మెయన్ ఫీచర్

విద్రోహ పంథా.. ‘కామ్రేడ్ల’ అజెండా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్సర్, కమ్యూనిస్టులకు సమాన లక్షణాలు ఉంటాయని కొందరంటారు. ఆ వ్యాధి నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అన్ని మూలాలకు వ్యాప్తిచెందుతూ అక్కడున్న జీవకణాలను నాశనం చేస్తూ ఆ దేహాన్ని ప్రాణాంతక దిశగా తీసుకువెడుతుంది. భారతీయ కమ్యూనిస్టులు కూడా అంతేనట! దేశవనరులపై ఆధారపడి జీవిస్తూ సిద్ధాంతం, వ్యూహాల ముసుగులో దేశ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతికి ద్రోహం చేసేలా కమ్యూనిస్టులు ఆది నుంచీ కృషిచేస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ దొడ్డిదారిన వివిధ సామాజిక, పాలనా వ్యవస్థలలోకి చొరబడి వాటిని బలహీనపరుస్తూ దేశ సార్వభౌమత్వాన్ని భంగపరచే చర్యలకు కమ్యూనిస్టులు పాల్పడ్డారు. జాతి ప్రయోజనాలు, దేశ హితం కంటే శత్రుదేశాల ప్రయోజనాలు కాపాడడానికి వారు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ క్రమంలో మరొక తాజా సంఘటన- పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని జిహాదీ తీవ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడులను కమ్యూనిస్టు నాయకులు శంకించడం. సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తూ సిపిఎం నేత సీతారాం ఏచూరి ప్రకటనలు చేయడం. ఇంతకంటే దుర్మార్గమైన విషయం మరొకటుంది. పాకిస్తాన్ భూభాగాన్ని కేంద్రంగా చేసుకుని తీవ్రవాదాన్ని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తూ ప్రపంచ శాంతికి అత్యంత ప్రమాదకరంగా మారిన మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తూ, అతడికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్ చేస్తున్న డిమాండ్‌ను చైనా అడ్డుకున్నది. భారత పార్లమెంట్, ముంబయి నగరం, పఠాన్‌కోట్ సైనిక స్థావరంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన తీవ్రవాద దాడులకు జైష్-ఎ-మహ్మద్ సంస్థకు చెందిన మసూద్ అజర్ వ్యూహకర్త. దేశంలో జరిగిన తీవ్రవాద దాడులలో అజర్ పాత్రను నిరూపిస్తూ భారత్ ఇప్పటికే పలు ప్రపంచ దేశాలతోపాటు ఐక్యరాజ్యసమితికి కూడా తిరుగులేని సాక్ష్యాధారాలను అందచేసింది. అయితే, సాంకేతిక కారణాలను చూపించి చైనా తన ‘వీటో’ అధికారాన్ని ఉపయోగించి భారత్ ప్రయత్నాలను అడ్డుకున్నది. తీవ్రవాదంపై భారత్ చేస్తున్న దాడిని చైనా అడ్డుకోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ముంబయి తీవ్రవాద దాడులకు సూత్రధారి అయిన జకి-ఉర్-రహ్మాన్ లక్వీపై చర్యలకు భారత్ చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకున్నది. చైనా అనుసరిస్తున్న పాకిస్తాన్ తీవ్రవాద అనుకూల, భారత వ్యతిరేక విధానాలకు అనేక కారణాలు ఉన్నాయి.
ఆసియా ఖండంలో తనకు దీటైన ప్రత్యర్థిగా భారత్‌ను గుర్తిస్తూ చైనా మనపై విషం కక్కుతూనే ఉన్నది. మన భూభాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. వివిధ రంగాలలో భారత్ ప్రగతిని నిరోధించడానికి పాకిస్తాన్‌ను ఒక పావుగా చైనా వాడుకుంటున్నది. పాక్‌తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నది. తన దగ్గర అదనంగా ఉన్న ఉక్కు, ఇనుము, సిమెంట్ తదితర వస్తువులకు చైనాకు అందుబాటులో ఉన్న మార్కెట్‌గా పాకిస్తాన్ ఉపయోగపడుతున్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొహాలలో 1000 మెగావాట్లు, నీలం-జీలంలో 969 మెగావాట్లు, చకోటి హత్తియాలో 500 మెగావాట్ల విద్యుత్ ప్రా జెక్టులను చైనా సాంకేతిక నైపుణ్యంతో నిర్మిస్తున్నారు. ఈ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి 3000 మంది చైనా జాతీయులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంటున్నారు. మరోవైపు చైనా తయారుచేస్తున్న ఆయుధాలను పాకిస్తాన్ పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నది.
పాకిస్తాన్‌ను ఆనుకుని ఉన్న ఆప్ఘనిస్తాన్‌పై పట్టుకోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఆప్ఘనిస్తాన్‌లో అత్యంత విలువైన సహజ వనరులు అపారంగా ఉన్నాయి. వీటికోసమే గతంలో అమెరికా, రష్యాలు తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రస్తుతం అక్కడ ఏర్పడ్డ శూన్యతను వినియోగించుకుని ఆయా ప్రాంతాలపై పట్టుకోసం చైనా ప్రయత్నిస్తున్నది. ఇందుకు పాకిస్తాన్‌తో మైత్రి చాలా అవసరం. ఒక అంచనా ప్రకారం ఆప్ఘనిస్తాన్‌లో ఒక ట్రిలియన్ డాలర్ల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. చైనా, పాక్‌ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలకు మరొక కీలకమైన అంశం- చైనా,పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి). బెలూచిస్తాన్- పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్ చైనా ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకం. చైనా ఉత్పత్తిచేస్తున్న అనేక వస్తువులను అమ్ముకోవడానికి ఆ దేశానికి ఉన్న సరిహద్దులే పెద్ద అవరోధంగా ఉన్నాయి. చైనా తన వస్తువుల విక్రయానికి అరేబియా సముద్రంతో రవాణా సదుపాయాలు అవసరం. ఐరోపా, ఆఫ్రికా తదితర ప్రాంతాలతో వాణిజ్యం కోసం నౌకలు చుట్టూ తిరిగి రావల్సివస్తోంది. వీటిలో అనేక దేశాలతో చైనాకు మంచి సంబంధాలు లేవు. తన వాణిజ్య ప్రయోజనాల కోసం ‘సిపిఇసి’ని పాకిస్తాన్‌కు ఉచితంగా లేదా నామమాత్రం ధరలకు చైనా నిర్మించి ఇస్తున్నది. ఇందుకు ప్రతిగా తన భూభాగాలను వాడుకోవడానికి పాకిస్తాన్ చైనాకు అనుమతి ఇస్తోంది. ఇందులో భాగంగా ఆరు లేదా ఎనిమిది లైన్ల హైవేలను నిర్మిస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, మైట్రోలైన్లను ఏర్పాటుచేస్తారు. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పథకం అమలు జరగాలంటే భారత్ అధీనంలో ఉన్న భూభాగంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కీలకమైన పాత్ర వహిస్తుంది. పాకిస్తాన్-చైనాలను క లపడంలో ము ఖ్యమైన- కారకోరం ప్రాంతం భారత్ అధీనంలో ఉ న్నది. జమ్మూ కాశ్మీర్ విషయమై 1947 అక్టోబర్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం కారకోరం, గిల్గిత్, బాల్తిస్థాన్ ప్రాం తాలు భారత్‌లో విలీనమయ్యాయి. పాకిస్తాన్ వీటిని అన్యాయంగా ఆక్రమించుకున్నది. జమ్మూ కాశ్మీర్‌లోని తూర్పు, ఉత్తర ప్రాంతాలలో కొంత భూభాగం చైనా కూడా ఆక్రమించుకున్నది. ఇందులో అక్‌సాయ్ చిన్ ప్రాంతం కూడా ఉన్నది.
సిపిఇసి కోసం చైనా ఇప్పటికే 50 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తికావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం వారి అధీనంలోనే ఉండాలి. ఇందుకోసం జమ్మూకాశ్మీర్ ప్రాంతం ఎప్పటికీ రావణకాష్ఠంలా రగులుతూనే ఉండాలి, పాక్ ప్రేరిత జిహాదీ తీవ్రవాదులు భారత్‌పై ప్రచ్ఛన్న దాడులు చేస్తూనే ఉండాలి. భారత్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనకూడదు, అభివృద్ధి జరగకూడదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్-చైనాలు తమ పథకాలను అమలుచేసుకుంటూపోతాయి. భారత్‌పై చైనా, పాకిస్తాన్‌లు సంయుక్తంగా ప్రచ్ఛన్న దాడులు చేస్తూండగా దేశంలో రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించేందుకు చైనా కొమ్ముకాస్తున్న భారత కమ్యూనిస్టులు ఇతోధికంగా కృషిచేస్తున్నారు. సీతారాం ఏచూరి లాంటి వారి నాయకత్వంలో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు దేశ ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల సుఖశాంతులకంటే చైనా ప్రయోజనాలు, తీవ్రవాదుల ప్రాణ, ఆస్తుల రక్షణే చాలా అవసరం. మసూద్ అజర్‌పై చర్యలను అడ్డుకున్న చైనాను నిలదీయలేకపోగా దానికి అనుగుణంగా కమ్యూనిస్టు నేతలు ప్రకటనలు చేశారు. భారత సార్వభౌమత్వంపైన, అమాయక ప్రజలపైన దాడులు చేసి విధ్వంసం సృష్టించిన అఫ్జల్‌గురు వంటి తీవ్రవాదులకు మద్దతుగా నిలచిన కన్హయ్యకుమార్ లాంటి దేశద్రోహ విద్యార్థులకు మద్దతుగా కమ్యూనిస్టులు నిలిచారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు మద్దతుగా వారు ఒక్కమాట మాట్లాడలేకపోయారు. ఇలాంటి దేశద్రోహ చర్యలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కాదు. సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. ఇందుకు చరిత్రలో తిరుగులేని సాక్ష్యాలెన్నో ఉన్నాయి. 1962లో భారత్‌పై చైనా జరిపిన దాడిని భారత కమ్యూనిస్టులు నిస్సిగ్గుగా సమర్ధించారు. టిబెట్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడాన్ని వెనకేసుకొచ్చారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ 1942లో నిర్వహించిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్టులు 1962లో భారత్‌పై దాడి చేసిన చైనాకు మద్దతుగా ఆ ప్రాంతంలో నీరు, ఇతర అవసరాలను సరఫరా కానీయకుండా కార్మికుల సమ్మెకు పిలుపుఇచ్చారు. బిఎంఎస్ లాంటి జాతీయవాద కార్మిక సంఘాలు వ్యతిరేకించడంతో ఆనాడు కమ్యూనిస్టులు ప్రతిపాదించిన సమ్మె విఫలమైంది. లేకుంటే చైనాతో పోరాడుతున్న మన సైన్యాలకు ఎంతో ఇబ్బంది కలిగేది.
భారత సైన్యానికి పోటీగా ఒక రహస్య సైనిక వ్యవస్థను నిర్మించేందుకు 1950-60 దశకాల్లో భారత కమ్యూనిస్టులు విపరీతంగా ప్రయత్నించారు. రష్యా, చైనాలు మన దేశంపై దాడి చేసినపుడు శత్రు సైన్యాలకు మద్దతుగా ఉండడమే మన కమ్యూనిస్టులు తలపెట్టిన రహస్య సైనిక వ్యవస్థ లక్ష్యం. ఇటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగంగానే కమ్యూనిస్టులు నక్సల్‌బరీ లాంటి ప్రాంతాల్లో సాయుధ తిరుగుబాట్లను ఉసిగొల్పుతూ వాటికి సిద్ధాంతాల ముసుగు తొడిగి దేశ ప్రజలను మభ్యపెట్టారు.
1959 ఏప్రిల్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రణదివే అప్పటి చైనా రాయబారిని కలిసి టిబెట్‌ను ఆక్రమించుకొన్న చైనాకు మద్దతు తెలిపారు. భారత్‌లో చైనా వ్యతిరేక, జాతీయభావ జాలంతో పనిచేస్తున్న జనసంఘ్, ప్రజాసోషలిస్ట్ పార్టీల నాయకులపై దాడులు ఉధృతం చేయాలని ఆయన కోరారు. ఇటీవలి వరకూ పశ్చిమ బెంగాల్, ఇప్పటికే కేరళ, త్రిపురలలో జాతీయవాద సంస్థలు, జాతీయవాదులపై జరుగుతున్న దాడులు ఈ వ్యూహంలో భాగమే. జాతి ప్రయోజనాలకు బదులు కమ్యూనిస్టులు శత్రుదేశాల లబ్ధి కోసం పనిచేయడం అత్యంత దుర్మార్గ చర్య. మసూద్ అజర్ లాంటి తీవ్రవాదులపై చర్యలను నిరోధించిన చైనాలాంటి దేశాలను నిలదీయకపోవడం కమ్యూనిస్టుల మానసిక దౌర్బల్యం. ఇకనైనా కమ్యూనిస్టులు దేశానికి నిజాయితీతో కూడిన సంజాయిషీ ఇచ్చుకోవాలి. లేదంటే నెమ్మది నెమ్మదిగా వారు మనుగడ కోల్పోకతప్పదు.

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం, bala.kamarsu@gmail.com