మెయిన్ ఫీచర్

క్రోధము ద్వేషము ఒకటి కాదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికయితము ఓకర పోకడ కోరగట్టు. ఔననుటకు నెఱవడి యొప్పిదము కాకపోయిననూ కాదనుటకు వీలు కుదరని యాసికమైనది. కారణముకైత కోర్కుల పుంజినెత్తిన గుత్తగంప. కోర్కులు మై చుట్టిన దూలగొండి దురదకంప. మొత్తముమీద ఇది దేహము నాక్రమించుకున్న స్థితిగతుల సంగడి. కవిత్వము మనస్సంబంధి గదా, ఇచట దేహమెట్లు పొసగును? మంచి ప్రశ్నయే. దేహము ధరించిన మనసు దేహమైనపుడు కవిత్వమే మగును? గతి తార్కికముగదా! బొంది గాదిలి యగును. ఎప్పుడు కవిత్వము ‘‘కట్టె’’చుట్టరికము కట్టెనో అప్పుడది ‘‘రాత’యే యగును. ఇప్పుడీ రాతలే రాజ్యమేలుచున్నవి. రాతల విస్తృతి పెరిగినకొలదీ ప్రావేశికుల సంఖ్యయు గణనీయముగానే పెరుగుట జరుగును. మేవ మీవీది మేనరికముకదా! ఆ మైవడిని చూతము.
వయసొచ్చి ఎత్తుపల్లములు కొలతలందు కొత్తదనము ఏర్పడుటకన్న ఈ కలిలమున కన్యమేమైనయున్నదా? భౌతికమున లేదు. బౌద్ధికముగా నున్నది. భౌతికము కనిపించును. బౌద్ధికము అనిపించును. భౌతికముననున్నదేమిటో తెలియును. బౌద్ధికమున అనిపించిదేమిటో తెలియదు. ఇది జీవలక్షణమై భాసిల్లుచున్నది. ఇదియే జీవలక్షణమా? బౌద్ధికముగదా, కనుకనే జీవలక్షణము. ఈ బుద్ధి ఎందులకు? పెడత్రోవను సైతము తర్కపరిధికి తెచ్చుటకు. తర్కమెందులకు? దేహి స్వాతంత్య్రము స్వకీయముగా ప్రకటించుకొనుటకు. ఈ ఉగ్గడింపు ఎందులకు? ఎచటనో పుట్టిన దురదను హేతువాదమున బరుకుటకు. హేతువు వ్యక్తిగతము ఉపరి తనకుతానే ప్రమాణము కనుక నిరవరోధకము. ఏతావాతా భౌతికము బౌద్ధికము కలసి క్రీడించుటకు. వాఙ్మయ సంబంధిగా ఇది వనె్నకెక్కుటయూ గలదు. ఈ అనుభవము వేరు. తజ్జనిత అనుభూత్యానందము వేరు. ఇంద్రియానుభూతి చేరు పరాకాష్ఠకు పాద సంకేతము. పాద మక్షరముల కూర్పు. ఇట్టిదే ఇప్పుడు కావ్యములు (శబ్దార్ధౌ సహితౌ కావ్యం గద్యం పద్యం చతద్విధా) కక్కుదెవులుగా వచ్చుచున్నవి. కార్పణ్యదోషమున స్వభావము హతమగుచున్నది. అది వేరే విషయము.
ఈ వాఙ్మయమంతయు వస్తువులో రచయిత(త్రి) కనిపించు అధమస్థాయి సృష్టియని అనుకొన్నచో సాహిత్యమున ముఖ్యముగా కవిత్వమందు ఇది తప్పనిసరైన సామాజిక స్పృహా స్థాయియై స్థిరపడినది. నిన్నటివరకు కవిత్వం పరవస్తుగత ప్రక్రియ. అందులోనూ లోకశ్రేయస్సు అనే భావం ప్రధానంగా దృష్టిలో వుంచుకొని వ్రాయబడిన కవిత. అంటే ఆనాటి రూపంలో సామాజిక స్పృహ (సామాజిక స్పృహ అంటే ముందు తెలుసుకొనండి) మీద లేచిన నిర్మాణం. రాముడులో కానీ దశరధుడులో గాని వ్యాసుడుండడు. కృష్ణుడులోగానీ అర్జునుడులో కానీ వ్యాసుడుండడు. యక్షుడులో గానీ, దుష్యంతుడులో కానీ కాళిదాసుండడు. కావ్యకేంద్రమైన నాయకుడులోనే కవిలేకపోతే కవి ఎక్కడ వున్నట్లు...? చంద్రోదయాల్లో గిరితరు వర్ణనాది అలంకారాల్లో వున్నాడు. కళలోను కన్నీటి బిందువులోను వున్నాడు. బోయవాడు గురిపెట్టికొట్టిన బాణం కలిగించిన బాధలో వున్నాడు. ఇప్పుడు (ఇవాళ) సాహిత్యం చాలా సంకుచిత కార్యక్షేత్రమైపోయింది. కాలాతీత మానవీయ దృష్టిని ప్రతిఫలించటంలో విఫలమై తన శాశ్వత మూల్యం కోల్పోవటం కవిత్వం అనిపించుకోదు. కవిత్వం పొలికేక కాదు. ఉపరితల వస్తువునెంత ఉత్ప్రేక్షిస్తే అది సచేతనవౌతుందని? కానీ సచేతన చక్షువుకు ఈ దృశ్యం పరిస్థితుల బలిపశువైన మానవ మనస్సుమీద కాలంచేస్తున్న లీలా విలాసమనిపిస్తుంది. ఎంత లీలావిలాసమైనా- కవికి వివేచన వుంటుంది. ఉండాలనేది నిర్వివాదాంశం. ఇది తెలుసుకున్నవారు కనుక్కునే ఆర్ష సిద్ధాంతం సమాధ్యవస్థను సంకేతించింది. ఈ సాంకేతికమైన- యోగ్యమైన విషయాన్ని గమనించక పోవటంచేతనే చిన్న కవులు-అకవులు- కుకవులు- పోజు కవులు- రివాజు కవులంటూ కవుల్లో తారతమ్యాలు బయలుదేరాయి. బయలుదేరటంవరకు పరవాలేదు. ఆ తరువాతే పరిస్థితి విషమించింది.
లక్ష కావ్యప్రయోజనాలను చెప్పిన భరతుడు కావ్యం సర్వవిధాలా మానవుడికి ఉపయోగపడాలనే చెప్పాడు. ‘‘మానవుడికి ఉపయోగమన్న’’మాటను సమానార్థక వాంఛితంగానే గ్రహించాలి కానీ ఎవరిష్టం వారిప్రకారం కాదు. కావ్యం ‘‘ఉత్తమాధమ మధ్యానాం నరాణాం కర్మసంశ్రయం హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాదికృత్-దుఃఖార్తానాం శ్రమార్తానాం- శోకార్తానాం. తపస్వినాం విశ్రాంతి జననం కావే నాట్యమేవద్భవిష్యతి ధర్మ్యం యశస్య మాయుష్యం హితం బుద్ధివివర్ధనం లోకోపదేశ జననం నాట్యమే తద్భవిష్యతి’’ (నాట్యశాస్త్రం) ఉత్తమ మధ్యమ అధమ అనే మూడువర్గాల మానవులకు హితోపదేశం చేస్తుంది కావ్యం. ధైర్యము వినోదము నీతి, సుఖము వీటిని ఇస్తుంది. ఆపదలో వున్నవారికి, శోకార్తులకు శ్రమజీవులకు-ఇంతేనా ఇటువంటి బాధలు బాదరబందీలు లేని తాపసులకుకూడా కావ్యం విశ్రాంతినిస్తుంది. ధర్మాధర్మ విచక్షణ, కామ్యాకామ్యాల గురించిన సావధానము, ఏది ఆయుర్వ్రద్ధికరం, ఏది హితం ఇత్యాది సంస్కారాలను ఉపదేశం చేసేది కావ్యమంటాడు భరతుడు. ఈ భరతుడనేవాడు రెండువేల అయిదువందల ఏళ్ళకుముందే చెప్పిన మాటలివన్ని. కావ్యం అంటే ఇంత విచక్షణాజ్ఞానాన్ని యివ్వాలనే నిర్ణయింపబడినదై వుంటుంది. ఈ నిర్ణయజ్ఞానం ‘‘పార్టీ జండా’’లెగరేసే పనికిమాలినవాడు పెట్టిన భిక్షకాదని మిత్రులు గ్రహించాలి. కావ్యప్రయోజన నిర్వహణావేశంలో కావ్యానికి ప్రాణమైన కావ్యత్వాన్ని మరచిపోవటమో వదిలివేయటమో చేయరాదనే విషయాన్ని ‘‘ఆనంద వర్ధనుడు’’ అపూర్వప్రాధాన్యమిచ్చి స్పష్టంగా ప్రతిపాదిస్తాడు. చదవండి. ‘‘కవి నాకావ్యముపనిబధ్నతా సర్వాత్మనా రస పరతంత్రేణ భవితవ్యం...నహికవే? ఇతివృత్తమాత్ర నిర్వహణేన కించిత్ ప్రయోజనం.’’ కవి కావ్యరచనలో సర్వాత్మనా రస పరతంత్రుడు కావాలి. ఇతివృత్త నిర్వహణ చేసినంతమాత్రాన కించిత్తు ప్రయోజనంకూడా వుండదు. అంటే కేవల ఇతివృత్తం కావ్యం కాదన్నమాట. కావ్యం కాకపోతే దానికి ఆకర్షణశక్తి వుండదు. ఆకర్షణ శక్తిలేకపోతే ఎవడు చదువుతాడు? ఎవడూ చదవకపోతే (చదవటమంటే పుటలు తిప్పెయ్యటం కాదు) కవి చెప్పిన విషయంచేత ఎవడూ ప్రభావితుడు కాడన్నమాట. కాబట్టి అట్టి రచన చేసేవాడు కవి అని పేరు తగిలించుకొని, చేసిన నిరర్ధకమైన చర్యే అవుతుంది. ఇది ఆనందవర్ధనుడి తాత్పర్యం. దృక్పథమున్నూ. ఈ దృక్పథం ఈనాడు తెలుగు కవిత్వం చేదుకోవల్సిన అవసరం ఎంతైనా వుంది. కవిత్వానికి సార్వజనీన శ్రేయస్సే ముఖ్యమని, ప్రయోజనమని, ఆ ప్రయోజనం జనంలో సఫలం కావాలంటే కవిత్వం కవిత్వంలా ఉండాలి తప్ప కంఠశోషగా వుండరాదన్నది రూఢి. ఆ కంఠశోష ‘‘సామాజిక స్పృహ’’ అనే ‘‘అరచావు’’ బిళ్ళ అసలే మెళ్ళోవేసుకు తిరగరాదని లక్షణ సారాంశం. కనక కావ్యానికి రమణీయత అంటే ఆకర్షణశక్తి అంటే కావ్యత్వం కీలకమని పూర్వ ఆలంకారికులు ఆధునిక ఆలంకారీకులు ప్రాక్‌పశ్చిమ ఖండాల్లో చెప్పారనీ నవీనంగా ఉదయించిన ‘‘సోషలిస్టు’’ సాహిత్య సిద్ధాంతం కూడా ఇదేనని (Yuri Borev's Aesthetics) కంఠోక్తిగా చెబుతోంది.
సర్వమానవులకు వాక్చాపల్యము దాన్ని అంటుకొని ఉపదేశ చాపల్యము (దేహ చాపల్యము, జిహ్వాచాపల్యము మాత్రం కాదుసుమా) సహజంగా వుండేవే; వాటికి తెలుగునాట కవి అనిపించుకోవాలనే చాపల్యంకూడా తోడయ్యేసరికి అమాయక ప్రజల (పాఠకుల) అవస్థలు వర్ణనాతీతంగా వున్నాయి. ఈ దురవస్థనుంచి ప్రజల్ని రక్షించటానికే అభినవగుప్తుడు ఆనాడు (ఆనాడే) అంతగా నొక్కిచెప్పవలసి వచ్చింది. కావ్యానందమనే కీలక ప్రాయమైన కావ్యత్వ లక్షణాన్ని ఇప్పుడు ప్రస్తావించటం కూడా అందుకే. ఈ కావ్యత్వ లక్షణాల్లో భాషనుకూడా విస్మరించలేదు. దాని ప్రాముఖ్యాన్ని ఉగ్గడిస్తునే వున్నారు. ప్రామాణ్యాన్ని నిగ్గదీస్తునే వున్నారు. కనుక ముందుగా తెలుగు ప్రజలు వాళ్ళ కవిధూమ్రాక్షసుల చేతుల్లోంచి రక్షింపబడాలి. వర్తమాన భాష వేరు (కావ్యపరంగా) ఆధునిక నామక సంగ్రామణోత్తర రచన కళాప్రపూర్ణులు కొందరు వాడుతున్న వచన కవితా భాష వేరు. ఈ ‘హంవీరులు’’ ఆధునిక నాట్య భాషగా చెలామణీ చేయించుకుంటున్న వీరి భాషలో ఎక్కడపడితే అక్కడ ఆరిపోయిన బీడీ ముక్కల్లా ఇంగ్లీషు పదాన్ని వెదజల్లుతుంటారు. తద్వారా వీరు మహా ఆధునిక కవులు అని ప్రజలు అనుకొందరుగాక అని వీరి తట తండ్ర. ఇంగ్లీషు పదాల వాడకమే ఆధునికతా లక్షణమైతే క్లైవుకు, వారన్‌హేష్టింగ్స్‌కు వంట చేసిపెట్టిన తెలుగు (భారతీయ) బట్లర్లుకూడా ఆధునిక మహాకవులు కావాలి. వట్టి శబ్దాలు కవిత్వంకాదన్న పాశుపతం చేతుల్లో ఈ ఆంగ్ల పదప్రయోగ రూపక ఆధునిక కవితాభినయం కూడా చస్తుంది. ఈ జాతి లక్షణం చేతనే అమాయక పాఠకుడు అర్థంకాని కవిత్వాన్ని భరించాల్సిన దుస్థితి యేర్పడింది. ఈ అదనులోనే అప్రగల్భుడైన కవి నామక చక్రవర్తి వాడికి ఏదితోస్తే అది వ్రాస్తూపోతాడు. ఇది ఈనాడు తెలుగు దేశాల్లో కవిత్వం పేరుతో జరుగుతున్న తమాషా. దీనికి రాజకీయ స్వార్థపరశక్తుల అండదండలు పుష్కలంగా వున్నాయి.
ఆ గొడుగు నీడలో మనుగడ సాగించే ఈ తరహా కవులు రచనలు స్వీయ ఘోషాన్వితాలు. విశృంఖలాలు. వెఱ్ఱిపోకడలు. నియమ రహితాలు. నీచ ప్రవృత్తాలు. ఇవన్నీ మన నిరక్షరాస్య సాహిత్యపు ముసుగు ముఠాల సాహిత్య పర్యవసానం. వీరెంత అధములంటే ‘‘కళ కళకోసమే’’ అనే సిద్ధాంతం పుట్టించి వ్యాపింపజేసి- ఆ నేరాన్ని సాహిత్యానికంటగట్టి వీరు మాత్రం వీరులమాదిరి చెలామణీ అవగలిగారు. అసలు తెలుసుకోవలసిందేమిటంటే- భారతదేశంలో ఎప్పుడూ కళ కళకోసం అనే సిద్ధాంతం అసలులేదు. ఈ దేశంలో ‘‘విశ్వశ్రేయస్సే’’ సాహిత్య పరమావధి. ఏ కళ అయినా ఈ సంగతిని విస్మరించలేదు. ఏ రూపమైనా ఈ ఆదర్శాన్ని వర్జించలేదు. ద్వేషం, క్రోధం ఒకటి కాదు.
ఆధునిక కవి ముఖ్యంగా వర్తమాన కవి నామధేయుల కృతులన్నియు ఇంచుమించు ఒకే సమజమై పరస కట్టున పరపారుచున్నవి. ఈ వర్తమాన కవికి ఏర్పడ్డ ‘‘శూన్యత’’కవిత్వంతోనే. ఎన్నుకున్న వస్తువుకి వస్తుతత్త్వం లేకపోవటం మనం గమనించాల్సిన అంశం. ఈ వికృతచేష్ట అత్యంత స్పష్టంగా అజ్ఞాన ఫలితమని కావ్యమర్మజ్ఞులైన పాఠకులకు తెలుస్తుంది. వస్తువు కావ్యస్రష్ట చైతన్యాన్ని సూచిస్తుంది, దాని అభివ్యక్తికోసం ఏంచెయ్యాలన్నది వారి (అస్తవ్యస్తమైన) అవ్యవస్థకు రూపుకట్టే విధానమై గోచరించటమెక్కువగా జరుగుతోంది. దీనిని పాఠకుడు ‘‘కావ్యశిల్పం’’గా అనుభవించాలని ఏ తత్కవి తీవ్రోత్కంఠ. వస్తువునుబట్టే కవిత్వంలో స్థారుూభేదాలు వస్తాయి. ఇతర హేతువులచేత కూడా ఈ భేదాలు రావచ్చు. తాత్పర్యం యేమంటే వస్తువువేరు కవిత్వం వేరు. కవిత్వం కానిదాన్ని వస్తువు కవిత్వం చేయలేదు. కనుక శాస్ర్తియ దృక్పధంలో చూస్తే కవిత్వంలో ఇతివృత్తస్థానం ఆనుషంగికం మాత్రమే. ‘‘్ధ్వన్యాలోకం’’ అనే ఒక ‘‘సైన్సు’’ పుస్తకం వుంది. సాహిత్యంమీద ఆ గ్రంథకర్త ఇదే అంటాడు. ‘‘నహి కవేః ఇతివృత్తమాత్ర నిర్వహణే నహించిత్ ప్రయోజనం’’ ఇంకా అకవిత్వంతో అచ్చుపోసుకుంటానంటే... ప్రజాస్వామ్యం ఎంత గొప్పదోకదా అని అనుకుంటాం.
ముగింపుగా కొన్ని మాటలు. ప్రాచీన కవిత్వం శోకంలోంచి పుట్టుకొస్తే, ఆధునిక కవిత్వం క్రోధంలోంచి పుట్టుకొచ్చింది. ఐతే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రాచీన కవిత్వం పుట్టిన శోకంలో క్రోధమే వుంది. అది కవిత్వానికి జీవధాతువు. ఇన్నాళ్ళు గడిచినా ఇంకా న్యాయం జరగటంలేదంటే, ఒక కారణం అయివుండాలి. జరగవలసిన న్యాయంకు ధర్మం లోపించి వుండాలి. అది ఈనాటి సహజ లక్షణమైంది. ఆధునికత పేరుతో అలముకున్న చీకటికి ఆత్మన్యూనత తప్ప తననితాను వెలిగించుకునే ధర్మసంగతమైన ధైర్యం లేదు. ఈర్ష్య తరుణోపాయంకాదు. ద్వేషం సహజమైన సమాధానం కాదు. కవిత్వం ఎప్పుడూ అధర్మాన్ని చెండాడుతునే వుంటుంది. అందువల్లనే వాక్కు ఋగ్వేదంలో స్వయంగా ఇలా అంటుంది. ‘‘అహం రుద్రాయధనురాతనోమి! బ్రహ్మ ద్విషే శరవే హంతవాడ. అహం జనాయ సమదం కృణోమి అహం ద్వావా పృథివీ అవివేళ’’ (10-125-5) నేను అధర్మ ధ్వంసంకోసం రుద్రుడయిన వాడికి ధనుస్సునిస్తాను. జ్ఞానద్వేషిని (ఎవరో తెలుసుకదా!) బాణం సంహరించాలని నేను ప్రజల్లో పోరాటం కలిగిస్తాను. నేను భూమ్యాకాశాన్ని ఆవేశిస్తాను అని భావం. ఆధునిక వేద పండితులు పూర్వాపరాలు వదిలేసి వికృతంగా విజృంభిస్తున్నారు. సరిచేసుకోండి. సంస్కారం అలవర్చుకోండి. జల్పం సాగిస్తే జల్పమే సమాధానం ఇస్తుంది. మీ పైత్యాన్ని ప్రకోపింపచేసుకోకండి. అతిసార వ్యాధినుండి అప్రమత్తంగా వుండండి.

- సాంధ్యశ్రీ, 8106897404