మెయన్ ఫీచర్

అడుగు పడని గ్రామ న్యాయాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెలవాలనే తపనతో కేసులు వేసే వారంతా చివరికి అవి పెండింగ్‌లో పడేసరికి, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరగలేక ఏదో ఒకటి తేల్చేస్తే బావుణ్ణు అనే పరిస్థితికి వస్తున్నారు. దశాబ్దాల అనంతరం కూడా నష్టపోవడానికి కక్షిదారులు సిద్ధమవుతున్నారు. దీనికి కారణం న్యాయస్థానాలు సామాన్యుడు ఆశించే వ్యవధిలోగా కేసులకు పరిష్కారం లభించకపోవడమే. దిగువస్థాయి న్యాయస్థానాల నుండి జిల్లా కోర్టులకు, అక్కడి నుండి హైకోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం, అధికారులు, ప్రజల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, స్వల్పకాలానికి అధికారంలోకి వస్తున్న పార్టీలు వ్యవస్థను అతలాకుతలం చేయడంతో వ్యాజ్యాలు పెరిగాయి. నిన్నటికి నిన్న లెక్కలు తీస్తే సుప్రీంకోర్టులో కేసుల సంఖ్య 59,291కు పెరిగింది. ఏడాది క్రితం కేసుల సంఖ్య 57,987 మాత్రమే. అడ్మిషన్ దశలో 38, 201 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 21వేల కేసుల్లో వ్యాజ్యం కొనసాగుతోంది. రాజ్యాంగ ధర్మాసనం ముందే 555 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 9 మంది న్యాయమూర్తులతో కూడిన పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం ముందు అత్యంత కీలకమైన 137 పిటిషన్లు, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 13, ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 401 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కోర్టుల్లో లక్షకుపైగా కేసులు 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. మరో రెండున్నర లక్షల కేసులు పాతికేళ్లుగా కోర్టుల్లో నలుగుతున్నాయి. 90 లక్షలకు పైగా సివిల్ కేసుల పెండింగ్ పడటానికి కారణాలు అనే్వషిస్తే అందులో 20 లక్షల కేసుల్లో ఇంత వరకూ సమన్లు కూడా జారీ కాలేదు. అలహాబాద్ హైకోర్టులో 7.26 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, రాజస్థాన్ హైకోర్టులో 4.49 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గణాంకాలను గమనించినపుడు సామాన్యుడికి సైతం భయం కలుగుతుంది.
దేశంలో కొత్త కేసులు నమోదు కాకుండానే కేవలం ప్రస్తుత కేసులను విచారించాలంటే కనీసం 324 ఏళ్లు పడుతుందని ఒక అంచనా. అన్ని కోర్టుల్లో కేసుల పరిష్కారానికి సకల సదుపాయాలు కల్పించాలంటే కనీసం ఇప్పటికపుడు 54వేల కోట్లు కావాలి. ఎప్పటికీ న్యాయం గెలిచితీరుతుందనే సామన్యుడి నమ్మకాన్ని న్యాయస్థానాలు నిలుపుకుంటూనే ఉన్నా, ధైర్యాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నామని జస్టిస్ రంజన్ గొగోయ్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎన్ని మార్గదర్శకాలు జారీ చేసినా, దిగువ కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరించలేకపోవడం కూడా కేసుల పెండింగ్‌కు మరో కారణమవుతోంది. బాలుడిగా కేసులను ఎదుర్కొన్న వారు తుది తీర్పు వచ్చేసరికి వయోజనుడిగా, మధ్యవయస్కుడిగా మారిన సందర్భాలున్నాయి. ప్రతి ఏటా జిల్లా కోర్టులు, దిగువ స్థాయి కోర్టుల్లో రెండు కోట్ల కేసులు నమోదవుతుండగా హైకోర్టుల్లో 17 లక్షల కేసులు నమోదవుతున్నాయి.
కేసుల పెండింగ్‌కు న్యాయస్థానాలో, న్యాయమూర్తులో కారణం కానే కాదు. చట్టంపై అవగాహన లేకపోవడం, అనుభవం లోపించడం, వ్యవస్థల నిస్తేజం, నిస్పృహతో ఒక కారణం అయితే కేసుల పెండింగ్‌కు దర్యాప్తు సంస్థలు, కక్షిదారులు, న్యాయవాదులు, పాలనావ్యవస్థ, అధికార యంత్రాంగం, వౌలిక సదుపాయాల లేమి, సిబ్బంది లోపం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సంపూర్ణంగా అందుబాటులోకి రాకపోవడం, సమాజం మరో కారణం అవుతున్నాయి. పెండింగ్ అనగానే సహజంగానే ఎవరైనా న్యాయస్థానాలనే నిందిస్తారు. కేవలం కోర్టులు సకాలంలో తీర్పులు ఇవ్వడం లేదనే నింద వేయడం వినా మిగిలిన పరిస్థితులు ఎవరికీ పట్టడం లేదు. న్యాయస్థానాల్లో సౌకర్యాలు, సదుపాయాలు తమకెందుకు పట్టాలి అన్నట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సుదీర్ఘకాలంగా కొనసాగిన అతి పెద్ద సమస్య.
1986లోనే ‘లా’ కమిషన్ గ్రామన్యాయాలయాల ఏర్పాటు అంశంపై నివేదికను ఇచ్చింది. 2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2007 నాటికి ప్రతి పది లక్షల మంది జనాభాకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇపుడున్నది కేవలం 16 మంది మాత్రమే.
కేంద్రం న్యాయమిత్ర పథకాన్ని 2017 ఏప్రిల్‌లో ప్రారంభించారు. రిటైరైన న్యాయమూర్తులను, న్యాయాధికారులను తిరిగి నియమించి పదేళ్లుపైబడిన కేసులను పరిష్కరించాలని కేంద్రం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అదే బాటలో నేటికీ న్యాయాలయాల అంశం కూడా ఉంది. భారత రాజ్యాంగం 39వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో భాగంగా గ్రామన్యాయాలయాల ముసాయిదా బిల్లును రాజ్యసభలో 2007లో ప్రవేశపెట్టింది. రాజ్యసభ, బిల్లును అన్ని ప్రభుత్వ శాఖలకు, స్టాండింగ్ కమిటీలకు, న్యాయశాస్త్ర కోవిదులకు పంపించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి, హైకోర్టు రిజిస్ట్రార్లతోనూ ఒక భేటీ నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత ముసాయిదాలో సవరణలు తెచ్చారు. లోక్‌సభలో ఆమోదం అనంతరం కేంద్రప్రభుత్వం 2008లో బిల్లుగా తీసుకువచ్చింది. ఈ బిల్లు 2009 అక్టోబర్ 2 నుండి అమలులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తొలి దశలో ఆరు వేల న్యాయాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. పేదలకు వారి ఇంటివద్దనే న్యాయం అందించడమే దీని లక్ష్యం. కొత్త కేసులతో పాటు పాత కేసులను కూడా ఈ న్యాయాలయాలకు బదిలీ చేయాలని తొలుత భావించారు.
గ్రామ న్యాయాలయాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిపాటు వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. తర్వాత్తర్వాత కాలంలో కేంద్రం కొంత మేర ఆర్థిక సాయం చేస్తుంది. కేవలం చట్టాల పరిధికే పరిమితం కాకుండా సహజ న్యాయసూత్రాలకు లోబడి పనిచేయాలనే కీలక అంశం ఈ గ్రామన్యాయాలయాల నిర్వహణలో ఉండటం అనేది అందరికీ కలిసొచ్చే పాయింట్. గ్రామాల్లో న్యాయసహాయాన్ని తక్షణమే అందించేందుకు, సలహా సంప్రదింపులకు, మధ్యవర్తిత్వానికి, లోక్‌అదాలత్ ఏర్పాటుకు, ఉచిత న్యాయసహాయం, పేదలకు, బాలలకు, మహిళలకు, అల్పసంఖ్యాకవర్గాల వారికీ తక్షణ సాయం అందించేందుకు వీలుగా గ్రామ న్యాయాలయాలు పనిచేయాల్సి ఉంది.
గ్రామ న్యాయాలయాల చట్టం -2008ని హైకోర్టుకు పంపించి, గ్రామ న్యాయాధికారులను నియమించాలి. వారికి ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ హోదాతో పాటు సమాన జీత భత్యాలను చెల్లించాలి. ప్రతి నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో కోర్టులను ఏర్పాటు చేయాలి. మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు సివిల్ క్రిమినల్ కేసులను కూడా విచారించే అధికారం ఈ న్యాయాలయాలకు ఉంటుంది. ఆస్తి కొనుగోలు, కాలువ నీరు వినియోగంలో వివాదాలు, కనీస వేతన చట్టం అమలు, వ్యవసాయ భూమి భాగస్వామ్య వివాదాలు గ్రామ న్యాయాలయాల పరిధిలోకే వస్తాయి. సివిల్ కేసులను తొలుత రాజీమార్గంలో పరిష్కరించాల్సి ఉంటుంది. గ్రామ న్యాయాలయాలు ఇచ్చే తీర్పులపై ఒక అప్పీలుకు వీలుంటుంది. తీర్పు అనంతరం 30 రోజుల్లో అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వద్ద అప్పీలు చేసుకోవచ్చు. తర్వాత ఈ తీర్పులపై అప్పీళ్లు ఉండవు, తద్వారా హైకోర్టులపై భారాన్ని తగ్గించవచ్చు. ఈ చట్టాన్ని 8 చాప్టర్లు, 40 క్లాజులతో రూపొందించారు.
ఇంత స్పష్టంగా రూపొందించిన చట్టం అమలులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్టు జస్టిస్’ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రస్తోగి నేతృత్వంలోని బెంచ్ దీనిని విచారించనుంది. సొసైటీ తరఫున ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించనున్నారు.
దేశంలో 11 రాష్ట్రాల్లో 320 పంచాయతీల్లో మాత్రమే న్యాయాలయాల ఏర్పాటుపై నోటిఫై చేయగా అందులో 204 మాత్రమే తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా 50వేల పంచాయతీల్లో న్యాయాలయాలు ప్రారంభం కావల్సి ఉంది. తొలిదశలో కనీసం 6వేల న్యాయాలయాల ఏర్పాటు పదేళ్లు గడచినా, కలగా మిగిలిపోయింది. అనిత కుష్వా వెర్సస్ పుష్ప సదన్ (2016)8 ఎస్సీస్సీ 509 కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గ్రామీణ ప్రజలకు న్యాయం వారి హక్కుగా పేర్కొంది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో సాచివేత వైఖరి చూస్తుంటే రాజ్యాంగంలోని 21 వ అధికరణం, 14వ అధికరణంలో కల్పించిన హక్కును కాలరాయడమే. న్యాయం కల్పించొచ్చు అని కాకుండా కల్పించాల్సిందే అని దిలిప్‌కుమార్ బసు వెర్సస్ స్టేట్ ఆఫ్ వెస్టుబెంగాల్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల్లో సైతం గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తొలి దశలో తెలంగాణలో 55, ఆంధ్రాలో 75 గ్రామన్యాయాలయాలు ఏర్పాటు కావల్సి ఉంది. ప్రభుత్వం తనకు మేలుకలిగించే అంశాల్లో స్పందించే తీరు ప్రజల లక్ష్యాలను నెరవేర్చడంలో లేదనడం నిర్వివాదాంశం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొంటే న్యాయం జరిగేది ప్రజలకే కాదు, పరోక్షంగా ప్రభుత్వానికి కూడా అనేది గ్రహించాలి.

-బీవీ ప్రసాద్ 9849998090