు. రెండేళ్ల క్రితమే స్మృతికి ఒక రూపం ఇచ్చి లోక్‌సభలో ప్రవేశపెట్టినా నేటికీ ఏ ప్రాతిపదికన కనీస వేతన నిర్ణయం ఉండాలో లేకపోవడంతో కార్మికులు ఆందోళనకు కారణమైంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలతో 1957లో జరిగిన భారత కార్మిక మహాసభ కనీస వేతనాల నిర్ణయానికి కొన్ని సిఫార్సులను చేసింది. దాని ప్రకారం వచ్చే వేతనం మీద మరో 25 శాతం విద్య, ఆరోగ్యం తదితర ఖర్చులను కలుపుకుని కనీస వేతనాన్ని నిర్ణయించాలని 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంశాలను కొత్త స్మృతిలో విస్మరించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త స్మృతికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు, నియమనిబంధనలు ఇంకా విడుదల చేయకపోవడంతో వాటిలో ఏమైనా అంశాలను చేర్చుతారేమో ఎదురుచూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2016లో కర్మాక మహాసభ సిఫార్సులు, సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే కనీస వేతనం 18వేలు చెల్లించాలని ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. 18వేల కనీస వేతనాన్ని జాతీయ కనీస వేతనంగా నిర్ణయించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం 2700 క్యాటరీలు కాకుండా 2400 క్యాటరీలు మాత్రమే లెక్కలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణయించడం ద్వంద్వనీతికి నిదర్శనం. ఇతరత్రా అయ్యే ఖర్చులకు 2012 ధరల ప్రకారం లెక్కలు తీసుకుంది. భారత కార్మిక మహాసభ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకూ పొంతన లేకుండా పోయింది.
రిటైరవుతున్న కార్మికులకు పెన్షన్ విషయంలోనూ ఇంకా అయోమయాన్ని కొనసాగిస్తోంది. ఉద్యోగి పింఛను పథకంతో పాటు జాతీయ పింఛను పథకాన్ని కూడా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ రెండు పథకాల్లో ఏది ఉత్తమమైనదనే అయోమయం ఇంకా తొలగిపోలేదు. నిజానికి స్టాండింగ్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో కొత్త స్మృతి అసంపూర్ణంగానే భావించాల్సి ఉంటుంది. వృత్తిపరమైన భద్రత- ఆరోగ్యం- పని పరిస్థితుల మెరుగు బిల్లులో ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, నౌకానిర్మాణ కార్మికుల చట్టం, భవన నిర్మాణ కార్మికుల చట్టం, వన కార్మికుల చట్టం, కాంట్రాక్టు కార్మికుల చట్టం, అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల చట్టం, వార్తాపత్రికల సిబ్బంది చట్టాలు, మోటారు రవాణా కార్మికుల చట్టం, అమ్మక ప్రోత్సాహక కార్మికుల చట్టం, బీడీ కార్మికుల చట్టం, సినీ వర్కర్లు చట్టం రద్దు చేసి ఒకే స్మృతి కిందకు తీసుకువచ్చింది. ఫ్యాక్టరీల చట్టంలోని భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులకు సంబంధించిన నిబంధనలు ఏవీ కొత్త స్మృతిలో కానరావడం లేదు, ఇవేవీ లేకుండా కొత్త స్మృతి అత్యుత్తమ బిల్లు ఎలా అవుతుందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి.

-బీవీ ప్రసాద్ 98499 98090