మెయన్ ఫీచర్

కాశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియకు సమయమిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ప్రశ్నార్థకంగా చేస్తూ వస్తున్న 370వ అధికరణను వర్తింప చేయకుండా రాష్టప్రతితో ఒక ప్రకటన ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం క్లిష్టమైన ఒక సమస్యకు అతి సులభమైన పరిష్కారం కనుగొన్నది. ఇప్పటి వరకు వివాదాస్పదంగా భావిస్తున్న ఈ అంశానికి రాజకీయ పక్షాలకు అతీతంగా లభించిన మద్దతు చూస్తుంటే దేశ ప్రజలు అటువంటి చర్యకు ఎదురు చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
పార్లమెంట్‌లో ఈ చర్యను తీవ్రంగా తూర్పురబట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహితం కాశ్మీర్ లోయలో హింసను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నదని అంటూ కఠినమైన పదప్రయోగంతో ఒక ప్రకటన చేయవలసి రావడం గమనిస్తే దేశ ప్రజల భావోద్వేగాలను వెల్లడి చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్‌కు మిగిలిన భారత దేశానికి ఇప్పటివరకు నెలకొన్న ప్రధాన అడ్డుగోడ తొలగిపోయినట్లు నేడు దేశ ప్రజలు భావిస్తున్నారు.
మొత్తం భారతదేశంతో జమ్మూకాశ్మీర్ సంపూర్ణ విలీనానికి ఇదొక్క పెద్ద ముందడుగుగా నేడు దేశం మొత్తం భావిస్తున్నది. 370వ ఆర్టికల్ రద్దుతో భారతదేశ సమైక్యత మరింత బలోపేతమైనదని చెప్పవచ్చు. అయితే నేడు మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాల్ కాశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనేటట్లు చేయడం. ప్రజా జీవనం సాధారణ స్థాయికి చేరుకొనేటట్లు చేయడం.
సుమారు నెల రోజులుగా కాశ్మీర్ లోయలో నేడు అప్రకటిత అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ నెట్, మొబైల్ ఫోన్లు, సాధారణ ఫోన్‌లను సహితం పనిచేయనీయకుండా చేశారు. స్థానిక వార్తాపత్రికలు రావడం లేదు. అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు అందరు నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చెప్పిన సమాచారం తప్ప అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ రాజకీయ ప్రక్రియ జరగడం లేదు.
ఈ నెల రోజుల కాలంలో కాల్పులలో ఒక్కరు కూడా చనిపోలేదని గవర్నర్ సత్ పాల్ మాలిక్ చెప్పుకొచ్చారు. అయితే ఉగ్రవాదుల కదలికలను పూర్తిగా అరికట్టలేక పోతున్నట్లు అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు వెల్లడి చేస్తున్నాయి. ఈ పరిస్థితులను ఏ మాత్రం సడలించినా సామూహికంగా హింసాయుత పరిస్థితులు ఏర్పడవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం స్వేచ్ఛ వాతావరణం కలిగించినా జిహాదీ ఉగ్రవాద కార్యకలాపాలకు బార్లు తెరిచినట్లు కావచ్చని వెనుకడుగు వేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రులతో సహా స్థానిక రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచడం వారి మంచి కోసమే అన్నట్లు గవర్నర్ చెప్పుకొచ్చారు. అంటే అసహనంతో ఉగ్రవాదులు వారిపై దాడులు జరిపే అవకాశం ఉన్నదనే అభిప్రాయం కావచ్చు. అంటే ప్రస్తుతం భారీగా సాయుధ దళాలను మోహరింప చేయడంతో పరిస్థితులు ప్రశాంతం గా ఉన్నట్లు కనిపిస్తున్నా సాధారణ పరిస్థితులు నెలకొన డానికి మరింతగా కృషి చేయవలసి ఉంది.
అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుండి తరలించిన సుమారు 40 వేల మంది కేంద్ర సాయుధ దళాలను ఇప్పుడు తిరిగి వెనుకకు పంపవలసిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ పౌరసత్వ జాబితాను ఈ నెలాఖరుకు విడుదల చేయవలసి ఉండడంతో, ఆ తర్వాత అక్కడ హింసాయుత పరిస్థితులు నెలకొనవచ్చని అనుమానిస్తున్నారు. దానితో కాశ్మీర్ లోయలో సాయుధ దళాల మోహరింపు కొంతమేరకు తగ్గించినట్లవుతుంది. సుదీర్ఘకాలం సాయుధ దళాలతో ప్రశాంతతను కొనసాగించడం సాధ్యం కాదు.
ఇటువంటి తీవ్రమైన చర్య తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఎవ్వరు, చివరకు కేంద్ర మంత్రులు సహితం శ్రీనగర్‌కు వెళ్ళలేదు. పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా వెళతారని, మూడు, నాలుగు రోజులు ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తారని కథనాలు వెలువడినా ఆయన ఇంకా బయలుదేరలేదు.
జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా, ఉద్యోగ నియామకాలు జరపడం ద్వారా అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనేటట్లు చేయడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకోసం ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించమని కోరారు. పెండింగులో ఉన్న ఆ ప్రాంతానికి చెందిన అన్ని పనులను తక్షణం అమలు చేయమని మంత్రులను ప్రధాని ఆదేశించారు.
ఆర్టికల్ 370 కారణంగా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో వెనుకబడినదని చెప్పిన ప్రధాని మోదీ ఆ దిశలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే అక్కడి ప్రధాన సమస్య అభివృద్ధి కాదని, స్థానిక ప్రజల విశ్వాసం పొందటం అని గుర్తించలేక పోతున్నారు. ఇప్పుడు కాశ్మీర్ లోయలో కావలసింది సైనిక చర్య కాదనీ, రాజకీయ ప్రక్రియ అనీ గ్రహించినట్లు కనబడటం లేదు. ఇప్పటి వరకు ప్రధాని గానీ, హోమ్ మంత్రి గానీ కాశ్మీర్ లోయ ప్రజలకు భరోసా కలిగించే విధంగా మాట్లాడటం లేదు.
బీజేపీతో పొత్తు ఏర్పరచుకొని సంశయిస్తూనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెహబూబ్ ముఫ్తి పలుసార్లు ప్రధానిని స్వయంగా కలసి రాజకీయ ప్రక్రియ చేపట్టమని అభ్యర్థించారు. ఎక్కడైతే వాజపేయి ఆగిపోయారో, అక్కడి నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని కోరారు. కానీ రిటైర్డ్ అధికారులను పంపి పరిస్థితులను మెరుగుపరచే ప్రయత్నాలు చేయడమే గాని, రాజకీయ నాయకత్వం సారధ్యం వహించక పోవడం నేడు అక్కడున్న ప్రధాన సమస్య అని చెప్పవచ్చు.
స్వాతంత్య్రం అనంతరం మొదటిసారిగా ఒక రాజకీయ వేత్త గవర్నర్‌గా రావడంతో వివిధ వర్గాల ప్రజలకు తమ సాధకబాధకాలు చెప్పుకొనే అవకాశం కలిగినట్లు అయింది. అదే విధంగా స్వయంగా ప్రధాని వివిధ వర్గాల వారి వాదనలు విని, వారికి భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. అమిత్ షా సహితం తరచూ కాశ్మీర్ లోయలో పర్యటిస్తూ వారికి అండగా ఉంటామనే విశ్వాసం కలిగించాలి.
తీవ్రవాదం ప్రారంభమైన తొలి రోజులలో కాశ్మీర్ లోయలోని ప్రజలు పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులపై పోరాటం జరిపారని మరచిపోరాదు. అంతేకాదు, తీవ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఎన్నికలను బహిష్కరించమని వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపులను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఎన్నికల సమయంలో ఓటు వేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎందుకు లేవు? ఎక్కడ లోపముంది?
వాస్తవానికి 1989-1991లలో కాశ్మీర్ పండిట్‌లు అక్కడి నుండి శరణార్థులుగా వెళ్ళిపోయిన తర్వాత లోయలో పరిస్థితులు ఎప్పుడు ప్రశాంతంగా లేవు. ఎక్కడో ఒక చోట హింస చోటుచేసుకొంటూనే ఉంది. తీవ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. వాస్తవాలను గ్రహించి, వాటిని అదుపు చేసే చర్యలు చేపట్టాలి గాని, ఎక్కువకాలం ఆంక్షలు విధించి, సాయుధ నిర్బంధంలో మొత్తం ప్రజానీకాన్ని ఉంచలేరు. దానితో వెంటనే ఆంక్షలను తొలగించే ప్రయత్నం చేయాలి. పరిస్థితులు అదుపు తప్పినా ఆగష్టు 5 ముందు నాటి వలే నిరసనలు తీవ్రతరం కావచ్చు. వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సోషల్ మీడియాపై నిఘా ఉంచి, అల్లర్లను ప్రేరేపిస్తున్న వారిని గుర్తించి, అదుపు చేసే ప్రయత్నం చేయాలి. కానీ మొత్తం ప్రజా జీవనాన్ని ఆంక్షలకు గురి చేయడం వల్లన ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులలో సైనిక, పోలీస్, రిటైర్డ్ అధికారులకన్నా రాజకీయ నాయకత్వం మరింత వివేకంతో వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంతర్జాతీయంగా ఏకాకి అయినప్పటికీ పాకిస్థాన్ వౌనం వహించే అవకాశం లేదు. రెండు నెలల్లో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదని ఒక మంత్రి అసహనంతో చేసిన వాఖ్యలు చూసాము. యుద్ధానికి దిగే సాహసం చేయకపోయినా రెచ్చగొట్టే చర్యలకు దిగడం అనివార్యం. అటువంటి చర్యలను ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధం కావలసి ఉంది. భారత్‌లో కాశ్మీర్ లోయ విలీనం సంపూర్ణం కావాలి అంటే స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోక తప్పదు. వారికి కేంద్ర ప్రభుత్వం పట్ల, రాజకీయ నాయకత్వం పట్ల విశ్వాసం కలిగించే విధంగా చర్యలు తీసుకోవలసి ఉంది.
ముఖ్యంగా ఈ చర్యను హిందూ - ముస్లిం అంశంగా ఒక విష ప్రచారం జరుగుతున్నది. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లోయలోని ముస్లింలు సర్వం కోల్పోయారని ప్రచారం జరుగుతున్నది. నేరుగా కాశ్మీర్ ముస్లింలలో భరోసా కలిగించేందుకు ప్రధాని మోదీ పూనుకోవాలి. ఈ చర్య ద్వారా అవినీతిపరులైన స్థానిక రాజకీయ నాయకత్వం నుండి తమకు విముక్తి కలిగినట్లు వారు గ్రహించేవిధంగా చేయాలి.
ఆ ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా ఇప్పటివరకు మిగిలిన దేశంలోని ప్రజలు పొందలేక పోతున్న 109 హక్కులను కాశ్మీర్ ప్రజలు కూడా పొందగలిగే అవకాశం ఏర్పడింది. ఉదాహరణకు అవినీతి నిరోధక చట్టం, సమాచార హక్కు చట్టం వంటివి అక్కడ ఇప్పటివరకు వర్తించడం లేదు. అట్లాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు విద్య, ఉపాధి, రాజకీయ రేజర్వేషన్లు అమలు కావడం లేదు. ఇప్పుడు ఒక కొత్త జీవితం వారి ముందుకు రాబోతున్నది. ఈ విషయమై వారిలో అవగాహన కలిగించేందుకు రాజకీయ ప్రక్రియ తక్షణం అవసరమని గ్రహించాలి.
పొరుగున ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్తిస్తాన్ లలో గత 70 ఏళ్లలో పాకిస్థాన్ పాలనలో అభివృద్ధికి దూరంగా ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారో, కాశ్మీర్ లోయలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో స్థానిక ప్రజలు గ్రహించేటట్లు చేయాలి. ఉగ్రవాదం వాళ్ళని, హింసాయుత చర్యల కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది ముస్లింలే అని కూడా గుర్తు చేయాలి. కాల్పులలో మృతిచెందుతున్న ఉగ్రవాదులు గానీ, పోలీస్ - జవాన్లు గానీ ఎక్కువగా ముస్లింలే కావడం గమనార్హం.
ప్రభుత్వ పరంగా కూడా కాశ్మీర్ ప్రజల పట్ల వివక్షతను తావులేని విధంగా వ్యవహరింపవలసి ఉంది. పెల్లెట్ తుపాకీ గుండ్లను ప్రయోగిస్తున్నట్లు తాజాగా గవర్నర్ చెప్పారు. దేశంలో మరెక్కడా ఉపయోగించకుండా అక్కడనే ఎందుకు ఉపయోగించాలి? నేరుగా ప్రజలకు భరోసా కలిగించే విధంగా రాజకీయ నాయకత్వం ఇప్పుడు చొరవ తీసుకోవాలి.

-చలసాని నరేంద్ర 98495 69050