మెయన్ ఫీచర్

‘అమరావతి’పై ఎందుకింత రభస..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రుల రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మొరటుగా, నిర్దయగా ఉంటాయి. అమరావతిలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు కొనసాగాల్సిందేనని టీడీపీ వాదిస్తోంది. తాము రాజధానిని మార్చమని, అయితే ముంపుప్రాంతాన్ని గత ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసుకుందని వైకాపా నేతలు అంటున్నారు. ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణాన్ని వైకాపా సర్కారు చేపడుతుందా? లేక అమరావతి పరిధిలోనే ముంపుప్రభావం లేని ప్రాంతానికి తరలిస్తుందా? అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ పరిధిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చాలా ప్రాంతాలు వస్తాయి. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతమే. గనుక ఇక్కడే రాజధాని ఉంటుందనేది నిశ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైకాపాకు జనం పట్టం కట్టారంటే, చంద్రబాబు రాజధానిని ఎంపిక చేసుకున్న తీరును వారు తిరస్కరించినట్లే.
ఆంధ్రాకు పూర్తిస్థాయిలో రాజధాని ఏర్పడలేదు. గతంలో చంద్రబాబు హయాంలో కొన్ని భవనాలను నిర్మించినా అవి తాత్కాలిక భవనాలని, పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల వాదనల సంగతి పక్కనపెడితే, ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన నిమిత్తం ఒక స్మార్ట్ రాజధాని అవసరం. మూడు పంటలు పండే 29 గ్రామాల్లోని సారవంతమైన ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ఎంపిక చేయడం చారిత్రక తప్పిదమే. రాష్ట్ర రాజధానిని సీఆర్‌డీఏ వెలుపలకు మార్చే సాహసం బహుశా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయకపోవచ్చు. అదే జరిగితే వైకాపా బలహీనపడేందుకు కారణమవుతుంది.
అమరావతి ప్రాంతంలో సామాన్యుడు కొనుగోలు చేసే స్థాయిలో భూముల ధరలు లేవు. వాస్తవానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా స్థలాల ధరలు ఉండాలి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. భవిష్యత్తులో మహానగరం వస్తుందంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, భూముల యజమానులు కుమ్మక్కై గజం రేటును రూ.50వేలకు పైగా నిర్ణయించారు. హైదరాబాద్, చెన్నై శివార్లలో కూడా ఈ రేట్లు లేవు. అపార్టుమెంట్లలో ఫ్లాట్ల రేటు కూడా అంతే. రాజధాని అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితం కాదు. రాజధాని మనందరిదీ అనే మానసిక భావనను కల్పించలేకపోయారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చి అమరావతిలో ఎవరైనా స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయగలరా? రాజధాని అంటే కరెన్సీ నోట్ల మార్పిడి కేంద్రమా? ఐశ్వర్యవంతులకు నిలయమా? అనే ఆగ్రహం ప్రజల్లో కలిగింది. ఈ రోజు టీడీపీ నేతలు చేస్తున్న హడావుడి వల్ల ప్రచారం రావచ్చునేమో కాని, ప్రజలు హర్షించడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అమరావతిలో రాజధాని నిర్మాణం ఇంకా చేపట్టలేదు. భవిష్యత్తులో 10 నుంచి 15 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తే పరిస్థితి ఏమిటనే విషయమై చర్చ జరుగుతోంది. పైగా నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది. అందుకే సీఆర్‌డీఏ పరిధిలో గట్టినేల ఉన్న చోట రాజధానిని నిర్మిస్తే తప్పేమీ లేదు. ఇక సినిమా సెట్టింగ్‌ల మాదిరి రాజధానిలో బహుళ అంతస్థుల భవనాలు అక్కర్లేదు. అసెంబ్లీ, హైకోర్టుతో కలిపి ఒక డజను పరిపాలన భవనాలు చాలు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా రిక్రూట్‌మెంట్ జరిగేది. కేవలం పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ మాత్రమే ఇపుడు జరుగుతోంది. టెక్నాలజీ వల్ల చాలా పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అవసరం ఉన్న వాళ్లు తప్ప సామాన్య ప్రజలకు సచివాలయంతో పని ఉండదు. రాజధానిని ఎంత గొప్పగా నిర్మించినా ఉద్యోగులు మాత్రం గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరిలోనే ఉంటూ అక్కడి నుంచి వస్తారు. సెక్రటేరియట్‌కు సమీపంలో ఎందుకుంటారు? వారికి వసతి సదుపాయాలు కల్పించినా, పిల్లల చదువులు, వైద్య సదుపాయాల నిమిత్తం అక్కడ ఉండరు. ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం వెళ్లే ఉద్యోగుల కోసం రాజధాని నిర్మించరు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌పైన నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేలాది మంది కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఆఫీసు అసిస్టెంట్లు, అటెండర్లను నియమించే సాహసం ప్రభుత్వం చేస్తుందా? అంత ఆర్థిక స్థాయి ప్రభుత్వానికి ఉందా?
ఆంధ్రాలో సచివాలయానికి పని ఉన్నా లేకపోయినా గుంపులు గుంపులుగా జనం వచ్చే సంస్కృతి ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో కూడా ఇదే జరిగింది. సచివాలయం ఎమ్మెల్యేలు, వారి వందిమాగధులతో నిండిపోయేది. ఒకరికి పని ఉంటే వంద మంది లోపలికి వచ్చేవారు. జనాన్ని వేసుకుని పాస్‌లు ఇప్పించి సెక్రటేరియేట్‌కు తీసుకువస్తేనే నాయకుడన్నట్లు చాలామంది భావిస్తారు. ఇదంతా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వారి గొప్పలు చాటుకునేందుకు మాత్రమే పనిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ అవసరం. హైదరాబాద్‌లో చేసిన తప్పిదం పునారవృతం కారాదు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని ఇపుడు జగన్ చేసి చూపిస్తారని జనం భావిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. కర్నూలు లేదా తిరుపతిలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడం, అసెంబ్లీని నిర్మించడం మంచిది. దీని వల్ల అమరావతిపై వత్తిడి తగ్గుతుంది. చరిత్రలో మనకు అన్నీ చిన్న చిన్న సంస్థానాలే ఉండేవి. రెండువేల ఏళ్ల క్రితం శాతావాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. వరదల వల్ల వారు అమరావతి నుంచి రాజధానిని మార్చారని చరిత్రాకారులంటారు. 66 ఏళ్లలో మద్రాసు, కర్నూలు, హైదరాబాద్‌ను పొగొట్టుకున్న ఆంధ్ర రాష్ట్రం, ఈ రోజు తన రాజధాని అమరావతిలోనే ఉంటుందా? లేక మారుతుందా? అనే అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలకులు ఇటువంటి సున్నితమైన అంశాలపై సులభంగా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు.
నిజంగా అమరావతి పరిధిలోనే సురక్షిత ప్రాంతానికి రాజధానిని మార్చాలంటే ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి ప్రజలకు వాస్తవాలను వివరించాలి. లేనిపక్షంలో ఈ పుకార్లకు స్వస్తి చెబుతూ ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయడం మంచిది. రాజధాని అనేది అన్ని వర్గాల ప్రజల కోసం నిర్మించాలి. అరగంట నుంచి గంటన్నర ప్రయాణిస్తే వెళ్లే గుంటూరు, మంగళగిరి, తెనాలి, విజయవాడ, ఏలూరు, గుడివాడ లాంటి పట్టణాలు ఉన్న చోట మహానగరంగా అమరావతి అవతరించడం దుర్లభం. ఇది ఒక అందమైన కల మాత్రమే. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం అన్ని హంగులతో పరిపాలనా భవనాలు, హైకోర్టు,అసెంబ్లీ భవనాలు, మంత్రులు, న్యాయమూర్తులు, అధికారులకు నివాస భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. దీనికి 34వేల ఎకరాల మాగాణి భూములను సేకరించారు. ఈ రోజు రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల బాధలను ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి నిర్మాణం కోసం స్టాక్ మార్కెట్‌లో బాండ్లు కూడా విడుదల చేశారు. 20వేల మంది భవన నిర్మాణ కార్మికులు అమరావతి వదిలి వారి గ్రామాలకు వెళ్లారని, ఇపుడు అక్కడ ఎలాంటి పనులు లేవనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలపై ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. సీఎం జగన్ నిర్ణయాలు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలి. అమరావతి రాజధాని స్టేటస్‌పై శే్వతపత్రం విడుదల చేయాలి. ప్రదేశాన్ని మార్చకుండా యదాతథంగా నిర్మాణం చేపట్టడమో లేదంటే అదే ఏరియాలో మరో ప్రదేశానికి మార్చాలనుకుంటే వివిధ వర్గాలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఏమి చేసినా బ్రాండ్ ఇమేజి దెబ్బతినకుండా చూసుకోవాలి. ఆంధ్రరాష్ట్రానికి అమరావతి ఒక బ్రాండ్ ఇమేజి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయపరమైన వ్యక్తిగత కక్షలకు తావులేకుండా అధికారంలో ఉన్న పార్టీ వ్యవహరించాలి. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ బ్రోకర్లకు, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు, నడమంత్రపుసిరితో రాత్రికి రాత్రి ధనవంతులు కావాలనే ఆశబోతులకు, గ్యాంబ్లింగ్ సంస్కృతికి నిలయంగా ఉండరాదు. స్టాక్ మార్కెట్‌లోలాగా ఉదయం పెట్టుబడి పెట్టి, సాయంత్రానికి లాభాలు దండుకునే కేంద్రంగా అమరావతి మారకుండా చూడాలి.
ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. చివరకు బజారుకు వెళ్లి పాదరక్షలు కొనుగోలు చేసే ఓపిక కూడా జనానికి లేకుండాపోయింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. కొరియర్ సంస్థలు తెల్లారేసరికల్లా హోమ్ డెలీవరీ చేస్తున్నారు. రాజధాని అంటే పాత సినిమాల్లో మాదిరిగా లేకపోతే మహానగరాల్లో మాదిరిగా బంగారు బజారు, గాజుల బజారు, బ్యాంకుల బజారు, హోల్‌సేల్ కిరాణా బజారు, టెక్స్‌టైల్ బజార్లు వంటివి ఉంటాయనే భ్రమలకు లోనై రంగుల చిత్రం ఆవిష్కృతమవుతుందని జనం భావించారు. ఊహాజనితమైన రంగుల ప్రపంచానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది. కోట్లాది రూపాయలు కుమ్మరించి విదేశీ రాజధానులను తలదనే్న భవనాలు నిర్మించాలన్న ఆలోచననే ముమ్మాటికీ తప్పు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో జారుకుంటోంది. ఈ పరిస్థితుల్లో అప్పులుచేసి పరిపాలనా భవనాలను నిర్మించాల్సిన అవసరం లేదు. దీని బదులు ప్రభుత్వాసుపత్రులు, పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను కల్పించవచ్చు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కరవు ప్రాంతాలకు సాగునీటిని ఇవ్వాలి.
అమరావతి రాజధాని ప్రాంతం నుంచి విజయవాడ ఆవల ఉన్న గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాంటే ఇప్పటికీ రెండే రెండు వంతెనలు దిక్కు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా నిర్మించలేకపోయింది. దీని వల్ల విజయవాడ నగర ప్రజలు వీఐపీల తాకిడితో ట్రాఫిక్‌లో తరచుగా చిక్కుకుంటున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే మూడేళ్లలో కృష్ణా నదిపై వంతెన నిర్మింవచ్చు. రాజధానిపై జగన్ ప్రభుత్వం అభూతకల్పనలకు చెక్ పెట్టాలి. ప్రభుత్వానికి భూములను ఇచ్చిన రైతుల కష్టాలను సహృదయంతో అర్థం చేసుకుని వారి భయాలను పొగొట్టాలి. పరిపాలన వికేంద్రీకరణపై శ్రద్ధ పెట్టాలి. అధికార, విపక్ష పార్టీలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రభావానికి లోనై డబ్బు దండుకునే ఎత్తుగడలకు స్వస్తి చెప్పి ప్రజలకు అవసరమైన రాజధాని నిర్మాణంపై శ్రద్ధపెట్టాలి. లేదంటే మరోసారి ఆంధ్రరాష్ట్రం జాతీయస్థాయిలో అభాసుపాలవుతుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097