మెయన్ ఫీచర్

నెహ్రూ, పటేల్.. ఇద్దరూ మహనీయులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి హోం మంత్రి-ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్‌లో ఎవరు గొప్ప? అనే వివాదస్పద చర్చ ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశ సమగ్రత, అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఈ అంశాన్ని ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు. అయితే, చరిత్రను సానుకూల కోణంలో చూసేందుకు గతకాలపు అంశాలను ప్రస్తావించుకోవడం తప్పేమీ కాదు. పటేల్ లేకపోతే నెహ్రూ లేడని, కశ్మీర్ అగ్నిగుండంగా మారేందుకు నెహ్రూ విధానాలే కారణమంటూ నేడు కొందరు వ్యాఖ్యలు చేస్తుండడం వాంఛనీయం కాదు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ మహనీయులే. వీరిని పరస్పరం పోల్చడం తగని పని. ఈ ఇద్దరు మహానేతలు తమ జీవితాలను జాతి సముద్ధరణకు అంకితం చేశారు. చరిత్రలోకి వెళ్లి ఎవరుగొప్ప, దేశానికి ఎవరి వల్ల మేలు జరిగిందనే వితండ వాదనలు ఇటీవల పెచ్చుమీరుతున్నాయి.
స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధేయవాదానికి ఆకర్షితులై జైళ్లకు వెళ్లి నేతలు బయటకు వచ్చిన రోజులవి. నెహ్రూ తన జీవితకాలంలో తొమ్మిది సార్లు జైలుకు వెళ్లి, 3,259 రోజులు కారాగారవాసం అనుభవించారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించినపుడు ఆయన వయసు 58 ఏళ్లు. 1889 నవంబర్ 14న జన్మించిన నెహ్రూ 1964లో మరణించారు. నెహ్రూ మొదటిసారి 88 రోజులు, రెండవ సారి 266 రోజులు, మూడవ సారి 12 రోజులు, నాల్గవ సారి 181 రోజులు, ఐదవ సారి 100 రోజులు, ఆరవ సారి 614 రోజులు, ఏడవ సారి 558 రోజులు, ఎనిమిదవ సారి 399 రోజులు, తొమ్మిదవసారి 1041 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. లక్నో, అలహాబాద్, నబా,నైనీ సెంట్రల్ జైల్, బరేరి, డెహ్రాడూన్, అలీపూర్, ఆల్మోరా, అహ్మద్‌నగర్ జైళ్లలో కారాగార శిక్షను అనుభవించారు. నెహ్రూ, పటేల్ సేవలను అంచనావేసే శక్తి ఎవరికీ లేదు. దేశ సమగ్రతకు ‘ఉక్కుమనిషి’ సర్దార్ పటేల్, అభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు లక్ష్యంగా నెహ్రూ పనిచేశారు.
1948లో న్యూయార్కు టైమ్స్‌లో రాబర్ట్ త్రుంబర్ అనే రచయిత ఆసక్తికరమైన వ్యాసం రాశారు. ‘నెహ్రూ, పటేల్ ఎవరికి వారు భావావేశం కలిగిన నేతలు. కాని ఆ ఇద్దరు నేతలు సులువుగా తమ అభిప్రాయబేధాలను పక్కనపెట్టి కలిసిపోయే శక్తి ఉన్నవారు. మహాత్మా గాంధీ మరణం తర్వాత తాము దేశాన్ని సరైన రీతిలో నడిపించాలనే వాస్తవాన్ని గుర్తించి, జవాబుదారీతనంతో వ్యవహరించేవారు. భారతదేశం ముక్కలు కాకుండా కలిసిపనిచేయాలనే గురుతరబాధ్యత తమపై ఉందనే సత్యాన్ని గ్రహించి మెలిగారు’ అని పేర్కొన్నారు. ఐక్యతకు, ప్రజాస్వామ్యం బలపడేందుకు నెహ్రూ, పటేల్ భుజం భుజం కలిపి పనిచేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు నెలల్లో గాంధీజీ అసువులు భాసారు. దేశంలో 565 సంస్థానాలను విలీనం చేసే బాధ్యత తమపై ఉందని పటేల్, నెహ్రూ గుర్తించారు. అదే సమయంలో రాజ్యాంగ రూపకల్పన పనులు చురుకుగా సాగుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 1948లోనే కశ్మీర్‌ను కబళించేందుకు దాయాది దేశం దాడికి దిగింది. 565 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసేందుకు పటేల్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఒప్పించారు. హైదరాబాద్, జునాఘడ్ సంస్థానాలు తిరుగుబాటు చేస్తే దేశ వ్యతిరేక శక్తుల పీచమణచేందుకు సైన్యాన్ని పంపించారు. మన దేశం భౌగోళికంగా గందరగోళంగా ఉండేది. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున హిందువులు, సిక్కులు భారత్‌కు వలస వచ్చారు. ఇక్కడి నుంచి ముస్లింలు అంతే సంఖ్యలో పాకిస్తాన్‌కు వెళ్లారు. ఇటు ఉత్తర భారతంలో, అటు పాకిస్తాన్‌లో నిత్యం గృహ దహనాలు, దోపిడీలతో అతలాకుతలమవుతున్న రోజులవి.
అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్ ముక్కలు చెక్కలు కాకుండా జవహర్‌లాల్, సర్దార్ పటేల్ కలిసి దేశానికి మార్గనిర్దేశనం చేశారు. పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే చరిత్ర మరోలా ఉండేదని, కశ్మీర్ సమస్యకు 1947లోనే పరిష్కారం లభించి ఉండేదనే వారున్నారు. ఇది ఒక రకంగా వితండ వాదన. పటేల్ కాంగ్రెస్‌కు వీర విధేయుడు. నెహ్రూ కంటే ఎక్కువగా పార్టీకి పనిచేసేవారంటారు. 1946లో దేశ విభజన కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. అప్పటి 15 మంది పీసీసీ అధ్యక్షుల్లో 12 మంది పటేల్‌ను ఎఐసీసీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నారు. వారు పటేల్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మిగిలిన ము గ్గురు ఎవరికీ ఓటు వేయలేదు. ఒక్క ఓటు కూడా నెహ్రూకు లభించలేదు. కాని గాంధీ మాత్రం నెహ్రూనే అధ్యక్షుడిగా ఉండాలని ఆదేశించారు. గాంధీ మాటను పటేల్ శిరసావహించారు. దేశ సమగ్రత, పార్టీ ఐక్యత కోసం పటేల్ చేసిన త్యాగం నిరుపమానమైనది. అందుకే ప్రధానిగా నెహ్రూ ఎన్నికైతే, హోం మంత్రిగా పటేల్ నియమితులయ్యారు.
పటేల్ 1875లో జన్మించగా స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆయన వయస్సు 73 సంవత్సరాలు. అంటే నెహ్రూ కంటే 15 సంవత్సరాలు పెద్ద. పటేల్ 1950 డిసెంబర్ 15వ తేదీన మరణించారు. ఒక్కొక్క నాయకుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసిన వెంటనే నిష్క్రమిస్తాడు. పటేల్ ఇంకా జీవించి ఉంటే ఎన్నో అద్భుతమైన పనులు జరిగి ఉండేవని చాలా మంది ఆకాంక్షిస్తుంటారు. ఈ కోరికలో నిజం ఉంది. కాలమనే మహాశక్తి ముందు మనమంతా తలొగ్గాల్సిందే. సీత గీత దాటి ఉండకపోతే రామాయణం ఉండేది కాదు. అలాగే మహాభారతంలో ధర్మరాజు కౌరవుల సభలో జూదం ఆడకపోతే యుద్ధం జరిగి ఉండేది కాదు.
స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడి అలిసిపోయిన పటేల్ 73 ఏళ్ల వయస్సులో సంస్థానాల విలీనమనే బృహత్తర పవిత్ర యజ్ఞాన్ని చేపట్టి విజయం సాధించారు. భారత్ రిపబ్లిక్‌గా అవతరించిన సమయంలో (1950 జనవరి 26 నాటికి) ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో మరణించారు. పటేల్ చేసిన కృషి ఫలితంగానే నెహ్రూ మూడుసార్లు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడంటే ప్రైవేటీకరణ, ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలు వచ్చాయి. 1947 తర్వాత భారత్ పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఢిల్లీకి ఇతర రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్లు అంతంత మాత్రమే. ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో గుర్తించే యంత్రాంగం లేదు. దుర్భరమైన పేదరికాన్ని ప్రజలు అనుభవించేవారు. రైతులకు బ్యాంకులు అప్పులు ఇచ్చేవికావు. జాతీయ బ్యాంకులు, పరిశ్రమలు లేవు. అంతకు ముందు శతాబ్ధాల తరబడి ఒక దేశం, ఒక జాతి, ఒక రాజ్యాంగం అనే భావన ప్రజలకు లేదు. ఎన్నో సవాళ్ల మధ్య అవతరించిన భారత్‌ను అభివృద్ధి మార్గం వైపు నడిపించిన ఘనత నెహ్రూ, పటేల్‌దే.
కశ్మీర్ విషయంలో నెహ్రూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించడం సులువు. కాని ఆ రోజులకు తగ్గట్టుగా నెహ్రూ రాజనీతితోనే వ్యవహరించారు. స్వాతంత్య్రం వ చ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దార్శనికతతో, ధైర్య సాహసాలను ప్రదర్శించి 370వ అధికరణను రద్దుచేసి కశ్మీర్‌ను రెండుగా విభజించి ప్రపంచం నోరెత్తకుండా చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపడడం, హాంకాంగ్ సంక్షోభాలతో చైనా సతమతం కావడం, అంతరంగిక సమస్యలతో అమెరికా పెద్దన్న పాత్రను పోషించే స్థితిని కోల్పోవడం, 28 ఏళ్ల క్రితం విచ్ఛిన్నమైన సోవియట్ రష్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండడం, విశ్వవ్యాప్తంగా ఆధునిక యువతకు యుద్ధకాంక్ష లేకపోవడం, అన్ని సమాజాల్లో భోగలాలసత్వం పెరగడం తదితర కారణాల వల్ల కశ్మీర్ అంశాన్ని పట్టించుకునే స్థితిలో అంతర్జాతీయ సమాజం లేదు. ఈ పరిణామాలు మోదీ, అమిత్‌షాకు బాగా కలిసివచ్చాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ దమన వైఖరికి ‘చెక్’ పెడుతూ నెహ్రూ కుమార్తె దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల పాకిస్తాన్ రెండు ముక్కలైంది. బంగ్లాదేశ్ అవతరించించడంతో పాకిస్తాన్ బలం క్షీణించింది. నెహ్రూ కశ్మీర్ అంశంలో సరైన నిర్ణయం తీసుకోలేదనే విమర్శలకు కాలం చెల్లింది. శత్రుదేశాన్ని ముక్కలు చేసిన ఇందిరాగాంధీని ఆ నాటి ప్రతిపక్షనేత వాజపేయి ‘అపర దుర్గ’గా కీర్తించారు.
చరిత్రలో సంభవించే అనేక పరిణామాలను తులనాత్మకంగా విశే్లషించాలే తప్ప సొంత అజెండాలతో, సిద్ధాంత భావజాలంతో హ్రస్వదృష్టితో చూసి అభాండాలు వేయడం సరికాదు. ఇటీవల ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ- అలనాడు నెహ్రూ చేపట్టిన అభివృద్ధి అజెండాను ప్రశంసించారు. చాలామంది అనుకున్నట్లుగా పదవుల విషయంలో, పరిపాలనలో నెహ్రూ, పటేల్‌లు శత్రువులు కారు. ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు మహనీయులూ దేశాన్ని తమ భుజస్కంధాలపై మోశారు. 1920 నుంచి 1947 వరకు దాదాపు 27 ఏళ్ల పాటు భారత జాతీయ కాంగ్రెస్‌లో పటేల్, నెహ్రూ కలిసి పనిచేశారు. ఆనాటి మీడియా దేశభక్తితో పనిచేసేది. అందుకే వీరి మధ్య పొరపొచ్ఛాలు ఉన్నట్లు, రాజీనామాల దాకా వ్యవహారం సాగినట్లు ఎక్కడా ఉదంతాలు లేవు. పటేల్ జీవిత చరిత్రపై రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో- ‘దేశం స్వాతంత్య్రం సాధించేందుకు, అనంతరం ఒక మహత్తరశక్తిగా అవతరించేందుకు గాంధీ, నెహ్రూ, పటేల్ ఉమ్మడి కృషి కారణం..’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్ విషయంలో కొన్ని తప్పిదాలు చేసినా వాటిని గోరంతలు కొండంతలుగా చూడాల్సిన పని లేదని చరిత్రకారులంటారు. 1975లో పటేల్ శతజయంతి ఉత్సవాలను ఆ నాటి కేంద్రప్రభుత్వం జరపాలి. కాని ఆ సమయంలో దేశంలో ఎమర్జన్సీ అమలులో ఉంది. అలహాబాద్ కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా, రాజ్యాంగ సవరణలు చేసి, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ప్రాథమిక హక్కులను ఆనాటి ఇందిర ప్రభుత్వం హరించివేసింది. పటేల్‌ను కాంగ్రెస్ విస్మరించడం వల్ల ఇప్పటికీ గుజరాత్‌లో ఆ పార్టీ కోలుకోలేదు. ఎమర్జన్సీపై పోరాడిన యోధుల్లో మొరార్జీ దేశాయ్ ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1977లో దేశ ప్రధాని కావడం విశేషం.
370వ అధికరణ రద్దు సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ, 1947 నుంచి 1950 మధ్య కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తూర్పారబట్టారు. సహజంగానే ఆరెస్సెస్ పునాదిగా ఉన్న నేతలు నెహ్రూయిజాన్ని విమర్శించేందుకు వెనుకాడరు. ఈ విమర్శలను చరిత్ర కోణంలో స్ఫూర్తిగా తీసుకోవాలి. కశ్మీర్ విషయంలో 1947-48లో ఏ నేత అధికారంలో ఉన్న ఆ రోజుల్లో అప్పటి పరిస్థితులకు అంతకంటే మించి చేసేదేమీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముగ్గురు నేతల మధ్య సమన్వయం, స్నేహబంధాన్ని చూడవచ్చు. నెహ్రూ-పటేల్, వాజపేయి- అద్వానీ, మోదీ-అమిత్ షాల మధ్య ఉన్న మిత్రత్వం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం సాధ్యమైందన్న వాస్తవం విస్మరించరానిది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097