మెయన్ ఫీచర్

కొలిక్కి వస్తున్న కీలక కేసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్ర గతిని, ప్రగతిని మార్చే అత్యంత కీలక కేసులు త్వరలోనే కొలిక్కిరానున్నాయి. సుప్రీం కోర్టులో వాదప్రతిపాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులపై తుదితీర్పులు రానున్నాయి. దీంతో యావత్ భారత్ అప్రమత్తమైంది. దేశ జనులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య భూ వివాదం, రాఫెల్ యుద్ధ విమానాల కేసు, ఆర్టీఐ చట్ట పరిధిలోకి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావచ్చా? లేదా? అనే కేసు, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడంపై దాఖలైన పునర్విచారణ పిటీషన్, ద్రవ్య బిల్లు కేసు, రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కారణ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల కేసు రూపంలో కుట్రకు పాల్పడటం వంటి కేసులపై సర్వోన్నత న్యాయస్థానం కొద్ది రోజుల్లో తీర్పులు ఇవ్వనుంది.
కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని సమర్ధిస్తూ 2018 డిసెంబర్ 14 సుప్రీం వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఒప్పందంలో వాస్తవాలను కోర్టుకు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసఫ్‌లతో కూడిన బెంచ్ విచారణ జరిపి, తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు ఈనెల 17లోగా వెలువడుతుందని అంచనా. ఫైనాన్స్ చట్టం -2017ను ద్రవ్యబిల్లుగా పార్లమెంటు ఆమోదించడానికి సంబంధించిన మరో పిటీషన్ సుప్రీం ముందుంది. ట్రిబ్యునల్ సభ్యుల కాలపరిమితి, విధి విధానాలను నిర్ణయించడానికి ప్రభుత్వం సంబంధిత అధికారాలను కొల్లగొట్టేలా ద్రవ్య బిల్లు ఉందని చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ రెవిన్యూ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ జరుపుతోంది. తీర్పు వెలువరించే సమయం ఆసన్నమైంది.
న్యాయమూర్తుల కార్యాలయాలను సమాచార హక్కు చట్టంలో చేర్చాలన్న కేసుపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్ 4వరకూ సాగిన విచారణ అనంతరం తీర్పును రిజర్వు చేసింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీం సెక్రటరీ జనరల్ అప్పీలు చేశారు. దానిపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని బెంచ్ ఈవారంలో తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు గత తొమ్మిదేళ్లుగా ఉన్నత న్యాయస్థానం వద్ద విచారణలో ఉంది.
శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం 2018 సెప్టెంబర్ 28న తీర్పు చెప్పింది. ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు కూడా ఈవారం వెలువడనుంది.
ప్రధాని నరేంద్ర మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఈ నినాదాన్ని రాఫెల్ తీర్పుకు ముడివేయడంతో అది మరింత వివాదం కావడంతో రాహుల్ సుప్రీంకు ఇప్పటికే క్షమాపణ చెప్పారు. కోర్టు తీర్పును ఆపాదిస్తూ రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌పై జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ పూర్తి చేయగా, త్వరలోనే తీర్పు వెలువడనుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు చేయడం ద్వారా కుట్రకు పాల్పడ్డారనే కేసు విషయంలో సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ విచారణ నివేదిక సుప్రీం ముందుకు రానుంది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ జస్టిస్ పట్నాయక్‌ను నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆ నివేదికపై బెంచ్ తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17న పదవీ విరమణ చేస్తున్నారు. 2012 ఏప్రిల్ 23న న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన రంజన్ గొగోయ్ 2018 అక్టోబర్ 3న ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన వారసుడిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ బాబ్డే 2021 ఏప్రిల్ 23 వరకూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బాబ్డే అనేక సంచలన కేసుల్లో భాగస్వామిగా ఉన్నారు.
సుప్రీంలో ఈనెల 1నాటికి 59,867 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 407 కేసులు, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 13, తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 135 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నా తన రిటైర్మెంట్ కంటే ముందే రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో తుది తీర్పును వెలువరించాలని నిర్ణయించినట్టు గతంలోనే రంజన్ గొగోయ్ ప్రకటించారు. అందుకు వీలుగా రాజ్యాంగపరంగా ఉన్న అన్ని అవకాశాలనూ ఆయన కక్షిదారుల ముందుంచారు. అందులో ప్రధానమైనది మధ్యవర్తిత్వం. అందుకు ఒక కమిటీని కూడా వేశారు. అవసరమైతే ఆ కమిటీలోకి కొంత మంది నిపుణులను తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అయోధ్య వివాదంలో కేసుల మీద కేసులు నమోదై, ఏ విషయం తేలకపోవడంతో దానిని ఒక కొలిక్కి తీసుకురావాలని భావించిన గొగోయ్ అనుదినం ఉభయ పక్షాల వాదనలు విన్నాక తీర్పును రిజర్వులో ఉంచారు. ఆ తీర్పు వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? వంటి అంశాలను పక్కన పెడితే, దశాబ్దాల నాటి వివాదానికి ఆ తీర్పు తెరదించుతుందనే ఆనందం భారతీయుల్లో ఉంది. అయోధ్య స్థల వివాదంపై వెలువరించే తీర్పు సుప్రీం కోర్టు చరిత్రలోనే సరికొత్త అధ్యయనాన్ని లిఖించబోతోందని కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే వ్యాఖ్యానించారు. రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును అక్టోబర్ 19న రిజర్వు చేసింది. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ఈ ధర్మాసనం ప్రస్తుతం తీర్పు కాపీని రూపొందించే పనిలో ఉంది.
1934లోనే అయోధ్యలో కొంతమంది ఒక గోవును హత్యచేయడంతో ఇరువర్గాల ఘర్షణ జరగడం, ఒక వర్గం జరిపిన దాడిలో బాబ్రీ కట్టడంపై ఉన్న మూడు గుమ్మటాలు దెబ్బతిన్నాయి. పురావస్తు పరిశోధనలు,సాహిత్యం, కావ్యాలు, పురాణాల రూపంలో రామజన్మభూమికి సంబంధించిన సాక్ష్యాలున్నాయి. తర్వాత అక్కడ బాబ్రీ మసీదు నిర్మాణం జరగడం, దానిని సైతం కూల్చివేయడం, ఆ తర్వాత ఆ స్థలం ఎవరిదనే అంశంపై వివాదాలు కొనసాగడం అందరికీ తెలిసిందే.
అయోధ్యలోని వివాదాస్పద భూభాగంలో 2.77 ఎకరాల స్థలం హిందువులదా? లేక అది ముస్లింలకు చెందుతుంతా? అనేది కేసు. ఆ స్థలాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో జస్టిస్ ధరమ్‌వీర్ శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ సిబాఘాతుల్లా ఖాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. మసీదు స్థానంలో రామవిగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని, రామ్ ఛబుత్ర, సీతా రసోయిలను నిర్మోహి అఖాడాలకు, మిగిలిన భూభాగాన్ని ముస్లింలకు ఇవ్వాలని అలహాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి రోజువారీ విచారణలు జరిపింది. సంచలన తీర్పులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంది.

-బీవీ ప్రసాద్ 99633 45056