మెయన్ ఫీచర్

ప్రియాంక చేతికి కాంగ్రెస్ పగ్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూనో లేక అవమాన భారం భరించలేకనో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాగే, నెహ్రూ-గాంధీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక-ఎంపికలో తమ కుటుంబాన్ని దూరంగా ఉంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ స్పష్టం చేశారు. అయినా సీడబ్ల్యూసీ సుదీర్ఘ కాలం పాటు రాహుల్ రాజీనామాను ఆమోదించ లేదు. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, రాజీనామాను వెనక్కి తీసుకోవాలని వివిధ స్థాయిల కాంగ్రెస్ నాయకులు అనేక రీతుల్లో విజ్ఞప్తులు చేశారు, వేడుకున్నారు, ప్రాధేయ పడ్డారు. అయినా రాహుల్ నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాజీనామా వెనక్కి తీసుకోలేదు. చివరాఖరుకి చేసేది లేక సీడబ్ల్యూసీ రాహుల్ రాజీనామాను ఆమోదించింది. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఈ కారణం చేతనో లేక గతంలో సీతారాం కేసరి విషయంలో ఎదురైన చేదు అనుభవం కారణంగానో మొత్తానికి పార్టీ అధ్యక్ష పదవి కుటుంబం చేయి జారకుండా సోనియా గాంధీ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అధ్యక్ష బాధ్యతలను ఆమె తాత్కాలికంగా తలకెత్తుకున్నారు.
నిజానికి ఏదో ఒకనాటికి రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించేందుకే సోనియా గాంధీ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారని అందరూ భావించారు. అది నిజం కూడా. తనకు దక్కకుండా పోయిన ప్రధాని పీఠంపై కుమారుడు రాహుల్ గాంధీని చూసుకోవాలనేది సోనియా మాత చిరకాల స్వప్నం. అందులో తప్పు పట్టవలసింది కూడా లేదు. ఒక తల్లిగా కుమారుడి ఉన్నతి చూడాలనుకోవడం తప్పు కాదు. మూడు తరాల పాటు ప్రధాని పదవిని ‘హక్కు’గా అనుభవించిన కుటుంబంలో నాలుగోతరం నాయకుడు రాహుల్ గాంధీని కూడా ఆ పదవిలో చూడాలనుకోవడం సహజం. కానీ, అదేమిటో రాహుల్ గాంధీకి మొదటి నుంచి కూడా రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేదనే అనిపిస్తుంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ బాధ్యతలు లేని అధికారాన్ని చెలాయించేందుకే ఇష్టపడ్డారు గానీ, ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టేందుకు ఇష్టపడలేదు. అనేక సందర్భాలలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, మంత్రివర్గంలో చేరేందుకు సుముఖత చూపలేదు. చివరకు పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో కూడా రాహుల్ ఇదిగో, అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
పస్తుత విషయంలోకి వస్తే రాహుల్ గాంధీలో 2019 ఎన్నికలకు ముందు కనిపించిన కాసింత ఉత్సాహం ఫలితాలు వచ్చాక నీరుగారి పోయింది. ఎన్నికల ప్రచారంలో ఆకాశానికి నిచ్చెనలు వేసి ఊహల పల్లకిలో ఊరేగిన రాహుల్ గాంధీని ఎన్నికల ఫలితాలు వెక్కిరించాయి. అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. అధికారం మాట దేవుడెరుగు.. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేక పోయింది. రాహుల్ గాంధీని తాత్కాలికంగా అవహించిన అధికార, అహంకార ‘మత్తు’- ఓటమి తర్వాత రాజకీయ వైరాగ్యంగా మారిపోయింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాదు, అసలు పార్టీ వ్యవహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వచ్చారు. సోనియా పుత్రప్రేమతో అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రాజకీయ వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చినా రాహుల్ గాంధీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. బహుశా ఓటమి అవమాన భారంగా మారి ఆయనను వెంటాడుతోంది.. అది నిజం కావచ్చు. అందుకే ఎక్కువ కాలం విదేశీ పర్యటనలో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే తల్లీకొడుకులిద్దరూ విదేశాలకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందోసారి, ఎన్నికల తర్వాత మరోసారి ‘్ధ్యనం’ పేరుతో రాహుల్ విదేశీ యాత్రకు వెళ్లారు. నిజానికి రాహుల్ గాంధీ ఈ విధంగా ఎవరికీ చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్ళడం కొత్త కాదు. గత ఐదు ఐదున్నర సంవత్సరాలలో ఆయన మొత్తం 16 సందర్భాలలో విదేశీ పర్యటనలు చేశారు. ఇందులో తొమ్మిది సందర్భాలలో అయన ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఎవరికీ తెలియదు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు కూడా రాహుల్ విదేశీ యాత్రలకు సంబంధించిన సమాచారం లేక ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాహుల్ విదేశీ యాత్రలు వ్యక్తిగత యత్రాలే అయినా, ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో కూడా రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటో? అంతు చిక్కని చిక్కు ప్రశ్నగా నిలిచింది. అనేక ఊహాగానాలకు తావిస్తోంది. పార్లమెంట్ సభ్యులు విదేశాలకు వెళ్లినప్పుడు తమ పర్యటన వివరాలను పార్లమెంట్ సెక్రటేరియట్‌కు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది, అయినా రాహుల్ గాంధీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. నిజానికి ఇది నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.
రాహుల్ గాంధీ విదేశీ యాత్రలు మాత్రమే కాదు, లోక్‌సభ ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా చాలా సందేహాలకు తావిస్తోంది. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలను ఆస్కారం కలిగిస్తోంది. మరోవంక సోనియా కుమార్తె ప్రియాంకా వాద్రే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నవంబర్ 5 నుంచి 15 వరకు దేశ వ్యాప్త ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజం నింపే లక్ష్యంగా నిర్దేశించుకున్న కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ జాడ లేదు. అయన విదేశాల్లో ‘్ధ్యనం’ చేసుకుంటున్నారు. మరో వంక ఆయన ధ్యానయాత్రలు నవ్వుల పాలవుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రాహుల్ ఇప్పుడు చేయవలసింది ధ్యాన యాత్రలు కాదు, దేశం ఎదుర్కొంటున సమస్యలపై వీధుల్లో పోరాటాలు చేయాలని ‘గురు’ బోధ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా చాలావరకు అదే అభిప్రాయంతో ఉన్నారు .అయితే వారు బయట పడలేక పోతున్నారు.
ఒక విధంగా దేశ రాజకీయ భవిష్యత్‌ను ప్రభావితం చేసే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయం, సందర్భం ఇది. ఓ వంక దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆరోగ్యకరంగా లేదు. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. నిరుద్యోగం భయపెడుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆ రాష్ట్రం రాష్టప్రతి పాలనా దిశగా సాగుతోంది. మరో వంక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ అన్నిటినీ మించి దేశ రాజకీయాల గతిని, గమ్యాన్ని మార్చి వేసిన అయోధ్య కేసు తుది తీర్పు రానే వచ్చింది.
ఇలాంటి కీలక సమయంలో కాలం కలిసొస్తే దేశ ప్రధాని కావలసిన రాహుల్ గాంధీ ఎక్కడో ముక్కుమూసుకుని ధ్యానంలో మునిగి పోవడం ఆయన మానసిక స్థితిని తెలియచేస్తోంది. రాహుల్ గాంధీ ఇలా రాజకీయ వైరాగ్యంలో కూరుకుపోవడానికి ఇంకా చాలానే కారణాలు ఉండవచ్చును. గానీ ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేక పోవడం ప్రధాన కారణం కావచ్చు. అదే సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ 2019 ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత ఇక అధికారం దక్కదన్న నిరాశలోకి జారుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అందుకే ఆయన ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయ్యారు. కారణం ఏదైనా రాహుల గాంధీ క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు కాదంటే.. నిష్క్రమణ దిశగా అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చును.
అందుకే ఇప్పుడు ప్రియాంక రాజకీయాల్లో మరింత క్రియాశీల పాత్రను పోషించేందుకు సిద్దమవుతున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రియాంక ఆదేశించారు. పార్టీ వైఖరిని ప్రకటించే వరకు బహిరంగ ప్రకటనలు చేయవద్దని కూడా ఆమె హెచ్చరించారు. ఒక్క ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయంగా ప్రభావం చూపే అయోధ్య తీర్పు వంటి విషయాల్లో నిజానికి పార్టీ అధ్యక్షురాలి హోదాలో సోనియా గాంధీ లేదా సీడబ్ల్యూసీ ఇలాంటి ప్రకటన చేయాలి. కానీ ప్రియాంక ఆ బాధ్యతలను తన భుజానికి ఎత్తుకున్నారు. ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు స్పందించి అభాసుపాలైన నేపథ్యంలో ప్రియాంకా గాంధీ చొరవ చూపారాని అనుకోవచ్చును. అదే సమయంలో ఆమె కుటుంబ త్రయంలో ... సోనియా, రాహుల్ కంటే క్రియాశీలంగా ఉన్నారనే దానికి కూడా ఇది నిదర్శనంగా నిలుస్తుంది. త్వరలోనే పార్టీ పగ్గాలు ఆమె చేపడతారనేందుకు ఈ పరిణామాలను సంకేతంగా తీసుకోవచ్చునని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఒక విధంగా ప్రియాంక కాంగ్రెస్ పార్టీ ముఖచిత్రంగా చెలామణి అవుతున్నారు.
మరో వంక ప్రియాంకకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిజానికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సమయంలో పార్టీ సీనియర్ నేతలు కరణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పార్టీ ఎంపీ శశి థరూర్ వంటి నేతలు చాలా మంది ప్రియాంకా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఆమె అయితేనే పార్టీ ఐక్యంగా ఉంటుందని, లేదంటే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంటుందని కరణ్ సింగ్ వంటి కొందరు నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా గట్టిగా ప్రచారం చేశారు. అయితే, ఎందుకనో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సీనియర్లు ప్రియాంక వైపు మొగ్గు చూపలేదు. అప్పట్లో ప్రియాంక కూడా అంతగా ఉత్సాహం చూపలేదు. అదే సమయంలో జరిగిన పార్టీ ప్రాధాన కార్యదర్శుల సమావేశంలో ప్రియాంక గాంధీ తనను వదిలేయాలని, తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. చివరకు సోనియా గాంధీనే తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు.
ప్రియాంక పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో ఒకప్పుడు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ జర్నలిస్ట్ పంకజ్ శంకర్ సోనియా గాంధీ పుత్ర వ్యామోహం, రాహుల్ గాంధీ వైఫల్యాలను చిత్రీకరిస్తూ ‘పుత్ర మోహ్’ పేరుతో వెబ్ సిరీస్ రూపొందించారు. ఇందులో ఒక్క ప్రియాంక మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ఇవ్వగలరని పేర్కొనడం ద్వారా పంకజ్ మరో మారు ప్రియాంకను తెరమీదకు తెచ్చారు. ఈ వ్యవహారాలను గమనిస్తే.. ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పంకజ్ పేర్కొన్నట్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ఇస్తారా? అంటే... అది కాలమే నిర్ణయిస్తుంది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722